“సుప్రసిద్ధ సాహితీవేత్త” అనే టైటిల్ తో కొందరు నాస్తికులు వ్యాసాలు రాస్తూ తమ రచనా నైపుణ్యం ద్వారా ప్రజల మైండ్ ను ట్యూన్ చేస్తూ ఉండే విషయం ఏమిటంటే- “అసలు దైవత్వపు భావన ఉండబట్టే కదా ప్రజల్లో ఇన్ని మూఢ నమ్మకాలు ప్రబలటానికి కారణం కాబట్టి అసలు దేవుడే లేడని ఒప్పుకుంటే మూఢనమ్మకాలే ఉండవు కదా” అన్నది.
ఈ వాదన ఎలాంటిదంటే “అసలు కళ్లు ఉండబట్టే కదా చెడు చూడటం సాధ్యపడుతుంది కాబట్టి మొత్తానికి కళ్లు పీకి పారేస్తే అసలు చెడు చూసే అవకాశమే ఉండదు కదా” అనటం లాంటిదన్నమాట.
నాస్తికులైన సుప్రసిద్ధ సాహితీవేత్తల రచనల్లో ఈ డొల్ల తనానికి కారణం వారికి దేవుళ్లూ – మూఢ నమ్మకాలు మరియు సృష్టికర్త అన్న అంశాలకు సంబంధించిన అవగాహన లేకపోవటమే.
సృష్టికర్త మరియు నకిలీ దేవుళ్లు!
ఆస్తికుల్లో “నిజ ఆస్తికులు” “నకిలీ ఆస్తికులు” అంటూ రెండు రకాల ఆస్తికులున్నారని, అలాగే ప్రతీ వస్తువులోనూ అసలు, నకిలీ ఉన్నట్టే “దైవత్వపు భావన”లోనూ “వాస్తవ దైవ భావన” మరియు “నకిలీ దైవత్వపు భావన” అని రెండు రకాల దైవ భావనలు ఉన్నాయన్న విషయం నాస్తికులకే కాదు, చాలా మంది ఆస్తికులకు సైతం అవగాహన లేదంటే అతిశయోక్తి కాదేమో.
నాస్తిక వర్గం ఆవిర్భావానికి కారకులు నకిలీ ఆస్తికులే!
ఇది వినటానికి కాస్త ఆశ్చర్యం అనిపించినప్పటికీ, ఈ విషయం ఆస్తికులకు చదవటానికి ఇబ్బంది కలిగించినప్పటికీ వాస్తవం అయితే “నాస్తికులు” అనే ఓ వర్గం అసలు ఉనికిలోకి రావటానికి ముఖ్య పాత్రపోషించింది మటుకు “నకిలే ఆస్తికులే! అని చెప్పాలి.
చరిత్రను పరిశీలిస్తే సమాజంలో బహుదైవారాధన, మూఢనమ్మకాలు ప్రబలినప్పుడు ప్రజలు మూడు వర్గాలుగా విడిపోతూ వచ్చారు.
మొదటి వర్గం- శాస్త్రీయ దృక్పథం కలిగిన ప్రజలు: వీరు ప్రజలు కల్పించుకున్న మూఢ నమ్మకాలను, బహుదైవాల ఆరాధనను చూసి ఈ సృష్టికి ఉంటే ఒకడే సర్వశక్తిమంతుడైన కర్త ఉండి ఉంటాడు. ఆయన తప్ప ఈ ప్రజలు కల్పించుకున్న దైవాలు కేవలం మిద్య అన్న విషయాన్ని జ్ఞానం ఉపయోగించి తెలుసుకుని, మత వ్యవస్థలోని ముఢాచారాలను ఖండిస్తున్న “ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మం” ప్రకారం నిజ ఆధ్యాత్మికులుగా మారిపోయిన ప్రజలు.
రెండవ వర్గం: మత వ్యవస్థలో కొందరు సృష్టించిన మూఢాచారాలు, గుడ్డి నమ్మకాలు, బహుదైవారాధన విధానాలకు ఆకర్షితులై జ్ఞానం ఉపయోగించని మూఢులు. వీరు పైకి ఆధ్యాత్మికులుగా ఉన్నప్పటికీ వీరు ధార్మిక గ్రంథాల ధర్మానికి సంబంధం లేని విశ్వాసాలు, మత ఛాందసవాదం కలిగిన సోకాల్డ్ ఆస్తికులన్నమాట!
మూడవ వర్గం: పైకి ఆధ్యాత్మికులుగా ఉంటూనే, ధార్మిక గ్రంథాల ధర్మానికి సంబంధం లేని విశ్వాసాలు కలిగిన సోకాల్డ్ ఆస్తికుల ఆచారాలు, వ్యవహారాలు చూసి ధర్మం, దేవుడు వగైరా ఆలోచనలు ఉండబట్టే వీరు ఇలా తయారయ్యారని మొత్తానికి ఆధ్యాత్మిక వ్యవస్థే ఒక మూఢాచారాల పుట్ట అని స్వయంగా డిసైడ్ అయిపోయి “హేతువాదులు” అన్న ట్యాగ్ తో తయారైన నాస్తికులన్న మాట!
****
“ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మం” మరియు “మూఢత్వ మత వ్యవస్థ”కు మధ్య ఉన్న బేధం… అలాగే…
“మత వ్యవస్థలోని కొందరు కల్పించుకున్న మిద్యా దైవాలు” మరియు “ధార్మిక గ్రంథాలు పరిచయం చేస్తున్న సృష్టికర్త” మధ్య ఉన్న బేధం…
తెలియక పోవటం వల్ల నాస్తికులు మత వ్యవస్థలో ఉన్న గుడ్డి నమ్మకాలు, ముఢాచారాలన్నిటికీ కారణం దేవుడు, ధర్మమే అని అపోహపడుతూ మత వ్యవస్థలో ఉండే ముఢాచారాలనూ, ధార్మిక గ్రంథాల ధర్మాన్నీ ఒకే గాటన కట్టేసి ఆధ్యాత్మిక వ్యవస్థనూ ..
అలాగే మత వ్యవస్థలో కొందరు కల్పించుకున్న మిద్యా దైవాలను, ధార్మిక గ్రంథాలు పరిచయం చేస్తున్న సృష్టికర్తనూ ఒకే గాటన కట్టేసి మొత్తానికి దైవత్వపు భావనను వ్యతిరేకిస్తుంటారు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే “ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మానికి” “మూఢత్వ మత వ్యవస్థకు” సంబంధం లేదు… అలాగే … మత వ్యవస్థలోని కొందరు కల్పించుకున్న మిద్యా దైవాలకు “ధార్మిక గ్రంథాలు పరిచయం చేస్తున్న సృష్టికర్త”కు సంబంధం లేదు.
ఈ విషయం తెలిక చాలా మంది నాస్తికులు “ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మాన్నీ” “మూఢత్వ మత వ్యవస్థనూ” కలగాపులగం చేసేసి మాట్లాడుతుంటారు. మత వ్యవస్థలోని కొందరు కల్పించుకున్న మిద్యా దైవాలూ, “ధార్మిక గ్రంథాలు పరిచయం చేస్తున్న సృష్టికర్త ఒక్కరే అన్న అపోహకు గురై “అసలు దేవుడే లేడు” అన్న ఓ అజ్ఞానపు డిక్లేరేషన్ చేస్తుంటారు. ఒకవేళ దేవుడే ఉంటే మాకు కనపడాలి కదా అంటూ హేళనగా మాట్లాడుతుంటారు.
“దేవుడు” vs “సృష్టికర్త”
ఈ సమస్త విశ్వానికి ఒక కర్త ఉన్నాడు అని చెప్పటానికి “సృష్టికర్త” అనే పదం చెప్పబడింది. “దేవుడు” అన్నది ఒకరకంగా చాలా అపార్థానికి అయిన పొల్యూటెడ్ పదం అని చెప్పావచ్చు. మత వ్యవస్థలో మిద్యా దైవాలకూ, సృష్టికర్తకూ దేవుడు అని పదం వాడటం వల్ల నాస్తికులు కన్ఫ్యూజన్ కు గురై జాతరల్లో పోతురాజు, పోలేరమ్మ విగ్రహాలను ఏవగించుకుంటూ సృష్టికర్త లేడని పొంతన లేకుండా మాట్లాడుతుంటారు.
నాస్తికత్వానికి చాలా మంది ఆకర్షించబడటానికి కారణం!
దేవుణ్ణి నమ్ముకుంటూ మనిషి తనలో సహజంగానే ఉండే మంచీ- చెడు ఆలోచనల్లో చెడు ఆలోచనలను నియంత్రించుకుంటూ మంచి ఆలోచనల ప్రకారం నడవటం, ధర్మం ప్రకారం తనలో విపరీత కోరికల్ని కంట్రోల్ చేసుకుంటూ నైతికంగా బ్రతకటం ఒక బరువుగా ఫీలవుతూ తమలో విచ్చలవిడి కోరికల ప్రకారం జంతువులంత స్వేచ్ఛగా బ్రతకాలనునే చాలా మందికి రెడీమేడ్ గా దొరికిన ఆప్షన్ “నాస్తికత్వం”! మాకు సృష్టికర్త కనపడలేదు కాబట్టి మేము సృష్టికర్తను నమ్మము అన్నది వాళ్లు పైకి ఇచ్చుకునే కవరింగ్ మాత్రమే.
అయితే నాస్తికుల్లో ఉత్తములు కూడా ఉన్నారు. ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారు. ఆధునిక విద్యను అభ్యసిస్తూ, ధర్మావగాహన లేని కారణంగా మూఢత్వ మత వ్యవస్థపై ఏవగింపుతో నాస్తికులుగా మారిపోయిన వారు చాలా మంది ఉన్నారు.
ఇక మనిషి సైతం ఒకప్పటి జంతువే! అంటూ మనిషిని, జంతువులను ఒక్కటి చేసి తరువాతి కాలాల్లో పనుషుల్లో పశుత్వాన్ని పెంచటానికి కారణమైన వ్యక్తే చార్లెస్ డార్విన్. అతను ప్రతిపాదించిన “మనిషి ఒకప్పటి కోతి” అన్న “కోతి సిద్ధాంతం” నాస్తికులకు విపరీతంగా ఆకర్షించింది. డార్వినిజం చాలా సైన్స్ సూత్రాలతో పొసగనప్పటికీ తిరిగి తరువాతి కాలాల్లో “నియో డార్వినిజం” అంటూ డార్వినిజానికి చాలా రిపేర్లు చేసి మొత్తానికి డార్విన్ సిద్ధాంతాన్ని నాస్తికులు తమ భుజాలపై మోయటం మొదలెట్టారు.
నాస్తికుల్లో ఉండే మూఢ నమ్మకం!
ఇంతకూ ధార్మిక గ్రంథాలు దేనికి అవతరించాయి? ప్రజల్లో మూఢ నమ్మకాలు, గుడ్డి విశ్వాసాలు ప్రబలిపోయి, ప్రజలు కొందరు మత పండితులు సృష్టించిన మిద్యా దైవాల ఆరాధనలో మునిగిపోయినప్పుడల్లా మత వ్యవస్థలో మూఢనమ్మకాలను ఖండించటానికే ధార్మిక గ్రంథాలు అవతరించేవి.
అటు ఉపనిషద్, వైదిక గ్రంథాల నుండి బైబిల్, ఖురాన్ గ్రంథాల వరకు ఒకే సృష్టికర్తను పరిచయం చేస్తున్నట్టు ఆయన్నే “సర్వేశ్వరుడు” “అక్షర పరబ్రహ్మ” “యెహోవా” “అల్లాహ్” అనేక భాషలల్లో పరిచయం చేస్తున్నట్టు గమనించగలం.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హిందూత్వంలో ఉన్న విగ్రహారాధనను వేదోపనిషత్తుల్లో చూడలేము.
క్రైస్తవుల్లో ఉండే యేసు దేవుడన్న భావన బైబిల్లో చూడలేము. కొందరు ముస్లిములు చేసే దర్గాల ఆరాధన ఖురాన్లో చూడలేము. కానీ వీటన్నిటినీ మూఢత్వ మత వ్యవస్థలో చూడగలము.
అయితే మత వ్యవస్థలో కొందరు మత పండితులు డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రవేశపెట్టిన బహుదైవారాధన, మూఢ నమ్మకాలకు కారణం ధార్మిక గ్రంథాలే అని భావించటమే నాస్తికుల్లో ఉండే మూఢ నమ్మకం.
అందుకే నాగుల చవితి నాడు పుట్టలో పాలు పొయ్యటాన్ని చూసి “చూసారా అందుకే మేము సృష్టికర్త లేడని చెప్పేది” అంటూ సంబంధం లేకుండా మాట్లాడుతూ అలా మాట్లాడటాన్ని అభ్యుదయవాదంగా ఫీలవుతుంటారు.
కాబట్టి నాస్తికులను ఈ మూఢత్వం నుండి బయటపడెయ్యాలంటే ముందు ఆస్తికులు ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. మత వ్యవస్థలో మిద్యా దైవాలకూ ధార్మిక గ్రంథాలు పరిచయం చేస్తున్న సృష్టికర్తకు మధ్య బేధాన్ని తెలుసుకోవాలి.
లేదంటే నాస్తికులకు.. ఆస్తికులకు ప్రళయం వరకు పోరు కొనసాగుతూనే ఉంటుంది.
దేవుళ్లూ – మూఢ నమ్మకాలు & సృష్టికర్త /-
