సద్విమర్శ – అవహేళన /-

ఏదైనా విషయంపై సద్విమర్శ చెయ్యటానికీ ఆ విషయాన్ని అవహేళన చెయ్యటానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కొందరు నాస్తికులు “మాట్లాడే స్వేచ్ఛ, విమర్శ చేసే స్వతంత్రం మాకెందుకు ఉండవంటూ చేసేదంతా అవహేళనే!

మేము విమర్శ చెయ్యకూడదా? మేము విమర్శ చేసినంత మాత్రానా మీ మనోభావాలు దెబ్బతింటే ఎలా? అన్నది చాలా మంది నాస్తికులు అనేక సందర్భాల్లో అడిగే ప్రశ్న.

ఏ విమర్శ చేసినప్పుడైనా కచ్చితంగా ఎదుటివారి మనోభావాలు దెబ్బతింటాయి. అలాగని మొత్తానికి విమర్శ చెయ్యకూడదని చెప్పటం కూడా తప్పే! కానీ, విమర్శలన్నీ ఒకలాంటివి కావు అన్నది గమనించాలి. సమంజసమైన విమర్శ, సద్విమర్శ వేరు ఇవి కచ్చితంగా చెయ్యాల్సిందే. అలాగే అర్థరహిత విమర్శలు, ఆక్కసు-ఈర్ష్యతో చేసే విమర్శలు, కావాలని ఎదుటివారిని రెచ్చగొట్టటం కోసం చేసే గుడ్డి విమర్శలు వేరు.

ఒక విషయాన్ని తప్పని చెప్పి, నిజం ఏంటో నిరూపించాలనుకున్నప్పుడు దానికి తగిన ఆధారాలతో లాజిక్ గ్గా విషయాన్ని వివరిస్తూ భావోద్రేకాలను రెచ్చగొట్టే ధోరణిలో కాక సున్నితంగా విషయాన్ని ఎదుటివారికి వివరించే ప్రక్రియనే ఆధునిక పరిభాషలో “కమ్యూనికేషన్ స్కిల్స్” అంటారు. ఇది లేకుండా ఎలా పడితే అలా మాట్లాడేసి మాకు మాట్లాడే స్వేచ్చ ఉంది కాబట్టి మెమలా మాట్లాడటంలో తప్పేంటి అనటం అనాగరికం అవుతుంది.

పనికట్టుకుని ఎదుటి వారిని కావాలని గిల్లి పైగా.. “గిల్లితే గిల్లించుకోవాలి గానీ అరవకూడదు” అన్నట్టుగా శాడిజం ప్రదర్శించటాన్ని స్వేచ్ఛను ఉపయోగించుకోవటం అనకూడదు.

ఇంట్లో మీ నాన్నగారున్నారా? అన్నదానికి.. మీ అమ్మ మొగుడు ఉన్నాడా? అన్న దానికి ఎదుటివాడి రియాక్షన్ లో చాలా తేడా ఉంటుంది. రెండిటికీ అర్థం ఒకటే కదా? ఆ మాత్రం దానికే మీ మనోభావాలు దెబ్బతింటే ఎలా అనటం మూర్ఖత్వం అవుతుంది.

“వారు మమ్మల్ని పట్టుకుని విమర్శించవచ్చు, మమ్మల్ని హీనంగా చూడవచ్చు. మేము మట్టుకు చేతులు కట్టుకుని మర్యాదగా మాట్లాడాలంటారా? అనటం వారు గడ్డి తిన్నారు కాబట్టి మేము కూడా తింటే తప్పేంటి అనటం లాంటిదే.

ముఖ్యంగా సామాజిక సమస్యలపై గళం విప్పటం వేరు. అదే ధోరణి మత వ్యవస్థపై ప్రదర్శిస్తే సమస్యలు వేరే రకంగా ఉత్పన్నమవుతాయి. ఎందుకంటే మత వ్యవస్థలో విశ్వాసాలు, నమ్మకాలు, ఆచారాలపై ప్రశ్నలు/విమర్శలు లేవనెత్తటం, దానిని సంస్కరించటం అన్నది అత్యంత సున్నితమైన అంశం.
జ్ఞానయుక్తంగా తగిన సమాధానాలు ఇవ్వగలిగినప్పుడే అందులో తల దుర్చాలి. లేదంటే సైలెంట్ గా ఉండిపోవటం ఉత్తమం.

పైగా నాస్తికత్వం ద్వారా ఆధ్యాత్మిక వ్యవస్థను సంస్కరించాలనుకోవటం డాక్టర్ అవ్వాలన్న పట్టుదలతో ఇంజినీరింగ్ లో జాయిన్ అయిపోవటం లాంటిదే!

కచ్చితంగా మత వ్యవస్థలో ఉన్న ముఢాచారాలు, గుడ్డి నమ్మకాలపై మాట్లాడాల్సిందే. కానీ, వాటిని ఖండించాలనుకున్నప్పుడు నిజ విశ్వాసాలు ఏమిటన్నవి కూడా వివరించి చెప్పగలిగే సిలబస్ మన దగ్గర ఉండాలి. ఎందుకంటే మూఢత్వ మత విశ్వాసాలకు-నాస్తికత్వానికి మధ్య ధర్మశాస్త్రాలు ఇస్తున్న “శాస్త్రీయ ధర్మం” అన్నది కూడా ఒకటుంది. అది నాస్తికత్వాని కంటే ముందు నుండే మూఢనమ్మకాలను ఖండించటం మొదలెట్టింది. బహు దైవారాధనను, వ్యక్తుల-వస్తువుల-విగ్రహాల-సమాధుల ఆరాధనలను అది ఎప్పుడో ఖండించటం మొదలెట్టింది. మత వ్యవస్థను సంస్కరించటానికి సోల్యూషన్ ఆ ధార్మిక గ్రంథాల ధర్మమే అవుతుంది. తప్ప నాస్తికత్వం ఆ అవసరాన్ని ఎప్పటికీ తీర్చలేదు.

ఆ నాస్తికులుగా మేము స్వంత మత వర్గాన్నే విమర్శిస్తున్నాం కాబట్టి ఏ మతాన్నైనా స్వేచ్ఛగా విమర్శించేందుకు మాకు లైసెన్స్ దొరికేసినట్టే అన్న ఫీలింగ్ లో ఏదిపడితే అది ఎలా పడితే అలా వాగేసి మేము వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకుంటున్నాం అంతే కదా ఇందులో తప్పేముంది ఆ మాత్రం దానికే మీ మనోభావాలు దెబ్బతింటే ఎలా అనటం అనాగరికత అవుతుంది.

వాస్తవాలను ఉత్తమ రీతిలో వివరించే జ్ఞానం లేనప్పుడు లోపాల్ని ఎత్తి చూపే హక్కు కూడా ఉండదు. కానీ, నాస్తికత్వం కేవలం ఆస్తికుల్లో లోపాలను ఎత్తి చూపుతూ వ్యంగ వెటకారాలు చెయ్యటం, అవహేళనగా మాట్లాడటం తప్ప వాస్తవం ఫలానా అని ఎప్పటికీ చెప్పలేదు. కానీ నాస్తికులందరూ అలానే మాట్లాడతారన్నది నా ఉద్దేశం కాదు వారిలో చాలా ఉత్తమంగా మాట్లాడే సంస్కారులు కూడా ఉన్నారు కానీ వారిలో అధికశాతం మంది ఆధ్యాత్మిక వ్యవస్థపై వ్యంగస్త్రాలు విసిరేవారే అన్న నిజాన్ని కూడా కొట్టి పారేయలేము.

పబ్లిగ్గా ఫలానా అతను దేవుడు కాడు అని చెప్పాలనుకున్నప్పుడు నిజ సృష్టికర్త ఎవరో కూడా చెప్పగలగాలి. లేదా ఒకవేళ అసలు సృష్టికర్త అన్నవాడే లేడని చెప్పాలకున్నప్పుడు కూడా తాము లేవనెత్తిన విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించుకోవాలి.

లేని సృష్టికర్తను లేడని వేరేగా నిరూపించాల్సిన పని మాకేముంది? అని అంటే.. అప్పుడు ఈ విశ్వానికి ఒక సృష్టికర్త లేడన్న తమ స్వంత నమ్మకాన్ని ఇతరులపై బలవంతంగా రుద్దే ప్రయత్నం కూడా చెయ్యకూడదు.

ఆధ్యాత్మిక వ్యవస్థను పనికట్టుకుని విమర్శించే నాస్తికులకు మత ఉన్మాదాన్ని ప్రదర్శించే కొందరు ఆస్తికులకు పెద్ద తేడా లేదు. కొందరు మతోన్మాదులు మత ఉన్మాదం ప్రదర్శిస్తే నాస్తికులు నాస్తికోన్మాదాన్ని ప్రదర్శిస్తుంటారు.

విమర్శ మంచిదే! కానీ, వ్యక్తిత్వ-సామాజిక సంస్కరణలన్నవి కేవలం విమర్శలు-వెటకారాల వల్ల సాధ్యపడవు. జ్ఞానయుక్తంగా, ఉత్తమమైన రీతిలో విషయాలను వివరించటం వల్లే సాధ్యపడతాయి. కానీ అలా వివరించే సిలబస్ నాస్తికుల దగ్గర లేదు.

అందంగా చెక్కబడిన ఒక శిల్పం వెనుక కచ్చితంగా ఒక ప్రావీణ్యత కలిగిన శిల్పి ఉండి తీరాల్సిందే అన్న “హేతుబద్దమైన వాదన”కు భిన్నంగా ఆ అందమైన విగ్రహం వెనుక ఏ శిల్పీ ఉండాల్సిన పనిలేదు అది దానికదే యాక్సిడెంటల్ గా చెక్కబడిపోతుంది అని అడ్డంగా వాదించటమే నాస్తికత్వం. ఆ టైపు హేతువిద్ధమైన వాదనకు వారు పెట్టుకున్న ముద్దు పేరు హేతువాదం!

మనిషికి ఈ లోకంలోనే జీవితం. అతనిపై ఏ సృష్టికర్తా అదుపు లేదు. ఎవరికీ నా పనుల గురించి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మంచీ-చెడులన్నవి హుళుక్కే! ఏది మంచిది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్లిపోతే చాలు అన్న నాస్తిక దృక్పథం వల్ల మనిషి ప్రపంచంలో ఒంటరి వాడైపోతాడు.

అతన్ని ఈ దృక్పథం పశువు కంటే దారుణంగా తయారు చేస్తుంది. ఏ తప్పు చెయ్యటానికైనా అతను వెనుకాడడు. నాకు ఏది కరక్ట్ అనిపిస్తే అదే మంచి నేను ఎవరికీ జవాబుదారీ కాను కదా అన్న దృక్పథం వ్యక్తిలో ఎప్పటికీ నైతిక విలువల్ని పెంపొందించలేదు. ఉత్తమ సమాజ నిర్మాణాన్ని కూడా చెయ్యలేదు.

చివరిగా… ఆస్తికుల్ని సంస్కరించే విధానం వారి విశ్వాసాలు, నమ్మకాలపై అవహేళనతో కూడిన విమర్శలు చెయ్యటం కాదు, వారు కలిగి ఉన్న విశ్వాసాలు, నమ్మకాలు వారి వారి ప్రామాణిక ధార్మిక గ్రంథాలకు అనుకూలంగా ఉన్నాయా? ప్రతికూలంగా ఉన్నాయా? అన్నది వారికి వారి గ్రంథాల నుండి ఉత్తమమైన రీతిలో మర్యాదపూర్వకంగా వివరించినప్పుడే ఆధ్యాతిక వ్యవస్థను సంస్కరించటం సాధ్యపడుతుంది.

మేము అవేమీ నమ్మం! కేవలం మేము వేటాకారాలు, విమర్శలు, వ్యంగస్త్రాలు విసరుకుంటూ సోషల్ మీడియాలో టైమ్ పాస్ చ్యెయ్యటం ద్వారానే మాకు స్వయంతృప్తి లభిస్తుందంటే.. ఆ విధానం వల్ల సమాజంలో మార్పు అన్నది ఎప్పటికీ రాదు. ఆధ్యాత్మిక వ్యవస్థపై నాస్తికులు చేసే విమర్శలన్నీ కేవలం ఎడారిలో పొలికేకల్లా ఎందుకూ పనికి రాకుండా ఎటూ కాకుండా మిగిలిపోతాయి అంతే.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *