మతం మనుషుల్ని చంపటం నేర్పుతుందా!?

మతం మనుషుల్ని తీవ్రవాదులుగా తయారు చేస్తుంది, చంపటం నేర్పుతుంది అన్న నేటి కొందరి ఆధునిక విద్యావంతుల, అభినవ నాస్తికుల ఊహే నిజమైతే బహుశా ఈపాటికి భూమిపై చెట్లు, జంతువులు తప్ప మనిషి తాలూకు ఆనవాలు కూడా మిగలకుండా పోయేదేమో!

మరి మతం పేరుతో చంపున్నది ఎవరు? మతావలంబీకులు కారా?

ఎంత మాత్రం కారు! మత ఉన్మాదం నెత్తికెక్కినవారు.

వారు ఏ మతంలో ఉంటారు?

అన్ని మతాల్లోనూ ఉంటారు!

వారినే మతోన్మాదులు అంటారు.

అసలు మతం ఉండబట్టే కదా మనుషులు మతోన్మాదులు మారుతుంది. మతమన్నదే లేనప్పుడు అసలు మతోన్మాదులు తయారవటానికి, మారణహోమాలకు ఇక ఆస్కారమే ఉండదు కదా!

మనిషి ఉన్మాదిగా మారటానికి, మారణహోమం జరిపి జనాల్ని చంపటానికి మతమే ఉండాల్సిన పనిలేదు. కాస్సేపు మనిషి ఒక్క మతం కారణంగానే ఉన్మాదిగా మారతాడు అనుకుందాం. అలా అయితే చరిత్రలో జరిగిన మారణహోమాలన్నీ కేవలం మతం ప్రాతిపదిక మీదనే జరిగి ఉండాలి కదా.

చరిత్రలో యుద్ధాలన్నిటికీ “మతమే” కారణమా?

చరిత్రలో జరిగిన యుద్ధాలకూ, మారణహోమాలన్నిటికీ కారణం మతమే! మతమే మనుషుల్ని మృగాలుగా, తీవ్రవాదులుగా తయారు చేస్తుంది అంటూ బలంగా బల్ల గుద్ది మరీ వాదించే చాలా మంది నాస్తికులకు తెలీని విషయం…

చరిత్రలో జరిగిన మొత్తం యుద్ధాలల్లో మతం కారణంగా జరిగినవి కేవలం 6.89% మాత్రమే. తప్పితే నాస్తికులు ఊహించుకుంటున్నట్లు నూటికి నూరు శాతం మతమే అన్ని యుద్ధాలకూ కారణం కాదు!

అది తెలుసుకోవాలంటే చరిత్రలో జరిగిన మొత్తం యుద్ధాలు, వాటి కారణాలను వివరిస్తూ రాయబడిన “ఎన్సైక్లోపీడియా ఆఫ్ వార్స్ (Encyclopedia of wars)” అనే పుస్తకం చదవాలి. దాని ప్రకారం చరిత్రలో (8000 BCE నుండి 2003 ఇరాఖ్ యుద్ధం వరకు) మొత్తం 1763 యుద్ధాలు జరగగా, వాటిలో మతం కారణంగా జరిగిన యుద్ధాలు 123 మాత్రమే! మిగతావన్నీ అధికారం, రాజకీయ, ఆర్థిక లబ్ది కోసం జరిగిన యుద్ధాలే అంట!

ఈ పుస్తకంతో పాటు – “ద గ్రేట్ బిగ్ బుక్ ఆఫ్ హారిబుల్ థింగ్స్: ది ద డెఫినిటివ్ క్రానికల్ ఆఫ్ 100 వరస్ట్ అట్రాసిటీస్ (The Great Big Book of Horrible Things: The Definitive Chronicle of History’s 100 Worst Atrocities)” అనే మరొక ప్రముఖ పుస్తకం- చరిత్రలో జరిగిన 100 దారుణమైన మారణ హోమాల్లో 11 మాత్రమే మతం కారణంగా జరిగాయని తేల్చి చెప్పటం జరిగింది.

***

మరి నాస్తిక దేశాల్లో జరిగిన మారణహోమాలకు కారణం “మతమా”?

చరిత్రలో జరిగిన సకల మారణహోమాలన్నీ మతం పేరుమీదనే జరిగాయని వాదించే నాస్తికులకు సైతం అవగాహన లేని విషయం ఒక్క 20 వ శతాబ్దంలో జరిగిన జనహననాల్లో 160 మిలియన్ల మంది చంపబడితే అందులో దాదాపు 100 మిలియన్ల మంది చంపడింది కమూనిస్ట్ రాజ్యాలైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ రష్యా మరియు చైనాల్లో జరిగిన జనహననాల్లోనే అన్నది. ఈ విషయం ఎంత మంది నాస్తికులకు తెలుసు?

గత వందేళ్లలో కమూనిస్ట్ రాజ్యాలు 100 మిలియన్ల మందిని చంపాయన్నది. “ద బ్లాక్ బుక్ ఆఫ్ కమ్యూనిజం” పుస్తకం చదివిన వారికి ఈ విషయం ఎరుకే! నాస్తిక దేశాల్లో జరిగిన ఈ దౌర్జన్యాలకు కారకులు ఎవరో మత ఉన్మాదులు కారు స్టాలిన్, లెనిన్, మావో వంటి వారే. చరిత్రలో అతిపెద్ద జనహననాలు సాగించిన హిట్లర్, సోవియట్ నియంత జోసెఫ్ స్టాలిన్ల కంటే మావో అధిగమించాడు. 1958 – 62 సం.ల మధ్య మావో జెడాంగ్ ప్రవేశ పెట్టిన “గ్రేట్ లీప్ ఫార్వర్డ్ పాలసీ” కారణంగా చైనాలో 45 మిలియన్ల మంది చంపబడ్డారన్న విషయం ఎంత మందికి తెలుసు? ఇది చరిత్రలో నమోదైన మరియు మరుగుపరచబడిన అతిపెద్ద జనహననం. ఇది గత వందేళ్లలో కమ్యూనిజం సాగించిన టెర్రరిజం అనటంలో తప్పులేదేమో?

అహింసా మార్గాన్ని ఒక్క బుద్ధిజం తప్ప ఏ మతమూ బోధించదు” అంటూ కొందరు నాస్తికులు తీర్మానం చేస్తుంటారు. మయన్మార్ లో బౌద్ధులు వేల మంది రోహింగ్యాలను దారుణంగా చంపటం టెర్రరిజం కాదా? మయన్మార్ లో ముస్లిములకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే “ఆశిన్ విరాటు”ను టైమ్ మేగజైన్ “ఫేస్ ఆఫ్ బుద్దిస్ట్ టెర్రర్” అని పేర్కొంది. ఇతన్ని “బుద్దిస్ట్ బిన్ లాడెన్” అన్న మరొక పేరు కూడా ఉంది.

ప్రతీ మతవర్గంలోనూ ఉండే కొందరు మూర్ఖులను బట్టి ఆయా మతాలు తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తుంటాయని చెప్పటం కూడా కరక్టే అనుకుంటే కొందరు బుద్ధిస్టులు సాగించిన మారణహోమాలను బట్టి బుద్ధిజం సైతం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని తీర్మానించటం కరక్టే అవుతుంది. “అబ్బే! ఎవరో కొందరు మూర్ఖుల్ని బట్టి బుద్దిజాన్ని తప్పుపట్టం ఎంతమాత్రం కరక్టు కాదు” అంటే అప్పుడు ప్రతీ మతవర్గంలోనూ ఉండే కొందరు మూర్ఖులను బట్టి ఆయా మతాల్ని, వారి ధార్మిక గ్రంథాల్ని తప్పు పట్టటం కూడా మరింత తప్పవుతుందన్న విషయం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.

దీనిని బట్టి “ఉన్మాదం” అన్న జబ్బు మనుషుల్లో కలగటానికి, మారణహోమాలు సాగించటానికి మతమే ప్రాతిపదిక కానవసరం లేదు. చరిత్రలో జరిగిన మొత్తం యుద్ధాల్లో 6.89% మతం కారణమైతే మిగిలిన 93.11% యుద్ధాలకు కారణం మతం కారణం కాదు.

ఏ మతమైనా మానవులందర్నీ సమానంగా చూడమని, వారి మధ్య ఉచ్చనీచ బేధభావాలు చూపవద్దని, తోటిమానవుల్ని ప్రేమించమని, జీవహింస చెయ్యవద్దని, తలిదండ్రుల్ని గౌరవించమని, బీదసాదల్ని ఆదుకోమని, ఒక్క సృష్టికర్తను మాత్రమే ఆరాధించమనే చెబుతుంది.

ఈ విషయాలు అవగాహన లేక.. నా మతమే గొప్ప ఎదుటి మతాలన్నీ నశించిపోవాలి అనే శాడిస్ట్ భావాలుండే కొందరుంటారు. ఇలాంటి శాడిస్టులు ప్రతీ మతవర్గంలోనూ కొందరుంటారు. వారినే తెలుగులో “మతోన్మాదులు” అంటారు. అసలు మొత్తం సమస్యంతా ఆ కొందరితోనే.

ఏ మతవర్గాన్ని తీసుకున్నా వారి సంఖ్య 1% సైతం మించి ఉండదు. కానీ ఈ 1% మూర్ఖులని బట్టి మతం మనుషుల్ని తీవ్రవాదులుగా మారుస్తుందని కొందరు నాస్తికులు స్వంత తీర్మానాలు చేస్తుంటారు.

నూపుర్ శర్మ ప్రవక్త ముహమ్మద్(స) వారి గురించి హేళనగా మాట్లాడిందని ఆమె మాటల్ని ఖండించిన ముస్లిములే.. ఆమె మాటలను బట్టి రెచ్చిపోయి ఉదయ్ పూర్ లో ముస్లిం వేషాలు ధరించి ఓ ముస్లిమేతరుణ్ణి హత్య చేసిన ఆ ఇద్దరు మూర్ఖులు చేసిన నేరాన్ని కూడా అంతే గట్టిగా ఖండించారు. పైగా ఇస్లాం అలాంటి చర్యలకు వ్యతిరేకమని ఏకగ్రీవంగా నినదించారు. తప్పితే వారు చేసింది కరక్టే అని ఏ ముస్లిమూ చెప్పలేదు.

బాధాకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి కొందరు చేసే పనుల వల్ల ఇస్లాం తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని, మతం మనుషుల్ని చంపటం నేర్పుతుందని ఎలాపడితే అలా తీర్మానాలు చేసేవారు బయలుదేరుతుంటారు.

ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల మంది ముస్లిములు ఇస్లాంను అవలంబిస్తుంటే.. అందులో 1% కూడా ఉండని ఆ కొందరు మూర్ఖులను బట్టి ఇస్లాం తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని ఎలా తీర్మానిస్తారు?

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 750 కోట్ల మందిలో సుమారు 90% మంది ఆస్తికులే ఉన్నప్పుడు మతం మనుషుల్ని చంపటం నేర్పుతుందని ఎలా నిర్ధారిస్తారు? ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చే ముందు వీరు కనీసం బుద్ధిని ఉపయోగించరా? అన్న సందేహం మాటిమాటికీ కలుగుతుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *