“యూనిఫాం సివిల్ కోడ్” సాధ్యమేనా..? /-

21 వ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఆగస్టు 2018లోనే కేంద్ర ప్రభుత్వానికి “యూనిఫాం సివిల్ కోడ్” అన్నది అవాంఛనీయమైనదని మరియు అనవసరమని చెప్పినప్పటికీ తిరిగి మరలా కేంద్ర ప్రభుత్వం “యూనిఫాం సివిల్ కోడ్” ప్రస్తావన తెరమీదకు తీసుకురావటంలో ఉద్దేశం ఏంటి? అన్నది గమనించే ముందు..

అసలు “యూనిఫాం సివిల్ కోడ్” అంటే ఏమిటి?

అన్నది గమనిస్తే… “యూనిఫాం సివిల్ కోడ్” లేదా “కామన్ సివిల్ కోడ్” అన్నదానికి అర్థం “ఉమ్మడి పౌర స్మృతి” అంటే భిన్న మతాలు, విశ్వాసాలు, సంస్కృతుల సమ్మేళనం కలిగిన భారతదేశంలో ఉన్న వ్యక్తుల తాలూకు వివిధ మతాల, సంస్కృతుల, విధానాల, విశ్వాసాలకు అతీతంగా వివాహాలు, విడాకులు, వారసత్వం, ఆస్తి పంపకాలు, గార్డియన్ షిప్, దత్తత వగైరా అంశాలలో ఒకే రకమైన చట్టాన్ని అమలు చెయ్యాటమే “యూనిఫాం సివిల్ కోడ్” లక్ష్యం.

ఈ సున్నిత అంశంపై ప్రస్తుతం 22 వ లా కమిషన్ ప్రజలు, వివిధ మత సంస్థలతో సహా అన్ని వర్గాల నుండి 30 రోజుల లోగా సలహాలు, సూచనల ఇవ్వాల్సిందిగా ప్రకటించటం జరిగింది.

*****
భారతదేశంలో “యూనిఫాం సివిల్ కోడ్” లేదా?

భారతరాజ్యాంగంలో “పౌర స్మృతి (సివిల్ లా)” మరియు “శిక్షాస్మృతి (క్రిమినల్ లా)” అని రెండు విభాగాలు ఉంటాయి. వీటిలో “శిక్షాస్మృతి” అన్నది భారత దేశంలో మతాలకతీతంగా అందరికీ సమానంగా వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి అతను ఏ మతస్తుడైనా సరే, అతను హత్య చేసినా, అత్యాచారం చేసినా లేదా ఏ ఇతర నేరం చేసినా దేశం మొత్తం మీద ఒకే రకమైన శిక్ష విధించబడుతుంది తప్ప వ్యక్తుల మతాలను బట్టి ఒక్కో రకమైన శిక్ష అన్నది విధించబడదు. కాబట్టి భారతదేశంలో “యూనిఫాం సివిల్ కోడ్” లేదా? అంటే.. ఉంది. అది “శిక్షాస్మృతి (క్రిమినల్ లా)” విభాగంలో ఉంది. మరి ఇప్పుడు “యూనిఫాం సివిల్ కోడ్” దేనికి అంటే… “పౌర స్మృతి (సివిల్ లా)” లో సైతం ఒకే రకమైన (Common) చట్టాన్ని తీసుకొచ్చి వివిధ మతాల్లో ఉన్న “వ్యక్తిగత చట్టాల (పర్సనల్ లా)”ను తొలగించి వారికి రాజ్యాంగం ఇచ్చిన “మతస్వేచ్ఛ హక్కు (రైట్ టు రిలిజియస్ ఫ్రీడం)”ను ఎత్తేయ్యటం “యూనిఫాం సివిల్ కోడ్” ప్రధాన లక్ష్యం.

ఇక్కడ అసలు సమస్య “యూనిఫాం సివిల్ కోడ్” మంచిదా? కాదా? అన్నది కాదు కానీ, ఈ రకమైన కామన్ చట్టాన్ని తీసుకురావటం అనేక మతాల ప్రజలున్న భారతదేశంలో ప్రాక్టికల్ గా సాధ్యమా? కాదా? అన్నదే.

ఎందుక్కాదండీ… గోవాలో “యూనిఫాం సివిల్ కోడ్” ఉన్నప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కాదు? అని కొందరు ప్రశ్నించవచ్చు. నిజానికి గోవాలో అమలవుతున్న “యూనిఫాం సివిల్ కోడ్” సైతం “సోకాల్డ్-యూనిఫాం సివిల్ కోడ్” అనే చెప్పాలి. గోవాలో క్రైస్తవుల పెళ్లిళ్లకు సంబంధించి వేరే చట్టాలుంటే.. అక్కడి హిందువులకు వేరే చట్టాలున్నాయి!

“25 సం.ల వరకు ఒకవేళ భార్య బిడ్డను కనకపోయినా, లేదా 30 సం.ల లోపు కొడుకును కనకపోయినా ఆ హిందూ పురుషుడు వేరే స్త్రీని సైతం నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు”. అంటే హిందూ పురుషుడు “బహుభార్యత్వం” కలిగి ఉండవచ్చన్న మాట. ఇంత గమ్మత్తైన చట్టం గోవాలో హిందూ పురుషుల కోసం తయారు చెయ్యబడితే గోవాలో ఉన్న ఈ భిన్నమైన చట్టాలకు “యూనిఫాం సివిల్ కోడ్” అన్న పేరు తగిలించటం ఇంకా విచిత్రం!

ఇది ఒక రాష్ట్రం సంగతి అయితే మొత్తం దేశం మీద “ఒకే చట్టం” ప్రాక్టికల్ గా ఎంత వరకు సాధ్యం? అన్నది పాఠకుల విజ్ఞతకే వదిలిపెట్టటం జరుగుతుంది.

*****
యూనిఫాం సివిల్ కోడ్ సమర్ధకుల వాదన ఏమిటి?

‘ఒకే దేశం ఒకే చట్టం’ ఉండటం వల్ల వ్యక్తుల్లో పరస్పరం సాన్నిహిత్యం, సమానత్వం, జాతి సమైక్యత అన్నవి ఆటోమేటిగ్గా ఏర్పడతాయన్నది నేటి యూనిఫాం సివిల్ కోడ్ సమర్ధకుల వాదన. ఇలాంటి సూక్తులు వినటానికి ఎంతో వినసొంపుగా ఉన్నా… ఇలాంటి మాటలు మతం ఆధారంగా నిత్యం హిందూ, ముస్లిం విద్వేష వేర్పాటువాద రాజకీయాలు నడిపే రాజకీయ నాయకులు, వారి సమర్థకులు చెప్పటమే ఏ మాత్రం శోభించని విషయం. అలా చెప్పేవారు ఆలోచించాల్సింది.. ఒకే చట్టం ద్వారా నిజంగా ‘ఐక్యత’ సాధ్యమేనా? అన్నది.

50 దేశాలు, 50 చట్టాలున్న అమెరికాలో ప్రజలు సమైక్యంగా లేరా?

అగ్రరాజ్యమైన అమెరికా ఉన్న 50 రాష్ట్రాల్లో 50 రకాలా వేర్వేరు చట్టాలున్నాయన్న విషయం ఎంతమందికి తెలుసు? మరి వేర్వేరు పౌర స్మృతులు లేదా వ్యక్తిగత చట్టాలు ఉన్న అమెరికా 50 రాష్ట్రాల ప్రజలు కొట్టుకు చస్తున్నారా? అమెరికా లో యూనిటీ లేదా? జాతి సమైక్యత లేదా? అభివృద్ధి పదంలో లేదా? బ్రిటన్, సౌత్ ఆఫ్రికా, కెన్యా, గ్రీస్ లాంటి క్రిస్టియన్ మెజారిటీ దేశాలు, ఇండోనేషియా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి ముస్లిం మెజారిటీ దేశాలను తీసుకున్నా ఆయా దేశాల్లో క్రిమినల్ లా ఒక్కటే ఉన్నప్పటికీ వేర్వేరు “వ్యక్తిగత చట్టాలు (సివిల్ లాస్)” అమలు పరచబడుతున్నాయి.
మొదటి ప్రపంచ యుద్ధంలో ఓ వైపు పాల్గొన్న జర్మనీ, ఇటలీ తదితర దేశాలు ఉండగా మరోవైపు బ్రిటన్, ఫ్రాన్స్ మొదలైన దేశాలు పోరాడాయి. ఈ యుద్ధంలో 30 మిలియన్ల మంది చనిపోయారు. చిత్రమేమిటంటే ఆ యుద్ధం చేసిన ఇరువర్గాలూ అవలంబించేది క్రైస్తవ మతాన్నే వారందరికీ కూడా ఒకే విధమైన “కామన్ సివిల్ కోడ్” ఉండేది. ఈ ఒకే చట్టం ఆయా దేశాల మధ్య యుద్ధాన్ని నివారించలేకపోయింది.

*****
“యూనిఫాం సివిల్ కోడ్” రాజ్యాంగంలోనే రాసుంది కదా?

నిజమే ఆర్టికల్ 44 లో అంబేద్కర్ స్త్రీల ఆర్ధిక సమానత్వం, వెనుకబడిన కులాల వారి సంరక్షణ కోసం “ప్రభుత్వం భారతదేశంలో ప్రజలందరికీ ఒకే యూనిఫాం సివిల్ కోడ్ తేవటానికి ప్రయత్నించాలని” అభిలషించినప్పటికీ.. అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 25 కూడా ఉంది. దాని ప్రకారం దేశంలో వివిధ మతాల ప్రజలు తమ మత విశ్వాసాల ప్రకారం, ఆచారాల ప్రకారం నడుచునే “మత స్వేఛ” కలిగి ఉన్నారు.

రాజ్యాంగం రాస్తున్న సమయంలోనే ఆనాడు కమెటీలో యూనిఫాం సివిల్ కోడ్ ప్రాక్టికల్ గా అమలు చెయ్యటం సాధ్యం కాదని “వ్యక్తిగత చట్టాలను (పర్సనల్ లాస్)” ను రూపొందించే అధికారాన్ని “యూనియన్ లిస్ట్”లో కాకుండా “కంకరెంట్ లిస్ట్” పెట్టటం జరిగింది. దాని ప్రకారం కేవలం ఒక్క కేంద్రానికే కాకుండా, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తమ తమ చట్టాలను రూపొందించుకునే హక్కు ఉంటుంది.

*****
ఇది ముస్లిం వ్యతిరేక చట్టమా?

“యూనిఫాం సివిల్ కోడ్” ప్రస్తావన ప్రధానే చెయ్యటం వల్ల, బీజేపీ సమర్థకులు సమర్థిస్తూ ఉండటం వల్ల ఇదేదో ‘ముస్లిం వ్యతిరేక చట్టం’ అని కొందరు భావించవచ్చు. అది ఎంత మాత్రం కాదు. నిజంగా యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువస్తే.. ఒక్క ‘ముస్లిం పర్సనల్ లా’ మాత్రమే కాదు ‘హిందూ పర్సనల్ లా’ సైతం మార్చాల్సి ఉంటుంది. చివరకు “హిందూ అన్ డివైడెడ్ ఫామిలీ ఎక్సెంప్షన్ టాక్స్”ను సైతం తొలగించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 371 ప్రకారం 12 రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపుల చట్టం సైతం ఎత్తేయాల్సి ఉంటుంది.

ఇంకా హిందూ ఆచారాల ప్రకారం ఏడడుగులూ, మూడు ముళ్ల వివాహాలు కూడా ఉండవు అందరూ కాంట్రాక్ట్ పద్ధతిలో పెళ్లిళ్లు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇంతకూ అందరికీ ఒకే చట్టం తీసుకువస్తే భారతదేశం దళితులకు, ముస్లిం, మైనార్టీలన్న తారతమ్యం లేకుండా రాజ్యసభల్లో సమాన హోదాలు ఇవ్వటానికి సిద్ధమేనా? పార్లమెంట్ భవనానికే రాష్ట్రపతి ఒక దళిత మహిళ అన్న కారణంగా ఆహ్వానం అందని దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ ఆధారంగా దళితులకు రాజ్యసభల్లో అందరితో పాటు సమాన హోదాలు ఇవ్వటం సాధ్యమేనా?

పైగా మద్యపాన నిషేధం ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉంది. గుజరాత్, లక్షద్వీప్, నాగాలాండ్, మిజోరాం రాష్టాల్లో మద్యం సంపూర్ణ నిషేధం. మరి యూనిఫాం సివిల్ కోడ్ తీసుకొస్తే ఈ రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ సంపూర్ణ మద్య నిషేధం సాధ్యమేనా? లేక ఆయా రాష్ట్రాల్లో మద్యపానం ఎత్తివేయటం జరుగుతుందా? కాబట్టి ఇది ఒక్క ముస్లిముల సమస్య ఎంత మాత్రం కాదు. ఇది భారతదేశపు అన్ని మతాల వారి సమస్య.

*****
అంతకంటే ముఖ్యమైన ఆర్టికల్స్ ఉన్నాయి కదా?

హిందూ, ముస్లిం పోలరైజేషన్ తీసుకురావటం, ఆర్టికల్ 370, రామ్ మందిర్, ట్రిపుల్ తలాక్, సీఎఎ, ఎన్.ఆర్.సీ ల క్రమంలో ఎలక్షన్స్ కు ముందు “యూనిఫాం సివిల్ కోడ్” తీసుకురావటం అన్నది కేవలం ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ఓ పోలిటికల్ స్టంట్ అన్నది సామాజిక విశ్లేషకులందరూ చెబుతుందే. అబ్బే! యూనిఫాం సివిల్ కోడ్ అన్నది పోలిటికల్ స్టంట్ ఎంత మాత్రం కాదు, అది బీజేపీ తెస్తున్న స్వంత చట్టం కూడా కాదు కదా, అది రాజ్యాంగంలో 44 వ ఆర్టికల్లో రాసున్న దాన్నే అమలు పరుస్తుంది, ప్రధాన మంత్రి సైతం రాజ్యాంగం ఆదేశిక సూత్రాల పై ఉన్న గౌరవం కొద్దే యూనిఫాం సివిల్ కోడ్ తెస్తున్నారనుకుంటే… అదే రాజ్యాంగంలో అంతకంటే ముందు అమలు పర్చాల్సిన అతి ప్రధానమైన ఇతర ఆర్టికల్స్ కూడా ఉన్నాయి కదా!

ఉదాహరణకు: ఆర్టికల్ 39 ప్రకారం “దేశంలో పౌరులైన స్త్రీ, పురుషులందరూ సమానమైన జీవనోపాధికి తగిన మార్గాలను కలిగి ఉండాలి”. ఒక ప్రక్క దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతున్న తరుణంలో ఈ ఆర్టికల్ కదా ముందు అమలు పరచాల్సింది!?

ఇంకా ఈ 39 ఆర్టికల్ ఏమి చెబుతుందంటే… “దేశంలో ఆర్థిక సంపద మొత్తం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకరించబడకూడదు” అని.
కానీ, నేడు దేశ సంపద కొందరు బిలియనీర్ల చేతిలో వెళ్లిపోతుంది. ఒక్క లాక్ డౌన్ లోనే ఈ దేశపు బిలియనిర్ల సంపద 35% కు పెరిగింది మరోప్రక్క అదే లాక్ డౌన్ కారణంగా 230 మిలియన్ల ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన చేరిపోయారు. ఈ పరిణామం ఆర్టికల్ 39 కు వ్యతిరేకం కాదా?

ఆర్టికల్ 47 నే తీసుకుంటే “కేంద్ర ప్రభుత్వం పోషకాహార స్థాయిని, మెరుగైన జీవన ప్రమాణాలను పెంచాలి మరియు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచటం ప్రభుత్వ ప్రాధమిక విధి”. ఒక ప్రక్క హంగర్ ఇండెక్స్ లో ఇండియా పాకిస్తాన్ కంటే వెనుకబడి ఉన్న దారుణమైన పరిస్థితి, మరో ప్రక్క ఇండియా ‘హెల్త్ కేర్’ గురించి చెప్పనక్కర్లేదు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లలో తగిన వైద్యపరమైన సౌకర్యాలు అంతంత మాత్రం ఉండటంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఆర్టికల్ 48A ప్రకారం “దేశ పర్యావరణం రక్షించబడాలి, అడవులు, వన్య ప్రాణులు రక్షించబడాలి” అన్నది. కానీ, ప్రపంచంలో అత్యంత కాలుష్యంతో నిండిన నగరాలు మన దేశానికే స్వంతం. కాబట్టి ఆర్టికల్ 44 కంటే పై ఆర్టికల్స్ ను కదా ముందు ప్రాధాన్యత ఇవ్వాల్సింది!

*****
చట్టం (Law) ఉండటం వేరు, అది అమలుపరచబడటం వేరు.

చట్టాలు చెయ్యటం ద్వారా సమాజ సంస్కరణ దానికదే జరిగిపోతుందనుకోవటం అమాయకత్వం అవుతుంది.
ఉదాహరణకు: “డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961” ప్రకారం కట్నం తీసుకోవటం, ఇవ్వటం కూడా నేరమే. ఈ చట్టం “యూనిఫాం సివిల్ కోడ్”గానే పరిగణించబడుతుంది. కానీ నేడు భారతదేశంలో ఎన్ని పెళ్లిళ్లు కట్నకానుకలు లేకుండా జరుగుతున్నాయి?

“చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 1929” ప్రకారం బాల్య వివాహాలు చేసుకోవటం నేరం. ఈ చట్టం కూడా “యూనిఫాం సివిల్ కోడ్” గానే పరిగణించబడుతుంది. కానీ భారతదేశంలో ఎన్నో బాల్య వివాహాలు జరిగిపోతున్నాయి.

“ప్రీ-కాన్సెప్షన్ మరియు ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ చట్టం, 1994” ప్రకారం గర్భంలో లింగ నిర్ధారణ నేరం. భ్రూణ హత్యలను నివారించటానికి చేసిన ఈ చట్టం సైతం “యూనిఫాం సివిల్ కోడ్” గానే పరిగణించబడుతుంది. భారతదేశంలో ఎంత మంది ఆడ శిశువుల హత్యలు ఈ చట్టం ద్వారా నిరోధించబడ్డాయి? 12 యేళ్ల కంటే తక్కువ మైనర్ అమ్మాయిల్ని రేప్ చేస్తే ఊరి శిక్ష విధించబడుతుందన్న ఫోక్సో చట్టం ద్వారా ఎంతమంది ఉరి తీయబడ్డారు?

“స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954” ప్రకారం వివిధ మతాలు, కులాలకు చెందిన స్త్రీ, పురుషులు వివాహం చేసుకోవచ్చు. ఈ చట్టం సైతం “యూనిఫాం సివిల్ కోడ్” గానే పరిగణించబడుతుంది. చిత్రం ఏమిటంటే ఈ చట్టానికి భిన్నంగా మరోప్రక్క గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో “లవ్ జిహాద్” చట్టం తీసుకురాబడింది. దాని ప్రకారం ఒక మతానికి చెందిన అబ్బాయిలు/అమ్మాయిలు మరో మతానికి చెందిన అబ్బాయిలు/అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవటం నేరం! మరి “యూనిఫాం సివిల్ కోడ్” తేవాలనే తుత్తర ఉన్నప్పుడు “లవ్ జిహాద్” చట్టం ఎందుకు తెచ్చినట్టు?

ఈ రకంగా “యూనిఫాం సివిల్ కోడ్” అనేక చట్టాల్లో ఆల్రెడీ ఉంది! తప్పితే ఆచరణలోనే లేదు. దీనిని బట్టి “ఒక దేశం ఒక చట్టం” ద్వారా భారతదేశంలో “జాతి సమైక్యత” ఏర్పడుతుందనుకోవటం అమాయకత్వం.

చట్టాలు తెచ్చినంత మాత్రానా ప్రజల్లో ఆటోమేటిగ్గా “సమైక్యత” ఏర్పడదు అది ఒక దేశాన్ని పాలించే పాలకుని పాలనా విధానాన్ని బట్టి వస్తుంది.

ఇప్పుడు చెప్పండి “యూనిఫాం సివిల్ కోడ్” అమలు చెయ్యటానికి భారతదేశం సిద్ధంగా ఉందా?
కాబట్టి ఇప్పుడు కావలసింది ‘యూనిఫాం సివిల్ లా’ కాదు. అంతకంటే ముందు ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగావకాశాలు, జీవన ప్రమాణాలు మెరుగుపరచబడాలి. ప్రతీ మతవర్గ ప్రజలను రాజ్యాంగంలో ఉన్న చట్టాలను అనుసరించేలా చేసి, భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని మరింత పటిష్టంగా సాధించటానికి కృషి చెయ్యాలి. ఒకవేళ బలవంతంగా యూనిఫాం సివిల్ కోడ్ ప్రజలపై రుద్దినప్పటికీ.. అది సైతం కేవలం అమలు కాని నామ మాత్రపు చట్టం మాదిరి అనాధగా మిగిలిపోతుంది.

కాబట్టి ముందు ప్రజల ఐక్యతనే ఇష్టపడక, ప్రజల్ని మతం ఆధారంగా విడగొట్టి పాలించే వేర్పాటువాద భావజాలం కలిగున్న రాజకీయ నాయకులు “యూనిఫాం సివిల్ కోడ్” ద్వారా ప్రజల్లో ‘జాతి సమక్యత’ తీసుకొస్తారని ఆశపడటం నేతి బీరకాయ నుండి నేతిని ఆశించటం లాంటిదే అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *