‘సైన్స్’ & ‘ధర్మం’ (Science and Religion) /-

ధార్మిక గ్రంథాల్లో చెప్పబడే ‘ధర్మం’ ఆస్తికులకు చెందింది.. ‘సైన్స్’ ఆధునిక విద్యావేత్తలకు, నాస్తికులకు చెందినది మాత్రమే.. అలాగే ‘ధర్మం’ మనిషి ఆలోచనలకు లాక్ పెట్టేసి మూఢత్వ ఆలోచనల వైపునకు నడిపిస్తుంటే సైన్స్ మనిషిని ఆలోచన, పరిశీలన వైపునకు నడిపిస్తుంది అన్న ఈ రెండు అతిపెద్ద అపోహలు లేక అపార్థాలను ఏదో కోణంలో నాస్తికులు తమ రాతల్లోనో మాటల్లోనో ప్రదర్శిస్తూనే ఉంటారు.

అసలు ‘సైన్స్’ కు మూలం- సృష్టి, సృష్టితాల పట్ల ‘ఆలోచన’ లేదా ‘పరిశీలన’ చెయ్యటమే! ‘ఆలోచన’ / ‘పరిశీలన’ అన్నది లేకపోతే సైన్స్ కు ఉనికే లేదు. సృష్టిపట్ల ఎందరో శాస్త్రవేత్తలు చేసిన ఆలోచన/పరిశీలన ఫలితంగా ఆవిష్కరించబడ్డావే ఈనాడు మన కళ్ల ముందు ఉన్న అత్యాధునిక భౌతిక సరంజామా అంతా.

లోతైన శాస్త్రీయ పరిశీలన చేసే కొద్దీ.. ఈ సృష్టి తాలూకు అద్భుతాలు బయటపడుతూనే ఉంటాయి. ప్రతీ పదార్థం అణువుల సముదాయంతో సృష్టించబడిందన్న విషయం కనుగొన్న తరువాత ఆ అణువు సైతం ఓ సూక్ష్మ జగత్తు అని.. ఒక అణువులో అద్భుతమైన మెకానిజమ్ ఉందని, అణువు సైతం న్యూక్లియస్, ప్రొటాన్స్, ఎలక్ట్రాన్స్ తో కూడిన ఓ అద్భుతమైన ప్రపంచమని లోతైన పరిశీలన చేశాకే తెలిసింది.

అలాగే విశ్వాన్ని ఎన్నో విధాలుగా శాస్త్రీయ పరిశీలన చేశాకే దానిలోని అద్భుతాలను సైంటిస్టులు ఒకొక్కటిగా వివరించగలిగారు. ఖురాన్ ఆ విధమైన సైంటిఫిక్ రీసెర్చ్ (శాస్త్రీయ పరిశీలన) కు అతి పెద్ద పీట వేస్తుందన్నది ఈ సందర్భంలో గమనార్హం.

“భూమీ ఆకాశాల నిర్మాణం గురించి ఆలోచన చేసే వివేకవంతులకు ఎన్నో సూచనాలు ఉన్నాయి” – ఖురాన్ 3:190

సైన్స్ కు బీజం సృష్టి పట్ల ఆలోచన/పరిశీలన చెయ్యటమైతే ఖురాన్ సృష్టిపట్ల ఆలోచన చెయ్యమని చెబుతుంది. పైగా బుద్ధిని ఉపయోగించనివారిని నీచాతినీచమైన జంతువులుగా జమకడుతుంది ఖురాన్.

“తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారు, మూగవారూ మాత్రమే నిశ్చయంగా అల్లాహ్ దృష్టిలో నీచాతినీచమైన కోవకు చెందిన జంతువులు” – ఖురాన్ 8:22

‘ధర్మం’ గుడ్డి నమ్మకాలను మాత్రమే ప్రమోట్ చేస్తుంది, ఆలోచనలకు లాక్ పెట్టేసి మూఢనమ్మకాల్లో నడిపించేదే ధర్మం అని ఆల్రెడీ బ్రెయిన్ వాషింగ్ కు గురై ఉన్న నాస్తికులకు పై ఖురాన్ వాక్యాలు మింగుడు పడవు.

నిజానికి ఖురాన్ సృష్టిపట్ల ‘శాస్త్రీయ పరిశీలన’ చెయ్యటం వైపు ప్రజలను ఆహ్వానిస్తుంది.

“ఆయనే భూమిని పరచినవాడు; అందులో పర్వతాలను గుంజలవలె పాతిపెట్టినవాడు, నదులను ప్రవహింపజేసినవాడు, ఆయనే అన్ని రకాల పండ్ల జతలను పండించినవాడు, ఆయనే పగలుపై రాత్రిని కప్పేవాడు. ఈ అన్ని రకాల విషయాలలో ఆలోచించే వారికొరకు పెద్ద సూచనలు ఉన్నాయి” – ఖురాన్ 13:3

“చూడండి! భూమిలో వేర్వేరు ప్రదేశాలున్నాయి. అవి ఒకదానికొకటి ప్రక్కప్రక్కన ఉన్నాయి. ద్రాక్షతోటలూ ఉన్నాయి, పంట పొలాలూ ఉన్నాయి, ఖర్జూరపు చెట్లూ ఉన్నాయి – వాటిలో కొన్ని ఒకొక్కటిగానూ మరికొన్ని జంటలుగానూ ఉన్నాయి – వాటన్నిటికీ ఒకే నీరు పారుతుంది. కానీ మేము కొన్నిటిని ఎక్కువ రుచికరమైనవిగా చేశాము. మరికొన్నిటిని తక్కువ రుచికరమైనవిగా చేశాము. ఈ అన్ని విషయాలలో బుద్ధిని ఉపయోగించే వారికి చాలా సూచనలు ఉన్నాయి” – ఖురాన్ 13:4

చివరకు ఏదైనా విషయాన్ని ఖండించటానికి సైతం “మీరు నా సూచనలను శాస్త్రీయ పరిశీలన చెయ్యకుండానే ఇట్టే తిరస్కరించారు” – ఖురాన్ 27:84 అని ఖురాన్ ప్రశ్నిస్తుంది.

“భూమిపై తిరగండి, ఆయన సృష్టిని ఏ విధంగా ప్రారంభించాడో ఆలోచనచెయ్యండి” – ఖురాన్ 29:20 అని నిద్రాణమైన ఉన్న మనిషి ఆలోచనలను తట్టిలేపుతుంది.

ఈ విధమైన కొన్ని వందల వాక్యాల్లో ఖురాన్, సృష్టి పట్ల ‘ఆలోచన/పరిశీలన’ చెయ్యమని చెప్పటమే కాక, వ్యక్తుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించటానికి ‘మనిషి పిండ నిర్మాణం గురించి’ ‘జంటల సిద్ధాంతం గురించి’ ‘బిగ్ బ్యాంగ్ గురించి’ ‘గ్రహాలా కక్ష్యల గురించి’ ‘భూమి-ఆకాశాల నిర్మాణం గురించి ప్రస్తావన చేస్తూ మనిషిలోని శాస్త్రీయ ఆలోచనలకు పదును పెడుతుంది.

దానికి కారణం మనిషి శాస్త్రీయ పరమైన మరియు హేతుబద్ధమైన ఆలోచన ద్వారానే భౌతికంగానూ, నైతికంగానూ అభివృద్ధి సాధించగలడు. ఆ విధంగా మనిషిని శాస్త్రీయంగానే కాక నైతికంగానూ అభివృద్ధి సాధించటానికి సృష్టికర్త పంపిన ఆదేశాల సమాహారమే ధార్మిక గ్రంథాలు.

అయితే ఈ ధార్మిక గ్రంథాల ప్రబోధనలను ఆచరణలో పెట్టటానికి బదులు వాటిని ప్రక్కనపెట్టేసి, కొందరు మత పండితులు గుడ్డి నమ్మకాలు, హేతువిరుద్ధమైన విశ్వాసాలతో కూడిన మతవ్యవస్థను తయారు చేశారు.

నేడు మత వర్గాల్లో తొంభై శాతం అనుసరించబడుతున్నవన్నీ
అలాంటి కల్పిత విశ్వాసాలూ, ఆచారాలే. వాటి పట్ల రోత పుట్టి మొత్తానికి ధర్మానికే దూరమైన వర్గమే నాస్తికులు.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *