మద్యం, మత్తు పదార్థాలకు మాత్రమే మనిషి వ్యసనపరుడిగా పారిపోతాడని చాలా మందికి తెలిసిన వాస్తవమైతే.. ఒకవేళ ధార్మిక గ్రంథాల అవగాహన లేకుండా దైవేతర ఆరాధనకు ఎవరైతే అలవాటు పడతారో వారికి అది ఒక విడదీయలేని వ్యసనంలా మారిపోతుందనటం అతిశయోక్తి కాదు.
ఆ వ్యసనానికి వారు ఎంతగా బానిసలుగా మారిపోతారంటే ఒకవేళ మీరు ఆరాధిస్తున్నది/ఆరాధిస్తున్నవారు నిజ దైవం కాదని చెప్పినా వాస్తవాలు వారి గ్రంథాల నుండే చూపించినా వారు తాము నమ్మిన నమ్మకాన్ని నిరూపించుకోవటానికి, ప్రచారం చేసుకోవటానికి శతవిధాలా ప్రయత్నాలు చెయ్యటం మొదలెడతారు. లాజిక్ లేకుండా మాట్లాడుతూ సత్యం వారి కళ్ల ముందున్నప్పటికీ గుడ్డివారిగా వ్యవహరిస్తుంటారు.
ఈ విషయంలో క్రైస్తవుల్లో యేసును దేవుడని నమ్మి, ప్రచారం చేసుకునేవారిని గొప్ప ఉదాహరణగా తీసుకోవచ్చు. దానికి సాక్ష్యం ఇదిగో ఇలా కరెంటు స్థంబాలపై, రోడ్డు ప్రక్కన గోడలపై, డివైడర్లపై, రాళ్లపై ఎక్కడపడితే అక్కడ ‘యేసు నిజమైన దేవుడని’ రాసుకుని మరీ పబ్లిసిటీ చేసుకోవటమే!
రెండు వేల సంవత్సరాల క్రితం అనేక మంది ప్రవక్తల క్రమంలో యూదుల సంస్కర్తగా, ప్రవక్తగా దేవునిచే పంపబడిన యేసు ఆనాటి మార్గబ్రష్ట యూదులకు ‘నిజ దేవుడు’ ఎవరు? ఆయన్ని ఎలా ఆరాధించాలి? ఆయన ఆదేశాలేమిటి? అన్న విషయాల్లో స్పష్టత ఇచ్చేసి, ఇక నుండి ఆ దేవుని ఆదేశాల ప్రకారం ఎలా జీవించాలి అన్నది నేర్పి వెళ్ళిపోయారు.
యెహోవా అన్న పేరుతో పిలువబడే సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రజలకు పరిచయం చేసి… “భూమి మీద మీరు ఎవరినీ తండ్రి (దేవుడు) అని పిలవద్దు ఒక్కడే మీ తండ్రి (దేవుడు) ఆయన పరలోకంలో ఉన్నాడని” (మత్తయి 23:9).. “ఆయన అద్వితీయుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని” (మార్కు 12:29,32) “ఆయనే నాకు కూడా దేవుడని” (యోహాను 20:17).. “ఆయన నా కంటే గొప్పవాడని” (యోహాను 14:28).. “ఆయనను మాత్రమే ప్రార్ధించాలని” (మత్తయి 6:6) చెప్పటమే కాక..
“నా అంతట నేను రాలేదు నన్ను దేవుడు పంపెను” (యోహాను 8:42) అని.. “నా అంతట నేను ఏమీ చెయ్యలేను నన్ను పంపిన దేవుని చిత్త ప్రకారమే ప్రతీదీ చేస్తుంటానని (యోహాను 6:38).. చివరకు “నా అంతట నేను ఏదీ మాటలాడలేను ఏది మాట్లాడాలన్నా దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉండాలని (యోహాను 12:49-50).. “దేవుని సహాయంతో స్వస్థతలు చేస్తున్నానని” (లూకా 11:20).. “నేను దేవునిచే పంపబడిన మెస్సియ (యోహాను 4:26)“ అని ఆనాడే స్పష్టంగా చెప్పేశారు.
తనకు అతీతంగా ఉన్న దైవాన్ని ఉద్దేశించి “నా దేవుడు” అని చెప్పేవాడు ఆ దేవునికి దాసుడు అవుతాడు తప్ప దేవుడు కాలేడు. కానీ ఇలాంటి చిన్న చిన్న లాజిక్కులు సైతం క్రైస్తవుల్లో చాలా మంది ఎందుకు ఆలోచించలేరన్నది అర్థం కాని విషయం.
******
ఏదైనా ఒక ప్రాంతానికి దైవ ప్రవక్త రావటం దైవేతర ఆరాధనతో మార్గభ్రష్టులైన ఆ ప్రాంత ప్రజలను సంస్కరించి ఆ ప్రవక్త పరమపదించాక ప్రజలు ఆ ప్రవక్త బోధించిన బోధలు మరచిపోయి తిరిగి మార్గభ్రష్టులైపోవటం లేదా తమకు దైవాన్ని పరిచయం చెయ్యటానికి వచ్చిన ఆ ప్రవక్తకే దైవత్వాన్ని అంటగట్టేసి ఆయన్ని దేవునిగా చేసుకుని ఆరాధించటం అన్నది అనాదిగా కొనసాగుతున్న ఆనవాయితీనే.
