మూఢత్వ మత వ్యవస్థకు, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని నేర్పుతున్న ధార్మిక గ్రంథాల ధర్మానికీ… మతవ్యవస్థలోని మిధ్యా దైవాలకూ, ధార్మిక గ్రంథాలు పరిచయం చేస్తున్న సృష్టికర్త అయిన దేవునికీ మధ్య తేడా తెలీని నాస్తికులు చాలా సార్లు “సృష్టికర్త, ధర్మం వంటి దృక్పథాలు మనిషి ఆలోచనలకు కళ్లెం వేసేసి, అతన్నో మూఢత్వంతో నిండిన వ్యక్తిగా మార్చేస్తాయి! ధర్మం మనిషిని హేతుబద్ధమైన ఆలోచన నుండి దూరం చేసేసి గుడ్డి విశ్వాసిగా మార్చిపరేస్తుంది. ఆలోచన చెయ్యగలగటం అన్నది ఒక్క నాస్తికత్వం ద్వారానే సాధ్యం” అని చెబుతుంటారు.
కానీ, ఈ వాదనకు పూర్తి భిన్నంగా ఖురాన్…
“అయినా మీరు బుద్ధిని బొత్తిగా ఉపయోగించరేమిటి” – 2: 44
అంటూ తన బుద్ధిని ఉపయోగించమని మనిషి ఆలోచనలను తట్టి లేపుతుంది. అంతేకాదు…
“తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారు, మూగవారు మాత్రమే నిశ్చయంగా అల్లాహ్ దృష్టిలో నీచాతినీచమైన కోవకు చెందిన జంతువులు” – 8:22
అంటూ స్వంత మెదడు ఉన్నప్పటికీ బుద్ధిని ఉపయోగించని వారిని చెవిటివారిగా, మూగవారిగా అభివర్ణిస్తుంది. తమ బుద్ధిని ఉపయోగించకుండా తమకు తట్టిందే నిజమని భావించేవారిని, తమ ఊహల్లో ఉన్నదాన్నే వాస్తవాలనుకునేవారిని, స్వంత తెలివి ఉపయోగించకుండా ఎదుటివారిని గుడ్డిగా ఫాలో అయ్యే వారిని ఖురాన్ నీచాతినీచమైన జంతువుల కోవలోకి జమకడుతుంది.
“ఊహా, అనుమానాల ఆధారంగా నిర్ణయం చేసేవారు నాశనమగుదురుగాక” – 51:10 అంటూ ఊహా, అనుమానాల ఆధారంగా గుడ్డి నమ్మకాలను కలిగి ఉండేవారు నాశనమవుతారని ఖురాన్ హెచ్చరిస్తుంది. ఇంకా బుద్ధీ, జ్ఞానాలు ఉపయోగించని వారికి ఖురాన్ చేస్తున్న మరొక హెచ్చరిక-
“బుద్ధీ జ్ఞానాలతో వ్యవహరించని వారిపై దేవుడు మాలిన్యాన్ని పడవేస్తాడు” – 10:100
అని ఆలోచన చెయ్యనివారిని ఖురాన్ తీవ్రంగా హెచ్చరిస్తుంది.
గుడ్డి నమ్మకాలు, మూఢ విశ్వాసాల వెంట పడకుండా… “భూమిలోనూ, ఆకాశాలలోనూ ఉన్నటువంటి దానిని కళ్లు తెరచి చూడండి” – 10:101 అంటూ ఖురాన్ మనిషి శాస్త్రీయ ఆలోచనా విధానానికి తలుపులు తెరుస్తుంది.
“భూమ్యాకాశాల పనితీరు గురించి ఎప్పుడూ యోచించలేదా?” – 7:185 అంటూ ఎంతో క్రమం, క్రమబద్ధతతో పనిచేస్తున్న విశ్వవ్యవస్థ పనితీరు గురించి మీరు ఎందుకు ఆలోచించరని పదేపదే ప్రశ్నిస్తుంది.
“భూమిలో ఆకాశాలలో ఎన్ని సూచనలు లేవు? కానీ వారు చూస్తూ ఉండిపోతారు. కొంచెమైన గమనించరు” – 12:102 అని చెబుతూ మీ కళ్ల ముందు కదలాడుతున్న అద్భుతమైన సృష్టిని గురించి కాస్తైనా ఆలోచన చెయ్యమని మనిషి ఆలోచనలకు పదును పెడుతుంది.
గుడ్డి నమ్మకాల్ని, మూఢ విశ్వాసాల్నీ ప్రక్కపెట్టేసి భూమ్యాకాశాల నిర్మాణం గురించి శాస్త్రీయ పరిశీలన, హేతుబద్ధమైన ఆలోచన చేసేవారికి ఎన్నో సూచనలున్నాయని కొందరి మొద్దుబారిపోయిన మెదళ్లకు మేత పెడుతుంది.
“భూమీ ఆకాశాల నిర్మాణం గురించి ఆలోచించే వివేకవంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి” – 3:190 అని చెబుతూ మీ అందరికీ స్వంత మెదళ్లు ఇవ్వబడింది మీరు ఆలోచన చెయ్యటానికే తప్ప దానికి లాక్ పెట్టేసి అనాలోచితంగా వ్యవహరించటానికి కాదన్న విషయాన్ని అనేక సందర్భాల్లో చెబుతూ హేతుబద్ధమైన ఆలోచనా విధానానికి ఆహ్వానం పలుకుతుంది.
శాస్త్రీయ ఆలోచనా విధానం కలిగి “ఆలోచించేవారి కొరకు పెద్ద సూచనలు ఉన్నాయి” – 13:3 అంటూ ఖురాన్ పదే పదే మనిషిని హేతుబద్ధంగా ఆలోచించటం వైపుకు నడుపుతుంది.
పటిష్టమైన నియమాలకు లోబడి క్రమబద్ధతతో పనిచేస్తున్న విశ్వవ్యవస్థ కళ్ల ముందు కదలాడుతున్నప్పటికీ ఈ విశ్వవ్యవస్థపై ఎవరి నియమాలూ పనిచెయ్యటం లేదు, దాని గురించి ఆలోచించాల్సిన పని కూడా లేదు, ఎవరూ అదుపు చెయ్యకుండానే విశ్వం ఏదో గాలివాటంగా ఏర్పడిపోయి దానికదే పనిచేస్తుందని హేతువిరుద్ధంగా మాట్లాడుతూ తమను తాము హేతువాదులుగా, మహా జ్ఞానులుగా, గొప్ప ఆలోచనాపరులుగా భావించుకునేవారిని…
“వారికి హృదయాలున్నాయి కానీ వారు వాటితో ఆలోచించరు. వారికి కళ్ళు ఉన్నాయి కానీ వారు వాటితో చూడరు. వారికి చెవులు ఉన్నాయి కానీ వారు వాటితో వినరు. వారు జంతువుల వంటివారు – కాదు వాటి కంటే కూడా దిగజారిపోయారు” – 7:179
అంటూ వారి నిజ వాస్తవికత తెలియజేస్తుంది. చివరకు ఈ సమస్త విశ్వవ్యవస్థ వెనుక ఏ సృష్టికర్తా లేడని తిరస్కరించటానికి కూడా మీకు హక్కు ఉంది. కానీ… ఆ తిరస్కరించటం కూడా ఏదో గుడ్డిగా కాకుండా శాస్త్రీయ పరిశీలన చేసి తిరస్కరించమని తిరస్కరించేవారిని సైతం చివరకు ఖురాన్ శాస్త్రీయ ఆలోచనా విధానం వైపుకే ఆహ్వానిస్తుంది.
“మీరు నా వాక్యాలను శాస్త్రీయ పరిశీలన చేయకుండానే ఇట్టే తిరస్కరించారు” – 27:84
****
“మీరు మీ పిల్లలకు ఆలోచన చెయ్యటాన్ని నేర్పకపోతే, మతం వారిని ఆలోచన చెయ్యకపోవటాన్ని నేర్పుతుంది” అని చెబుతూ మతానికీ, ధర్మానికి తేడా తెలీక నాస్తికానందం పొందుతున్న కొందరు నాస్తికులకు సమాధానమే పై వ్యాసం.
ఇది చదివి కాస్తైనా ఆలోచన చెయ్యగలరు.
కానీ… ధర్మం ఆలోచించమంటుంది / –
