గర్భంలో ఉన్నప్పటి నుండే శిశువులకు సంస్కారాన్ని అలవర్చటం కోసం ఆర్.ఎస్.ఎస్ చేపట్టిన “గర్భ సంస్కార్” క్యాంపేయిన్ నిర్వహిస్తుంది. భాగవద్గీత బోధల్ని గర్భంలో శిశు దశ నుండే నేర్పటం వల్ల వారిలో విలువలు, సంస్కృతిపై అవగాహన ఏర్పడుతుందన్నది ఈ కార్యక్రమం ఉద్దేశం.
మంచిదే. కానీ, గర్భంలో ఉండగా పిండ దశ నుండే భాగవద్గీతా పాఠాల్ని నేర్పటం మొదలెట్టినా లేదా చిన్నతనం నుండే ప్రారంభించినా.. ఏ గీతాశాస్త్రపు విలువలైతే నేర్పాలని ఆర్.ఎస్.ఎస్ ఈ కార్యక్రమం మొదలెట్టిందో ఆ గీతాశాస్త్రం నేర్పుతున్న విలువలు ఆర్.ఎస్.ఎస్ భావజాలానికి ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయన్నదే అసలు ప్రశ్న.
కొందరు “ఆర్.ఎస్.ఎస్ ఈ క్యాంపేయిన్ నిర్వహిస్తుంది తమ హిందుత్వపు భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే” అంటున్నారు. నిజానికి వేదోపనిషత్తుల, గీతా శాస్త్రాలు బోధిస్తున్న పవిత్ర వైదిక ధర్మానికి, ఆర్.ఎస్.ఎస్ “హిందుత్వ” భావజాలానికి సంబంధం లేదన్నది ముందుగా గుర్తించాల్సిన విషయం.
సంక్షిప్తంగా చెప్పాలంటే దేశంలో అన్ని మతవర్గాల ప్రజల ఐక్యత పిలుపునిస్తూ ఒకప్రక్క మహాత్మాగాంధీ స్వతంత్ర ఉధ్యమం చేస్తున్న నేపథ్యంలోనే మరోప్రక్క ఆ పిలుపును తిరస్కరిస్తూ “సావర్కర్ హిందుత్వ ఐడియాలజీ” ద్వారా కే.బీ.హెగ్డేవర్ స్థాపించిందే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్).
“అహింసా పరమో ధర్మః” అన్న గొప్ప హైందవ దృక్పథానికీ.. “సర్వేజనాసుఖినోభవంతు” అన్న హైందవ శాస్త్రాల అభిలాషకూ.. ప్రజలంతా వసుదైక కుటుంబంలా ఐక్యతతో అలరారాలన్న వేదవాంగ్మేయానికి సంబంధం లేకుండా కేవలం ముస్లిం, క్రైస్తవ, కమ్యూనిస్ట్ వర్గాల పట్ల ధ్వేషాన్ని రగిలించటమే పునాదిగా 1915 లో మోహన్ మాలవియా, సావర్కర్ ల ద్వారా వెలుగులోకి తీసుకు రాబడిందే “హిందుత్వ” ఐడియాలజీ.
దీనికి భిన్నంగా భగవద్గీత నేర్పుతున్న ఐడియాలజీ
భాగవద్గీతా శాస్త్రాన్ని తెరచి చూస్తే అది నేర్పుతున్న విలువలు, మనుషులందరి పట్లా “సమదృష్టి” “సమభావం” కలిగి ఉండాలని ఇస్తున్న ఐడియాలజీ ఆర్.ఎస్.ఎస్ తాలూకూ “హిందుత్వ” ఐడియాలజీకి పూర్తి భిన్నంగా కనపడుతుంది. అదెలాగో తెలియాలంటే ఈ క్రింది కొన్ని శ్లోకాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
“శ్రేయోభిలాషుల పట్ల, ప్రతిఫలంగోరి మేలు చేయువారి పట్ల, శత్రువుల పట్ల, తటస్థుల పట్ల, మధ్యవర్తుల పట్ల, విరోధుల పట్ల, బంధువుల పట్ల, సజ్జనుల పట్ల, పాపుల పట్ల సమదృష్టి కలిగి ఉండువాడే శ్రేష్ఠుడు” – భగవద్గీత 6.9
“విద్య, వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని బ్రాహ్మణునియందు, గోవుయందు, ఏనుగునందు, కుక్కయందు, ఆ కుక్క మాంసం వండుకు తిను ఛండాలుని యందు సమదృష్టి కలవారే జ్ఞానులు అని చెప్పబడుదురు” – భగవద్గీత 5.18
“ఎవరి మనసు సమదృష్టితో ఉంటుందో, అన్ని ప్రాణులను, అందరు మనుషులను ఎవరైతే సమానంగా చూస్తూ ఉంటారో అతడు జీవించి ఉండగానే తన జన్మమును జయిస్తాడు” – భగవద్గీత 5:19
పై గీతా శ్లోకాలన్నీ కలిపితే ఒక్క ముక్కలో చెప్పాలంటే.. అన్ని ప్రాణులను, మనుషులను సమానంగా చూసేవాడే భగవద్గీతను అనుసరించే ఓ నిజమైన హిందువు అలాగే “సజ్జనుల పట్ల, పాపుల పట్ల, శత్రువుల పట్ల, జ్ఞానుల పట్ల, చివరకు కుక్క మాంసం వండుకు తిను ఛండాలుని పట్ల సైతం “సమదృష్టి” కలవాడే శ్రేష్టుడు, జ్ఞానవంతుడైన హిందువు అని అర్థమవుతుంది.
తప్పితే కులాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, వర్ణాన్ని బట్టి మనుషులను విడగొట్టి కొందరిని అధికులని, కొందరిని అధములు, నీచులని “అసమాన దృష్టి”తో చూసేవారు.. ఆజ్ఞానులు, దుర్మార్గులు అని తేటతెల్లమౌతుంది.
ఒకవేళ ఇలాంటి విలువల్నీ, ఐడియాలజీని భగవద్గీతా శాస్త్రం నేర్పుతూ ఉంటే ఈ విలువలు ఆర్.ఎస్.ఎస్ భావజాలానికి పూర్తి భిన్నమనే చెప్పాలి. ఒకవేళ ఎవరైనా అదృష్టవశాత్తూ “గర్భ సంస్కార్” క్యాంపేయిన్ ద్వారా చిన్నతనం నుండే భగవద్గీతా పాఠాల్ని వంటబట్టించుకుని పెరిగి పెద్దవారైతే అలాంటి వారు నేర్చుకునే ఆ విలువలు ఆర్.ఎస్.ఎస్ కు వ్యతిరేకులుగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు.
పైగా వేదాల్ని గమనిస్తే… “సహోదరులైన మీ మధ్య ధ్వేషం ఉండకూడదు. మీ మధ్య చర్చలు నిర్మాణాత్మకంగా మీ ఆలోచనలు సామరస్యపూర్వకంగా ఉండాలి” (అథర్వణవేదం 3:30:3) అని చెబుతున్నాయి.
ఇంతకంటే మరీ స్పష్టంగా అథర్వణవేదం 3:30:1 మంత్రం “మానవులరా సామరస్యపూర్వక భావాలు కలిగి ఉండండి, సహనాన్ని, ధ్వేషరహిత భావాలు కలిగి ఉండండి. ఒకరిపట్ల ఒకరు ప్రేమను కలిగి ఉండండి” అంటూ వ్యక్తుల పట్ల ధ్వేషాన్ని కలిగి ఉండవద్దని హెచ్చరిస్తుంది.
“మన అందరి ఆశలు ఒక్కటిగా ఉండాలి, మన అందరి హృదయాలు ఒక్కటిగా ఉండాలి, మన అందరి ఆలోచనలు ఒక్క త్రాటిపై నడవాలి. మనమందరం ఒక్కటి అయి మంచి స్నేహితులం కావాలి” అంటూ మానవాళి ఐక్యతను ఋగ్వేదం 10:191:4 మంత్రం అభిలషిస్తుంది.
ఈ విలువల్నే మేము పిల్లలకు చిన్నతనం నుండి లేదా గర్భంలో పిండ దశ నుండే నేర్పుతాం అంటే కచ్చితంగా హర్షించతగ్గ విషయమే. గర్భంలో పిండాలకు ఇలాంటి విలువలు నేర్పే వ్యక్తులు ముందు ఈ విలువల్ని వంటబట్టించుకోవాలి.
కులాలు, వర్గాలు, వర్ణాలను బట్టి మనుషుల్లో కొందరిని అధికులని, కొందరిని అధములు, నీచులని అసమాన దృష్టితో చూసే ఐడియాలజీకి స్వస్తి పలకాలి. ఈ విషయాన్నే హిందూ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
“అహింసా పరమో ధర్మః” “సర్వేజనాసుఖినోభవంతు” అన్న గొప్ప దృక్పథాలను నేర్పేదే హిందూత్వం. తప్పితే ఎప్పుడో మధ్య యుగాలనాటి మొగల్ పాలకుల చరిత్రలను వాట్స్ యాప్పుల్లో పంపుకుంటూ ఇప్పుడు ముస్లిం మైనార్టీ సమాజం అంటే హిందూ వ్యతిరేకులన్నట్టు చిత్రీకరిస్తూ వారి పట్ల అర్థం లేని శత్రుత్వాన్ని, కారణం లేని కోపాన్ని పెంచుతూ వారి పట్ల ద్వేషభావం కలిగి ఉండటం, దాడులకు పాల్పడటం, నిజ హిందూత్వం కాదన్న విషయం గ్రహించాలి.
హిందూత్వాన్ని కాపాడుకోవటం అంటే దళిత, ముస్లిం, క్రైస్తవ మైనార్టీలను ఈ దేశం నుండి తన్ని తరిమేయాలనుకోవటమో, వారి పట్ల హింసాత్మక ధోరణులు అనుసరించటమో కాదు వేదోపనిషత్తుల్లో, గీతా శాస్త్రాలు నేర్పుతున్న “సమభావన” “సమదృష్టి” వంటి ఉన్నత విలువల్ని స్వయంగా నేర్చుకుని సామాన్య హిందువులకు నేర్పటం అని తెలుసుకోవాలి.
ఒకవేళ గీతాస్త్రం నేర్పే విలువలకు భిన్నంగా ప్రవర్తిస్తూ మరోప్రక్క తమ హిందుత్వ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటానికి గీతాశాస్త్రాన్ని అడ్డం పెట్టుకుని ‘గర్భ సంస్కార్ క్యాంపేయిన్’ నిర్వహిస్తుంటే మటుకు అది కేవలం రాజకీయ నినాదమనే చెప్పాలి. Md Nooruddin