యేసు విషయంలో క్రైస్తవులు చేసింది/చేస్తున్నది అచ్చం అదే. యేసు అనంతరం దాదాపు 325 సం.ల తరువాత రోమన్ రాజైన కైసర్ ఫ్లావిస్ కాన్స్టన్ టైన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చెయ్యబడ్డ నైసియా సభలో ఇప్పుడున్న క్రైస్తవ విశ్వాసాలు రూపొందించబడ్డాయన్న విషయం చాలా మంది క్రైస్తవులకు తెలీదు. యేసు, దేవుని అవతారమని, యేసు దైవత్వసారాన్ని కలిగి ఉన్నారని, యేసు త్రిత్వంలో ఒకరని ఇలా బైబిల్లో లేని విశ్వాసాలన్నిటికీ ఆ సభలోనే బీజాలు పడ్డాయి. ఆ విశ్వాసాల ప్రచారమే నేడు క్రైస్తవంలో చాలా మంది క్రైస్తవులు, పాస్టర్ల ద్వారా జరుగుతుంది.
నిజానికి యేసు క్రైస్తవ్యాన్ని స్థాపించలేదు సరికదా క్రిస్టియానిటీ అనే పదం యేసు ఎప్పుడూ పలకలేదు, అది ఆయనకు తెలియని అపరిచిత పదం. “త్రిత్వం” (Trinity) అనే అన్య దృక్పథం యేసు చెప్పని ఆయనకు తెలీని సిద్ధాంతం. నిజ దేవుడెవరో పరిచయం చెయ్యటానికి వచ్చిన యేసు తనను తాను దేవుడని ఎన్నడూ నోటితో సైతం పలుకని విషయం.
యేసు తాను సువార్త చేసినంత కాలం నిజమైన దేవుడేవరో స్పష్టపరిచేశారు. తాను దేవుడని గానీ, రాబోయే కాలాల్లో తనను దేవుడని ప్రచారం చెయ్యమని గానీ తన అనుచరులపై ఎలాంటి బాధ్యతలూ పెట్టలేదు. యేసు తన అనుచరులపై మోపిన బాద్యత ఏదైనా ఉందంటే.. యెహోవాగా పిలువబడే ఆ సృష్టికర్తను దేవునిగా నమ్మి, ఆయన ఇచ్చిన ఆదేశాలను తు.చ తప్పకుండా అనుసరించటమే!
అయినప్పటికీ యేసును దేవుడని నమ్మే క్రైస్తవులు.. యేసే దేవుడైతే ఆయన మరొక దేవుణ్ణి పరిచయం చెయ్యడు కదా అన్న అతిచిన్న లాజిక్ ను సైతం ఆలోచించలేకపోతుంటారు. యేసు ద్వారా ప్రకటించబడిన ఆ దేవుడు ఎవరు? యేసు ద్వారా ప్రార్ధించబడిన ఆ దేవుడు ఎవరు? అన్న మౌలిక అంశాలపై నేటి క్రైస్తవ్యం ఆలోచన చెయ్యటం మానేసింది.
కాబట్టి నేటి క్రైస్తవులు యేసు పరిచయం చేసిన దేవుడైన యెహోవాను వదిలి యేసును ఆరాధించటం దైవేతర ఆరాధన మాత్రమే అవుతుంది. ఈ విషయంలో నేటి క్రైస్తవుల్లో అధిక శాతం మంది ఎంత దూరం వెళ్లిపోయారంటే.. బైబిల్లో యేసు తనకు అతీతంగా ఉన్న యెహోవాను దేవునిగా పరిచయం చేసినట్టు, ఆయన్ని యేసు ప్రార్ధించినట్టు, ప్రార్ధించమన్నట్టు కొన్ని వందల వాక్యాల్లో కనపడుతున్నప్పటికీ.. వాటన్నిటినీ ప్రక్కన పెట్టేసి తమకు చర్చిల్లో పాస్టర్లు “యేసే దేవుడని” బోధించే సిద్ధాంతం ఎంతవరకు కరెక్టన్నది కాస్త ఆగి కాస్సేపు ఆలోచన చెయ్యలేనంత దూరం వెళ్లిపోయారు.
బైబిల్లో ఏ యెసైతే నిజదైవాన్ని పరిచయం చేశారో.. ఆ యేసుకే దైవత్వం అంటగట్టేసి ఇలా కరెంటు స్థంబాలపై, తలుపులపై, రోడ్ల ప్రక్కన గోడలపై “యేసు నిజ దేవుడన్న” స్లోగన్లు రాసుకుని పబ్లిసిటీచేసుకునేంత వరకు వెళ్లిపోయారు.
Md Nooruddin
దైవేతర ఆరాధన – విడలేని వ్యసనం
