బాబ్రీ మసీదు సంఘటన నుండి వరుసగా సీ.ఏ.ఏ., ఎన్.ఆర్.సీ, ట్రిపుల్ తలాక్, లవ్ జిహాద్ వగైరా చట్టాలు రూపొందించటం వరకు, ముస్లిములపై సామూహిక జెనోసైడ్ చెయ్యాలంటూ బహిరంగ పిలుపు ఇవ్వటం నుండి జిన్నాటవర్ కూల్చేయాలంటూ పిలుపు ఇవ్వటం వరకు ప్రస్తుత ప్రధాన మతతత్వ పార్టీ, దాని సభ్యులూ హిందూ-ముస్లిముల మనోభావాలు రెచ్చగొడుతూ వేర్పాటువాద రాజకీయాలు నడపటానికి ఏ అవకాశాన్నీ వదలటం లేదు.
ఇలాంటి ప్రమాదకర నేపథ్యంలో హిందూ, ముస్లిములనబడే రెండు అతి పెద్ద వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించటానికి అన్ని విధాలా ప్రయత్నించటం తప్పనిసరి. అయితే హిందూ-ముస్లిముల పటిష్ట ఐక్యత ఆ ఇరువర్గాల మధ్య భావ సారూప్యతను తేవటం ద్వారానే సాధ్యమవుతుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
****
మతోన్మాదం తలకెక్కిన కొందరు ఇస్లాం ధ్వేషకులు హిందూ-ముస్లిముల మధ్య ఐక్యతను నాశనం చెయ్యటానికి ఇస్లాం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని, అది ప్రాచీన వైదిక ధర్మానికి విరుద్ధమైన ధర్మమని సామాన్య హిందూ ప్రజానీకంలో ముస్లిముల పట్ల ధ్వేషాన్ని నాటటంలో కొంతవరకు సఫలీకృతులయ్యారని చెప్పవచ్చు. తద్వారా హిందూ-ముస్లిం వర్గాల్లో చాలా మంది వైదిక-ఇస్లాం భావజాలాలు ఒకదానికొకటి పరస్పర విరుద్ధమన్న అపార్థానికి లోనైపోయారు.
వాస్తవానికి అటు వేదోపనిషత్తులు గమనించినా ఇటు ఖురాన్ గ్రంథాన్ని చదివినా వాటి మౌలిక సందేశం విషయంలో కించిత్తు భేదాన్ని గమనించలేము. అటు వేదాలను, ఇటు ఖురాన్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే అవి సృష్టికర్త అయిన దేవుని ఏకత్వాన్నే స్పష్టంగా బోధిస్తున్నాయి. అంతేకాదు ఏకదైవారాధన, పరలోక భావనలకు సంబంధించిన బోధల్లో సైతం ఎక్కడా వైరుద్ధ్యాన్ని చూడలేము.
ఈ లోతైన అవగాహన ఉన్నవారెవరైనా ఒకాటి వైదిక ధర్మం, ఇస్లాం పరస్పర విరుద్ధ బోధలు కలిగిన ధర్మాలు అని చెప్పే సాహసం చేయలేరు. ఇస్లాం, వైదిక ధర్మాల లోతైన అవగాహన ఉండబట్టే స్వామీ వివేకానందా హిందూ-ముస్లిముల ఐక్యతను అభిలాషిస్తూ ఈ క్రింది విధంగా చెబుతున్నారు.
“మన మాతృ భూమి కొరకు వేదాంతం, ఇస్లాం – ఈ రెండిటి విధానాల కలయిక, అంటే వేదాంతమే మేధస్సుగానూ, ఇస్లాం శరీరంగానూ జోడింపబడినదే శరణ్యం అనిపిస్తుంది. భారతదేశం ఉన్న క్లిష్ట పరిస్థితుల నుండి వేదాంతమే మస్తిష్కంగానూ, ఇస్లాం దేహంగానూ భాసిస్తూ ‘విజయవంతమైన, ప్రతిష్ఠాత్మకమైన సంపూర్ణ దేశంగా’ భవిష్యత్తులో వెలవగలదని నాకు స్పష్టంగా గోచరిస్తుంది” – స్వామీ వివేకానంద (నా భారతం అమర భారతం, పేజి నెం.113)
“ప్రజాబాహుళ్యానికి వేదాంత సిద్ధాంతాలు అవి ఎంత సున్నితమైనవి అయినప్పటికీ ఆచరణాయుతమైన ఇస్లాం మతంతో మేళవింపులేకుండా నిరుపయోగంగా పరినమిస్తాయి” – స్వామీ వివేకానంద (నా భారతం అమర భారతం, పేజి నెం.113)
స్వామీ వివేకానంద చెబుతున్న పై మాట లను బట్టి వైదిక-ఇస్లాం ధర్మాలు పరస్పర విరుద్ధం ఎంత మాత్రం కాదని సుస్పష్టమవుతుంది.
దీనిని బట్టి హిందూ-ముస్లిం వర్గాలలో కొందరి మధ్య ఏర్పడి ఉన్న అనైక్యతకు వైదిక-ఇస్లాం ధార్మిక దృక్పథాల మధ్య వైరుధ్యం కలిగి ఉండటం కాదు కానీ, వాటి మధ్య సమన్వయం (Co-ordination) చేయటంలో లోపం అని అర్థమౌతుంది. అది గనుక చేయగలిగితే మన దేశం ‘విజయవంతమైన, ప్రతిష్ఠాత్మకమైన సంపూర్ణ దేశంగా’ కాగలదన్న స్వామి వివేకానంద అభిలాష కచ్చితంగా సాధ్యమై తీరుతుంది.
ఒకనాటి వైదిక ధర్మానికి ఇస్లాం ఎంతో సారూప్యత కలిగి ఉన్నప్పటికీ వాటిని నమ్మేఅధికశాతం ప్రజల మధ్య ఐక్యత ఎందుకు లేదు అన్నది గమనిస్తే దానికి రెండు కారణాలు మన ముందుకొస్తున్నాయి.
అవి: 1. హిందూ-ముస్లిం వర్గాల్లో ప్రజలు తమ వద్ద ఉన్న ధార్మిక గ్రంధాలను పరిశీలనగా చదవకపోవటం 2. ఆయా ధార్మిక గ్రంథాలు ప్రస్తావిస్తున్న విశ్వాసాల ఆధారంగా కాక, స్వయం కల్పిత విశ్వాసాల ఆధారంగా కొందరు శాస్త్రులు (స్వార్థ పరులైన మత బోధకులు) సృష్టించిన మూఢాచారలతో కూడిన కాల్పనిక ధర్మాన్ని అనుసరించటం.
ఇక ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నది ముఢాచారాలతో కూడిన కాల్పనిక ధర్మమన్న అపోహకు గురై కొందరు విధ్యావంతులు మొత్తానికి ధర్మానికే దూరమైపోయి నాస్తికులుగా మారిపోయారు. ప్రస్తుత కాలంలో ధర్మం అంటే చాలా మందికి వెగటు పుట్టటానికి కారణం ధార్మిక గ్రంధాలు కావు, కానీ ప్రజల్లో కొన్ని గుడ్డి నమ్మకాలు సెంటిమెంట్లు సృష్టించి వారి ద్వారా తమ జేబులు నింపుకోటానికి కొందరు స్వార్థపరులైన మతబోధకులు తయారు చేసుకున్న మతవ్యవస్థే కారణం!
కాబట్టి నిజమైన వైదిక ధర్మాన్ని తెలుసుకోవాలంటే హిందూ సమాజాన్ని కాదు వేదోపనిషత్తులు చదవాలి, అలాగే ఇస్లాం గురించి యదార్థంగా తెలుసుకోవాలంటే ముస్లిం సమాజాన్ని కాదు ఖురాన్-హదీసులు చదవాలి.
ఈ గ్రంథాలు చదివితే చివరకు తేలే విషయం ఒక్కటే అది- “మానవులంతా ఒకే జంట సంతానం, అందరి ధర్మం ఒక్కటే, అందరికీ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే” అన్నది. ఈ సత్యాన్ని అటు హిందూ సమాజంలో ఇటు ముస్లిం సమాజంలో మాన్యుల నుండి సామాన్యుల వరకు అవగాహన చేసుకున్నప్పుడు ఇరువర్గాల్లో భావసారూప్యత అన్నది ఏర్పడుతుంది. తద్వారా హిందూ ముస్లిం వర్గాల్లో పటిష్ట ఐక్యత అన్నది ఏర్పడుతుంది. అప్పుడే స్వామీ వివేకానందుని అభిలషించినట్టు ‘విజయవంతమైన, ప్రతిష్ఠాత్మకమైన సంపూర్ణ దేశం’ నిర్మించటం సాధ్యపడుతుంది.
హిందూ, ముస్లిముల ఐక్యత – వివేకానందుని అభిలాష /-
