వారు దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశారు /-

దేశం నలువైపులా మత ఉన్మాదం ముసురుకుంటున్న నేటి నేపథ్యంలో ఈ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించేసిన అనేక మంది ముస్లిం యోధుల చరిత్ర దాదాపుగా మరుగున పడిపోయిందనటం అతిశయోక్తి కాదేమో. ఇది దాదాపు రెండొందలేళ్ల పాటు తమ తోటి దేశ పౌరులతో భుజం కలిపి బ్రిటీషు సామ్రాజ్యంతో పొరాడుతూ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించేసిన ముస్లిం యోధుల చరిత్ర. నేడు దేశ ద్రోహులన్న విధంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొనని నామమాత్ర దేశభక్తుల ద్వారా బలవంతంగా ముద్ర వేయబడుతున్న భారతదేశ ముస్లిముల చరిత్ర.

1857 లో మొట్టమొదటి సారిగా బ్రిటీషు వారిపై భారతీయుల తిరుగుబాటు లేదా సిపాయిల తిరిగుబాటు జరిగిందన్నది అందరికీ తెలిసిందే. కానీ అంతకు ముందే “సిరాజుద్దౌలా” 1757 ఫ్లాసీలో బ్రిటీషర్లకు ఎదురు తిరిగి ప్రాణాలు అర్పించేసిన మొట్టమొదటి రెబలియన్ అన్న విషయం ఎంత మందికి తెలుసు? టిప్పుసుల్తాన్ నాలుగు సార్లు బ్రిటీషర్లతో యుద్ధానికి తలపడి 1799లో యుద్ధభూమిలో ప్రాణాలు అర్పించేయటం జరిగింది. ఆయన చేసిన యుద్ధాలు “ఆంగ్లో మైసూర్ వార్స్” అన్న పేరుతో వినుతికెక్కాయి. ఇది మీకు తెలుసా?

1857 లో భారతీయులు బ్రిటిష్ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా చేపట్టిన స్వతంత్ర సంగ్రామానికి నాయకత్వం వహించిన చివరి మొగల్ పాలకుడు బహదూర్ షాహ్ జాఫర్. ఫజల్ ఎ హక్ ఖైరబాది 1857 లో జరిగిన తిరుగుబాటులో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ముస్లిములను “జిహాద్” చెయ్యటానికి పిలుపునిచ్చిన స్వతంత్ర సమరయోధుడు. ఇక గదర్ పేరుతో వినుతికెక్కిన 1857 “ఇండియన్ రెబలియన్ మూవ్మెంట్”లో దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎంత మంది ముస్లిములు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసి ఉంటారన్నదానికి గొప్ప ఉదాహరణ ఒక్క డిల్లీ నగరంలోనే అక్షరాలా 27000 మంది ముస్లిములు చంపబడ్డారని చరిత్ర చెబుతుంది. ఈ నేపథ్యంలో బ్రిటీషర్లకు ఎదురు తిరిగిన మదర్సా ఉలామాలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 1864 నుండి 67 మధ్యలో ముస్లిం ఉలామాలు తమకు ఎదురు తిరిగారన్న నెపంతో అక్షరాలా 14000 మంది ముస్లిం ఉలామాలను ఉరికంబాలు సరిపోక చెట్ల కొమ్మలకు వ్రేలాడదీసి ఉరి తాళ్లు బిగించి చంపారు.

ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ 1929 లో ప్రారంభించిన “ఖుదాయే ఖిత్మత్ గార్ మూవ్ మెంట్” ఎంతమందికి తెలుసు? ఈ ముస్లిం యోధుడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా అక్షరాలా ఒక లక్షమంది ముస్లిములను ఏకం చేస్తే వారిపై పెషావర్ లో జరిపిన బహిరంగ కాల్పుల్లో 250 మంది ముస్లిములు చనిపోయారు.

ముస్లిములు దేశద్రోహులు కారు, కానీ ఈ దేశాన్ని ఆక్రమించిన దేశద్రోహుల పట్ల ద్రోహులుగా మారి ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించిన యోధులు! ఈ విషయం కేవలం వాట్స్ యాప్ జ్ఞానం తప్ప లౌకిక జ్ఞానం తెలీని నేటి కట్టర్ మతతత్వవాదులకు ఎంత మాత్రం తెలీని విషయం.

మదర్సా లను ఉగ్రవాదం నేర్పే పాఠశాలలుగా ముస్లిం పండితుల్ని ఉగ్రవాదం ప్రేరేపించేవారిగా ముద్రవేసే ఎంతమందికి “సిల్క్ లెటర్ ఉద్యమం” గురించి తెలుసు? 1857 తరువాత ముస్లిం దేశాల సహాయం తీసుకుని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చివేయ్యటానికి దేవ్ బంద్ పండితుల ద్వారా వ్యూహాత్మకంగా రూపొందించబండిదే “సిల్క్ లెటర్ ఉద్యమం”. దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ మద్రాసా పండితులైన మౌలానా మహ్ మూద్ హాసన్, మహమ్మద్ మియాన్ మన్సూర్ అన్సారీ, మౌలానా హుస్సేన్ అహ్మద్ మదనీ, మహమ్మద్ ఉబైదుల్లా సింధీ వగైరా ముస్లిం పండితులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. దేవ్ బంద్ ముస్లిం పండితులు మరియు ఇతర ముస్లిం పండితులు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చటానికి వ్యూహాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రీ, వాలంటీర్ల నియామకం వగైరా వాటి గురించిన సమాచారం రహస్యంగా పట్టు వస్త్రాలపై రాసుకుని చేరవేసుకునేవారు. దాని కారణంగానే దానికి సిల్క్ లెటర్ మూమెంట్ అనే పేరు వచ్చింది. దురదృష్టవశాత్తు ఆ లేఖలు బ్రిటిష్ వారికి చిక్కటంతో ఆ వ్యూహం విఫలమైంది.

బహుశా చాలా మందికి తెలీని విషయం ఏమిటంటే చరిత్రలో మరుగున పడిపోయిన ఆనాటి గొప్ప ఉద్యమాన్ని గుర్తించి జనవరి 11 2013 న మాజీ రాష్ట్రపతి “సిల్క్ లెటర్ ఉద్యమం”పై స్మారక స్టాంపును కూడా విడుదల చెయ్యటం జరిగింది. అంతేకాదు ప్రణబ్ ముఖర్జీ ఆనాటి సిల్క్ లెటర్ ఉద్యమాన్ని “A glorious chapter of Indian’s history of freedom struggle” గా అభివర్ణించటం జరిగింది.
***

ఈ దేశాన్ని క్రైస్తవులైన ఆంగ్లేయులు ఆక్రమించి 200 సం.లు ఉగ్రవాదం చేస్తే వారికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధపడిన వారిలో అష్ఫుల్లా ఖాన్, బేగం హజ్రత్ మహల్, ఆబాదీ బానో బేగం, మౌల్వీ అహ్మదుల్లా షా ఫైజాబాదీ, ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్, టిప్పుసుల్తాన్ లాంటి ముస్లిం యోధులే కాక, ఆనాడు బ్రిటీషర్లకు ఎదురుతిరిగి అష్ఫాఖుల్లా ఖాన్ ప్రాణాలు అర్పించి ఉండకపోతే, ముహమ్మద్ బఖ్త్ ఖాన్, మౌల్వీ సర్ఫరాజ్ అలీ, పీర్ ఆలీ ఖాన్ వగైరా ఎందరో చరిత్రలో మరుగున పడిపోయిన ముస్లిం యోధులు (Muslim unsung warriors) బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతూ తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసి ఉండకపోయి ఉంటే, ఎందరో ముస్లిములు బ్రిటీషర్ల తుపాకీ గుళ్లకు బలై ప్రాణాలు అర్పించకపోయి ఉంటే దేశ స్వతంత్రం పొందటం అన్నది కల్లోనే కాదు పీడకల్లో సైతం ఊహించుకోవటానికి సాధ్యం కాకపోయి ఉండేదేమో! అలాగే “తుర్రే బాజ్ ఖాన్” బ్రిటీషర్లకు ఎదురు తిరిగిన మొట్టమొదటి హైదబాదీ రెబలియన్! ఈయన్ని తుప్రాన్ సమీపంలో బ్రిటిష్ వారు చంపటమే కాక, ఆయన శవాన్ని హైదరాబాద్ మోసుకొచ్చి ప్రజల ముందు ఉరి వేసి మరీ పైశాచిక ఆనందం పొందారు.

ఇంకా మౌల్వీ ముహమ్మద్ బాకీర్, వాక్కమ్ మజీద్, సైఫుద్దీన్ కిబ్లెవ్, మగ్ఫూర్ అహ్మద్ అజాజీ, ఆసిఫ్ ఆలీ (ఈయన భగత్ సింగ్ తరఫున పోరాడిన లాయర్), అబ్బాస్ అలీ, అబ్దుర్రహ్మాన్, సయ్యద్ అల్లావుద్దీన్ హైదరీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వగైరా ఇంకా ఇక్కడ పేర్లు ప్రస్తావించని చరిత్రలో మరుగున పడిపోయిన ఎందరో ముస్లిం యోధులు 200 సం.లు సాగిన బ్రిటీషు ఉగ్రవాదానికి ఎదురు తిరగకపోయి ఉంటే భారతదేశ స్వతంత్రం ఓ తీరని కలగానే మిగిలిపోయేదేమో అనటం అతిశయోక్తి కాదు!

జాత్యాభిమానం ఈ దేశ ముస్లిముల నరనరాల్లో ఉంది దాని గొప్ప ఆధారం వేలల్లో ముస్లిములు ఈ దేశం కోసం బలిదానాలు చెయ్యటమే కాదు భారతదేశానికి జాతీయవాద నినాదాలన్నీ ముస్లిములు ఇచ్చినవి కావటమే!

1.”మాదరే వతన్ భారత్ కి జై” నినాదాన్ని 1857 లో అజీముల్లా ఖాన్ రూపొందించారు.
2.“జై హింద్” నినాదాన్ని అబిద్ హసన్ ‘సఫ్రానీ’ రూపొందించారు.
3.”ఇంక్విలాబ్ జిందాబాద్” నినాదాన్ని హస్రత్ మోహని రూపొందించారు.
4.భారత్ చోడో” (క్విట్ ఇండియా) నినాదం యూసుఫ్ మెహర్ అలీ రూపొందించారు. అలాగే యూసుఫ్ మెహర్ అలీ “సైమన్ గో బ్యాక్” నినాదాన్ని కూడా రూపొందించారు.
6.”సర్ఫరోషి కి తమన్నా, అబ్ హమారే దిల్ మె హై” అనే నినాదాన్ని 1921 లో బిస్మిల్ అజీమాబాది రాశారు.
7.”తరానా-ఎ-హిందీ” ‘సారే జహాన్ సే ఆచ్చా హిందోస్తాన్ హమారా’ ను అల్లామా ఇక్బాల్ రాశారు.

ఇది వాస్తవ చరిత్ర. అయినప్పటికీ నేడు హిందూ-ముస్లిం విభజన రాజకీయాలు నడుపుతున్న కొందరు నామమాత్ర “దేశభక్తు”లు ఈ దేశం కోసం ప్రాణాలర్పించేసిన ముస్లిం యోధుల చరిత్రను మరుగు పరచి మొత్తానికి ముస్లిములను పరాయి దేశస్తులుగా, దేశద్రోహులుగా ముద్ర వెయ్యటానికి కుటిల ప్రయత్నాలు చెయ్యటమే ఆశ్చర్యకరమైన విషయం

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *