ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలలో అతిపెద్ద సమస్య నేటి ఆధునిక యువతలో ముఖ్యంగా విద్యావంతుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోవటం మరియు నైతిక విలువలు రోజురోజుకీ దిగజారిపోవటం. ఇది నేడు ప్రపంచవ్యాప్తంగా రగులుతున్న సమస్య (Global burning issue).
ఒక్క భారతదేశాన్నే తీసుకుంటే National Crime Records Bureau (NCRB) ప్రకారం హత్యలు, దొంగతనాలు, అత్యాచారాలు వగైరా ఘోరమైన నేరాలకు పాల్పడేవారిలో అత్యధికంగా 16 నుండి 18 సం మధ్య వయస్సు గల యువత ఉండటం అత్యంత బాధాకరం. మరొక ప్రక్క యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు విపరీతంగా అలవాటు పడిపోతుండటం మరొక పెద్ద సమస్య. ఒక NGO నిర్వహించిన సర్వే ప్రకారం డ్రగ్స్ కు అలవాటు పడుతున్నవారిలో అత్యధికంగా 16 నుండి 26 సం.ల మధ్య వయస్సువారేనని, అందులోనూ అధికశాతం విద్యావంతులేనని తేల్చిచెప్పింది. ఆధునిక విద్యార్థుల్లో పెరిగిపోతున్న ఈ రుగ్మతల కారణంగా భవిష్యత్తులో దేశం మరింత ప్రమాదకర స్థితిలోకి నెట్టబడుతుందనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు.
ఇక ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సమస్యలను ఇక్కడ చర్చించటానికి ప్రధాన కారణం యువతలో ముఖ్యంగా విద్యావంతుల్లో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి నుండి కాపాడే విషయంలో మొట్టమొదట బాధ్యత వహించేవారు తలిదండ్రులైతే ఆ తరువాత ప్రముఖ బాధ్యత వహించేవారు ఉపాధ్యాయులే కాబట్టి. ఉపాధ్యాయులు విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దటమే కాక, మంచి సమాజాన్ని కూడా నిర్మించగలరు కాబట్టి.
అందుకనే విద్యార్థులు తప్పుదారిపడితే దానికి సగం బాధ్యత ఉపాధ్యాయులదే అని విశ్వసించిన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఉపాధ్యాయుల విధులను, లక్ష్యాలను గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకునే ఆనవాయితీ ప్రారంభమైంది. ఇక ప్రముఖ విద్యావేత్త అయిన ఐ.ఐ.టి.రామయ్య ఉపాధ్యాయుల గురించి చెబుతున్నదేమిటంటే…
“నైతిక విలువలను కాపాడే బాధ్యత ఉపాధ్యాయులదే. ఉపాధ్యాయుడు ఉద్యోగి మాత్రమే కాదు, సమాజ నిర్మాత. మంచి ఉపాధ్యాయుడు ఒక సామాజిక వైద్యుడు”
ఈ నేపథ్యంలో సరైన విధ్య, వైజ్ఞానిక, ఆర్థిక రంగాల్లో వెనుకబాటు తనమే నేడు సమాజంలో ముఖ్యంగా యువతలో నేర ప్రవృత్తి పెరిగిపోవటానికి కారణమని నేటి కొందరు విద్యావేత్తలు, ఆర్థిక వేత్తలు తేల్చి చెబుతున్నారు.
విద్యార్థులలో నేరప్రవృత్తికి కారణం నాణ్యత గల విద్య లేకపోవటమా ?
నాణ్యత గల విద్య లేకపోవటం విద్యావంతుల్లో నేరప్రవృత్తికి ప్రధాన కారణం అనుకుంటే NRCB గణాంకాల ప్రకారం “నిరక్షరాస్యులైన యువత కంటే ఉన్నత విద్యావంతులే అత్యధికంగా ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నార”న్నది అత్యంత గమనార్హం.
నాణ్యత గల విద్య లేకపోవటం విద్యావంతుల్లో నేరప్రవృత్తికి ప్రధాన కారణం అనుకుంటే అమెరికా, యూరప్ వగైరా విద్యా పరంగా మరియు శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో మన దేశం కంటే కూడా మెరుగైన విద్యా ప్రమాణాలున్నప్పటికీ, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ ఆయా దేశాలు బాల నేరస్తుల జాబితాలో టాప్ టెన్ లో కూడా ఉన్నాయన్నది గమనార్హం.
సైబర్ నేరాల నుండి స్కాముల వరకు, భారీ కుంభకోణాల నుండి బాంబుల వరకు, నకిలీ కరెన్సీ నుండి లంచాల వరకు, డ్రగ్ మాఫియా నుండి టెర్రరిజం వరకు అనేక నేరాలకు పాల్పడుతున్నవారంతా నిరక్ష్యరాస్యులు ఎంత మాత్రం కాదు కదా! “విద్యలేనివాడు వింత పశువు” అన్నది పాత నానుడి. ఇప్పుడైతే “విద్య ఉన్నవాడు వికృత పశువు” అనే పరిస్థితి దాపురించింది.
విద్యార్థులలో నేరప్రవృత్తికి కారణం ఆధ్యాత్మికత లేకపోవటమా?
భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు లాంటిది. ఇక్కడివారిలో 90 శాతం మంది ఆస్తికులే. పైగా భారతదేశంలో ప్రతీ రాష్ట్రానికి లక్షల్లో దేవాలయాలు, చర్చీలు, మసీదులున్నాయి. రోజుకొకటి చొప్పున కొత్తగా కట్టబడుతున్నాయి కూడా. దేవాలయాలు, చర్చీలు, మసీదులు ఇసుకవేసినా రాలనంత జనంతో నిండి ఉంటున్నాయి. ఎటు చూసినా ఆధ్యాత్మిక కోలాహాలం.
ఒకప్రక్క నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య అందించబడుతున్నప్పటికీ, సమాజంలో అధికశాతం మంది ఆస్తికులున్నప్పటికీ సమాజంలో నేరాలు పెరగాలా? తగ్గాలా? కచ్చితంగా తగ్గాలి. అయినప్పటికీ సమాజంలో నేరప్రవృత్తి పెరుగుతుంది అంటే దానికి మూల కారణం ఏమిటో కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది.
మరి ఈ సమస్యకు మూల కారణం ఏంటి?
వాస్తవానికి మనిషి భౌతిక జీవి మాత్రమే కాదు. నైతిక జీవి కూడా. ప్రస్తుతం ఉన్న నాణ్యత గల “భౌతిక విద్య” ద్వారా ప్రస్తుత విద్యావంతులు భౌతిక, ఆర్థిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ది చెందగలుగుతున్నారు, వారిలో భాషా సామర్థ్యాలు పెరుగుతున్నాయి, ఆధునికత పెరుగుతుంది. కానీ, చెడు వాంఛలను నుండి తమను తాము నియంత్రించుకుంటూ మంచిగా మెలగాలి అన్న “నైతిక స్పృహ” పెరగటం లేదు. దాని కారణంగా నేడు ఉన్నత విద్యనభ్యసించినప్పటికీ విద్యావంతుల్లో “నిష్ణాతులైన దుర్మార్గులు (Skilled criminals)” తయారవుతున్నారు.
ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?
ప్రాచీన విద్యావిధానంలో విద్యార్థులకు భౌతిక సామర్థ్యాలను పెంపొందించే “భౌతిక విద్య”తో పాటు “నైతిక విద్య (Moral science)”ను కూడా బోధించేవారు. ధర్మశాస్త్రాల ద్వారా విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందింపజేస్తూ వారి వ్యక్తిత్వాలను వికాశపరచటం జరిగేది. ఈ విధంగా భౌతిక సామర్థ్యాలను పెంపొందింపజేసే “అపరా విద్య”తో పాటు, మనిషి జీవిత వాస్తవికతను తెలియజేస్తూ వారిలో నైతిక విలువలు పెంపొందించే “పరా విద్య”ను లేదా “ఆధ్యాత్మిక విద్య”ను అందించేవారు.
నేటి విద్యావిధానంలో కేవలం భౌతిక, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మాత్రమే అభివృద్ది చెందే ఒక్క “భౌతిక విద్య (అపరా విద్య)”ను అందిస్తూ, వారిలో నైతిక విలువలు పెంపొందించే “పరా విద్య”ను పూర్తిగా వదిలిపెట్టటం వలన విద్యావంతుల్లో “నైతిక విలువలు” అన్నవి లేకుండా పోతున్నాయి. అందుకే ఐన్ స్టీన్ భౌతిక విద్య + ఆధ్యాత్మిక విద్యల ప్రాముఖ్యతను తెలియజేస్తూ “Science without religion is lame, religion without Science is blind” అని చెప్పటం జరిగింది.
మనిషి ప్రవర్తనను మార్చగలిగేది “దృక్పథం” మాత్రమే!
“ఉత్తమ వ్యక్తుల నిర్మాణం” అన్నది “బాధ్యతాయుత దృక్పథాల అనుసరణ” వలన మాత్రమే సాధ్యపడుతుంది. ఆ దృక్పథాలు నేడు మానవద్ద నున్న ధార్మిక శాస్త్రాలైన వేదోపనిషత్తులు, గీతా, బైబిల్, ఖురాన్ గ్రంథాలలో మాత్రమే ఉన్నాయి.
ఈ ధర్మశాస్త్రాలు వేరువేరు భాషల్లో వేరువేరు కాలాల్లో అవతరించినప్పటికీ అవన్నీ “సారూప్యత కల” దృక్పథాలను బోధిస్తున్నాయి. తలిదండ్రులు, ఉపాధ్యాయులు, తోటి మానవుల పట్ల ఎలా నడుచుకోవాలో నేర్పుతున్నాయి. సత్సమాజాన్ని నిర్మించటానికి మానవులలో ఉన్నత నైతిక విలువలను పెంపొందింటం కోసం అవసరమైన ఎన్నో బోధలు ఈ గ్రంథాల్లో ఉన్నాయి.
అన్నిటి కంటే ముఖ్యంగా ఈ ధర్మశాస్త్రాలు “మానవులంతా ఒకే జంట సంతానం” అని, వారిలో ఏ ఒక్కరూ ఎక్కువా కాదు తక్కువా కాదని మానవులంతా సమానమే అని, అనేక మతాలు ఉన్నప్పటికీ అందరికీ ధర్మం ఒక్కటే అని” “మానవులందరికీ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే” అన్న గొప్ప విషయాలు తెలియజేస్తున్నాయి.
“Man is a social animal” అన్నది నేటి భౌతిక వాదులు చెబుతుంది. కానీ, మనిషి కేవలం భూమి మీద ఉన్న అనేక జంతువుల్లో ఒక ‘animal (జంతువు)’ కాదని, అతనికి జీవితానికి ఒక ప్రత్యేక లక్ష్యం ఉందని, కొన్నాళ్లు భౌతిక ప్రపంచంలో సుఖభోగాలు అనుభవించి చనిపోవటంతో ఒక వ్యక్తి పాత్ర శాశ్వతంగా ముగిసిపోదని ఈ ధార్మ గ్రంథాలు తెలియజేస్తున్నాయి.
ఒకే సృష్టికర్త మానవులందరినీ ఒక్క మానవ జంట ద్వారా పుట్టించాడని, ఇంకా మనిషిలో “మంచి-చెడు” అనే రెండు ఆలోచనలతో పాటు “మంచీ-చెడు” అనే రెండు మార్గాలను ఏర్పరచి, మనిషి ‘చెడు’ మార్గంలో నడుకుంటాడా? లేక ‘మంచి’ మార్గంలో నడుచుకుంటాడా? అన్నది పరీక్షించటానికే ఈ జీవితాన్ని ప్రసాదించాడని ఈ గ్రంథాలు తెలియజేస్తున్నాయి.
చెడుకు దూరంగా ఉంటూ, మంచికి దగ్గరగా మసలుకుంటూ తోటి మానవుల పట్ల ‘ప్రేమ-త్యాగాలతో’ వ్యవహరిస్తూ ఉండటం వలన ‘ఇహలోకంలో గౌరవ మర్యాదలను’ మరియు పరలోకంలో ‘శాశ్వత ముక్తీ మోక్షాలను’ సాధించటానికి ఈ జీవితం ప్రసాదించబడిందన్న మనిషి జీవితానికి సంబంధించిన ‘గంభీరమైన (Most serious) దృక్పథాన్ని ఈ ధార్మిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి.
ఈ దృక్పథం నేటి ఆధ్యాత్మికుల్లో ఎందుకు లేదు?
బాధాకరమైన విషయమేమిటంటే వేదోపనిషత్తులు, గీతా, బైబిల్, ఖురాన్ శాస్త్రాల్లో ఉన్న గొప్ప దృక్పథాలను ఒక్క ఆధునిక విద్యావంతులు మాత్రమే కాదు, అధికశాతం ఆధ్యాత్మికులు సైతం వదిలిపెట్టేశారనటం అతిశయోక్తి కాదు. అందుకే ఈ ధార్మిక గ్రంథాల్లో ఉన్న “శాస్త్రబద్ధమైన ధర్మం (Scriptural religion)” కు బదులు మూఢ నమ్మకాలతో కూడిన “కల్పిత ధర్మం (Manmade religion)” నేడు చలామణీలోకి వచ్చేసింది. మూఢత్వ మత వ్యవస్థను చూసి అదే ధార్మిక గ్రంథాలు నేర్పుతున్న ధర్మం అన్న అపార్థానికి గురైపోయి కొందరు మొత్తానికి ధర్మానికి దూరమైపోయి నాస్తికులైపోయారు.
ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు చెయ్యాల్సింది..
“అన్ని విద్యల్లోకెల్లా మనిషి జీవితానికి సంబంధించిన వాస్తవికతను తెలిజేసే విద్యే గొప్పదని” ప్లాటో వివరించాడు. మనిషి బాహ్య వ్యక్తిత్వాన్ని (External personality) అభివృద్ధి చేసే “భౌతిక విద్య”ను అందించటంతో పాటు, నేటి విద్యావిధానంలో మనిషి అంతర్వ్యక్తిత్వాన్ని (Internal personality) వికాస పరచే “నైతిక విద్య (Moral science) ని కూడా బోధించాలి.
దానికి గాను మనిషి జీవిత లక్ష్యాన్ని తెలియజేస్తూ, అతనిలో ఉత్తమ నైతిక విలువలను పెంపొందింపజేసే ధర్మ శాస్త్రాల (వేదోపనిషత్తులు, బైబిల్, ఖురాన్) బోధన ద్వారా వ్యక్తిత్వ నిర్మాణం (Personality development) చెయ్యగలగాలి. మన విద్యావిధానం మానవీయ విలువలను విద్యార్థులలో ఇనుమడింపజేసేలా ఉండాలి. వారిలో నిగూఢంగా ఉన్న సామర్థ్యాలను వెలికితీసి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి.
ఈ విధంగా నాణ్యమైన భౌతిక విద్యను అందించటంతో పాటు, విద్యార్థులలో ఉత్తమ నైతిక విలువలను పెంపొందింపజేసే బృహత్తర బాధ్యత ఉపాధ్యాయులదే. ఉపాధ్యాయులు విద్యార్ధులకు ఆదర్శంగా ఉండాలి. బాధ్యతాయుతమైన ఉపాధ్యాయులే మంచి సమాజాన్ని నిర్మించగలరు. సమాజంలో మార్పు అన్నది నైతిక విలువలతో కూడిన విద్యావల్ల ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యపడుతుంది.
ఒకనాటి ఋషీశ్వరుల స్థానంలో ఉన్నవారే నేటి ఆధునిక అధ్యాపకులు. అందుకే ఉపాధ్యాయులు నిర్వహించే ‘తరగతి గది’ గురించి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏమన్నారంటే…
“తరగతి గది ఒక ప్రసూతి గది… జ్ఞానానికి జన్మనిచ్చేందుకు, తరగతి గది ఒక శ్మశానవాటిక… ఆజ్ఞానాన్ని ఖననం చేసేందుకు, తరగతి గది ఒక కర్మాగారం… జాతి భవితను నిర్మించేందుకు, తరగతి గది ఒక న్యాయస్థానం… సరైన నిర్ణయాలు తీసుకునేందుకు”
విద్యార్థులలో నేరప్రవృత్తి – ఉపాధ్యాయుల బాధ్యత
