దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్! అన్న కొటేషన్ పదే పదే వింటూ వస్తున్న నేపథ్యంలో నాకర్థం కాని విషయం ఇంతకూ “దేశభక్తి” అంటే- సంవత్సరానికోసారి త్రివర్ణ పతాకానికి సాల్యూట్ కొట్టడమా? భారత్ మాతాకీ జై చెప్పడమా? లేక మన ప్రధాని మోడీజీ చెప్పినట్టు కుటుంబ నియంత్రణ పాటించటమా? మైనార్టీలపై అసహ్యించుకోవటం లేక దాడులకు తెగబడటమా? సారే జహాసే అచ్చా, జణమన గీతాలు పాడటమా? స్కూళ్ళలో పిల్లల చేత వందేమాతరం జనగణమణ గీతాలు పాడించటమా? పంద్రాగస్టు నాడు జండా వందనం చేసి చాక్లెట్లు పంచుకోవటమా? లేక పాకిస్తాన్ని అసహ్యించుకోవడమా? బలవంతంగా భారత్ మాతాకీ జై చెప్పించటమా? సినిమా ధియేటర్లలో జనమణ గీతానికి లేచి నిలబడటమా? లేక ఈ మధ్య మొదలైన గోభక్తిని దేశభక్తి అని అనుకోవాలా? ఇంతకూ “దేశభక్తి అంటే ఏమిటి? ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది పాకిస్థాన్ అన్న ఐటెం లేకపోయి ఉంటే ఈపాటికి ఇండియాలో దేశభక్తి అన్న పదం ఉనికి ఎప్పుడో కోల్పోయి ఉండేదేమో! అని.
ఒకప్పుడు కొన్ని వేలమంది హిందూ-ముస్లిములు కలిసికట్టుగా ఈ దేశం కోసం ప్రాణార్పణలు చేసేసిన వారి అసలు సిసలైన దేశభక్తిని ప్రక్కన పెడితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో దేశభక్తి ముసుగులో రూపు దాల్చుకుంటున్న క్రొత్తరకం “దేశ్ భక్తి” –
ముస్లిం, క్రైస్తవ దళితులపై తిరుగుబాట్లు చెయ్యటం, ముస్లిములను ఎక్కడ పడితే అక్కడ గెడ్డాలు మీసాలు లాగేసి పిసికేసి జైశ్రీరామ్ బోల్ అని బెదిరించడం, చెప్పినా చెప్పకపోయినా హింసించి చంపేయటం, పసువులకంటే హీనంగా ముస్లిములను ట్రీట్ చెయ్యటం, ఉగ్రవాదులన్న ముద్ర వేసి వారిని అసహ్యించుకోవటం, పారాయి దేశస్థులుగా ట్రీట్ చేస్తూ మూక దాడులు చేసి హింసించడం చంపటం ముస్లిం స్త్రీలను సైతం కొట్టటం బురఖాలు లాగెయ్యటం వీలైతే అత్యాచారాలు చెయ్యటం, వారిని అవమానించడం ఇంకా గోరక్షణ పేరుతో హింసా దౌర్జన్యాలకు తెగబడటం! ఇదంతా దేశభక్తిలో భాగంగా చేస్తున్నామన్న ఫీలింగులో మునిగిపోయి చివరకు గోభక్తే దేశభక్తి అన్న చందంగా ఈనాటి దేశభక్తి పరిస్థితి తయారైంది అనటం అతిశయోక్తి కాదు!
దేశం + భక్తి = దేశభక్తి!
********************
ఇంతకూ దేశభక్తి అంటే ఏమిటి? దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించటం అని చక్కగా పదాలను వల్లించి చెప్పే వారిలో అధికశాతం మంది సైతం దానికి సరైన డెఫినిషన్ ఇచ్చే స్థితిలో లేరు అంటే అతిశయోక్తి కాదు! వివరంగా చెప్పాలంటే ఈరోజు దేశభక్తిని గురించి లెక్చర్లు ఇచ్చే అధిక శాతం మంది రాజకీయ నాయకుల నుండి “భక్తుల” వరకు అసలు దేశభక్తి అంటే ఏమిటో తెలియదని చెప్పటంలో సందేహం లేదు.
ఇంతకూ “దేశం” అంటే- భారతదేశంలో ఉండే ఆవులు, మట్టిదిబ్బలు, రోడ్లు, పొలాలు, కాలవలు, కొండలు, గుట్టలనా? కాదుకదా! భారతదేశంలో పుట్టిన మనుషులు అని అంతేకాదా! వారు ఎవరు? హిందూ-ముస్లిం-క్రైస్తవ-దళిత ఇతర మత ప్రజలంతా అంతేకాదా! అలాంటప్పుడు “దేశభక్తి” అంటే- హిందూ, ముస్లిం, క్రైస్తవ, దళిత అన్న తేడా చూపకుండా అగ్రవర్ణం-అధమ వర్ణం, గొప్పవాడు-అధముడు అన్న తారతమ్యాలు చూపకుండా, నల్లవాడు-తెల్లవాడు అన్న జాత్యాహంకారం చూపకుండా, వర్గ-జాతి, ఉచ్ఛ-నీచ, కుల-మత వివక్షలు చూపకుండా ఉండగలిగే ప్రవృత్తి (Nature) ని కలిగి, అందరినీ తమను తాము ప్రేమించుకుంటున్నట్టు, గౌరవించుకుంటున్నట్టు ఇతరులను కూడా సమానంగా ప్రేమించటం, గౌరవించటం అని ఎవరైనా అర్ధం చెబితే, అలాంటి సంస్కారవంతమైన ఉత్తమోత్తమ ప్రవృత్తిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని పధ్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే ప్రవక్త ముహమ్మద్ (స) ఈ క్రింది విధంగా బోధించారని ఈనాటి ఎంతమంది అభినవ దేశభక్తులకు తెలుసు?
“తెల్లవానికి నల్లవానిపై గానీ, నల్లవానికి తెల్లవానిపై గానీ, అరబ్బునికి అరబ్బేతరునిపై గానీ, అరబ్బేతరునికి అరబ్బుపై గానీ ఏ అధిక్యతా లేదు కేవలం సత్ప్రవర్తన, భయభక్తుల ద్వారా తప్ప” – ప్రవక్త ముహమ్మద్ (స)
“జాత్యాహంకారాన్ని (Racism)”, కుల-మత, ఉచ్ఛ-నీచ, అగ్ర-అధమ వర్ణ వ్యవస్థలను ఇస్లాం పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే కూకటివేళ్లతో సహా పెకించివేసింది. కాబట్టి సమాజంలో జాత్యాహంకారాన్ని, కులమత, జాతి-వర్గ అసమానతలను తొలగించి సుందర సమాజం ఎలా నిర్మించాలి? అన్నది తెలుసుకోవాలనుకునే అభిలాష కలిగిన ఉత్తములు చెయ్యల్సింది- ఒక్కసారి ఓ గంట టైమ్ తీసి 1400 సం. కు ముందు ప్రవక్త ముహమ్మద్ (స) రాక పూర్వం అరేబియా అనే దేశంలో అప్పటి ప్రజలు తీవ్రమైన వర్గపరమైన వైరుధ్యాలతో ఎంత ఆటవికంగా, క్రూరంగా, ఎంత అనైతికంగా అమానవీయతతో హీనస్థితిలో జీవితం గడిపేవారో అలాంటి ఒక ఒక జాతి ప్రజలు ప్రవక్త ముహమ్మద్ (స) ఆవిర్భావం తరువాత ఏ విధంగా ఉత్తమోత్తమ నైతిక విలువలు బోధించేవారుగా, ఆచరణాత్మకంగా పాటించేవారుగా, మానవత్వానికి పట్టుకొమ్మలుగా మారిపోయారు? ఇంకా ఏ విధంగా కేవలం 22 సం.ల అతికొద్ది సమయంలో అరేబియా ప్రపంచానికి ఆదర్శంగా మారిపోయింది? అన్నది ఒక్కసారి పరిశీలిస్తే చాలు.
పై వివరణలో చెప్పబడినట్లు వ్యక్తుల ప్రవృత్తిలో కుల-మత, ఉచ్ఛ-నీచ, అగ్ర-అధమ తారతమ్యాలు చూడకుండా, ఎటువంటి భేషజాలు చూపకుండా నైతికంగా ఉత్తమ ప్రవర్తన కలిగి తోటి ప్రజలందరినీ సమానంగా ప్రేమించటమే, గౌరవించటమే దేశభక్తి అయితే దానిని ఖురాన్ ఎప్పుడో స్థాపించింది. ఇదిగో ఈ క్రింది విధంగా …
“మానవులారా! మేము మిమ్మల్ని ఒకే స్త్రీ, పురుష జంట నుండి సృష్టించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవ పాత్రుడు” – 49:13
Md Nooruddin
దేశభక్తి అంటే…!?
