మూఢత్వం నుండి నాస్తికత్వం వైపుకు /-

మూఢత్వ మత వ్యవస్థకూ, నాస్తికత్వానికీ మధ్య ధర్మశాస్త్రాల ‘శాస్త్రీయ ధర్మం’ అనేది ఒకటుంది. మతం ఏంటి? ధర్మం ఏంటి? ఈ రెండూ ఒకటి కావా? మతం ఏర్పడిందే దైవత్వపు దృక్పథం నుండి కాదా? మరలా మతాన్ని ధర్మాన్ని వేరువేరుగా చూడటమేంటి? అన్న ప్రశ్నలు ఈ సందర్భంలో ఒకదాని వెంట మరొకటి బయలు దేరిపోతాయి.

మతవ్యవస్థలో మూఢనమ్మకాల్ని వ్యతిరేకించే నాస్తికుల అతిపెద్ద మూఢ నమ్మకం ఏమిటంటే- మూఢ నమ్మకాల్ని వ్యతిరేకించేది ఒక్క నాస్తికత్వమే అన్నది!

వారికి తెలియని అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే- నాస్తికత్వం ఏర్పడటానికి ముందు నుండే ‘ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మం’ మత వ్యవస్థలో మత పండితులు సృష్టించిన మూఢ విశ్వాసాలను, గుడ్డి నమ్మకాలనూ ఖండించటం మొదలెట్టిందన్నది.

నిజానికి “ఈ సృష్టిలో ఏ దేవుడూ లేడు” అన్నమాట నాస్తికుల కంటే ముందే ధర్మం చెప్పింది. ఇస్లాం సద్వచనాన్ని గమనిస్తే.. “లా ఇలాహ ఇల్లల్లాహ్” అన్న వాక్యానికి “ఈ సృష్టిలో ఏ దేవుడూ లేడు” అని అర్థం. అంటే సృష్టిలో పుట్టి చనిపోయే మానవులు, జంతువులు, రాళ్లతో చెక్కబడిన విగ్రహాలు, చెట్లూ, పుట్టలూ ఏవీ దైవాలు కావు, కానీ ఈ సమస్త సృష్టిని ఉనికిలోకి తెచ్చి దాన్ని క్రమబద్ధంగా నడుపుతున్న ఒక సృష్టికర్త మటుకు ఈ సమస్త సృష్టికి అతీతంగా ఉన్నాడు అన్న హేతుబద్ధమైన విషయాన్ని ధార్మిక గ్రంథాల ‘ధర్మం’ వివరిస్తుంది.

ఆ ధర్మంతో సంబంధం లేకుండా ధర్మం ముసుగులో ఉంటూ గుడ్డి నమ్మకాలు, ముఢాచారాలతో బహుదైవారాధన దృక్పథం ఆధారంగా కొందరు స్వార్థ మత పండితులు ఉనికిలోకి తెచ్చిందే ‘మూఢత్వపు మత వ్యవస్థ’.

పటిష్టమైన నియమాలు, గణిత సూత్రాల ఆధారంగా ‘క్రమబద్ధం (Disciplined)’గా నడుపబడే ఒక చైతన్యవంతమైన వ్యవస్థ (System) వెనుక దానిని ఉనికి లోకి తెచ్చి, ఆ వ్యవస్థను అదుపు (Control) చేసే ఒక ‘మాస్టర్ మైండ్’ కచ్చితంగా ఉండాల్సిందే అన్నది అత్యంత హేతుబద్దమైన విషయం. కానీ, అలా ఉండాల్సిన అవసరం లేదు అన్నది మేము హేతువాదులమని చెప్పుకునేవారి హేతువిరుద్ధమైన వాదన.

ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఒక విగ్రహం అందంగా చెక్కబడటం వెనుక ఏ శిల్పీ ఉండాల్సిన అవసరం లేదు, యాక్సిడెంటల్ గా కూడా ఒక అందమైన విగ్రహం దానికదే చెక్కబడిపోతుంది అంటూ హేతువిద్ధంగా వాదించటమే నాస్తికత్వం!

అలాంటి గందరగోళమైన వాదనలు చేసే వారికి ధార్మిక గ్రంథాలు శాస్త్రీయ కోణంలో హేతుబద్ధంగా ఆలోచన చెయ్యమంటున్నాయి. “భూమీ ఆకాశాల గురించి ఆలోచన చేసే వివేకవంతులకు ఎన్నో ‘సూచనలు (Signs)’ ఉన్నాయి” “భూమీ ఆకాశాలలో ఉన్నటువంటి దానిని కళ్లు తెరచి చూసి ఆలోచన చెయ్యండి” అంటూ భూమీ ఆకాశాల నిర్మాణం పట్ల శాస్త్రీయమైన ఆలోచన చెయ్యమని ఆహ్వానిస్తుంది ఏ నాస్తిక సంఘ సభ్యులో కాదు, కానీ ఈ వాక్యాలు నిజానికి ఖురాన్ గ్రంథంలోనివి.

“భూమిపై తిరగండి ఆయన సృష్టిని ఏ విధంగా ప్రారంభించాడో చూడండి (29:20)” అంటూ సృష్టిని శాస్త్రీయ కోణంలో పరిశీలించి ఈ సృష్టిలో ఉన్నవాటిని గుడ్డిగా పూజించెయ్యకుండా ఈ సృష్టికి అతీతంగా ఒక సృష్టికర్త ఉన్నాడన్న హేతుబద్ధమైన విషయాన్ని ఆలోచించి తెలుసుకోమని ఖురాన్ చెబుతుంది.

నాస్తికుల వాదన!

“ఆస్తికులని చెప్పుకునే మీలోనే ఒకడు రాముడు దేవుడంటాడు, ఒకడు సాయిబాబా దేవుడంటాడు, మరొకడు యేసు దేవుడంటాడు ఇంకొకడు ఎవర్నో దేవుడని పూజిస్తుంటాడు! ఒకడు విగ్రహాన్ని పూజిస్తుంటాడు మరొకడు చెట్లను, పుట్లను దేన్ని పడితే దాన్ని పూజిస్తుంటాడు. మీలోమీకే దేవుడెవరో క్లారిటీ లేదు పైగా మీరు ఈ సృష్టికి ఒక దేవుడున్నాడని వాదిస్తుంటారు. నిజానికి మీరు దేవుళ్లంటూ ఎవరినైతే/వేటినైతే పూజిస్తున్నారో వారెవరూ/ఏవీ దైవాలు కావు. కాబట్టి ఆ సృష్టికి ఏ దేవుడూ లేడు” అన్నది అనేక సందర్భాల్లో నాస్తికులు చేసే వాదన.

నాస్తికుల కంటే ముందే ధర్మం ఖండించింది!

నిజానికి ఈ వాదన నాస్తికుల కంటే ముందే ధార్మిక గ్రంథాలు ఖండించటం మొదలెట్టాయని చెప్పవచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదు! రాముడైనా, కృష్ణుడైనా, యేసైనా, ముహమ్మద్ అయినా లేక మనుషులుగా పుట్టిన మహనీయులెవరైనా దేవుళ్లో, దేవుని అవతారాలో కారని వారంతా సృష్టికర్తను అనేక పేర్లతో పరిచయం చేసిన మహనీయులని, వారిని గౌరవించమని, అనుసరించమని ధర్మం చెబుతుంది. సృష్టిలో ఉన్న మహనీయుల్ని, చెట్లు, పుట్టలు, రాళ్లు, రప్పలకు దైవత్వం ఆపాదించి పూజించవద్దని వారిస్తుంది. సృష్టికర్తను మూఢ విశ్వాసాలు, గుడ్డి నమ్మకాలతో కాక, శాస్త్రీయంగా పరిశీలించి, బుద్ధిని ఉపయోగించి గ్రహించమంటుంది.

పుట్టి చనిపోయే మానవులు, జంతువులు, రాళ్లతో చెక్కబడిన విగ్రహాలు, చెట్లూ, పుట్టల్నీ ఆరాధన చేసే వారంతా ఆస్తికులన్నది మతవ్యవస్థను వ్యతిరేకించే నాస్తికుల భావన. నిజానికి అలాంటి సృష్టి ఆరాధకులను లేదా బహుదైవారాధకులను ధార్మిక గ్రంథాలే ‘ఆజ్ఞానులు’ అని ముద్ర వేస్తున్నాయి.

వాస్తు, తాయెత్తులు, క్షుద్రపూజలు, భూతవైద్యాలు, జాతకాలు, నిమ్మకాయలు, మిరపకాయలు, కొబ్బరికాయలు, నెల్లూరు రొట్టెలు, సిలువ-విగ్రహ-సమాధి పూజల ద్వారా లాభ-నష్టాలు కలుగుతాయన్న కొందరి మూఢనమ్మకాలకూ ధార్మిక గ్రంథాలు నిర్దేశిస్తున్న నిజ ఆధ్యాత్మికతకు సంబంధం లేదు. కానీ నాస్తికులు ఆయా ముఢాచారాలనూ, ధర్మ శాస్త్రాల్నీ ఒకే గాటన కట్టి విమర్శిస్తూ స్వయంతృప్తి చెందుతూ ఉంటారు.

ఈ సృష్టిలో ఒక్క సృష్టికర్తకు తప్ప పుణ్యపురుషులకైనా, వారి విగ్రహాలకైనా, వారి సమాధులకైనా, స్వాములు, బాబాలకైనా, తాయెత్తులకైనా, నిమ్మకాయలు, కొబ్బరికాయలు వగైరా దేనికైనా సరే లాభ-నష్టాలను కలుగజేసే దైవత్వపు శక్తి ఎవరికీ/దేనికీ లేదని ధార్మిక గ్రంథాల ‘ధర్మం’ చెబుతుంది. సృష్టిలో దేనికైనా/ఎవరికైనా లాభనష్టాలను కలుగజేసే శక్తి ఉందని నమ్మటం, వాటి/వారి పట్ల భక్తి భావం కలిగి ఉండటం, వాటిని పూజించటాన్నే ధార్మిక గ్రంథాలు మూఢ నమ్మకాలుగా, బహుదైవారాధనగా పరిగణిస్తున్నాయి.

అలాంటి అజ్ఞానపు పోకడలను అనుసరిస్తూ మత వ్యవస్థలో మూఢనమ్మకాలను కలిగి ఉండేవారిని సంస్కరించటం నిమిత్తమే ధార్మిక గ్రంథాలు అవతరించాయి. ఈ విషయం నాస్తికులకు తెలియదు. వారికి తెలిసిందల్లా మత వ్యవస్థలో మూఢ నమ్మకాలను వదిలిపెడితే చాలు చక్కగా నాస్తికులుగా మారిపోవచ్చన్నదే.
కానీ, మత వ్యవస్థలో మూఢనమ్మకాలను వదిలి పెట్టి నాస్తికులుగా మారిపోయి బోడిగా మిగిలికుండా హేతుబద్ధంగా ఆలోచన చేసే నిజ ధార్మికులుగా మారవచ్చని ధార్మిక గ్రంథాల ‘ధర్మం’ చెబుతుంది.


నాస్తికత్వానికీ, ధార్మిక గ్రంథాల ధర్మానికి మధ్య ఉన్న తేడా ఏమిటంటే నాస్తికత్వం కేవలం మూఢ నమ్మకాలను, ఆచారాలను కేవలం ఖండించగలుగుతుంది అంతే. ధర్మం కేవలం వాటిని ఖండించటమే కాదు, ‘వాస్తవ దైవ భావన’ ఏమిటన్నది కూడా వివరిస్తుంది.

నాస్తికులు మత వ్యవస్థలో లోపాల్ని ఎత్తి చూపుతూ కేవలం హేళన మాత్రమే చెయ్యగలుగుతారు తప్ప ఏది కరెక్టో ఎప్పటికీ చెప్పలేరు. కారణం నాస్తికుల వద్ద తప్పుల్ని ఎత్తి చూపటం, వెకిలి తనంగా మాట్లాడటం, వ్యంగ వక్రమైన వెటకారాలు చెయ్యటం తప్ప మనిషి ఉత్తమోత్తమ నైతిక, ఆధ్యాత్మిక-మానవతా విలువలతో జీవించటానికి కావలసిన సంపూర్ణ జీవన విధానాన్ని నిర్దేశించే సూత్రాలు వారికి తెలియవు, వారి వద్ద ఉండవు కాబట్టి.

నిజ ఆస్తికులు-నకిలీ ఆస్తికులు!

ఆస్తికుల్లోనే ధర్మాన్ని హేతుబద్దమైన ఆలోచనలతో అనుసరించే ‘నిజ ఆస్తికులు’ మరియు మత వ్యవస్థలో మూఢనమ్మకాల్ని అనుసరించే ‘నకిలీ ఆస్తికులు’ అంటూ రెండు రకాల ఆస్తికులు ఉన్నారు! ఇది ఆస్తికులే కాక నాస్తికులు సైతం గమనించాల్సిన విషయం.

మత వ్యవస్థలోని ముఢాచారాలు, గుడ్డి నమ్మకాలకు కారణమే ధార్మిక గ్రంథాలన్నది చాలా మంది నాస్తికులు కలిగి ఉండే మూఢ నమ్మకాన్ని ముందుగా విడిచి పెట్టాలి. శ్రమించకుండా ప్రజల డబ్బును తమ జేబుల్లోకి రప్పించుకొటానికి కొందరు తయారు చేసుకున్న మూఢత్వ మత వ్యవస్థకూ, వారి మూఢత్వ పోకడల్ని ఖండిస్తున్న ధార్మిక గ్రంథాల ధర్మానికీ మధ్య ఉన్న సున్నితమైన బేధాన్ని నాస్తికులు ముఖ్యంగా ఆధునిక యువత గుర్తించాలి.

మత వ్యవస్థలోని ముఢాచారాలు, గుడ్డి నమ్మకాలను చూసి వెగటుగా భావించే ఆధునిక యువత తక్షణం నాస్తికత్వంలోకి దూకెయ్యకుండా… నాస్తికత్వానికీ మూఢత్వ మత వ్యవస్థకూ మధ్య ‘ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మం’ అన్నది కూడా ఒకటుందని, అది మత వ్యవస్థలోని ముఢాచారాలు, గుడ్డి నమ్మకాలను నాస్తికుల కంటే ముందు నుండే ఖండించటం మొదలెట్టిందన్న విషయాన్ని తెలుసుకోవటమే కాక, వాస్తవంగా ఒక వ్యక్తి ఎలాంటి హేతుబద్ధమైన ఆలోచనలు కలిగి ఉండాలో కూడా ధార్మిక గ్రంథాల ధర్మం నిర్దేశిస్తుందన్న వాస్తవాన్ని తెలుసుకుని దానిని అధ్యయనం చెయ్యాలి.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *