నాకు తెలిసిన హిందూత్వం ఇది కాదు!

కాషాయం ధరించి ముస్లిముల ఇళ్లూ, అంగళ్లూ తగలేట్టేయటం..

మసీదు మీనార్లెక్కి కాషాయ జెండాలు తగిలించి ఉన్మాదం ప్రదర్శించటం..

బ్యాక్‌గ్రౌండ్‌లో ముస్లిం వ్యతిరేక పాటలతో కేరింతలు కొడుతూ ఊగిపోవటం..

మసీదుల ముందు డిజేలు పెట్టి డ్యాన్సులు చేస్తూ నా నా భీబత్సం చేసెయ్యటం..

ఒకవేళ ఈ ఇరవైయ్యవ శతాబ్దపు అభినవ “హిందుత్వవాదం” ఇదే అయితే.. ఇలా ఉన్మాదాన్ని ప్రదర్శించటమే హిందుత్వ పరిరక్షణ అని కొందరనుకుంటే..

ఈ అభినవ హిందుత్వ వాదానికీ మరియు పవిత్ర వేదోపనిషత్తులు, గీతా శాస్త్రాల్లో ఉన్న సనాతన హిందూ ధర్మానికి ఏ మాత్రం పొంతన లేదని చెప్పటం అతిశయోక్తి కాదు!

ఇది ఫాసిస్టు భావజాలంతో విద్వేష రాజకీయాలు నడుపుతున్నవారి ద్వారా తలకెక్కించబడుతున్న ఉన్మాదం ఒక రకమైన మేనియా మాత్రమే. కానీ..

నాకు తెలిసిన హిందుత్వం వేరు

ఎక్కడో చదివాను “హిందూ” అంటే “హింసాయాం దుషయతి ఖండయతి ఇతి హిందూ” – “ఎక్కడైతే హింస, పాపములు ఉన్నాయో వాటిని ఖండించేవాడే హిందువు” దానికి భిన్నంగా హింసను, దౌర్జన్యాన్ని, పాపక్రియలను సమర్ధించేవాడు హిందూ ధర్మ వ్యతిరేకిగా పరిగణించబడతాడు అని

హిందూ ధర్మాన్ని పరిరక్షించడం అంటే..?

హిందూ ధర్మాన్ని పరిరక్షించటం అంటే పరమతాలను ద్వేషించటమా? పరమతస్తులను హింసించి మేము మాత్రమే దేశంలో సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మిగతా మతస్తులందరినీ తన్ని తరిమేయాలని కోరుకోవటమా? తమ కులం, మతం, వర్ణం కానివారిని పట్ల అంటరాని తనంతో వ్యవహరించటమా?

జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ జనాలను చావకొట్టటమా? జై శ్రీరామ్ పేరు స్మరిస్తూనే బూతులు వల్లిస్తూ భూతదయ కోల్పోయి దౌర్జన్యానికి తెగబడటమా?

జైశ్రీరామ్ అని నినదిస్తూనే మానవత్వం కోల్పోయి ఉన్మాదంతో ఊగిపోతూ పరమతస్తుల చర్చీ, మసీదులను కాల్చిపారేసి, వాటిపై తమ జండాలు పాతటమా? పరమతస్తుల బుర్రలు బద్దలుగొడుతూ అనాగరికంగా వ్యవహరిస్తూ చంపుతూ రక్తచరిత్ర సృష్టించటమా?

నేను చదివిన హిందూ ధర్మం వేరు?

హిందూ శాస్త్రాల్లో నేను చదివిన హిందూ ధర్మం వేరేగా ఉంది. ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో కొన్ని మతోన్మాద మూకలు హింస ఆధారంగా సృష్టిస్తున్న సోకాల్డ్ “హిందుత్వవాదం” వేరు! ఇది ఇరవయ్యవ శతాబ్దంలో పరమత ద్వేషం ఆధారంగా పురుడుపోసుకుంది.

నేను హైందవ శాస్త్రాల్లో గమనించిన హిందూ ధర్మం

ఎంతో సంస్కారంతో కూడిన, హుందాతనం కలిగిన అహింసను నేర్పే శాంతిపూర్వక ధర్మం. అది – “సర్వే జనాసుఖినోభవంతు” (సకల జనులు సుఖంగా ఉండాలి) అన్న గొప్ప భావజాలాన్ని నేర్పుతుంది. తప్పితే “హైందవ జనే సుఖినోభవంతు (ఒక్క హిందూ జనాలే సుఖంగా ఉండాలి)” అన్న పక్షపాత సిద్ధాంతం నేర్పటం లేదు.

హైందవేతరులపై ఉన్మాదం ప్రదర్శించమని కూడా చెప్పటం లేదు.

నేను చదివిన హిందూత్వం అహింసను నేర్పుతుంది. నేను చదివిన హిందూత్వం “మానవసేవయే మాధవసేవ” అని చెబుతుంది తప్ప “హిందూ సేవయే మాధవసేవ” అని చెప్పటం లేదు.

నాకు తెలిసిన హిందూత్వం “అహింసా పరమో ధర్మః అని చెబుతుంది. అంటే- “అహింస అన్ని ధర్మాల్లో కెల్లా ఉత్తమమైనదని చెబుతుంది. “హింస” అంటే శారీరకంగానే కాదు మానసికంగా బాధపెట్టటమూ హింసే! అలాంటప్పుడు ప్రజల్ని హింసిస్తూ మేము హిందూత్వాని కాపాడుతున్నాం అనుకోవటానికి మించిన వెర్రితనం మరొకటి ఉండదు.

ఈ ఉన్మాదం ప్రదర్శిస్తున్నవారు ఎవరు వీళ్లంతా?

ఎప్పుడో మద్య యుగాల్లో ముస్లిం పాలకులు గుళ్లు పడగొట్టేశారని, దేశంపై దండెత్తారని, ఎక్కడో కాశ్మీర్లో పడితులను వీరు తరిమికొట్టేశారని జరిపోయిన గత చరిత్రను వక్రీకరించి వీరి బుర్రల్లోకి ఎక్కించి ముస్లిముల వల్ల హిందూత్వం ప్రమాదంలో ఉందన్న ఓ కల్పిత భయాన్ని సృష్టించటంతో సామాన్య ముస్లిముల పట్ల పగా, ప్రతీకారాలు తీర్చుకునే ఉన్మాదులుగా తయారు చెయ్యగా తయారైన ఉన్మాదులు వీళ్లు.

తమ ఇరుగు పొరుగున ఏవో చిన్న చిన్న వ్యాపారాలు, తోపుడు బళ్లు నడుపుకుంటూ, పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సామాన్య ముస్లిములపై దాడులు చేస్తూ ఏదో తమ ఆగర్భ శత్రువులపై దాడి చేసి తమ స్వంత ధర్మాన్ని పరిరక్షించుకుంటున్నామన్న స్వయంతృప్తికి లోనయ్యే అమాయక ఉన్మాదులు వీళ్లు.

ప్రస్తుత అతిపెద్ద సమస్య ఈ మతోన్మాదులు కూడా కాదు.. వీరి ఆగడాలను చూస్తూ కూడా సామాన్య హిందూ ప్రజానీకం పాటిస్తున్న మౌనమే అతిపెద్ద సమస్య.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *