మసీదు షాపింగ్ కాంప్లెక్స్

ఢిల్లీ, ముంబాయ్, కలకత్తా వంటి మహానగరాల్లోనే కాక, దాదాపు అన్ని నగరాలూ, పట్టణాల్లోనూ మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలా చోట్ల ప్రధాన కూడళ్లలోనో, మెయిన్ రోడ్ల ప్రక్కనో మసీదుల నిర్మాణాలుంటాయి. అంతేకాదు, ఆ మసీదుల ముందో, గ్రౌండ్ ఫ్లోర్ లోనో షాపింగ్ కాంప్లెక్సులు కూడా కట్టి ఉంటాయి.

ఆయా మసీదులు షాపింగ్ కాంప్లెక్సులు కట్టి అద్దెకివ్వటంలో ఉద్దేశం ఏమిటంటే వచ్చిన అద్దె డబ్బులను మసీదు మెయింటినెన్సు మరియు మసీదులో నమాజ్ చవించే ఇమామ్, ముఅజ్జిన్ లకు జీతాలివ్వటం, రంజాన్ నెలల్లో సహరీ, ఇఫ్తార్ సమయాల్లో నీళ్లు, ఆహారపదార్థాలు సమకూర్చటం వగైరా వాటి కోసం వాడుతూ ఉంటారు. ఒకవేళ ఊరి చివరో, వీధుల్లోనో కట్టే మసీదులకైతే ఆ మసీదు చుట్టూ ఉండే ముస్లిములే నెలకు తలా ఇంతని చందాలు వేసుకుని నిర్వహిస్తుంటారు.

ఆ షాపింగ్ కాంప్లెక్సులను కూడా ఒకసారెప్పుడైనా గమనించండి. ఆ మసీదు కాంప్లెక్సుల్లో ఉండే షాపుల్లో మతాలకతీతంగా హిందువులు, మార్వాడీలు, క్రైస్తవులు, ముస్లిములు వగైరా చాలా మంది కలిసికట్టుగా రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. పైగా వారందరూ సంవత్సరాల తరబడి ప్రక్కప్రక్కనే వ్యాపారాలు చేసుకుంటూ ఒక కుటుంబంలా కలిసిమెలసి ఉంటారు.

పైగా ఆయా మసీదు షాపింగ్ కాంప్లెక్సు ల్లో ఉండే షాపుల్లో రకరకాల వ్యాపారాలు చేసుకునే వారిలో హిందువులున్నా, క్రైస్తవులున్నా, ముస్లిములున్నా ఎవరున్నా పొద్దున్నే వారి వారి ఇష్టదైవాలను ప్రార్ధించుకుని, పూజించుకుని వ్యాపారాలు మొదలెడుతుంటారు. వారు చేసుకునే పూజలు, ప్రార్ధనల వల్ల ఆ మసీదు నిర్వాహకులు గానీ, రోజులో ఐదు పుట్లా వినపడే అజాన్ వల్ల, నమాజుల వల్ల ఆయా ముస్లిమేతర వ్యాపారస్తులు గానీ ఎలాంటి ఇబ్బందీ ఫీలవరు.

పైగా ప్రక్కప్రక్కనే సరదాగా కలిసిమెలసి సోదరుల్లా ఉంటూ, ఒకరి కష్టనష్టాలను మరొకరు తెలుసుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంవత్సరాల తరబడి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు.

ఈ విధంగా ఏ ఊళ్లో మసీదునైనా గమనించండి ఆయా మసీదు నిర్వాహకులు ఈ మసీదు ప్రాంగణంలో/ షాపింగ్ కాంప్లెక్సులో ఉంటే మా ముస్లిములే వ్యాపారాలు చేసుకోవాలని గానీ, ఆయా వ్యాపారాలు చేసుకునే ముస్లిముల్లో సైతం ఇక్కడ ఉంటే మా ముస్లిములే ఉండాలి, ముస్లిమేతరులు ఉండకూడదని గానీ ఎప్పుడూ అనుకోరు.

ఇంకా చెప్పాలంటే అధికశాతం మసీదు షాపింగ్ కాంప్లెక్సులు గమనిస్తే 90 శాతం మంది ముస్లిమేతరులే వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు.

ఈ రకమైన హిందూ-ముస్లిముల సోదరభావంతో, ఐక్యతతో నిర్మించబండిందే మన భారతదేశం. అలాంటి దేశంలో ఇప్పుడు కొందరు ఫాసిస్టు నాయకులు మత విద్వేష రాజకీయాలు చెయ్యటం మొదలెట్టారు.

దేవాలయాల చుట్టూ హిందూవేతరులు షాపులు పెట్టటానికి గానీ, వ్యాపారాలు చెయ్యటానికి గానీ వీలులేదని కొత్త చట్టాలు చెయ్యటం మొదలెట్టారు. హిందువుల దగ్గర హిందువులే కొనాలని ప్రజల మెదళ్లలో విషాన్ని నింపటం మొదలెట్టారు. సోదరుల్లా ఐక్యతతో కలసిమెలసి ఉన్న హిందూ-ముస్లిముల మద్య బీటలు తేవటం మొదలెట్టారు. వారి మద్య ధ్వేషాన్ని పెంచటం మొదలెట్టారు.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *