అవును, ఆలోచించాల్సిన ప్రశ్న కదా! నాస్తికులు ఎలా ఏర్పడ్డారు? కొన్ని మత విశ్వాసాలు కలిగుండటాన్ని బట్టో కొందరు మహనీయులను అనుసరించటాన్ని బట్టో హిందువులు, క్రైస్తవులు, ముస్లిములు ఇతర మత వర్గాలు ఏర్పడ్డాయన్నది మనందరికీ తెలిసిందే!
మరి ఈ నాస్తిక వర్గం ఎలా ఏర్పడింది?
ఈ ప్రశ్న ఏ మతస్తుణ్ణి అడిగినా అతను ఠక్కున చెప్పే సమాధానం “ఏముందీ! దేవుణ్ణి గానీ, ఏ మతాచారాల్నీ నమ్మనోళ్లంతా నాస్తికులుగా తయారయ్యారు అనే కదా.
కానీ, అది తప్పు! నాస్తికులు స్వతహాగా తయారు కాలేదు. వారిని ఆ విధంగా కొందరు మార్చేశారు. కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ!..
దీన్ని గుర్తుపెట్టుకోండి తరువాత మాట్లాడదాం.
*****
సరే, మీరు నాస్తికులుగా ఎలా తయారయ్యారు అని నాస్తికులను ప్రశ్నిస్తే వారు ఇచ్చే సమాధానం ఏంటో చూద్దాం.
“మేము బుద్ధిని ఉపయోగిస్తాం! దేన్నీ గుడ్డిగా నమ్మేయం. కనపడని దేవుణ్ణి మీరు ఉన్నాడు అని చెప్పినంత మాత్రానా మేము చూడకుండానే గుడ్డిగా నమ్మేయటం జరగదు. మతం మనుషులను బుద్ధిహీనులుగా తయారు చేస్తుంది. లేని దేవుణ్ణి ఉన్నట్టు ఊహించుకుని ఆయన ఫోటోల్నీ, విగ్రహాల్నీ తయారు చేసుకుని, కొన్ని గుడ్డి నమ్మకాల ఆధారంగా ప్రజలు తయారు చేసుకున్నదే మత వ్యవస్థ. కాబట్టి మేము దేవుడు, మతవిశ్వాసాలు వగైరా గుడ్డి నమ్మకాలు కాకుండా హేతుబద్దంగా ఆలోచిస్తాం కాబట్టి మేము నాస్తికులుగా మారాం”
అనే కదా చెబుతారు. ఇక్కడ అతి ముఖ్యంగా గమనించాల్సింది మూఢ విశ్వాసాలు, గుడ్డి నమ్మకాలు కలిగుండేటోళ్లు నాస్తికులనబడతారో లేదో ప్రక్కన పెడితే, ముందు అలాంటి మూఢ విశ్వాసాలు, గుడ్డి నమ్మకాలు కలిగుండేటోళ్లు నిజమైన ఆస్తికులైతే కాలేరు.
ఇది నాస్తికులకు కాస్త ఆశ్చర్యం కలిగించవచ్చు. ఎందుకంటే మూఢ విశ్వాసాలు, గుడ్డి నమ్మకాల్నీ కలిగుండేటోళ్లంతా ‘ఆస్తికులు’ అన్నది నాస్తికులు కలిగి ఉండే ఓ పెద్ద గుడ్డి నమ్మకం!
ఇక్కడ నాస్తికులకు తెలీని విషయం ఏమిటంటే… కొందరు స్వార్థపరులైన మత పండితులు స్వయంగా కొన్ని మూఢ విశ్వాసాలు, గుడ్డి నమ్మకాల్నీ కల్పించి ప్రజలను దోచుకోటానికి ఒక మతవ్యవస్థను తయారు చేసుకుని వారిని భ్రష్టుపట్టించే సందర్భాలలో ప్రజల్ని హేతుబద్ధమైన విశ్వాసాల వైపునకు మరల్చటానికి అవతరించినవే ధార్మిక గ్రంథాలు. ఆయా గ్రంథాల ఆధారంగా ప్రజల్ని మూఢ విశ్వాసాల నుండి శాస్త్రీయ ఆలోచనా వైపునకు నడిపించటానికి ఎన్నోకోబడిన వారే దైవ ప్రవక్తలు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే అనేక కాలాల్లో పంపబడ్డ ఆ దైవ ప్రవక్తలంతా ప్రజల్ని కొందరు పండితులు కల్పించిన మూఢ నమ్మకాలు, గుడ్డి విశ్వాసాల నుండి తప్పించి హేతుబద్దమైన ఆలోచనా విధానం పై నడిపేవారు.
సరే, బాగానే ఉంది! ఇంతకూ నాస్తికులు ఎలా తయారయ్యారు? అనే ప్రశ్న పెండింగ్ లో ఉంది కదా! అది గమనించే ముందు తెలుసుకోవలసిన ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది.
అదేమిటంటే…
నాస్తికులను ధార్మిక గ్రంథాలు ‘బుద్ధి హీనులు’ అని చెబుతున్నాయి!
ఈ మాట వినగానే నాస్తికులు తల గోడకు బాదేసుకుని మరీ నవ్వేసుకోవచ్చు! ఇప్పుడు మనం ‘బుద్ధిని ఉపయోగించేవారు బుద్ధిమంతులు, అలాగే బుద్ధిని ఉపయోగించలేని వారు బుద్ధిహీనులు’ అన్న సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని బైబిల్లోని ఈ క్రింది వాక్యాన్ని మనం ఒకసారి గమనించాల్సి ఉంటుంది.
“దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు… వివేకము కలిగి దేవుని వెదకువారు కాలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను” – కీర్తనలు 53:1,2
పై వాక్యాన్ని బట్టి.. సృష్టికర్త లేడని ఊహించుకునేవారు ‘బుద్ధిహీనులు’ అని అర్థమవుతుంది. అసలు సృష్టికర్త అనేవాడు ఉన్నాడా? అన్న ప్రశ్నవేసుకుని కాస్త తెలివి ఉపయోగించి పరిశీలన చేసేవారు ‘బుద్ధిమంతులు’ అన్న విషయం స్పష్టమవుతుంది. కనీస ఆలోచన చెయ్యనివారు బుద్ధిహీనులన్న విషయం ఖురాన్ సైతం ఈ క్రింది విధంగా తెలియజేస్తుంది.
“భూమీ ఆకాశాల చింతన చేసే బుద్ధిమంతులకు సృష్టిలో ఎన్నో సూచనలు ఉన్నాయి (3:190)” “భూమీ ఆకాశాలలో ఎన్నో సూచనలు ఉన్నప్పటికీ వారు చూస్తూ ఉండిపోతారు. కొంచెమైనా ఆలోచించరు (12:105)”
అయితే ప్రస్తుతం ఉన్నది డూప్లికేట్ నాస్తికులా?
“మేము మూఢ విశ్వాసాలు, గుడ్డి నమ్మకాల్నీ కలిగి ఉండము, సృష్టికర్త అనేవాడు ఉన్నాడా లేడా? అన్నది ఇంకా మాకు తేల లేదు కాబట్టి మేము నాస్తికులం” అని చెప్పుకోవటంలో తప్పులేదు. కానీ, అసలు ఈ సృష్టికి ఒక ‘కర్త (Creator)’ అంటూ ఉన్నాడో లేడో అన్న విషయం గురించి మేము కనీస ఆలోచన కూడా చెయ్యము, ఆ విషయంపై ఎవరితోనూ చర్చ కూడా చెయ్యం అనేవారినే ‘డూప్లికేట్ నాస్తికులు’ అనటంలో తప్పులేదు. అలాంటి నాస్తికుల్నే ధార్మిక గ్రంథాలు ‘బుద్ధిహీనులు’ అని చెబుతున్నాయి.
సింపుల్ గా చెప్పాలంటే.. ఒక ఫ్యాక్టరీ తయారవ్వటం వెనుక ఒక ఇంజినీర్ ఉంటే నిరూపించమనటం బుద్ధి లేని ప్రశ్న అవుతుంది. ఒక నిర్ధిష్టమైన క్రమం, క్రమబద్ధత, పటిష్టమైన సూత్రాల ఆధారంగా ఏదైనా ఒక వ్యవస్థ చైతన్యవంతంగా నడుపబడుతుందంటే ఆ వ్యవస్థను డిజైన్ చేసి, తయారు చేసినవాడు (అతన్ని కళ్లతో చూడకపోయినా) కచ్చితంగా ఒకడుంటాడు అన్నది బుద్ధి చెప్పే విషయం. ఈ బుద్ధినే ధార్మిక గ్రంథాలు ఉపయోగించమంటున్నది.
ఏ దేవుడూ లేడన్నదే ఇస్లాంలో ‘సద్వచనం’ చెబుతుంది!
“లాయిలాహ ఇల్లల్లాహ్” అంటే ఈ సృష్టికి “ఏ దేవుడూ లేడు” అన్నదే ఇస్లాంలో చదువబడే సద్వచనం (కలిమ) తాలూకు మొదటి భాగం చెబుతుంది. ఆ తరువాత “ఇల్లల్లాహ్ (ఒక్క సృష్టికర్త తప్ప)” అనే రెండవ భాగంతో అది పూర్తవుతుంది.
అంటే ‘ప్రజలు కల్పించున్న ఏ దేవుడూ ఈ విశ్వాన్ని తయారు చెయ్యలేదు ఒక్క సృష్టికర్త తప్ప’ అన్న హేతుబద్దమైన విషయాన్నే ధార్మిక గ్రంథాల ‘శాస్త్రీయ ధర్మం’ చెబుతుంది.
“వారు సృష్టికర్త లేకుండానే తామంతట తామే పుట్టారా? లేక వారు తమకు తామే సృష్టికర్తలా? లేక వారు భూమినీ, ఆకాశాలను సృష్టించారా? (52:35)” అని ప్రశ్నిస్తూ పైకి నాస్తికులమని పేరుపెట్టుకుని మేము హేతువాదులమని చెప్పుకుంటున్నవారి ఆలోచనల్లోని డొల్లతనాన్ని ఖురాన్ ఎత్తి చూపుతుంది.
ఆయన మీ మేలు కోసం రాత్రినీ, పగలునూ సూర్యుణ్ణీ, చంద్రుణ్ణి మీకు వశపరిచాడు. నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞ వల్లే మీకు వశమై ఉన్నాయి. బుద్ధిని ఉపయోగించేవారి కొరకు ఇందులో చాలా సూచనలు ఉన్నాయి” – 16:12
“భూమీ ఆకాశాలలో ఉన్నటువంటి దానిని కళ్లు తెరచి చూడండి. అసలు విశ్వసించటానికే ఇష్టపడని వారికి సూచనలు గానీ, హెచ్చరికలు గానీ ఎలా ఉపయోగపడతాయి” – 10:101
అంటూ విశ్వవ్యవస్థను కనీస పరిశీలన చెయ్యని బుద్ధిహీనుల్ని బుద్ధిని ఉపయోగించాల్సిందిగా ఖురాన్ ఆహ్వానిస్తుంది. దీనికి రివర్సులో నేటి అభినవ సోకాల్డ్ నాస్తికులు మత గ్రంథాలు మనిషి ఆలోచనల్ని లాక్ చేసేస్తున్నాయని తెగ గోల పెడుతుంటారు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే “దేవుడనే వాడు ఉంటే మాకు కనపడాలి కదా!” అని చెప్పేవారంతా “బుద్ధి ఉపయోగించని నకిలీ నాస్తికులు” అని చెప్పవచ్చు. “ఇప్పటివరకు మాకు దేవుడనేవాడు ఉన్నాడో లేడో ఇంకా తేలలేదు కానీ మేము ఆలోచన చేసి మా పరిశీలనలో దేవుడు ఉన్నాడు అని తేలితే అప్పుడు అంగీకరిస్తాం” అని చెప్పి హేతుబద్దంగా ఆలోచన చేసేవారు నిజమైన నాస్తికులు అనబడతారు.
ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న నాస్తికులు ఎలా తయారయారన్న పాయింట్ దగ్గరకు వద్దాం. నాస్తికులు స్వతహాగా తయారు కాలేదు. వారిని ఆ విధంగా కొందరు మార్చేశారని పైన మనం చెప్పుకున్నాం.
అవును! నాస్తికులుగా మారుతున్న వారిలో నూటికి నూరుశాతం మంది అలా మార్చబడ్డవారనే చెప్పాలి. వారిని అలా తయారు చేసింది/చేస్తున్నది ఎవరో కాదు. మత వ్యవస్థలో ధార్మిక గ్రంథాల్ని ప్రక్కనపెట్టేసి, మూఢ నమ్మకాల్ని అనుసరిస్తున్న ‘డూప్లికేట్ ఆస్తికులే’.
ఆస్తికులంతా కూడా ఒక్కటి కాదు! ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇక్కడ ముఖ్యంగా ఆస్తికులు, నాస్తికులు తెలుసుకోవలసిన విషయం- ధార్మిక గ్రంథాల ధర్మాన్ని అర్థం చేసుకుని ఈ విశ్వానికి ‘ఒకే సృష్టికర్త ఉన్నాడు’ అన్న హేతుబద్ధమైన ఆలోచన కలిగిన వారంతా ‘హేతుబద్ధమైన ఆస్తికులు’ అనబడతారు. మా తాత ముత్తాతల కాలం నుండి ఫలానా దేవీదేవతల్ని ఆరాధిస్తున్నారు కాబట్టి మాక్కూడా వారే దేవుళ్లనో లేక ఎవరో ఏదో చెప్పారనో స్వంత బ్రేయిన్ ఉపయోగించటం మానేసి దేన్నిపడితే దాన్ని పూజించేసే గుడ్డి విశ్వాసులను ‘డూప్లికేట్ ఆస్తికులు’ అంటారన్న మాట.
ఈ ‘డూప్లికేట్ ఆస్తికులు’ తయారు చేసుకున్న కొన్ని గుడ్డి నమ్మకాల్ని, వారు ఆచారవ్యవహారాల్ని చూసి చికాకెత్తిపోయి కనీసం లాజిగ్గా ఆలోచన చేసే ఆధునీకులు మొత్తానికి ఆధ్యాత్మిక వ్యవస్థకే దూరమైపోయారు.
ఒక రకంగా చెప్పాలంటే దీనికి బీజం పడింది ఒకనాటి యూరప్ లో అని చెప్పవచ్చు. గ్రీకు పురాణాలకు, కట్టు కథలకు మతం రంగు పులిమి వాటి ఆధారంగా రాజరిక వ్యవస్థను నడిపిన ఒకనాటి యూరప్ చర్చీ వ్యవస్థ అప్పటి ఆధునీకుల్ని మొత్తానికి ఆధ్యాత్మిక వ్యవస్థ నుండి దూరం చేసేసింది. కొన్ని గుడ్డి నమ్మకాల్ని మతంలోని అంశాలుగా చిత్రీకరించిన చర్చీ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడిన శాస్త్రవేత్తలను శారీరక హింసలకు గురిచెయ్యటం, కేవలం భూమి గోళాకారంలో ఉందని చెప్పిన వారిని సజీవ దహనం చెయ్యటం ఆనాటి ఆధునికులకు ఆధ్యాత్మిక వ్యవస్థపై ఏవగింపు కలిగేలా చేసింది. చివరకు వారిని నాస్తికులుగా మార్చేసింది.
ఆ విధంగా నాస్తికులను తయారు చేసింది ఎవరో కాదు.. మత వ్యవస్థలో లాజిగ్గా ధర్మాన్ని అర్థం చేసుకోకుండా గుడ్డిగా వ్యవహరించే నకిలీ ఆస్తికులే!
వీరి చేష్టలకు నాస్తికులు ఎంతగా విసుగెత్తిపోయారంటే… సృష్టికర్త గురించి ఆలోచన చేస్తే మళ్లీ మేము ఎక్కడ వీరి మూఢత్వ మత వ్యవస్థకు దగ్గరవుతామో అన్న సందేహంతో సృష్టికర్త గురించి కనీస హేతుబద్ధమైన ఆలోచనల్ని సైతం ఆహ్వానించటానికి సిద్ధపడలేనంత కరుడు కట్టిన నాస్తికులుగా మారిపోయారు.
ఇప్పుడు ఒకవేళ హేతుబద్ధంగా ఆలోచన చేసే ఆస్తికులు ఎవరైనా ఉంటే వారు చెయ్యాల్సిందల్లా…
కాస్త ధార్మిక గ్రంథాల్లో ఉన్న నిజమైన ధర్మాన్ని అర్థం చేసుకుని ప్రజలకు పరిచయం చెయ్యటానికి ప్రయత్నించే విషయంలో నిద్రపోకుండా ఉండాలి.
హేతుబద్ధంగా ఆలోచన చేసే నాస్తికులు పై విషయాల పట్ల కాస్త లోతుగా ఆలోచన చెయ్యాలి.
నాస్తికులు ఎలా ఏర్పడ్డారు? /-
