యేసు – నికార్సైన దైవ విధేయుడు (ముస్లిం)

అబ్దుల్లా అబ్దుర్రహ్మాన్ వంటి ముస్లిం/అరబిక్ పేర్లు పెట్టుకుకునే వారంతా ముస్లిములే అన్నది సాధారణంగా అందరిలో ఉండే భావన! ముస్లిముల ఇంట పుట్టినప్పటికీ ఇస్లాం ఇచ్చే దృక్పధాన్ని అనుసరించక పైకి ఎన్ని ముస్లిం/అరబిక్ పేర్లు తగిలించుకున్నప్పటికీ అతను ధార్మికంగా ముస్లింగా పరిగణించబడడు!

అలాగే ఓ వ్యక్తి యూదుల ఇంట పుట్టినా, క్రైస్తవుల ఇంట పుట్టినా, హైందవుల ఇంట పుట్టినా లేక ఏ వర్గంలో పుట్టినా ఇస్లాం ప్రభోధిస్తున్న మౌలిక దృక్పథాన్ని గనుక విశ్వసిస్తూ ఉంటే అతను ముస్లింగానే పరిగణించబడతాడు.

ఆ మౌలిక దృక్పథం ఏమిటంటే- “ఈ సర్వసృష్టికి ఒక దేవుడు ఉన్నాడు అన్నది తెలుసుకుని, పరలోకంలో ఒక రోజు ఆయన ముందు నిలబడి సమాధానం చెప్పుకోవలసి ఉందని నమ్మి, మంచి పనులు చేస్తూ దేవునికి లోబడి ఉండటం”. ఇస్లాం వెలుగులో ముస్లిం అన్న పదానికి ఇదీ సంక్షిప్త వివరణ.

“ముస్లిం” అన్న పదానికి ధాతువు “సిల్మ్” దీని అర్థం- సమర్పణ, లొంగిపోవటం, శాంతి అన్న అర్థాలు ఉన్నాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే- దేవుడు ఒక్కడే అని సాక్ష్యమిచ్చి, ఆయనను మాత్రమే ప్రార్ధిస్తూ, ఆయనకు ఆదేశాలకు లోబడి ఉండే వ్యక్తిని “దైవ విధేయుడు” లేక “దేవునికి స్వయం సమర్పణ చేసుకున్నవాడు” అంటారు. అరబ్బీలో “ముస్లిం” అంటారు.

దీన్ని దృష్టిలో పెట్టుకుంటే యేసు నూటికి నూరుశాతం ఒక నికార్సైన ముస్లిమే అని చెప్పకపోతే అది ఘోరమైన పాపమే అవుతుంది! ఎందుకంటే- స్వయంగా యేసు “దేవుడు ఒక్కడే అని సాక్ష్యం ఇవ్వటమే కాక, ఆయనను మాత్రమే ప్రార్ధిస్తూ, ఆయన ఆదేశాలను తూ.చ తప్పకుండా ఆచరించే వ్యక్తిగా మనం ఆయన్ని బైబిల్లో చూడగలం. ఈ విషయంలో యేసును “ఒక నికార్సైన ముస్లింగా” అభివర్ణించక తప్పదు! ఆశ్చర్యానికి లోనయ్యేవారు ఈ క్రింది ఆధారాలు పరిశీలించాల్సిందే.

1. యేసు, దేవుడు ఒక్కడే అని సాక్ష్యం (షహాద) ఇచ్చారు!

“యేసు- ఓ, ఇస్రాయేలూ వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు” – మార్కు 12:29

“ఆ శాస్త్రి- బోధకుడా (అనగా- యేసు), బాగుగా చెప్పితివి; ఆయన (అనగా- యెహోవా దేవుడు) అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే” – మార్కు 12:32

ఇది ఒక వ్యక్తి ముస్లింగా పరిగణించబడటానికి కావలసిన మొట్టమొదటి విషయం – దేవుడు ఒక్కడే ఆయన తప్ప వేరొక దేవుడు లేడని అని సాక్ష్యం (షహాద) ఇవ్వటం. యేసు తన సువార్తల్లో చేసింది అదే.

2. యేసు నిత్యం ఆ ఒక్క దేవుణ్ణే వేడుకుంటూ (దువా) చేస్తూ ఉండేవారు!

“యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను” – యోహాను 11:41

“ఆ సమయమున యేసు చెప్పినదేమనగాతండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను” – మత్తయి 11:25

3. యేసు నిత్యం ఆ ఒక్క దేవుణ్ణే ప్రార్ధిస్తూ (నమాజ్ చేస్తూ) ఉండేవారని మనం సువార్తలలో గమనించగలం.

నిలబడి, మోకాళ్లపై ఆని, ముఖమును నేలపై పెట్టి దేవుని స్తుతించటమే ప్రార్ధన (అరబ్బీలో సలత్ ఉర్దూలో నమాజ్)! నమాజ్ లో ఉండే ముఖ్యమైన మూడు భంగిమల్లో (నిలబడి, మోకాళ్లూని, ముఖమును నేలపై పెట్టి) యేసు ఒక్క దేవుణ్ణి మాత్రమే ప్రార్ధిస్తూ ఉండేవారని మనం సువార్తలలో స్పష్టంగా గమనించగలం.

A. నిలబడి ప్రార్ధన చేయటం:

“మీరు నిలవబడి ప్రార్ధన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి” – మార్కు 11:25

B. మోకాళ్లపై ఆని ప్రార్ధన చేయటం:

“యేసు వారి వద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్లూని దేవుని ప్రార్ధన చేసెను” – లూకా 22:42

C. ముఖమును నేలపై పెట్టి ప్రార్ధన చేయటం:

యేసు కొంతదూరము వెళ్లి, తన ముఖమును నేలపై పెట్టి ప్రార్ధించెను” – మత్తయి 26:39

“And he (Jesus) went a little farther and fell on his face to the ground, and prayed…”- Matthew 26:39

4. యేసు నిత్యం నిర్ధిష్ట సమయాలలో దేవునికి ప్రార్ధన (నమాజ్) చేస్తూ ఉండేవారు!

వాస్తవానికి ప్రవక్తలందరూ అవలంబించిన నమాజ్ విధానం అన్నది దాదాపుగా ఒకే రకంగా ఉన్నప్పటికీ ప్రార్ధనా సమయాల్లో, సంఖ్యలో కొద్దిపాటి తేడాలు ఉండేవి. ఖురాన్ ప్రకారం అయితే ఐదు పూట్ల నమాజ్ (ప్రార్ధన) నిర్ధారించబడింది. చీకటి ఇంకా ఉండగానే పెండలకడ ప్రార్ధన. మధ్యాహ్నం, సాయంత్రం ప్రారంభం అయ్యేటప్పుడు, చీకటి పడే ముందు, రాత్రి సమయపు ప్రార్ధన. బైబిల్లో యేసు సైతం దాదాపు ఈ సమయాల్లోనే దేవునికి ప్రార్ధన (నమాజ్) చేసేవారని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఈ క్రింది వాక్యాల్లో గమనించగలరు.

A. పెండలకడ ప్రార్ధన:

“యేసు పెండలకడ లేచి ఇంకనూ చీకటి యుండగానే అరణ్యమునకు వెళ్ళి ప్రార్ధన చేయుచుండెను” – మార్కు 1:35

B. రాత్రి ప్రార్ధనలు:

“యేసు ప్రార్ధన చేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్ధించుట యందు రాత్రి గడిపెను” – లూకా 6:12

ఈ విధంగా యేసు, దేవునికి నిర్ధిష్ట సమయాల్లో నమాజ్ (ప్రార్ధన) చేస్తూ ఉండేవారని తెలుస్తుంది.

5. యేసు సున్నతి పొందారు!

“ఆ శిశువు (యేసు) నకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు” – లూకా 2:21

అబ్రాహాము నుండి సకల ప్రవక్తలూ యేసు పాటించిన ఈ సున్నతి ఆచారాన్ని పాటిస్తున్నవారు నేడు ముస్లిములే!

6. యేసు దేవుని కోసం ఉపవాస దీక్ష (రోజా) ఉండేవారు, ఉండమని ఆదేశించేవారు!

“నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా” – మత్తయి 4:2

“ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము” – మత్తయి 6:17

7. యేసు తీర్పుదినం రోజున ఆ దేవుని ముందు నిలబడి సమాధానం చెప్పుకోవలసి ఉంటుందని హెచ్చరించారు!

“నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును” – మత్తయి 12:36

8. తన తరువాత వచ్చే ప్రవక్త ముహమ్మద్ (స) గూర్చి సాక్ష్యం ఇచ్చారు!

“అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త(లేక,ఉత్తరవాది) మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును” – యోహాను 16:7

“అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును” – యోహాను 16:13

8. యేసు బోధించిన ధర్మం ఇస్లాం మాత్రమే!

ఇది వినటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా నిజం. ఒకసారి ఈ క్రింది బైబిల్ వాక్యాన్ని గమనించగలరు.

“శాంతిని మీకనుగ్రహించి వెళ్లుచున్నాను. నా శాంతినే మీకనుగ్రహించు చున్నాను” – యోహాను 14:27

ఈ వాక్యంలో ఇస్లాం ఎక్కడ ఉంది? అని ప్రశ్నిస్తే ఈ వాక్యాన్ని కాస్త మనం యేసు మాట్లాడిన అరమాయిక్ భాషలో క్రింది విధంగా గమనించగలరు.

“ష్లామ షబఖ్ అనా లకూన్, ష్లామా దీలీ యాహెబ్ అనా లకూన్”

“PEACE (ష్లామ) I leave with you, my PEACE (ష్లామ) I give unto you” – John 14:27

పైన యేసు చెబుతున్న వాక్యంలో “శాంతి” అంటే = “Peace” దీనిని అరమాయిక్ లో “ష్లామ” అని చెప్పటం జరిగింది. “ఇస్లాం” అన్న పదానికి ధాతువు “సలాం” అనగా “శాంతి” అని అర్థం. వెరసి “ష్లామ” అన్న అరమాయిక్ పదం అరబ్బీలో “ఇస్లాం” అని ఉచ్చరించబడుతుంది.

ఈ విధంగా యేసు బోధించిన మరియు విడిచి వెళ్లింది”ఇస్లాం ధర్మం (శాంతి ధర్మం)” అన్న విషయాన్ని తెలుసుకున్నాం.

9. యేసు, దేవుణ్ణి “అల్లాహ్” అన్న పేరుతోనే పరిచయం చేశారు!

హెబ్రూ భాషలో యాఃవే, ఎలోహ్ గా పిలువబడ్డ సృష్టికర్త అయిన దేవుడే అరమాయిక్, అరబ్బీ భాషల్లో అల్లాహ్ అన్న పేరుతో పిలువబడ్డాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్రింది వాక్యాలను గమనించాల్సి ఉంటుంది.

“అందుకు యేసు- ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలూ వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు” – మార్కు 12:29

ఈ వాక్యాన్ని ఇపుడు మనం అరమాయిక్ భాషలో గమనిద్దాం.

“అమర్ లెహ్ యషు’, మద్మే మిన్ కుల్ల్ హూన్ వుఖ్ దనే, షిమ’ ఇశ్రాయేల్, మర్య అల్లాహన్, మర్య హుద్ హు”

పై అరమాయి లిపిలో ” అల్లాహన్” అన్న పదాన్ని గమనించగలం. ఇప్పుడు మరొక వాక్యం గమనించగలరు.

“అందుకాయన (యేసు) మంచి కార్యముల గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే” – మత్తయి 19:17

ఈ వాక్యాన్ని ఇపుడు మనం అరమాయిక్ భాషలో గమనిద్దాం.

“మన ఖర అంత లీ తబ? లేత్ తబ ఇల్లా ఎన్ హద్ అల్లాహ్”

పై అరమాయిక్ వాక్యంలో ఎంతో స్పష్టంగా “ఇల్లా ఎన్ హద్ అల్లాహ్” అన్న వాక్యాన్ని చూడగలం. దానిలో “ఎన్ హద్” అంటే- అరబ్బీలో “అహద్” అంటే= “ఒక్కడు” అని అర్థం. “ఇల్లా ఎన్ హద్ అల్లాహ్” అంటే= “అల్లాహ్ ఒక్కడే” అని అర్థం.

10. యేసు నిత్యం అల్లాహ్ కు మాత్రమే ప్రార్ధన చేసేవారు!

ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ క్రింది తెలుగు బైబిల్ వాక్యాన్ని అరబిక్ బైబిల్ అనువాదం లో చూడాల్సి ఉంటుంది.

“యేసు దేవుని ప్రార్ధించుట యందు రాత్రి గడిపెను” – లూకా 6:12

“వ ఫీ తిల్క వూలా అయ్యామి ఖరజ ఇలవుల్ జబల లియుసల్లి వఖస వులల్లైల కుల్లహు ఫీ “అస్సాలాతిలిల్లాహ్”

పైవాక్యంలో చివరి వాక్య భాగం ఒకసారి గమనిస్తే- “అస్సాలాతిలిల్లాహ్” అని గమనించగలం. ఈ పదం అటు అరమాయిక్ బైబిల్లో అయితే స్పష్టంగా “అస్సాలాతిలిల్లాహ్” అని చదవగలం. అంటే- “అల్లాహ్ కు ప్రార్ధన చేయుచుండెను’ అని అర్థం.

ఇప్పటివరకు మనం పై వివరణలో గమనించిన విషయాలు

1. యేసు, దేవుడు ఒక్కడే అని సాక్ష్యం (షహాద) ఇచ్చారు!

2. యేసు నిత్యం ఆ ఒక్క దేవుణ్ణే వేడుకుంటూ (దువా) చేస్తూ ఉండేవారు!

3. యేసు నిత్యం నిర్ధిష్ట సమయాలలో దేవునికి ప్రార్ధన (నమాజ్) చేస్తూ ఉండేవారు!

4. యేసు సున్నతి సైతం పొందారు!

5. యేసు దేవుని కోసం ఉపవాస దీక్ష (రోజా) ఉండేవారు, ఉండమని ఆదేశించేవారు!

6. తన తరువాత వచ్చే ప్రవక్త ముహమ్మద్ (స) గూర్చి సాక్ష్యం ఇచ్చారు!

7. యేసు, ఇస్లాం ధర్మాన్ని మాత్రమే బోధించి వెళ్లారు!

8. యేసు, దేవుణ్ణి “అల్లాహ్” అన్న పేరుతోనే పరిచయం చేశారు!

9. యేసు నిత్యం అల్లాహ్ కు మాత్రమే ప్రార్ధన చేసేవారు!

దీనిని బట్టి యేసు, దేవునికి పూర్తిగా విధేయుడైన దాసుడు, ఆయనను మాత్రమే బలంగా విశ్వసించే దాసుడు అన్న విషయం సుస్పష్టంగా తేలిపోయింది.

ఇదంతా చదివి “యేసు, ముస్లిమేంటి? ఆయన ముస్లిం కాడని ఎవరైనా అడ్డంగా వాదించటం మొదలెడితే అది పరోక్షంగా యేసు “దేవుని విశ్వాసి కాడు” లేక “దేవుని విధేయుడు కాడు” అని చెప్పటమే అవుతుంది. అది ఘోరమైన పాపమే అవుతుంది! అలాంటి ఘోర పాపం మూటకట్టుకోకుండా నిత్యజీవానికి వెళ్లాలంటే యేసును ఒక నికార్సైన దైవ విధేయునిగా ఒప్పుకోవటమే ఒక క్రైస్తవునికి ఉత్తమం.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *