సైన్సుకు, మతానికి ముడి పెట్టేసి మతాన్ని నమ్ముకోవటం కంటే సైన్సును నమ్ముకోవటమే మేలని వాదించటం కన్నా దిక్కుమాలిన చర్చ మరొకటి ఉండదు.
“మోరల్ సైన్సు కంటే మెడికల్ సైన్సే గొప్ప” అని చెప్పటం ఎంత తెలివి తక్కువ స్టేట్మెంటో.. “మతాన్ని నమ్ముకోవటం కంటే సైన్సును నమ్ముకోవటమే మేల”ని చెప్పటం కూడా అంతే తెలివి తక్కువ స్టేట్మెంట్ అవుతుంది. ఎందుకంటే అవి రెండూ వేరు వేరు అంశాల తాలూకు సబ్జెక్టులు కాబట్టి.
మత వ్యవస్థలో మూఢాచారాలను చూసి మొత్తానికి ధార్మిక వ్యవస్థకే దూరమైపోయిన నాస్తికులే మతం గొప్పదా? సైన్సు గొప్పదా? అన్న వాదనలు లేవనెత్తుతుంటారు.
కచ్చితంగా సైన్సు గొప్పదే! ఆ విషయాన్ని నాస్తికులు సర్టిఫై చెయ్యాల్సిన పని ఉండదు. యదార్థ అవగాహన ఉన్న ఏ నాస్తికుడూ సైన్సును వ్యతిరేకించడు కూడా. ముఖ్యంగా ఎన్నో ఆవిష్కరణలు చేసిన సైంటిస్టులందరూ నాస్తికులు కాదు ఎందరో ఆస్తికులు కూడా ఉన్నారు.
“మోడ్రన్ సైన్స్” భౌతిక ప్రపంచంలో మనిషి జీవితాన్ని అత్యంత సులభతరం మరియు సౌకర్యవంతం చెయ్యటానికి ఎంత అవశ్యకమో, అతను భౌతికంగా అభివృద్ధి చెందాక నైతికంగా నడుచుకోటానికి ధార్మిక గ్రంథాలు బోధించే “మోరల్ సైన్స్” కూడా అంతే ఆవశ్యకం అవుతుంది.
కాస్త వివరంగా చెప్పాలంటే నేటి అభినవ నాస్తికులు మత వ్యవస్థను అంతగా వ్యతిరేకించటానికి కారణం ఆధ్యాత్మిక వ్యవస్థలో పైకి ఆస్తికులుగా చలామణీ అయ్యే “నకిలీ ఆస్తికులే” అనటం అతీయోశక్తి కాదు.
ఎవరీ “నకిలీ ఆస్తికులు?” ఆస్తికుల్లో రెండు రకాల ఆస్తికులున్నారు. మొదటి రకం ఆస్తికులు- ధార్మిక గ్రంథాల “శాస్త్రీయ ధర్మాన్ని” “సృష్టికర్త అయిన దేవుణ్ణీ” విడిచి పెట్టేసి బహుదైవాల ఆరాధనను, విగ్రహారాధనలు చేస్తూ మత పండితులు ప్రవేశపెట్టిన మూఢాచారాలు, గుడ్డి నమ్మకాలను అనుసరించేవారు. వీరు నకిలీ ఆస్తికులని చెప్పవచ్చు.
రెండో రకం ఆస్తికులు- ధార్మిక గ్రంథాల “శాస్త్రీయ ధర్మాన్ని” అవగాహన చేసుకుని, “సృష్టికర్త అయిన దేవుణ్ణి” యదార్థంగా తెలుసుకుని, సృష్టిలో ఉన్నవన్నీ సృష్టికర్త ద్వారా ఉనికిలోకి తేబడ్డవే తప్ప అవేమీ దైవాలు కావన్న విషయాన్ని గ్రహించి, ఏక దైవారాధన చేస్తూ హేతుబద్ధమైన విశ్వాసాలను కలిగి ఉండే నిజమైన ఆస్తికులు.
దైవత్వపు భావన కలిగి ఉండే ప్రతీ ఒక్కరూ ఆస్తికులే అయినప్పటికీ ఆ ఆస్తికుల్లోనూ ధార్మిక గ్రంథాల “శాస్త్రీయ ధర్మాన్ని” మాత్రమే అనుసరించే “నిజ ఆస్తికులు”, ఆ ధర్మాన్ని విడిచిపెట్టేసి మతవ్యవస్థలో మూఢాచారాలు, మూఢనమ్మకాలను అనుసరించే “నకిలీ ఆస్తికులు” కూడా ఉన్నారు.
ఈ రెండు రకాల ఆస్తికుల్లో తేడాను కనిపెట్టటంలోనే నాస్తికులు ముందుగా ఫేలయ్యారు. అన్నిటికంటే నాస్తికుల పెద్ద ఫేల్యూర్- అసలు మత వ్యవస్థలో పేరుకుపోయిన మూఢాచారాలను, గుడ్డి నమ్మకాలను బహిరంగంగా ఖండించే పని అందరికంటే ముందే ధార్మిక గ్రంథాల “శాస్త్రీయ ధర్మం” చేస్తుందన్న విషయాన్ని గమనించకపోవటమే! అందుకే వారు మత వ్యవస్థలో మూఢాచారాల్నీ, ధార్మిక గ్రంథాల్నీ ఒకే గాటన కట్టేసి మొత్తం ధార్మిక వ్యవస్థనే విమర్శిస్తూ ఉంటారు.
అన్నిటికంటే ముఖ్యంగా “సృష్టికర్త ఉంటే సైన్స్ ద్వారా నిరూపించండి?” అన్నది నాస్తికుల ఫేమస్ డైలాగుల్లో ఒకటి. నాస్తికులడిగే ఈ ప్రశ్న ఒకరకంగా పూర్తిగా అర్థరహితమైన ప్రశ్న.
ఎందుకంటే సైన్స్ 13.8 బిలియన్ల సంవత్సరాల క్రితం విశ్వం ఉనికిలోకి వచ్చింది అని మాత్రమే చెప్పగలుగుతుంది. స్వయంగా సైంటిస్టులే విశ్వం అనంత కాలం నుండి లేదని చెబుతున్నారు. కేవలం ప్రకృతిలో ఉన్న పదార్థాలపై ప్రయోగాలు చేసి కొత్త ఆవిష్కరణలు చెయ్యటం వరకే సైన్స్ పాత్ర ఉంటుంది. విశ్వం లేనిదే ప్రకృతీ లేదు, సైన్సు కూడా లేదు. అలాంటప్పుడు సైన్స్ ఆధారంగా సృష్టికర్త ఉన్నాడని నిరూపించమనటం మూర్ఖత్వం.
ఇక విశ్వం ఏర్పడటానికి పూర్వం పరిస్థితి ఏమిటి? ఏమీ లేని స్థితి నుండి పదార్థం అసంఖ్యాక గ్రహాలుగా ఏర్పడిన తరువాత విశ్వవ్యవస్థ అత్యంత క్రమత, క్రమబద్ధతతో, సమతూల్యతతో, అత్యంత పటిష్ట గణిత సూత్రాలు కల నియమాలతో ఎలా నడుపబడుతుంది? ఎలా అదుపు చెయ్యబడుతుంది?
శూన్యంలో ఏమీ లేని స్థితి నుండి పదార్థం ఏర్పాడ్డాక ‘జీవులు’ ఎలా ఉద్భవించాయి? అన్న ప్రశ్నలకు సైన్స్ ముంగిట సమాధానాలు లేవు.
విశ్వం ఏర్పడక పూర్వం, గ్రహాలూ లేవు, భూమీ లేదు దాని మీద ప్రకృతీ లేదు, విశ్వ నియమాలు కూడా లేవు. మరి అంత పటిష్టమైన క్రమబద్ధతతో, గణిత నియమాలతో, ధర్మాలతో నడపబడటానికి విశ్వానికి అన్ని తెలివితేటలెక్కడివి?
విశ్వంలో పదార్థానికి తెలివి ఎందుకుంటుంది? అని ప్రశ్నిస్తే మరి ఆ విశ్వాన్ని అంత నియమబద్ధంగా నడపటం వెనుక ఏదో ఒక తెలివి పనిచేస్తూ ఉండాలి కదా?
ఏదైనా ఒక వ్యవస్థ పటిష్ట నియమాలతో నడుపబడుతుందీ అంటే కచ్చితంగా నియమాలను ఏర్పర్చేవాడు కూడా ఉండి తీరాలన్న విషయానికి మనిషి బుద్ధీ వివేకాలు సాక్ష్యామిస్తున్నాయి.
కాబట్టి మేధాసంపన్నుడైన సృష్టికర్త ఒకడు ఉన్నాడు అనటానికి కళ్ల ముందు మహత్తరమైన నియమాలతో నడుపబడుతున్న విశ్వవ్యవస్థే ప్రత్యక్ష సాక్ష్యం. తిరిగి “నేను ఆయన్ని కళ్లతో చూశాకే నమ్ముతాను” అనటం మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ఘన, ద్రవ, వాయు పదార్థాలతో సృష్టించబడ్డ విశ్వవ్యవస్థలో ప్రతీదీ మనిషి కళ్లకు కనపడే పదార్థాలే కావు కనపడనివి కూడా ఎన్నో ఉన్నాయి.
హత్య జరిగితే హంతకుణ్ణి కళ్లతో చూడనప్పటికీ కొన్ని సాక్ష్యాధారాలతో హంతకుణ్ణి కనిపెట్టగలిగే బుద్ధి మనిషికివ్వబడింది. ఒక గొప్ప కళాఖండాన్ని చూసి దాన్ని గీసిన కళాకారుడిని కళ్లతో చూడనప్పటికీ అతని నైపుణ్యాన్ని అంచనాకట్టగలిగే మేధస్సు మనిషికివ్వబడింది.
అలాగే ఎంతో క్రమబద్ధతతో, విశ్వనియమాలతో నడుపబడుతున్న విశ్వవ్యవస్థ వెనుక ఒక మేధస్సు కచ్చితంగా ఉండి తీరాలని మానవ మేధస్సు సాక్ష్యమిస్తుంది.
ఒకవేళ విశ్వానికి “ఏ సృష్టికర్తా లేడు” అదంతా హుళుక్కే అని వాదించే నాస్తికులు అంత కచ్చితంగా వాదించే తమ వాదనకు ప్రయోగాత్మక ఆధారాలు ఏమిటో కూడా చూపాలి.
ఇవేమీ ఆలోచించకుండా సైన్సు గొప్పదా? మతం గొప్పదా? అంటూ టైమ్ పాస్ డిస్కషన్లు పెట్టకూడదు.
