ఖుర్ఆన్ – “ఈసా రూహుల్లాహ్” అని చెబుతుందా?

నేటి కొందరు క్రైస్తవ ఖురాన్‌ విమర్శకులను గమనిస్తే, ఖురాన్ ను విమర్శించే విషయంలో వారి బుద్ధి సైతం మందగించి, ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారనటం అతిశయోక్తి కాదు! ఒకప్రక్క ‘యెహోవా మరియు అల్లాహ్ ఒకటి కాదని వాదిస్తూనే మరోప్రక్క ‘యెహోవాయే ప్రత్యక్షంగా యేస’ని ప్రచారం చేస్తూ, తిరిగి యేసు గురించి ఖురాన్ లో ‘రూహుల్లాహ్‌’ (అల్లాహ్ యొక్క ఆత్మ) అని, ‘కలిమతుల్లాహ్‌’ (అల్లాహ్ యొక్క వాక్కు) అని వ్రాయబడి ఉంది కాబట్టి మీ ఖురాన్‌ ప్రకారమే యేసు, అల్లాహ్ యొక్క ఆత్మ మరియు వాక్కు కాబట్టి యేసే అల్లాహ్! కాబట్టి ముస్లిములు ఖురాన్ ప్రకారం యేసును దేవునిగా నమ్మాలని వాదించటం ఎంతో చిత్రం! అయినా ఒకప్రక్క యెహోవా, అల్లాహ్‌ ఒకటి కాదని వాదిస్తూనే… తిరిగి యేసు, అల్లాహ్‌ వాక్కు, అల్లాహ్‌ ఆత్మ కాబట్టి ఖురాన్‌ ప్రకారం ‘యేసే అల్లాహ్‌’ అని వాదించటంలో, పుస్తకాలు సైతం రచించటంలో అసలు అర్థం ఉందా? అన్నది ఆలోచించాల్సిన ప్రశ్న!

వాస్తవానికి ఖురాన్‌లో ఎక్కడా కూడా ‘రూహుల్లాహ్‌’ (దేవుని ఆత్మ) మరియు ‘కలిమతుల్లాహ్‌’ (అల్లాహ్ యొక్క వాక్కు) అన్న పదాలే రాయబడి లేవు అన్నది గమనార్హం! ఈ విషయం “ఈసా రూహుల్లాహ్ / ‘కలిమతుల్లాహ్‌” అని ఖురాన్ లో రాసుందని వాదించే క్రైస్తవ బోధకులకు తెలియదు! మరేమని వ్రాసి ఉంది? అంటే, ‘రూహుమ్మిన్‌హు’ (అంటే- అల్లాహ్ తరఫు నుండి వచ్చిన ఆత్మ) అని మాత్రమే ఉంది అంటే అల్లాహ్‌ కన్యమేరీ వైపునకు పంపిన ఒక “ఆజ్ఞ (Word or Order)” అని అర్థం. ఒక సారి ఈ క్రింది ఖురాన్ వాక్యాన్ని గమనించగలరు.

గ్రంథ ప్రజలారా! మీ ధర్మ విషయాలలో అతిగా ప్రవర్తించకండి. అల్లాహ్ కు సత్యం తప్ప వేరే విషయాన్ని ఆపాదించకండి. మసీహ్, మర్యం కుమారుడైన ఈసా (యేసు) అల్లాహ్ పంపిన ఒక ప్రవక్త, అల్లాహ్ మర్యం వైపునకు పంపిన ఒక ఆజ్ఞ, అల్లాహ్ తరఫు నుండి వచ్చిన (మర్యం గర్భంలో బిడ్డ) రూపం దాల్చిన ఒక ఆత్మ తప్ప మరేమీ కాదు” – 4:171

పై ఖురాన్ వాక్యాన్ని సంక్షిప్తంగా విశ్లేషిస్తే- తండ్రి లేకుండా కన్య మేరీ గర్భం ద్వారా యేసును పుట్టించాలని సంకల్పించిన సృష్టికర్త అయిన దేవుడు ఆ విధంగా “అగును గాక” అన్న తన “ఆజ్ఞ” లేక “వాక్యాన్ని” (Order or Word) విడుదల చేశాడు. దేవుని ఆ ఆజ్ఞ ఫలితంగా కన్య మేరీ గర్భం దాల్చటం జరిగింది. తొమ్మిది మాసాల అనంతరం జరిగింది ఏమిటంటే-

“ఆ వాక్యము (లేక ఆజ్ఞ) శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను”- యోహాను 1:14

వాస్తవానికి బైబిల్‌ ని జాగ్రత్తగా గమనిస్తే- సృష్టిలో ప్రతీదీ తన “అగును గాక” అన్న తన “వాక్కు” లేదా “ఆజ్ఞ” లేక “వాక్యం” విడిదల చేసి సృష్టించిన దేవుడు తొలి మానవుణ్ణి సైతం మట్టితో సృష్టించిన అనంతరం ‘మానవుని నాశికారంధ్రంలో జీవవాయువును ఊది జీవాత్మ గా చేసినట్టు’ (ఆది 2:7) చూడగలం. వివరంగా చెప్పాలంటే ఎలా అయితే ఆదామును తలిదండ్రులు లేకుండా సృష్టించి, దేవుడు అతనిలో జీవాత్మను ఊది అతనికి ప్రాణం పోశాడో అచ్చం అలాగే తండ్రి లేకుండా యేసును పుట్టించాలని సంకల్పించిన దేవుడు, “అలా అగును గాక” అన్న తన “ఆజ్ఞ”ను విడుదల చేసి, కన్యమేరీ గర్భంలో పిండ దశలో ఉన్న యేసులో జీవాత్మను కలుగజేసి బిడ్డ రూపంలో ఈ లోకంలో సజీవంగా పుట్టించాడు. ఇదే విషయం ఖురాన్ లో “అల్లాహ్ మర్యం వైపునకు పంపిన ఒక ఆజ్ఞ, అల్లాహ్ తరఫు నుండి వచ్చిన (మర్యం గర్భంలో బిడ్డ) రూపం దాల్చిన ఒక ఆత్మ తప్ప మరేమీ కాదు” అని చెప్పటం జరుగుతుంది. ఈ విషయాన్ని ఈ క్రింది ఖురాన్ వాక్యంలో సైతం గమనించగలం.

“మర్యం ను కూడా ఒక ఉదాహరణగా పేర్కొంటున్నాడు. ఆమె తన మానాన్ని కాపాడుకున్నారు. ఆతరువాత మేము ఆమెలోనికి మా తరఫు నుండి ఆత్మను ఊదాము” – 66:12

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే- ‘దేవుడు మానవుని నాశికారంధ్రంలో జీవవాయువు ఊదగా జీవాత్మ ఆయెను’ (ఆది 2:7) అన్న విషయమే ఖురాన్‌లో అల్లాహ్‌ ఈ క్రింది విధంగా ప్రస్తావిస్తున్నాడు.

“నేను కుళ్లిన మట్టి యొక్క ఎండిన గారతో ఒక మానవుణ్ణి సృష్టిస్తున్నాను. నేను అతన్ని పూర్తిగా తయారుచేసి అతనిలో నా ఆత్మను ఊదినప్పుడు మీరందరూ అతని ముందు సాష్టాంగపడాలి” – 15:29

“… ఆ తరువాత అతనిని (ఆదామును) నఖశిఖ పర్యంతం తీర్చి దిద్దాడు. అతనిలో తన ఆత్మను ఊదాడు” – 32:9

దీనిని బట్టి ఖురాన్ ప్రకారం ఒక్క యేసు మాత్రమే కాదు, ఆదాము సైతం “దేవుని తరఫున ఆజ్ఞ” ద్వారానే సృష్టించబడి, దేవుని తరఫున ప్రసాదించ బడిన ఆత్మ ద్వారానే ప్రాణమున్న మనిషిగా తీర్చిదిద్దబడ్డాడని తెలుసుకున్నాం. అయితే తరువాతి కాలంలో యేసును దేవుడు, తండ్రి లేకుండా పుట్టించాడు కనుక అలంకారికంగా ముస్లిం పండితులు ఆయనను “రూహూమినల్లాహ్” అన్న పొడవాటి పదానికి సంక్షిప్తంగా ‘రూహుల్లాహ్‌’ అన్న బిరుదు ఇచ్చారు. తప్పితే నేటి బోధకులు ఊహించుకుంటున్నట్లు యేసు, దేవునిలో నుండి బయటకు వచ్చిన ఆత్మ అని కాదు! వాస్తవానికి ఒక్క యేసే కాదు, పైన మనం గమనించిన బైబిల్‌ మరియు ఖురాన్‌ వాక్యాల ప్రకారం ఆదాము నుండి అందరూ దేవుని వాక్కు ద్వారా సృష్టించబడి, దేవుని జీవాత్మ ద్వారా సజీవంగా పుట్టించబడిన వారే అని చెప్పవచ్చు.

“అల్లాహ్ తాను కోరిన దానిని సృష్టిస్తాడు. ఆయన ఒక పని చెయ్యాలని నిర్ణయించినప్పుడు, కేవలం దానిని “అయిపో” అంటాడు. అంతే అది అయిపోతుంది” – 3:48

ఖురాన్ ప్రకారం యేసు “దేవుని యొక్క వాక్యమా?”

ఖురాన్‌లో ఎక్కడా కూడా ‘కలిమతుల్లాహ్‌’ (దేవుని వాక్కు) అని లేదు! కానీ అలా ఉందన్న విషయం తెలియని క్రైస్తవ బోధకులు ఆవేశపడి, ఖురాన్ ప్రకారం యేసు “అల్లాహ్ యొక్క వాక్కు” కాబట్టి ఖురాన్ ప్రకారం కూడా యెసే దేవుడని భలే గమ్మత్తుగా వాదిస్తూ ఉంటారు.

నిజానికి ఖురాన్ లో ‘కలిమతుమ్మిన్‌హు’ (దేవుని తరఫు నుండి వచ్చిన వాక్కు లేక ఆజ్ఞ) అని మాత్రమే ఉంది. ఈ విషయాన్ని మనం స్పష్టంగా ఖురాన్ 3:45 అరబ్బీ మూలంలో గమనించగలం.

“అల్లాహ్ తన తరఫున “ఆజ్ఞ”కు సంబంధించిన శుభవార్తను నీకు పంపుతున్నాడు” – 3:45

అంటే కన్యక గర్భం ద్వారా దేవుడు యేసును పుట్టించాలని సంకల్పించుకుని, ఆయన తరఫు నుండి ఇచ్చిన ఆజ్ఞ (Order) లేదా వాక్కు. అలాగే బైబిల్లో దేవుని తరఫు నుండి ‘అగుము’ అన్న ఆజ్ఞలు అనేకం వచ్చినట్లు, ఆ వాక్యాల ఆధారంగానే సకల సృష్టి జరిగినట్లు మనం చూడగలం. సకల సృష్టి మాత్రమే కాక, సమస్త మానవులూ దేవుని వాక్కు ద్వారా పుట్టించబడినవారే అని బైబిలే చెబుతుంది (హెబ్రీ 11:3, 1 పేతురు 1:22-23). అయితే యేసు, తండ్రి లేకుండా దేవుని ‘అగుము’ అన్న వాక్కు ద్వారా పుట్టారు. కనుక అలంకారికంగా పండితులు ఆయనను ”కలిమతుమ్మిన్‌హు” అన్న పొడవాటి పదానికి సంక్షిప్తంగా ”కలిమతుల్లాహ్‌” అన్న బిరుదు ఇచ్చారు.

అలాగే ఒక్క యేసు విషయంలోనే కాదు ముస్లిం పండితులు మోషేతో దేవుడు, ప్రత్యక్షంగా మాట్లాడటాన్ని బట్టి ‘మూసాకలామల్లాహ్‌’ (4:164) అన్న బిరుదును ఇచ్చారు. అలాగే అబ్రాహామును దేవుడు తన స్నేహితుడని చెప్పటాన్ని బట్టి ‘ఇబ్రాహీం ఖలీలుల్లాహ్‌’ అన్న బిరుదును ఇచ్చారు. అలాగే ఆదాము తొలి మానవునిగా ఎన్నుకోబడటాన్ని బట్టి ‘ఆదంసఫీవుల్లాహ్‌’ అని, ప్రవక్త ముహమ్మద్‌(స) వారిని ‘హబీబుల్లాహ్‌’ అని అభివర్ణించటం జరిగింది.

ఈ విధంగా కొందరు ప్రవక్తలు వారి యొక్క కొన్ని ప్రత్యేక పరిస్థితులు, వారికి ఇవ్వబడిన కొన్ని ప్రత్యేకతలను బట్టి కొన్ని బిరుదులు ఆయా ప్రవక్తలకు ఇవ్వబడ్డాయి. ఇవేమీ గమనించకుండా యేసు రూహుల్లాహ్‌ అని, కలిమతుల్లాహ్‌ అని పిలువబడ్డారు కాబట్టి అలా ఖురాన్ లో రాయబడి ఉందని ఊహించుకుని, యేసు, అల్లాహ్ యొక్క ఆత్మ కాబట్టి అల్లాహ్, యేసు ఒక్కరే! యేసు, అల్లాహ్ యొక్క వాక్కు కాబట్టి యేసు అల్లాహ్ లో భాగం! యేసే అల్లాహ్‌ అని అని నిర్ధారించటం, వాదించటం కేవలం అవివేకం, మూర్ఖత్వం మరియు అజ్ఞానం కదా!

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *