ఒకవేళ “యూసిసి” గనుక అమలు చేస్తే నాగాలాండ్ లో ఉన్న స్థానిక ఎం.ఎల్.ఏ లకు చెందిన అరవైకి అరవై ఇళ్లను తగలెట్టేస్తామని అక్కడి మూడువేల మంది ఉన్న లోకల్ గ్రూప్ లిఖిత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. గమ్మత్తేమిటంటే వారిచ్చిన వార్నింగును బట్టీ కేంద్ర హోం మంత్రి “నాగాలాండ్ ను యూసిసి నుండి మినహాయిస్తామని వారికి హామీ ఇవ్వటం జరిగింది.
నాగాలాండ్ లో ఇంత వైలెంట్ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తులంతా ముస్లిములు కారు! నాగాలాండ్ లో ఉన్నవారంతా క్రైస్తవులు, గిరిజన సంఘాల వారే…
ఝార్ఖాండ్ లో ఆదివాసీల సమూహం సైతం 5 th షెడ్యూల్ ఉపయోగించి తమను యూసిసి నుండి మినహాయించాల్సిందిగా డిమాండ్ చెయ్యటం జరుగుతుంది. ఈ డిమాండ్ చేస్తున్న వ్యక్తులు సైతం ముస్లిములు కారు!
కచ్చితంగా “నాగాలాండ్ క్రైస్తవులు, గిరిజనులను యూసిసి నుండి మినహాయింపునిస్తే ఝార్ఖాండ్ లో ఆదివాసీల సమూహాన్ని సైతం యూసిసి నుండి మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుంది.
సో, మొత్తానికి “ఒకే దేశం ఒకే చట్టం” అన్నది కేవలం “నామ మాత్రపు వ్యవహారం” అని ఇక్కడితో తేలిపోయింది.
అంతేకాదు, యూసిసి విషయంలో కేంద్రానికి వైలెంట్ వార్నింగులు ఇస్తుంది ముస్లిములు కూడా కాదని కూడా తేలిపోయింది. అంతేకాక, యూసిసి ఇదేదో హిందూ – ముస్లిం సమస్య అంతకంటే కాదని కూడా సుస్పష్టమయ్యింది.
భారతదేశం లాంటి బహు మతస్తుల జనులుండే దేశంలో యూసిసి తీసుకురావటం ప్రాక్టికల్ గా ఎందుకు సాధ్యం కాదో ఇదో చిన్న ఉదాహరణ అంతే.
అందరికీ ఒకే దేశం ఒకే చట్టం ఉన్నప్పుడు అందరికీ సమాన హక్కులు, సమ న్యాయం ఇవ్వాల్సి ఉంటుంది, అందర్నీ ఒకేలా సైతం చూడాల్సి ఉంటుంది. వ్యక్తుల్లో కొందర్ని వెనుకబడిన వర్గాలుగా జమ కట్టి వారి ముఖాలపై ఉచ్చలు పోసే దారుణమైన సంస్కృతిలో ఉండటమే కాక, పైగా పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికే రాష్ట్రపతి ఒక దళిత మహిళ అన్న కారణంగా ఆహ్వానం అందని దేశంలో ఇంకా ఉన్నాం మనం.
అలాంటిది యూసిసి ఆధారంగా దళితులకు, అల్ప సంఖ్యాకులకు సమ న్యాయం, అందరితో పాటు సమాన హోదాలు, సమాన హక్కులు ఇవ్వటం సాధ్యమేనా? అన్నది ఒక పెద్ద ప్రశ్న.
యూసిసి అమలు చేస్తే ముందుగా “హిందూ ఆన్ డివైడెడ్ ఫ్యామీలి లా’ ను ముందుగా తొలగించాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల ప్రభూత్వానికి లక్షల కోట్ల ట్యాక్స్ నష్టం కలుగుతుంది. ఈ చట్టాన్ని ఉపయోగించి ట్యాక్స్ మినహాయింపు పొందుతున్నవారంతా హిందువులే అనటంలో సందేహమే లేదు.
ముఖ్యంగా యుసిసి ని అమలు చేస్తే భారతదేశంలో అందరికీ మతాచారాలతో సంబంధం లేకుండా ఒకే విధమైన వివాహం చేసుకోవాలనే చట్టం తేవటం సాధ్యమేనా? అన్నదో ప్రశ్న.
ఉదాహరణకు యూసిసి అమలుచేయబడుతున్న గోవాలో నే క్రైస్తవుల పెళ్లిళ్లకు సంబంధించి వేరే చట్టాలుంటే.. అక్కడి హిందువులకు వేరే చట్టాలున్నాయి!
25 సం.ల వరకు ఒకవేళ భార్య బిడ్డను కనకపోయినా, లేదా 30 సం.ల లోపు కొడుకును కనకపోయినా ఆ హిందూ పురుషుడు వేరే స్త్రీని సైతం నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు”. అంటే హిందూ పురుషుడు “బహుభార్యత్వం” కలిగి ఉండవచ్చన్న మాట. ఇంత గమ్మత్తైన చట్టాలు గోవాలో హిందూ పురుషుల కోసం తయారు చెయ్యబడ్డాయన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. గోవాలో క్రైస్తవులకు, హిందువులకు ఉన్న ఈ వేర్వేరు వివాహ చట్టాలకు తగిలించిన ముద్దు పేరు యూసిసి!
*****
కానీ, యూసిసి ను ఒక్క ముస్లిములే వ్యతిరేకిస్తున్నారన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టటంతో అసలేమాత్రం విషయ పరిజ్ఞానం లేని వాట్స్ యాప్ సంఘ సభ్యులంతా యూసిసి వస్తే ముస్లిములు నాలుగేసి పెళ్లిళ్లు చేసుకోటానికి అవకాశం లేకుండా పోతుంది కాబట్టి వారు వ్యతిరేకిస్తున్నారని చెప్పి స్వయంతృప్తి చెందుతున్నారు.
నిజానికి భారతదేశంలో బహుభార్యత్వం తాలూకు రిపోర్ట్స్ ను సంక్షిప్తంగా పరిశీలిస్తే… 1961 సెన్సస్ డేటా ప్రకారం ముస్లిముల్లో బహుభార్యత్వం 5.7 శాతం కలిగి ఉంటే హిందువుల్లో 5.8 శాతం, జైన్స్ లో 6.7 శాతం, బుద్ధిస్టుల్లో 7.9 శాతం ఉన్నట్లు తేలింది.
1974 లో సైతం ‘కమిటీ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా’ అన్న ఒక ప్రభుత్వ కమెటీ చేసిన సర్వేలో సైతం ముస్లిముల్లో 5.7 శాతం, హిందువుల్లో 5.8 శాతం బహుభార్యత్వం ఉన్నట్లు కనుగొన్నారు.
దీనిని బట్టి హిందూ పురుషులంతా ఏకపత్నీవ్రతులు ముస్లిములు బహుభార్యత్వం కలిగిన వారనటానికి అవాకాశమే లేదు. ‘నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే’ (2019-21) ప్రకారం అన్ని మతవర్గాల్లోనూ బహుభార్యత్వం తగ్గుతూ వస్తుంది అని చెప్పటం జరిగింది.
ఇప్పుడు చూసినా భారతదేశంలో 1.3 శాతం హిందువులు, 1.9 శాతం ముస్లిములు బహుభార్యత్వం కలిగి ఉంటే 2.1 శాతం క్రైస్తవుల్లో, వీరందరికంటే ట్రైబల్ గ్రూప్స్ లో ఎక్కువగా బహుభార్యత్వం ఉన్నట్లు తేలింది.
కాకపోతే, వాట్స్ యాప్ సిలబస్ ను మాత్రమే ఫాలో అయ్యే అర్థ మెదడు మేధావులకు ఇలాంటి సమాచారం తెలియకపోవటం వల్ల.. ఒక్క ముస్లిములు మాత్రమే బహుభార్యతం కలిగి ఉంటారన్న అపోహలో పడిపోయి ఉన్నారు.
పోనీ, యూసిసి వల్ల ప్రస్తుత అతిపెద్ద దేశ సమస్యలైన నిరుద్యోగం, పేదరికం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల లాంటి సమస్యలు తొలగిపోతాయా? దేశ ఆర్థికాభివృద్ధి జరిగిపోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం ఇలాంటి సమస్యలపై దృష్టి పెట్టకుండా భారతదేశంలో అమలు చెయ్యటానికి సాధ్యం కాని ‘యూసిసి’ ని తేవటానికి ప్రయత్నాలు చెయ్యటం కేవలం ప్రజల భావోద్వేగాలతో ఎప్పుడూ మైండ్ గేమ్ ఆడే పొలిటికల్ పార్టీల ‘ఎలక్షన్ స్టంట్’ తప్ప మరొకటి కాదనటంలో సందేహమే లేదు.
