వరుసగా జరుగుతున్న నేటి హత్యాచారాల నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రతీ ఒక్కరి డిమాండ్ రేపిస్టులకు బుద్ధి వచ్చేలా కఠిన శిక్షలు అమలు చెయ్యాలన్నది స్వాగతించాల్సిన విషయమే. అయినప్పటికీ ఇటు సమాజంలో సామాన్యుల నుండి విధ్యావంతుల వరకు ముఖ్యంగా అనేక అంశాలలో యువతీ, యువకుల ఆధునిక ఆలోచనా విధానం మార్చుకుని కొన్ని మౌలిక జాగ్రత్తలు తీసుకోవలసిన తరుణం ఇది. అవేమిటో సంక్షిప్తంగా గమనిద్దాం.
***
“స్త్రీ అందచందాలు మనం ఆస్వాదించటానికే” అన్న భావన అటు యువకుల్లో అలాగే స్త్రీ అందం ఉన్నది దాచుకోవటానికి కాదు” అన్న విషతుల్యమైన భావనను ఇటు యువతుల్లో నేటి సినీ మీడియా రకరకాలుగా చిత్రీకరించి నేటి యువత ఆలోచనల్లో ఎప్పుడైతే నింపేసిందో అప్పుడే నేటి ఆధునిక సమాజమనే డిక్షనరీ నుండి “అశ్లీలత” అనే పదం తన ఉనికిని కోల్పోయిందనటం అతిశయోక్తికాదు. లాభార్జనే ప్రధాన లక్ష్యంగా మీడియా యువత కామోద్రేకాలను ఎంతవరకు ఎన్ని విధాలుగా రెచ్చగొడితే వారు ఆకర్షితులవుతారో అంతవరకు వారిని విపరీతమైన ఎక్స్ పోజింగ్, సెక్సువల్ ఎక్స్ ప్రెషన్స్, డబల్ మీనింగ్ డైలాగ్స్ తో నింపేసిన సినిమాలతో అంతవరకు రెచ్చగొడుతూనే ఉంది. “లస్ట్ ఈజ్ మస్ట్ ఫర్ ఎర్న్ మనీ” అన్నది మీడియా మంత్రం. ఇక యూట్యాబ్, ఫెస్బుక్, ఇంటర్నెట్ దానికి తోడు అతి తక్కువ ధరలకే ఆండ్రాయిడ్ ఫోన్లు, ఆన్ లిమిటెడ్ డేటాలతో పొర్నోగ్రఫీ చూడటం అన్నది ఓ సర్వసాధారణ విషయంగా ఎప్పుడో మారిపోయింది.
ఇలాంటి సమాజం నేపథ్యం మధ్య వృద్ధి చెందుతున్న ఈనాటి ఆధునిక సమాజపు యువతకు మీడియాలో నలువైపుల నుండి వచ్చిపడుతున్న అశ్లీలత సైతం అశ్లీలతగా కనపడటం అన్న భావన ఎప్పుడో సమసిపోయింది. అశ్లీలతతో నిండిన సినిమాలు, సిరియళ్లను, యాడ్లను సైతం కుటుంబ పరివారంగా కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న నేటి సామాజిక నేపథ్యంలో యువతీ, యువకుల తలిదండ్రులకు కూడా మీడియాలో కనపడుతున్న అశ్లీలత చాలా కామన్ విషయంగా మారిపోయింది.
ఓ డర్టీ పిక్చర్ బ్లాక్ బస్టర్, ఓ పోర్న్ స్టార్ బయోపిక్ సూపర్ డూపర్ హిట్ కాగలుగుతున్న నేటి పొల్యూటెడ్ సొసైటీలో ఉన్న ఈనాటి యువతలో అటు యువకులైతే తమ ఫేవరెట్ హీరోను అనుసరిస్తూ ఉంటే, అమ్మాయిలు సినీ హీరోయిన్లను అనుసరిస్తూ నలుగురిలో ఎంత హాట్ గా, ఎంత సెక్స్ అప్పిల్స్ కలిగి ఉంటే అంతగా మేమూ ఆకర్షించబడతామనే తపనలో కొట్టు మిట్టాడుతున్నారు. ఈ రకమైన పోకడకు నేటి ఆధునిక సమాజం పెట్టుకున్న పేరు- “మోడ్రనిజం”.
ఇక స్త్రీ శరీరం కనపడకుండా నిండుగా బట్టలు ధరించమనటం స్త్రీ అణచివేతలో ఒక భాగమని వాదించే అభ్యుదయ ఆధునిక ఫెమినిస్టులు (స్త్రీ వాదులు) ఎలాగూ ఉన్నారు. వారి పుణ్యమా అని స్త్రీ తనకు నచ్చిన బట్టలు వేసుకుని పురుషునితో సమానమైన ఆర్ధిక స్వతంత్రాన్ని సంపాదించి తనకు నచ్చినట్టు స్వతంత్రంగా తిరిగే హక్కు స్త్రీలకు కూడా ఉంది అంటూ టైట్ జీన్స్ ఫ్యాంటులు, షార్ట్లు, శరీరం కనిపించేలా టీ-షర్టులు వేసుకుని ఉమన్ ఎంపవర్మెంట్ అంటే ఇదే అన్న భావనలో ఈపాటికే చాలా మంది మునిగిపోయారు.
ఈ విధంగా విపరీతంగా సెక్సువల్ ఎమోషన్స్ ను ప్రమోట్ చేస్తున్న మీడియా ప్రభావం, అశ్లీలత నిండిన సామాజిక ప్రభావం ఉన్న నేపథ్యంలో రోజుకీ పదుల సంఖ్యలో అత్యాచారాలు ఎలా జరగకుండా ఉంటాయి? అన్నదే అసలు ప్రశ్న. కన్న కూతురినే రేప్ చేసిన తండ్రి, స్వంత చెల్లెల్నే రేప్ చేసిన అన్న లాంటి చదవటానికే ఏహ్యా భావం, గగుర్పాటు కలిగించే సంఘటనలు రోజూ న్యూస్ లలో మనం చదవటాన్ని బట్టి ఎంత దిగజారుడు సమాజంలో మనం నివసిస్తున్నామో ఈజీగా అంచనాకట్టవచ్చు.
స్త్రీ అంటే ఓ ఆటవస్తువుగా పరిగణించి రోడ్డు పై ఏ స్త్రీ కనిపించినా కింద నుండి పై వరకు కామంతో చూస్తూ ఆనందించేవారు కొందరైతే, వీలు చిక్కితే లైంగికంగా వేధించేవారు మరి కొందరు, సమాజం, పట్టింపులు గురించి పెద్దగా పట్టించుకొని ఇంకొందరు తెగించి అవకాశం దొరికితే అత్యాచారాలకు తెగబడుతుంటారు. వీరంతా ఎక్కడ నుండో వచ్చే గ్రహాంతర వాసులేమీ కారు సమాజంలో మన చుట్టూ ఉండే ఇళ్ళల్లో చెల్లెళ్లకు అన్నల పాత్ర పోషిస్తూ, ఓ అమ్మాయికి తండ్రుల పాత్ర పోషిస్తూ, ఓ స్త్రీలకు భర్తల పాత్ర పోషిస్తూ ఉండే పురుషులే.
ఇక మీడియాలో విపరీతమైన ఎక్స్ పోజింగ్ ప్రభావమే ఈనాడు జరుగుతున్న అనేక అత్యాచారాలకు కారణం అన్న వాదనను సైతం మొత్తం మీడియాలో యాక్టర్లు, హీరో, హీరోయిన్లు అంతా కలిసి “సినిమాలు లేక ముందు రోజుల్లో రేపులు జరగలేదా ఏంటి? అయినా చిన్న పిల్లలు కూడా రేప్ చేయబడటం లేదా? వారు ఏమైనా సెక్స్ అప్పీల్ బట్టలు వేసుకువటం వల్ల జరుగుతున్నాయా? అయినా మేము ఏ బట్టలు వేసుకుంటే మీకెందుకు? మమ్మల్ని కామ దృష్టితో చూడకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోవటం అది మీ చేతకానితనం అంటూ కొన్ని దిక్కుమాలిన లాజిక్కులు చెబుతుంటారు. వీరు చెప్పే మాటలు ఎంత వెరైటీగా ఉంటాయంటే నోట్లు చాక్లెట్ పెట్టి చప్పరించటం అది మీ తప్పు! అన్న చందంగా ఉంటుంది. ఎందుకంటే వారి జీవనం అందాలు ఎరవేసి, యువత కామోద్రేకాలు రెచ్చగొట్టి డబ్బు చేసుకోవటం మీద ఆధారపడి ఉంది కాబట్టి.
ఇదీ నేటి సమాజపు అతి ప్రమాదకర ఆధునిక భావజాలం.
***
మార్పు అనేది ఏ యే అంశాలలో తీసుకురావాలి?
ఈ రకమైన సామాజిక నేపథ్యంలో స్త్రీ-పురుషులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవటాన్ని బట్టే కొంతవరకు మార్పు అనేది సాధ్యమౌతుంది. అవి:
తలిదండ్రులు ఎదిగీ ఎడగని వయసులో తమ పిల్లలు అనవసర ఆందోళనల్లో పడిపోకుండా వారికి ఊహ వచ్చినప్పటి నుండే మీడియాలో అశ్లీలత నుండి, వారిని దూరంగా ఉంచాలి. ఇంకా వారికి చిన్నప్పటి నుండే ధార్మిక గ్రంధాల్లో శాస్త్రబద్ధమైన ఆధ్యాత్మికత (Spirituality) కి దగ్గర చెయ్యాలి.
స్త్రీలు అందర్నీ ఆకర్షించటానికి చిత్ర విచిత్ర బట్టలు వేసుకోవటం ఎంత మూర్ఖత్వమో, శరీరం-అందచందాలు కనిపించేలా బట్టలు వేసుకుని మా వంక ఎవరూ అదోలా చూడకూడదనుకోవటం కూడా అంతే మూర్ఖత్వం అవుతుంది. శరీర అందచందాలు కనపడేలా బట్టలు ధరించటం అన్నది ఆధునికత అవ్వదు అనాగరికత అవుతుంది. నాగరికులే నిండైన బట్టలు వేసుకునేది. కాబట్టి స్త్రీలు పురుషునితో సమానంగా కాలేజీల్లో చదువుకోవటం, ఉధ్యోగాలు చెయ్యటం, ఆర్ధిక స్వతంత్రం సంపాదించటం తప్పు కాదు. కానీ, ఆధునికత పేరుతో ఎదుటివార్ని తమ వంక చూసేలా ఆకర్షించబడేలా తయారటం, ప్రవర్తించటమే ప్రమాదకరం. ఇంకా నిండైన బట్టలు ధరించటం ఎంతమాత్రం స్త్రీ అణచివేత అవ్వదు కానీ స్త్రీకి కవచం అవుతుంది. ఇవి స్త్రీలు తమ విషయంలో మార్చుకోవలసిన ఆలోచనా విధానం.
యువకులు మరియు పురుషులు రోడ్డుపై స్త్రీ కనపడితే చొంగ కార్చుకునే ముందు ఆమె కూడా మన ఇంట్లో స్త్రీ వలె ఒకనికి తల్లో, చెల్లెలో, కూతురో అయి ఉంటుంది. మా స్త్రీల వంక ఇదే రకంగా ఇతర పురుషులు ఎవరైనా చూస్తే మనం తట్టుకోలేనప్పుడు పరాయి స్త్రీలు అంటే మన కళ్ల దాహం తీర్చుకోవటానికి పనికి వచ్చే ఆటవస్తువుగా భావించక వారి వంక అదోలా చూడటం, లైంగికంగా వేధించటం ఎంతవరకు సబబో ఆలోచించుకోవాలి. ఇవి యువకులు తమ విషయంలో మార్చుకోవలసిన ఆలోచనా విధానం.
ఆధునికత అంటే వచ్చి రాని తెలుగులో పదాలు వల్లెవేస్తూ, టోర్న్ జీన్స్ ఫ్యాంట్లు, టీ షర్ట్ లు, శరీరం కనపడేలా తక్కువ బట్టలు తొడగటం కాదు. ఆలోచనల్లో శాస్త్రీయత, నడవడికలో నైతికత, వ్యవహారాలలో మానవత్వం, హేతుబద్ధమైన ఆలోచనలు మరింతగా కలిగి ఉండటం అన్నది తెలుసుకోవాలి. పురుషాధిక్యత అంటే స్త్రీని ఎలా పడితే అలా వాడేసే ఆటవస్తువులా భావించి ఆమె పై పనికిమాలిన పెత్తనం చలాయించటం కాదు. మంచి భర్తగా, అన్నగా, తండ్రిగా తన పూర్తి బాధ్యతను నిర్వర్తించటం. అన్ని విధాలా స్త్రీకి ప్రొటెక్షన్ ఇవ్వగలగటం. ఈ విధంగా అటు చట్టాల్లో కఠిన శిక్షలే కాక, ఇటు స్త్రీ, పురుషుల ఆలోచనా విధానంలో మార్పు అనేది రానంత వరకు సమాజంలో అత్యాచారాలు, లైంగిక వేధింపులు కొంతవరకైనా నియంత్రించబడటం అన్నది ఓ పీడకలగానే మిగిలిపోతుంది.
Md Nooruddin
ఆధునిక భావజాలం & అశ్లీలత
