వాస్తవ చరిత్ర గుర్తించలేని అంధభక్తి!

Shot of a blindfolded young businessman standing against a black backgroundhttp://195.154.178.81/DATA/i_collage/pu/shoots/784479.jpg

వాస్తవాలను గుర్తించటానికి ‘జ్ఞానం’ ఎంత అవసరమవుతుందో అవాస్తవాలను నిజాలనుకుని నమ్మేయటానికి కూడా ‘అజ్ఞానం’ అంతే అవసరమవుతుంది.

ఈ విషయం భారతదేశాన్ని ఇస్లామిక్ ఆక్రమణదారుల నుండి విముక్తి చేసినందుకు గాను రెండొందల సంవత్సరాలు ఈ దేశాన్ని దురాక్రమణ చేసిన బ్రిటిష్ పాలకుల మహారాణి క్వీన్ విక్టోరియా వర్ధంతిని ఘనంగా నిర్వహించుకున్న ‘హిందూ సేన’లను చూసినప్పుడు నిజమే అనిపించింది.

భారతదేశాన్ని ముస్లిం పాలకుల నుండి బ్రిటీషర్లు విముక్తి చెయ్యలేదు కానీ, భారతదేశాన్ని బ్రిటిషర్ల దౌర్జన్య పాలన నుండి కాపాడటం కోసం వారితో పోరాడుతూ ఎందరో ముస్లిం పాలకులు తమ ప్రాణాలను సైతం అర్పించేసి తమ రాజ్యాలను కోల్పోయారు. తప్పితే తమ రాజ్యాల్ని కాపాడుకునే దురుద్దేశంతో వారికి క్షమాభిక్ష పత్రాలు రాసుకుని లొంగిపోలేదు.

ముఖ్యంగా ఈ దేశాన్ని పాలించిన ముస్లిం పాలకులు, మొగలులు దురాక్రమణ దారులు కారు. వారు కూడా ఈ నేలపై పుట్టిన వారే. దానికి సాక్ష్యం బ్రిటిష్ వారు భారతదేశ సంపదను దోచుకెళ్లి బ్రిటన్ దేశాన్ని నిర్మించుకున్నట్లు ముస్లిం పాలకులు భారతదేశ సంపదను దోచుకుని ఏ ఇస్లామిక్ దేశాన్నీ నిర్మించుకోలేదు. వారు పాలన చేసినంతకాలం ఈ దేశ సంపద ఈ దేశానికే ఖర్చుపెట్టారు.

బ్రిటిష్ వారి దౌర్జన్య పూరిత పాలనకు వ్యతిరేకంగా మొట్టమొదట పోరాటం చెయ్యటం ప్రారంభించింది ఈ దేశ ముస్లిం పాలకులే అన్నది ఉద్దేశపూర్వకంగా కొందరు దాచిపెడుతున్న వాస్తవం. బ్రిటీషు పాలకులను ఈ దేశం నుండి తరిమేయటంలో అనేక పోరాటాలు చేసి ఈ దేసం కోసం ప్రాణాలర్పించేసిన వారిలో దాదాపు 65 శాతం మంది ముస్లిములే అన్నది ఎంత దాయాలనుకున్నా దాగని పచ్చి నిజం.

అన్నేళ్ల ముస్లిం పాలనలో భారతదేశంలో హిందువులు ఎప్పుడూ ముస్లిం పాలకుల ద్వారా అణచివెయ్యబడలేదు. గతచరిత్రను గమనిస్తే నిజానికి హిందూ సమాజంలో కొందరు కనిపెట్టిన వర్ణ వ్యవస్థలో అగ్రవర్ణాలవారి ద్వారా తక్కువ స్థాయి కులస్తులుగా ఎంచబడ్డావారే ఎక్కువగా అణచివెయ్యబడ్డారు. అది కూడా ముస్లిం పాలకుల హయాములోనే అన్నది చరిత్రలో లిఖించబడిన వాస్తవం.

ముస్లిం పాలకుల వలె బ్రిటీషువారు ఆలయాలను ధ్వంసం చెయ్యలేదు కదా?

బ్రిటిషు పాలకులు రోడ్లు, రైల్వేలు కట్టారు తప్ప దేవాలయాలను ధ్వంసం చెయ్యలేదు కదా! కాబట్టి వాళ్లు మహానుభావులు కనుక వారిని నెత్తిన పెట్టుకుని ఊరేగినా తప్పులేదని బ్రిటన్ మహారాణుల వర్ధంతులను జరుపుకోవటంలోనూ తప్పులేదని కొన్ని హిందుత్వ మతతత్వవాద సంస్థలు చెప్పటం వారి సంకుచితత్వానికి అద్దం పడుతుంది.

ఎప్పుడూ ఘోరీ, గజనీ ముహమ్మద్ లాంటి కొందరు పాలకుల ద్వారా కొన్ని దేవాలయాలు దోచుకోబడ్డాయన్న సంఘటనలనే మాటి మాటికీ వండి వార్చే వారికి భారతదేశంలో అత్యధికంగా హిందూ దేవాలయాల్ని కుల్చింది, దేవాలయాల సంపదను తమ రాజ్యాలకు దోచుకెళ్లిపోయింది హిందూ పాలకులే అన్న సంగతి ఎంతమందికి తెలుసు?

6 వ శతాబ్దానికి చెందిన శివభక్తుడైన మిహిరాకుల రాజు నుండి 9 వ శతాబ్దానికి చెందిన పాండ్యన్ రాజు శ్రీమార శ్రీవల్లభ, 10వ వ శతాబ్దానికి చెందిన ప్రతిహార రాజైన హేరంబపాల, 11 వ శతాబ్దానికి చెందిన మొదటి లోహర రాజవంశానికి చెందిన కాశ్మీర్ రాజైన “హర్ష”, రాజేంద్ర చోళుడు, 14 వ శతాబ్దానికి చెందిన ఒరిస్సాలోని సూర్యవంశీ గజపతి వంశ స్థాపకుడు కపిలేంద్ర, పరమార్ రాజు శుభర్ వర్మన్, రాష్ట్రకూట రాజైన ఇంద్ర, కళింగరాజైన ఖారవేలుడు, పల్లవ రాజైన నరసింహవర్మన్, పుష్యమిత్ర సుంగ, కాశ్మీర్ కిన్నెర రాజు, మరాఠి బ్రాహ్మణుడైన మురహరిరావు, బ్రాహ్మణ గురువైన ఆదిశంకరుడు వరకు ఎందరో హిందూ పాలకులు, నాయకులు చరిత్రలో దేవాలయాలు కూల్చేసి, దోచుకున్నవారే!

ఇక్కడ తెలుసుకోవలసింది చరిత్రలో ముస్లిం పాలకులైనా, హిందూ పాలకులైనా దేవాలయాల్ని దోచుకోవటంలో వెనుక పనిచేసింది వారి రాజ్యకాంక్ష తాలూకు యుద్ధోన్మాదమే తప్ప మతోన్మాదం కాదు.

నిజానికి హిందూ సమాజం, దేవాలయాలతో సహా వారి ఆచారాలు, సతీ సహగమనం లాంటి గుడ్డి నమ్మకాలతో సహా చెక్కుచెదరకుండా జాగ్రత్తగా కాపాడబడింది ముస్లిం పాలకుల హయాములోనే అని చెప్పటం అతిశయోక్తి కాదేమో. ఇంకాస్త చరిత్ర పరిజ్ఞానం ఉన్నవారికి ముస్లిం పాలకులు ఎన్నో దేవాలయాల్ని నిర్మించారని, వాటి నిర్వహణకు ఎన్నో జాగీర్లు, సహాయ సహకారాలందించారన్న విషయం తెలిసిందే.

ఈ దేశంలో హిందూ-ముస్లిములు సంఘటితంగా ఐక్యంగా ఉన్నంత కాలం తమ కుట్రలు సాగవన్న విషయాన్ని ముందే కనిపెట్టిన బ్రిటీషు పాలకులు చరిత్రను వక్రీకరిస్తూ హిందువుల దృష్టిలో ముస్లిములను దేవాలయాల్ని కూల్చేసినవారిగా హిందూ వ్యతిరేకులుగా రాయించటం మొదలు పెట్టారు. ఈనాడు మత రాజకీయాల్ని నడపటానికి, మతోన్మాదాన్ని రెచ్చగొట్టటానికి అదే సిలబస్ ను వాట్స్ యాప్ యూనివర్సిటీ సబ్యుల ద్వారా ఫార్వార్డ్ చెయ్యబడుతూ ఉంటుంది.

హైదర్ అలీ, టిప్పుసుల్తాన్ లాంటి వీరుల కంటే ముందే బెంగాల్ నవాబ్ “సిరాజుద్దౌలా” 1757 ఫ్లాసీలో బ్రిటీషర్లకు ఎదురు తిరిగి ప్రాణాలు అర్పించేసిన మొట్టమొదటి రెబలియన్ అన్న విషయం ఎంత మందికి తెలుసు? టిప్పుసుల్తాన్ నాలుగు సార్లు బ్రిటీషర్లతో యుద్ధానికి తలపడి ప్రాణాలు అర్పించటం జరిగింది. ఆయన చేసిన యుద్ధాలు “ఆంగ్లో మైసూర్ వార్స్” అన్న పేరుతో వినుతికెక్కాయి. 1857 లో మొదలైన “ఇండియన్ రెబలియన్ మూవ్మెంట్” అది “గదర్” అన్న పేరుతో వినుతికెక్కింది. 1857 లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఎందరో మదర్సా పండితులు పొరాడి ప్రాణాలర్పించేశారు.

బాధాకరమైన విషయం ఏమిటంటే భారత జాతి కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించేసిన ఎందరో ముస్లిం వీరుల చరిత్ర మరుగున పడిపోవటం, ముస్లిములను కొందరు తమ రాజకీయ లబ్ది కోసం వక్రీకరించబడిన చరిత్రను పట్టుకుని ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తుంటే కొందరు చరిత్ర పరిజ్ఞానం లేని సామాన్య ముస్లిమేతరులు నిజమేనని నమ్మేయటం!

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *