బైబిల్ దేవుని బర్త్ డే నా.. !?

చావూ, పుట్టుకలు లేని సృష్టికర్త అయిన దేవునిని ప్రజలకు పరిచయం చెయ్యటానికి పంపబడిన యేసునే ప్రత్యక్షంగా దేవునిగా భావిస్తూ ఆయన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోవటానికి అధిక శాతం క్రైస్తవులు పండుగలా జరుపుకునేదే క్రిస్మస్.

డిశంబర్ 25 యేసు పుట్టిన రోజా? కాదా? అన్న విషయంలోనూ క్రైస్తవ పండితుల మధ్యే బేధాభిప్రాయం ఉంది. నిజానికి వారంతా కలసి పరిశీలించాల్సిన అంశం యేసు డిశంబర్ 25 పుట్టారా? పుట్టలేదా? అన్నది కూడా కాదు. డిశంబర్ 25 కాకపోతే మిగతా నెలల్లో ఏదో ఒకరోజు పుట్టే ఉండి ఉంటారు. కాబట్టి అది ప్రక్కన పెట్టేసి అసలు బైబిల్లో దేవుడు ఎవరు? ఆయన కేవలం పుట్టి, చనిపోయేంత బలహీనుడా? లేక చావూ, పుట్టుకలకు అతీతుడైన సర్వశక్తిమంతుడా? బైబిల్ దేవుడు చావూ-పుట్టుకలు లేని యెహోవానా? లేక యెహోవా ద్వారా పుట్టించబడ్డ యేసా? అన్నవి అసలు వారంతా కలసి సమాధానం వెతకాల్సిన ప్రశ్నలు.

యేసు తన మూడున్నరేళ్ల సువార్తా కాలంలో ఏ యెహోవా దేవునినైతే ఆనాటి ప్రజలకు పరిచయం చేస్తూ ఉండేవారో ఆ దేవుడు పాతనిబంధనలో అప్పటికే- “నేను పరిశుద్ధ దేవుడను గానీ మనుష్యుడను కాను” (హోషేయ 11:6) అని చెప్పి తాను “మానవ పుట్టుక లేని వాడిని” అని ప్రకటించుకుని ఉండటం గమనార్హం! ఆయన మానవమాత్రుడిగా అవతరించేవాడుకాదన్న విషయాన్ని బైబిల్- “ఆయన నరుడు కాడు” (1 సమూయేలూ 15:29) అని మరో చోట ఎలుగెత్తి ప్రకటించటం మరింత గమనార్హం.

పాతనిబంధనలో “నేను మనుష్యుడను కాను” అని ప్రకటించుకున్న ఆ యెహోవానే యేసు తన సువార్తలో దేవునిగా పరిచయం చేస్తూ, స్వయంగా ఆయన్ని ప్రార్ధిస్తూ, ప్రజలకు కూడా ఆయననే ప్రార్ధించమని ఆదేశిస్తూ ఉండేవారన్న విషయం బైబిల్ ని పరిశీలనగా చదివే ప్రతీ ఒక్కరికీ ఎరుకే.

పైగా భవిష్యత్తులో తన అనుచరులు దేవుడు ఎవరు? అన్న విషయంలో ఎక్కడ అపార్థాలకు లోనౌతారో అని.. “భూమి మీద తండ్రి (అంటే దేవుడు) అని ఎవరికీ పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ దేవుడు ఆయన పరలోకంలో ఉన్నాడు (మత్తయి 23:9)” అని తేల్చి చెప్పేశారు. అంతేకాదు తన విషయంలో ఏ కన్ఫ్యూజన్ లేకుండా “నేను క్రీస్తనబడిన మెస్సియ (యోహాను 4:25)”ను మాత్రమే అని కూడా తేల్చి చెప్పేశారు.

యెహోవాయే కన్యమేరీ గర్భంలో మానవ పిండంగా మారిపోయి, ఆమె గర్భంలో తొమ్మిది నెలలు అపరిశుద్ధావస్థలో ఉన్న తరువాత యేసు అన్న పేరుతో తొమ్మిది నెలల బిడ్డగా అత్యంత బలహీన స్థితిలో ఈ లోకంలో పుట్టేశాడన్న అధికశాతం క్రైస్తవుల అన్య అవతార వాదాన్ని దృష్టిలో పెట్టుకుని… మనం తక్షణం చెయ్యాల్సిన పని- యెహోవాయే యేసులా పుట్టేశాడని బైబిల్ చెబుతుందా? లేక యెహోవా ద్వారా యేసు పుట్టించబడ్డారని బైబిల్ ప్రకటిస్తుందా? అన్నది గమనించటం.

“దేవుడు (అనగా- యెహోవా) ఇశ్రాయేలు ప్రజల కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను” – అ.పో.కా 13:23

ఈ వాక్యాన్ని బట్టి స్పష్టంగా – యెహోవా ఈ లోకంలో యేసును మానవ మాత్రునిగా “పుట్టించాడని” అర్థమవుతుంది తప్పితే యెహోవాయే యేసులా మారిపోయి ఈ లోకంలో “పుట్టేశాడని” బైబిల్ ఎక్కడా చెప్పటం లేదు! ఇదే విషయం బైబిల్ మరో చోట యేసును ఉద్దేశించి బైబిల్- “ఆయన దేవుని మూలముగా పుట్టినవాడు (1 యోహాను 5:1)” అని ప్రకటించటం.

స్వయంగా యేసైతే – “నా అంతట నేను రాలేదు ఆ దేవుడే నన్ను పంపాడని (యోహాను 8:42)” చెప్పటాన్ని బట్టి యేసు, తండ్రి అయిన యెహోవా దేవుని ద్వారా పుట్టించబడ్డ మానవ మాత్రుడని తేలిపోతుంది.

మరీ ముఖ్యంగా బైబిల్ దేవుడైన “యెహోవా అక్షయుడు (రోమా 1:23)” అంటే ఎప్పటికీ క్షీణించనివాడు అంటే చనిపోనివాడని ప్రకటించటం మరొక గమనార్హ విషయం. పుడితేనే కదా చావు అనేది ఉండేది.
మరీ ముఖ్యంగా గమనించాల్సింది-

యేసుకు ఏదోలా లేని దైవత్వం ఆపాదించటానికి అన్యుల నుండి ఎరువు తెచ్చుకున్నవే “త్రిత్వం” మరియు “దేవుడే శరీర ధారిగా మారి యేసు రూపంలో ఈ లోకంలో పుట్టేశాడన్న” అన్య విశ్వాసాలు.
వాస్తవానికి నేడు క్రైస్తవ్యంలో బోధించబడుతున్న త్రిత్వ-అవతార వాదాలు యేసు గానీ, ఆయన శిష్యులు గానీ ఎప్పుడూ తమ సువార్తల్లో బోధించని విశ్వాసాలు. వారంతా కేవలం దేవుడు ఒక్కడే ఆయన యెహోవా, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన భూమి మీద పుట్టడని, చనిపోడని ఆయనను ఎవరూ ఏ కాలమందైననూ చూడలేదని, చూడలేరని కరాఖండీగా తేల్చి చెప్పేసినట్లు బైబిల్లో వందల వాక్యాల్లో చూడగలం. కానీ గ్రంథాలు చదివినంత మాత్రానా సత్యాలు కళ్లకు కనపడవు అర్థం చేసుకునే జ్ఞానం ఉంటే తప్ప.

యేసు దేవుడని దేవుని అవతారం అని గానీ, త్రిత్వంలో ఒక దేవుడని గానీ బైబిల్లో ఎక్కడా లేదు అయినప్పటికీ క్రైస్తవులు ఆ సిద్ధాంతాలు నమ్మటానికి కారణం కొందరు బోధకులు అన్యుల నుండి ఎరువుతెచ్చుకున్న విశ్వాసాలను బైబిల్ వాక్యాలకు తగినట్టు కుదించి ఆయా సిద్ధాంతాలు బైబిల్లో ఉన్నట్లు భ్రమ కల్పించి బోధించటమే.


ఈ అన్య విశ్వాసాలు నమ్మేవారికి కూడా కావలసింది సత్యం కాదు తాము నమ్ముకుంటున్న నమ్మకాలను సత్యాలుగా చిత్రీకరిస్తూ సాటిస్ఫై చేసే కొందరు సోకాల్డ్ సువార్తికుల స్పీచులు మాత్రమే.

ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లభించగానే ఎవరెన్ని వాక్యాలు చూపించి సత్యాలు చెప్పే ప్రయత్నం చేసినా మెదళ్లలో పాతుకుపోయిన అన్య విశ్వాసాలే సత్యాలని ఫిక్స్ అయిపోయాక చివరకు అసలైన సత్యాలు కూడా అబద్ధాలుగా కనపడుతుంటాయి. ప్రస్తుతం క్రైస్తవ్యంలో అధిక శాతం మంది ప్రస్తుతం ఈ దశలోనే ఉన్నారు.

ఇక దేవుడు త్రిత్వ బహుళత్వం కలిగి ఉన్నాడని, దేవుడే యేసులా అవతరించాడని నేడు బోధించబడుతున్న సిద్ధాంతాలు యేసు అనంతరం 325 సం. లో నైసియా సభలో మొట్టమెదటిసారి ఆమోదించబడ్డాయన్నది చరిత్ర అవగాహన ఉన్నోళ్లకు ఎరుకే.

చివరిగా.. క్రిస్మస్ అన్నది బైబిల్ దేవుడైన యెహోవా పుట్టిన రోజా? లేక ఆయన ద్వారా పుట్టించబడ్డ యేసు పుట్టిన రోజా? అన్నది ప్రియ క్రైస్తవులే నిర్ణయించుకోవాలి.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *