తొంభై తొమ్మిది శాతం మనిషి శరీరం “ఆక్సిజన్” “కార్బన్” “హైడ్రోజన్” “నైట్రోజన్” “కాల్షియం” “ఫాస్ఫరస్” అనే ఆరు మూలకాల సముదాయంతో తయారైనదే! మహాలేదంటే ఈ ఆరు మూలకాలు బజారులో కొన్ని వందల రూపాయలు ఖర్చు పెడితే దొరికేసే వస్తువులే.
కానీ, ఈ కొద్ది పాటి పదార్థాలతోనే ఆ సృష్టికర్త విలువకట్టలేని అమూల్యమైన మానవుణ్ణి సృష్టించాడు. అతని శరీరం ఎంత అమూల్యమైనదంటే.. ఒకవేళ శరీరంలో ఏ కాలో చెయ్యో తెగిపోతే.. మిలియన్ల కొద్దీ డబ్బు ఖర్చుపెట్టినా నేటి ఆధునిక సైంటిస్టులకు సైతం శరీరంలో ఆ తెగిన భాగాన్ని తిరిగి రప్పించటం సాధ్యం కాని పని.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే..
తన ప్రమేయం లేకుండా వీర్యకణం అండంతో ఫలదీకరణం చెందితే..
తన ప్రమేయం లేకుండానే 9 నెలలు గర్భంలో పెంచి పొంషించబడి..
తన ప్రమేయం లేకుండానే వివిధ దశల్లో పెరుగుతూ పోయి..
తన ప్రమేయం లేకుండానే తల్లి గర్భం నుండి ఈలోకంలో పంపబడి..
తన ప్రమేయం లేకుండానే అణువంత మరిమాణం నుండి ఆరడుగులంత పెరిగి పెద్దవాడై.. ఈ మనిషే చివరకు నన్ను ఏ సృష్టికర్తా సృష్టించలేదంటాడు..
లేదా ఆయన్ని వదిలిపెట్టి సృష్టితాలను దేవుళ్లుగా చేసుకుంటాడు..
తనను పుట్టించిన సృష్టికర్తకే బహిరంగ ప్రత్యర్థిగా మారిపోతాడు..
తన పుట్టుకను గురించి మరిచిపోతాడు. సకల జీవుల్లోకెల్లా ఎంతో అర్థవంతమైన జీవితాన్ని, ఉత్తమోత్తమ స్థానాన్ని పొంది, తనను తాను కోతుల నుండో, కుక్కల నుండో పరిణామం చెందినట్లు డిక్లేర్ చేసుకుని దానినే ఆధునిక అభ్యుదయవాదమంటూ కాలరెగరేస్తాడు.
తన అంతరాత్మ ఆ ఏకైక సృష్టికర్తను గురించి హేతుబద్ధంగా ఆలోచన చెయ్యమని లోలోపల గద్దిస్తూ ఉన్నప్పటికీ.. ఆ సృష్టికర్తను వదిలి విగ్రహాలను, పుట్టి చనిపోయే మానవులను, జంతువులను దేవుళ్లుగా చేసుకుంటాడు..
లేదంటే ఎంతో క్రమబద్దతో నడుపబడుతున్న ఈ సృష్టి తన కళ్ల ముందు కదలాడుతున్నప్పటికీ.. ఈ సృష్టికి ఏ కర్తా లేడు ఈ విశ్వకర్మాగారమంతా ఏదో గాలివాటంగా ఏర్పడిపోయి దానికదే నడుపబడుతుందని వాదిస్తూ చివరకు వృద్ధాప్యానికి చేరిపోతాడు. అందుకే అతని గురించి ఖురాన్ చెబుతున్నదేమిటంటే..
“మేము మానవుడిని వీర్య బిందువుతో సృజించిన విషయం అతను చూడటం లేదా? అయినా అతడు బహిరంగ ప్రత్యర్థిగా నిలబడ్డాడు. ఇప్పుడు అతడు మాకు పోలికలు కల్పిస్తున్నాడు, తన పుట్టుకనే మరచిపోతున్నాడు. పైగా, శిథిలమైపోయిన ఈ ఎముకలకు తిరిగి ఎవరు జీవం పోస్తారు? అని వాదిస్తున్నాడు. అతడికి ఇలా చెప్పు, “మొదట వాటిని సృష్టించిన వాడే మళ్లీ వాటికి జీవం పోస్తాడు. సృష్టికి సంబంధించిన ప్రతీ విషయమూ ఆయనకు తెలుసు. మీకై ఆయనే పచ్చని వృక్షాల నుండి అగ్నిని సృష్టించాడు. మీరు దానితో కుంపట్లు రాజేసుకుంటారు. ఆకాశాలనూ భూమినీ సృష్టించినవాడు వీరిలాంటి వారిని పుట్టించలేడా? ఎందుకు చేయలేడు, ఆయన మహానిపుణుడైన సృష్టికర్త అయినప్పుడు?” – ఖుర్ఆన్ 36:77-81
Md Nooruddin
