మతం పేరుతో మనిషి ప్రమాదంలో ఉండడు! /-

ఓ రెండు మంచి విషయాలు చెబుతూ వాటితో పాటు అర్థం పర్థం లేని తమ స్వంత భావాల్ని కూడా ఇరికించేసి ప్రచారం చేసినప్పుడు అది కూడా మంచి విషయాలతో పాటు ప్రజల్లో చొచ్చుకుపోయే ప్రమాదం ఉంది! ఈ రకమైన టెక్నిక్ నే “వ్యూవ్స్ ఇన్ న్యూస్” అంటారన్న మాట!

ఏ మతమూ ప్రమాదంలో ఎప్పుడూ ఉండదు! అలాగే మతం పేరుతో మనిషి కూడా ప్రమాదంలో ఉండడు! మతాలపై చికాకుపుట్టి నాస్తికులుగా మారిపోయినవారికి ఇలాంటి స్టేట్మెంట్లు చదివినప్పుడు మనసుకు తృప్తిగా అనిపించవచ్చు! కానీ..

ఇక్కడ తెలుసుకోవలసిన కొన్ని ప్రధాన విషయాలున్నాయి:

1. నిజానికి ‘మతం’ పేరుతో మనిషి ఎప్పటికీ ప్రమాదంలో ఉండడు! కానీ ‘మతోన్మాదం’ వల్ల మనిషి ప్రమాదంలో ఉంటాడు.

2. అలాగే ఏ మతమూ మనిషిని ఉన్మాదిగా తయారవ్వటం ఎలా అన్నది నేర్పదు. ఇతర మతాలన్నిటి కంటే నా మతమే, నా ధార్మిక గ్రంథమే, నా దేవుడే గొప్ప అన్న ఉన్మాద భావాలే ఏ మనిషినైనా మతోన్మాదిగా తయారు చేస్తాయి.

3. నిజానికి ధార్మిక గ్రంథాలైన వేదోపనిషత్తులు, గీతా, బైబిల్, ఖురాన్ గ్రంథాలు ఏకగ్రీవంగా ఇలాంటి మతోన్మాద భావాలకు భిన్నంగా “మతాలు వేరైనా మానవులందరి దేవుడు ఒక్కడే” “మానవులందరి ధర్మం ఒక్కటే” “మానవులంతా ఒక్కటే” అని చెబుతున్నాయి.

4. ముఖ్యంగా ఏ మతమూ/ధార్మిక గ్రంథమూ స్వంత మతవర్గాన్ని ప్రాబల్యంలోకి తేవటానికి ఇతర మత వర్గాలపై దాడులు, యుద్ధాలు చేసి తోటి మతస్తులను హింసించమని, దౌర్జన్యం చేసి ప్రాణాలు తీయమని చెప్పటం లేదు. కానీ, మా మతమే ప్రాబల్యంలో ఉండాలని కొందరు ఉన్మాదులు మతోన్మాదాన్ని ప్రదర్శిస్తుంటారు. దానికి కారణం మతమే అని ఎక్కువగా వాట్స్ యాప్, ఫేస్బుక్కుల్లో టైమ్ పాస్ చేసే మేధావులు భ్రమపడుతుంటారు.

నాస్తికులు ఫీలౌతునట్టు .. మతం పేరుతో మనిషి ప్రమాదంలో ఉన్నాడన్నదే నిజమైతే..

దాదాపు ప్రపంచ మానవాళిలో 90% మంది ఆస్తికులే ఉన్నారు! ‘మతం’ ప్రతీ మనిషిని సైకోగా మార్చేసి ప్రమాదంలో నెట్టేసేదైతే.. ఈ పాటికి ఆస్తికులంతా రక్తాలు కారేలా కొట్టుకు చచ్చిపోయి, భూమిపై అల్లకల్లోలం చెలరేగి మానవజాతంతా అంతరించిపోయి ఈపాటికి భూమి ఏ గురు గ్రహం మాదిరిగానో బోడిగా తయారైపోయి ఉండేది.

‘మతం’ మూఢ విశ్వాసాలు నేర్పటం లేదా?

మతవ్యవస్థలో డబ్బు సంపాదననే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు మత బోధకులుగా ఉంటూ మత వ్యవస్థలో మూఢ విశ్వాసాలు, గుడ్డి నమ్మకాలు ప్రవేశపెట్టారన్నది ఎంత నిజమో.. వాటికీ ధార్మిక గ్రంథాలకూ సంబంధం లేదన్నది కూడా అంతే వాస్తవం.

కొన్ని విశ్వాసాలూ, నమ్మకాలూ కలిగి ఉండే ఆస్తికుల వర్గాన్ని మత వర్గం అనోచ్చెమో గానీ, నిజానికి మతాలు ఎన్ని ఉన్నా ధార్మిక గ్రంథాల ధర్మం అందరికీ ఒక్కటే.

మనిషిని ఈ విశ్వానికి ఒకే సృష్టికర్త ఉన్నాడని…
అందరూ కలిసి ఆయనను మాత్రమే ఆరాధించాలని…
ఏ భాషలో పిలిచినా ఆయన అస్తిత్వం ఒక్కటే అని…
మానవులు భూమిపై మానవత్వం, నైతిక విలువలు కలిగి నడుచుకోవాలని…
తోటి మానవులపై, జీవులపై దయ చూపాలని…
తోటి మానవుల హక్కులు చెల్లించాలని…
బీదలను, అవసరార్ధులను ఆదుకోవాలని…

మాత్రమే ధర్మం చెబుతుంది. తప్పితే మీ స్వంత మతవర్గపు మందిని పెంచుకోటానికి తోటి మతస్తులను హింసించమనో, వారిపై దౌర్జన్యం చేసి ఉన్మాదం ప్రదర్శించమనో చెప్పటం లేదు.

కాబట్టి మతం పేరుతో మనిషి ప్రమాదం ఉండకూడదు అంటే… దానికి పరిష్కారం అతన్ని మతం నుండి దూరం చేసేసి నాస్తికునిగా మార్చేసి ఏ దారీ చూపకుండా అంధకారంలో వదిలి పెట్టేయటం కాదు! అతనిలో ఉండే ‘ఉన్మాద’ భావాల్ని దూరం చెయ్యాలి. అప్పుడు ప్రతీ ‘మతోన్మాదీ’ ‘మానవతావాది’గా మారిపోతాడు.
…………………..

ఇదంతా చదివి “మరి చరిత్రలో మతం పేరుతోనే యుద్ధాలు ఎందుకు ఎక్కువగా జరిగాయి? అని ప్రశ్నించి తమ మేధావి తనాన్ని ప్రదర్శించాలని ఎవరూ ప్రయత్నించొద్దు.

ఇలాంటి భావాలున్నవారు “ఎన్సైక్లోపీడియా ఆఫ్ వార్స్ (Encyclopedia of wars)” అనే పుస్తకం చదవాలి. దాని ప్రకారం చరిత్రలో (8000 BCE నుండి 2003 ఇరాఖ్ యుద్ధం వరకు) మొత్తం 1763 యుద్ధాలు జరగగా, వాటిలో మతం కారణంగా జరిగిన యుద్ధాలు 123 మాత్రమే!
మిగతావన్నీ అధికారం, రాజకీయ, ఆర్థిక లబ్ది కోసం జరిగిన యుద్ధాలే! అంటే చరిత్రలో జరిగిన మొత్తం యుద్ధాలల్లో మతం కారణంగా జరిగినవి కేవలం 6.89% మాత్రమే.

తప్పితే నాస్తికులు ఊహించుకుంటున్నట్లు చరిత్రలో జరిగిన యుద్ధాలన్నిటికీ కారణం మతం కాదు అని తేల్చిచెప్పటం జరిగింది.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *