నాస్తిక్ కామెడీ /-

ఈ పోస్ట్ పై నేను స్పందించాల్సినంత అవసరం లేదు. “పిల్లిపిల్ల స్థానంలో ఆ ఇమాం కుక్కపిల్లని ముద్దాడగలడా? కాళ్ల పక్కన పందిపిల్ల నిలబడడాన్ని సహించగలడా?” అన్న వీర వంకర ప్రశ్నను లేవనెత్తుతూ ఓ ఆవేశపరుడైన నాస్తికుడు పెట్టిన పోస్టుకు సమాధానంగా ఇతను తిరిగి కౌంటర్ పోస్ట్ పెడుతూ లేవనెత్తిన కొన్ని పాయింట్లు నాకు మరీ కామెడీగా అనిపించాయి. వాటికి కౌంటర్ గా ఈ పోస్టు రాయాలనిపించింది అంతే.

“1. పోలిక సమానమైన వాటితోనే పెట్టాలనే ఇంగితం వుంది కాబట్టే పిల్లిపిల్ల స్థానంలో కుక్కపిల్లని ముద్దుపెట్టుకోమని అడిగా. పాముని, పందిని కాదు! మీ దేవుడు సృష్టించని డైనోసార్‌ని కాదు! ఇక్కడ పోలిక పిల్లిపిల్లకి, కుక్కపిల్లకి. పిల్లిపిల్ల స్థానంలో ఈ భూమ్మిద అత్యధికంగా పెంపుడయ్యే కుక్కపిల్లని, విశ్వాసానికి మారుపేరైన కుక్కపిల్లని”

Ans: అంటే ఆ సమయంలో నమాజ్ చదివిస్తున్న ఇమామ్ గారు పిల్లి స్థానంలో కుక్కపిల్ల ఉండి ఉంటే ఆయన నమాజ్ ఆపేసి ఆ కుక్కపిల్లను ముద్దాడుతూ కూర్చొని ఉంటే ముస్లిం సమాజం అంతా కుక్కల పట్ల వివక్ష ప్రదర్శించటం లేదన్నట్టు, పిల్లిని ముద్దాడారు కాబట్టి ముస్లిం సమాజం కుక్కల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నట్టు అర్థమా? కుక్కపిల్లే కాదు నమాజ్ చదివిస్తున్నప్పుడు ఆ ఇమామ్ ప్రక్కన ఏ జంతువు వచ్చి నిలబడినా ఏ ఇమామూ నమాజ్ వదిలేసేది ఉండదు. మహాలేదంటే నమాజ్ పూర్తి చేసుకున్న తరువాత అతను ఆ కుక్కపిల్లనో/పంది పిల్లనో సురక్షితంగా బయట వదిలిపెట్టి రావటం జరుగుతుంది అంతే! ఇక ఖురాన్ అయితే సమస్త జీవుల పట్ల దయ, జాలి కలిగి ఉండమనే చెబుతుంది. కాకపోతే ఆరోగ్య రిత్యా ఖురాన్ కోరపళ్లు కలిగిన క్రూరస్వభావం ఉన్న జంతు మాంసాన్ని తినటాన్ని నిషేధించింది. తప్పితే కొన్ని జంతువుల పట్ల సామూహికంగా ద్వేషాన్ని ప్రదర్శించమని ఎక్కడా చెప్పలేదు.

ఇక “మీ దేవుడు సృష్టించని డైనోసార్‌” అనటానికి ఏదైనా ఆధారం ఉంటే పెట్టాలి. లేదంటే ఈయనకు అలా అని వాట్స్ యాప్ లో గానీ వచ్చిందా? కుక్కపిల్లలు, పంది పిల్లలతో పాటు ఈ డైనోసార్ గొడవేంటో?

“2. ఆవు అమ్మవంటిది అనే నమ్మకమైనప్పుడు బర్రె కనీసం పిన్ని ఎందుకు కాకూడదని అడిగినప్పుడు శభ్భాస్ అని జబ్బలు చరిచిన మీలోని ఆలోచన మీ మతం దాకా వచ్చేసరికి ఎక్కడికి పోయింది? కల్వరి గొర్రెని అన్నప్పుడు ఏమైంది? మన మతం వచ్చేసరికి మనిషితనం చచ్చి, జంతువు బయటికి వచ్చాడా?

Ans: మా స్వంత మతాన్ని విమర్శించుకుంటున్నాం కాబట్టి ఏ మతాన్నైనా విమర్శించటానికి మాకు ఫ్రీగా లైసెన్స్ దొరికేసినట్టు అన్న ఫీలింగ్ లో ఏది పడితే అది విమర్శ చెయ్యకూడదు. ఆవు అమ్మవంటిదన్నది ఓ మూఢ నమ్మకం. ఆవుల పేరు మీద దళితుల, మైనార్టీల హత్యలు కూడా జరిగిన నేపథ్యంలో బహుశా ఆవులపై హేళన చేసినప్పుడు కొందరు ముస్లిములు ఈ నాస్తికుణ్ణి శభ్భాస్ అని ఉండవచ్చు. అలా అన్నంత మాత్రానా ఇస్లాంను కూడా గుడ్డిగా విమర్శిస్తాను అంటే శబ్భాస్ అనాలని రూల్ లేదు. ఆ మాటకొస్తే ఇతర మతాల్లోని మూఢనమ్మకాలతో పాటు ముస్లిం సమాజంలోనే దర్గాలు, తాయెత్తులు, ముహర్రం నాటి మాతం, రొట్టెల పండుగలు వగైరా అనేక ముఢాచారాలను ఎండగడుతూ ఈ పేజ్ పై నేనే ఎన్నో పోస్టులు రాయటం జరిగింది. కాబట్టి ఏది ధర్మం, ఏది మూఢాచారం అన్న కనీస అవగాహన కూడా లేకుండా ఇతర మతాలను గుడ్డిగా విమర్శించకూడదు.

“3. ఏమీ ఇస్లాం ఎవరినీ ద్వేషించదా? ఇది ఇస్లామే కాదు ప్రతి మతస్తుడూ కూసే కూతనే. మా మతం దయ, జాలి, ప్రేమ, సమానత్వం బ్లా బ్లా. అదే మతాన్ని ఎవడైనా ఏమైనా అన్నాడా వెంటనే నోరు విషం కక్కుతుంది. పశువు బయటికొస్తాడు. భాష బూతుని అద్దుకుంటుంది. మతాలన్నీ మంచివే అయితే ఈ నేలమీద ద్వేషం ఇంత ఎలా విస్తరించింది, హింస ఎలా పెరిగిందీ, నెత్తురు పారింది మీ మతాల వల్లనే కాదా?”

Ans: ఈ పాయింట్ లో నాకు విపరీతంగా కామెడిగా అనిపించిన అంశం “ఈ నేలమీద ద్వేషం, హింస పెరిగిందీ, నెత్తురు పారింది మీ మతాల వల్లనే కాదా?” అన్నది. ఇదీ ఇతని అవగాహనా పరిధి! పైగా ఈయన ముస్లిం సమాజానికి “పుస్తకాలు చదువుకోండి” అని సలహా ఇస్తున్నాడు.

సరే, చరిత్రలో జరిగిన యుద్ధాలు, వాటి కారణాలను వివరిస్తూ రాయబడిన “ఎన్సైక్లోపీడియా ఆఫ్ వార్స్ (Encyclopedia of wars)” అనే పుస్తకం ఇతను అర్జెంటుగా చదవాలి. దాని ప్రకారం చరిత్రలో (8000 BCE నుండి 2003 ఇరాఖ్ యుద్ధం వరకు) మొత్తం 1763 యుద్ధాలు జరగగా, వాటిలో మతం కారణంగా జరిగిన యుద్ధాలు 123 మాత్రమే! మిగతావన్నీ అధికారం, రాజకీయ, ఆర్థిక లబ్ది కోసం జరిగిన యుద్ధాలే!

దీనితో పాటు “ద గ్రేట్ బిగ్ బుక్ ఆఫ్ హారిబుల్ థింగ్స్: ది ద డెఫినిటివ్ క్రానికల్ ఆఫ్ 100 వరస్ట్ అట్రాసిటీస్ (The Great Big Book of Horrible Things: The Definitive Chronicle of History’s 100 Worst Atrocities)” అనే మరొక ప్రముఖ పుస్తకం కూడా చదవాలి. దాని ప్రకారం చరిత్రలో జరిగిన 100 దారుణమైన మారణ హోమాల్లో 11 మాత్రమే మతం కారణంగా జరిగాయని తేల్చి చెప్పటం జరిగింది.

మతం పేరు మీదనే భూమిపై నెత్తురు పారింది అన్న మూఢ నమ్మకం ఉన్న నాస్తికులకు సైతం అవగాహన లేని విషయం గత వందేళ్లలో కమూనిస్ట్ రాజ్యాలు 100 మిలియన్ల మందిని చంపాయన్నది. “ద బ్లాక్ బుక్ ఆఫ్ కమ్యూనిజం” పుస్తకం చదివిన వారికి ఈ విషయం ఎరుకే! నాస్తిక దేశాల్లో జరిగిన ఈ దౌర్జన్యాలకు కారకులు ఎవరో మత ఉన్మాదులు కారు. స్టాలిన్, లెనిన్, మావో వంటి నాస్తిక లీడర్లే. చరిత్రలో అతిపెద్ద జనహననాలు సాగించిన హిట్లర్, సోవియట్ నియంత జోసెఫ్ స్టాలిన్ల కంటే మావో అధిగమించాడు. 1958 – 62 సం.ల మధ్య మావో జెడాంగ్ ప్రవేశ పెట్టిన “గ్రేట్ లీప్ ఫార్వర్డ్ పాలసీ” కారణంగా చైనాలో 45 మిలియన్ల మంది చంపబడ్డారు. ఇది చరిత్రలో నమోదైన మరియు మరుగుపరచబడిన అతిపెద్ద జనహననం. ఇది గత వందేళ్లలో నాస్తిక లీడర్లు సాగించిన టెర్రరిజం.
ఇవన్నీ తెలియకుండా ఇతర మతాలపై ఎలా పడితే అలా విమర్శలు చెయ్యకూడదు.

ఆ ఇమామ్ పై యాదృచ్ఛికంగా పిల్లి మీదెక్కటం దాన్ని ఆయన విసుక్కోకుండా ప్రేమతో నిమరటం చూసి మీలోని “పశువు బయటికొచ్చాడేమో” అని నాక్కూడా అనిపించింది. పనికట్టుకుని ముస్లిం సమాజాన్ని హేళన చేస్తూ పోస్టు పెడితే రియాక్ట్ అవ్వకూడదా? అంటే మీరు గిల్లితే సైలెంటుగా గిల్లించుకోవాలా?

“4. మంచి కనపడితె మతానికి, చెడు చూపిస్తే అది అయా వ్యక్తికో, ఇమాంకో, సంప్రదాయానికో ముడిపెట్టి మాట్లాడడం బాధ్యతా రహిత్యం. జవాబుదారీతనం లేకపోవడం.”

Ans: చెడు చూపించటంలో తప్పులేదు. కాకపోతే ఫలానా లోపం మతావలంబీకుల్లో ఉందా లేక వారి ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయా అన్న అవగాహన సైతం ఉండాలి. తప్పితే మతావలంబీకుల్లో ఉన్న లోపాల్ని ఆయా మతాలకు ముడి పెట్టేసి విమర్శించకూడదు. అది అసలు బాధ్యతా రహిత్యం. ఏ మతమూ చెడు బోధించదు. మతావలంబీకుల్లో చెడులు, చెడ్డవారు ఉండవచ్చు కానీ ధార్మిక గ్రంథాలు చెడు చెప్పవు.

“5. అవును అన్ని జంతువులూ నచ్చాలని లేదు వ్యక్తిగతంగా. కానీ ఒక సామూహికంగా మత ప్రాతిపదికన కొన్ని వృత్తులపట్ల, కొన్ని ప్రాణులపట్ల, కొన్ని జెండర్ల పట్ల ప్రేమ లేకపోతే మానాయ, అసహ్యం, ద్వేషం పసితనం నుండి ట్యూన్ చేయడం అదీ ఒక ఏహ్యాన్నీ, వివక్షనీ ప్రోత్సహించడం దుర్మార్గం”

Ans: కొన్ని ప్రాణులపట్ల, కొన్ని జెండర్ల పట్ల ప్రేమ ఉండకూడదని ముస్లిం సమాజంలో అసహ్యం, ద్వేషం పసితనం నుండి ట్యూన్ ఎక్కడ చేస్తున్నారా నాయనా!? అని పించింది నా మనసులో. పైన ఆల్రెడీ చెప్పాను ఖురాన్ అయితే సమస్త జీవుల పట్ల దయ, జాలి కలిగి ఉండమనే చెబుతుంది. కాకపోతే ఆరోగ్య రిత్యా ఖురాన్ కోరపళ్లు కలిగిన క్రూరస్వభావం ఉన్న జంతు మాంసాన్ని తినటాన్ని నిషేధించింది. తప్పితే కొన్ని జంతువుల పట్ల సామూహికంగా ద్వేషాన్ని ప్రదర్శించమని ఎక్కడా చెప్పటం లేదు. ఇంకా చెప్పాలంటే ఖురాన్ “మానవులంతా ఒకే జంట సంతానం అని పుట్టుక రీత్యా ఎవరూ ఎవరి మీదా గొప్పవారు కాద”ని చెబుతుంది.
ఆమాటకొస్తే కుక్కల్ని పెంచుకునే ముస్లిములు కూడా ఎందరో ఉన్నారు. అది వాళ్ల ఇష్టం. పోనీ మీరు ఇంట్లో వీధిలో తిరిగే పందుల్ని పెంచుకుని చూపండి మాక్కూడా ఆదర్శంగా ఉంటుంది. ఏమంటారు?

చివర్లో కామెడీ పంచ్…

నాస్తికంగా, హేతుబద్దంగా, సత్యంగా బ్రతకడం అనేది మతాన్ని అనుసరిస్తూ, దేవుడిని విశ్వసిస్తూ బ్రతకడమంత సుళువు కాదు. చేతనైతే ఒక్కరోజు బ్రతికి చూడండి!

Ans: నాస్తికత్వంలో హేతుబద్ధం ఉండటం నేతి బీరకాయలో నెయ్యి ఉండటం ఒక్కటే! ఓ క్లిష్టతరమైన వ్యవస్థ తయారవటం, నడపబడటం వెనుక ఓ మేధస్సు ఉండి తీరాలన్న హేతుబద్ధమైన వాదనకు భిన్నంగా అలా ఉండాల్సిన పనిలేదు అంతా యాక్సిడెంటల్ గా కూడా జరుగుతుందన్న హేతువిరుద్ధ వాదనకు నాస్తికులు “హేతుబద్ధం” అన్న పేరు తగిలించుకున్నంత మాత్రానా నాస్తికులు హేతువాదులవ్వరు.

“మతాన్ని అనుసరిస్తూ, దేవుడిని విశ్వసిస్తూ బ్రతకడమంత సుళువు కాదా నాస్తికత్వం అంటే?” నా తప్పుల్ని, నేరాల్ని పట్టుకునే ఏ దేవుడూ లేడు, నేను ఎవరి ముందూ జవాబుదారీ కాదు అని బోడిగా బ్రతకటంలో ఏ కష్టం ఉందిరా నాయనా? అని మళ్లా అనిపించింది నాకైతే మనసులో.
నేను చివరకు చీకట్లో ఉన్నా నా ప్రతీ పనీ అబ్జర్వ్ చెయ్యబడుతుంది, దానికి నేను ఒక రోజు సృష్టికర్త అయిన దేవుని ముందు నిలబడి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అని నైతకంగా బాధ్యతాయుతంగా బ్రతకటం కదా బాధ్యత కలిగిన జీవితం అంటే.
అలా బాధ్యతాయుతంగా చేతనైతే ఒక్కరోజు మీరు బ్రతికి చూడండి! అర్థమవుతుంది.

ఇతని కామెంట్లు చదివి నాకనిపించింది …

ప్రేమను ప్రదర్శిస్తున్నాం అంటూ ద్వేషాన్ని వెళ్లగక్కే మీరంతా ఎవర్రా? మనుషులకే పుట్టారా? నాస్తికత్వానికా? అని

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *