అవును నిజమే… ముహమ్మద్(స) ఒకప్పుడు ఆర్ధికంగా-భౌతికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన ఓ నాగరిక సమాజం వద్దకు ప్రవక్తగా పంపబడలేదు.
పరమ నీచమైన మూఢ నమ్మకాలతో నైతికత, మానవతా విలువల విషయంలో అధః పాతాళానికి అణిగిపోయి, కనీస సభ్యతా సంస్కారాలు తెలీని ఎడారి దిబ్బల మధ్య నివసిస్తూ పశుత్వంలో మునిగితేలే ఒకనాటి అనాగరిక అరబ్బు జాతి వద్దకు ప్రవక్తగా పంపబడ్డారు.
అలాంటి అనాగరిక జాతికి ఆయన పూస గుచ్చినట్టు ప్రతీదీ నేర్పాల్సి వచ్చింది. ఆ బోధల్ని ఇప్పుడు 2022 లో అన్నివిధాలా నాగరికంగా అభివృద్ధి చెందిన ఆధునిక ప్రపంచ వ్యక్తులు చదివితే నవ్వు తెప్పించవచ్చు. కొందరికైతే వెటకారం చెయ్యాలన్న దురద కూడా పుడుతుంది.
ఒకనాటి అరబ్బు సమాజం ఎలాంటిదంటే.. కనీసం సజావుగా బట్టలు ఎలా ధరించాలో, ఏది తినాలో ఏది తినకూడదో, ఏది త్రాగాలో ఏది త్రాగకూడదో, ఎలా త్రాగాలో ఎలా త్రాగకూడదో, ఏ చేత్తో తినాలో ఏ చేత్తో తినకూడదో, ఏ చేత్తో కడుక్కోవాలో ఏ చేత్తో కడుక్కోకూడదో కూడా తెలీని అన్ని విధాలా అజ్ఞాన స్థితిలో కొట్టుమిట్టాడే సమాజం అది.
కాబట్టే లోకం తెలీని చంటి బిడ్డలకు పద్ధతులు నేర్పినట్టు ఆ జాతికి ప్రతీదీ నేర్పాడా మనిషి.
మద్యం మత్తులో నిత్యం తూగుతూ, నగ్నత్వం, వ్యభిచారాల్లాంటివి అతి సామాన్య విషయాలుగా పరిగణిస్తూ, ఆడ పిల్ల పుట్టటం తమ ప్రతిష్టకు భంగమని భావించి సజీవంగానే పుడ్చేసేంత విలువల్లేని జాతికి విలువలు నేర్పాడాయన. కాబట్టే ప్రతీదీ విడమర్చి చెప్పాల్సి వచ్చింది.
కానీ, కేవలం ఇరవై మూడు సంవత్సరాల కాలంలో ఆయన నేర్పిన విలువలు శూన్యమైన ఆ ఎడారిలో నుండి ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించింది, కొన్ని సంవత్సరాల్లోనే ఆనాటి అనాగరికులైన అరబ్బులను ఉన్నత నాగరికతకు, శాస్త్రీయ విజ్ఞానానికి ధ్వజవాహకులుగా మార్చగలిగింది. యూరప్, ఆఫ్రికా, స్పేయిన్ నుండి అగ్రరాజ్యాల ప్రజల వరకు వారి ఆలోచనా విధానాన్ని లోతుగా ప్రభావితం చేసింది.
కాబట్టి ఏమీ తెలీని ఓ జాతికి ఆయన నేర్పిన ఆనాటి బోధల్ని ఈనాటి కాలంలో చదివి వెటకారం చెయ్యటం.. తనను లోకం తెలీని స్థితి నుండి పద్ధతులు నేర్పుతూ వచ్చిన తన తల్లిని పెరిగి పెద్దయ్యాక అవన్నీ గుర్తు తెచ్చుకుని వ్యంగ్య వెటకారపు కామెంట్లు చెయ్యటం లాంటిదన్న మాట!
ఎందుకంటే ఆయన పంపబడ్డ జాతి అటువంటిది /-
