పరలోక శిక్షా బహుమానాలు లాజిగ్గా నమ్మటమెలా?

కంటికి కనిపించేవి, సైన్స్ ద్వారా నిరూపించబడేవే లాజిక్ తో కూడిన వాస్తవాలు. కంటికి కనపడని, సైన్సుకు అందనివన్నీ ఇల్లాజిక్ తో కూడిన గుడ్డి నమ్మకాలన్నది ఆల్రెడీ చాలా మంది ఆధునిక నాస్తికుల ద్వారా సర్వసామాన్యం కాబడిన ఓ సాధారణ భావజాలం. నాస్తికులు సృష్టించిన ఈ భావజాలం ద్వారా బ్రెయిన్ వాషింగ్ చెయ్యబడిన చాలా మంది ఆధునిక విద్యావంతులు కూడా ఏ మాత్రం ఆలోచన చెయ్యకుండా “దేవుడు ఉంటే కనపడాలి కదా! కనపడని దేవుణ్ణీ, స్వర్గ-నరకాలూ, శిక్షా-బహుమానాలు” వగైరా ధార్మిక గ్రంథాలు చెప్పేవాటిని ఎందుకు నమ్మాలని ప్రశ్నిస్తూ ఉంటారు.

దానికి తోడు ఎలాగూ అన్ని మత వర్గాల్లోనూ మెజార్టీ ప్రజలు తమ ధార్మిక గ్రంథాల బోధనలకు ఏనాడో దూరమైపోయి అనేక హేతువిరుద్ధమైన మూఢ నమ్మకాలు, గుడ్డి విశ్వాసాల అనుసరణలో పడిపోయి ఉండటంతో మత వ్యవస్థలో చలామణీలో ఉన్న మూఢ నమ్మకాలతోపాటు దేవుడు, పరలోక శిక్షా-బహుమానాలు వగైరా ధార్మిక గ్రంథ దృక్పథాలను కూడా ఒకే గాటన కట్టేసి నాస్తికులు మరియు వారి భావజాలానికి ప్రభావితమైన ఆధునిక విద్యావేత్తలు సైతం ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మానికి పూర్తిగా దూరమైపోయారు.

సమస్త విశ్వం సృష్టించబడిన తరువాత మనిషికి సహజంగానే ఇవ్వబడిన “పరిశీలనాత్మక దృష్టి” అనే సామర్ధ్యం ఆధారంగానే సైన్స్ అన్నది ఉనికిలోకి వచ్చింది. సైన్స్ చేసే పని- తన వద్ద ఉన్న వస్తువులు/పదార్థాల ఆధారంగా పరిశీలన, ప్రయోగాలన్నవి చేస్తూ కొత్త ఆవిష్కరణలు చేసి మానవ మనుగడను సులభతరం చెయ్యటం మాత్రమే.
13.8 బిలియన్ల సంవత్సరాల క్రితం కొన్ని జంట కణాల సముదాయంతో కూడిన అణువుల నుండి పదార్థం ఏర్పడి తద్వారా బిగ్ బ్యాంగ్ జరిగి విశ్వం ప్రారంభమైంది అన్నంత వరకే సైన్స్ చెప్పగలుగుతుంది. అంతకు పూర్వం పరిస్థితి ఏమిటి? ఆ జంట వ్యతిరేక కణాలు ఎలా ఉనికిలోకి వచ్చాయి, తద్వారా ఏర్పడిన విశ్వవ్యవస్థ గంభీరమైన కమబద్ధతతో ఎలా కంట్రోల్ చెయ్యబడుతుంది? గొప్ప టెక్నాలజీ తో నియంత్రించబడుతున్న విశ్వం వెనుక పని చేస్తున్న మేధ ఏమిటి? అన్న ప్రశ్నలకు సైన్స్ ముంగిట ఏనాటికీ సమాధానాలు ఉండవు. ఆధునిక సైన్స్ సైతం ఇప్పటి వరకూ విశ్వం గురించి చెప్పగలిగింది- కేవలం 4% మాత్రమే. మిగతా 96% విశ్వం తాలూకు సమాచారం సైన్సుకు ఓ అంతుచిక్కని మిస్టరీనే!

కాబట్టి సైన్స్ ద్వారా సృష్టికర్తను గురించి తెలుసుకోవటం అన్నది మీటరు టేపుతో కాంతివేగాన్ని కొలవటానికి ప్రయత్నం చెయ్యటం లాంటిదన్న మాట! ఎందుకంటే సృష్టికర్తను గుర్తించటమన్నది బుద్దీ, వివేకాల ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి.

“శాస్త్రీయ ఆలోచన (scientific thought process)”తో పాటు “బుద్ధి (Intelligence)” అన్నది మనిషికి అదనంగా ఇవ్వబడిన ఓ సామర్థ్యం. ఈ రెండిటికీ మధ్య ఉన్న తేడా తెలుసుకోవాలంటే ఉదాహరణకు: కిటికీ బయట పొగ కనపడితే కొంత దూరంలో మంట ఉందని “అనుమాన ప్రమాణం” ఆధారంగా నిర్ధారణ చేసేది “బుద్ధి” అయితే… వాతావరణంలో ఆక్సిజన్ సహాయంతో కొన్ని వాయువులు మండటం కారణంగా ఆ మంట మండుతుందని చెబుతూ మంట (Fire) తాలూకు స్థితిగతుల గురించి వివరించి చెప్పేది “సైన్స్” అన్నమాట.

మంచీ-చెడులు, ధర్మం-అధర్మం, న్యాయం-అన్యాయం వగైరా వంటి వాటి గురించి సైన్స్ వివరించదు. మనిషి చేసే మంచీ-చెడులకు తగినట్టు శిక్షా-బహుమానాలు ఇవ్వబడాలి అని సైన్స్ నిర్ధారించలేదు. ఇవన్నీ మనిషి బుద్దీ, వివేకాలకు సంబంధించిన విషయాలు కాబట్టి. వాటి ఆధారంగానే కొందరు ఆలోచనాపరుల ద్వారా చట్టం (Law) అనేది రూపుదిద్దబడుతుంది. తప్పితే ఏ దేశంలోనైనా చట్టాలను సైంటిస్టులు తయారు చెయ్యరు.

ఇక వేలాది మంది ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకుని తన నేరం బయటపడకుండా చట్టాల కళ్లు గప్పి, అధికారంతో అన్యాయంగా సంపాదించిన డబ్బుతో జీవితాంతం విలాసవంతంగా బ్రతుకుతూ ఓ దుర్మార్గుడు ఎంతో సునాయసంగా చనిపోతే వాడు చేసిన దారుణాలకు శిక్షించబడాల్సిన అవసరం ఉందా లేదా? అని ప్రశ్నిస్తే ఓ నాస్తికుడి హృదయం సైతం కచ్చితంగా వాడి దారుణాలకు తగిన శిక్ష లభించాలనే కోరుకుంటుంది. అలాగే వేలాది మందికి మంచి చేసి, జీవితాలు బాగుపరచి పేదరికంలో చనిపోయిన ఓ గొప్ప వ్యక్తికి తగ్గట్టు గొప్ప బహుమానం లభించాలనే కోరుకుంటుంది.

ఏ దేశపు న్యాయస్థానంలోనైనా దొంగతనం చేస్తే ఒక శిక్ష, దౌర్జన్యం చేస్తే ఒక శిక్ష, హత్య చేస్తే ఒక శిక్ష అంటూ అనేక నేరాలకు తగిన శిక్షలను రూపొందించటం జరుగుతుంది. అయితే మనిషి జీవితం ఎలా అయితే కొన్ని పరిమితుల (Limits)కు లోబడి ఉందో.. అచ్చం ఇక్కడి న్యాయస్థానాలల్లో చట్టాలు, అవి విధించే శిక్షలు సైతం కొన్ని పరిమితులకే లోబడి ఉన్నాయని చెప్పక తప్పదు. అలాగని అది న్యాయస్థానాల తప్పు కాదు.

వివరంగా చెప్పాలంటే ఒక హత్య చేసిన నేరస్తునికి ఇక్కడి న్యాయ స్థానాలు ‘ఉరిశిక్ష’ మాత్రమే విధించగలవు. ఓ ఇరవై హత్యలు చేసిన వ్యక్తికి సైతం ఉరిశిక్షే విధించగలవు. అదే వెయ్యి మందిని చంపినట్టు రుజువైన ఓ క్రూరుడి విషయంలో సైతం ఇక్కడి చట్టాలు, న్యాయస్థానాలూ ఉరిశిక్షే విధించగలవు. ఒకవేళ ఆ వెయ్యి మందిని చంపిన నేరస్థుడు “నేను చంపింది వెయ్యి మందిని కాదు కేవలం ఓ వంద మందిని మాత్రమే అని క్రింది కోర్టులో అప్పీలు చేసుకున్నప్పటికీ ఆ క్రింది కోర్టు ఆ వంద మందిని చంపిన దానికి తిరిగి ఉరిశిక్ష విధించాలనే తీర్పు చెబుతుంది.

అలాగే ఓ స్త్రీని అన్యాయంగా అత్యాచారం చేసి చంపేసిన నేరస్తుడి నేరం కోర్టులో రుజువై ఉరిశిక్ష పడ్డ కొన్నాళ్లకు ఆ నేరస్తుడు అంతకు ముందే మరో పది మంది స్త్రీలను సైతం అలాగే చంపి ఉన్నాడన్న విషయం బయటపడినా అప్పటికే పడ్డ ఉరిశిక్షకు మించి విధించటానికి తగిన శిక్ష సైతం ఇక్కడి న్యాయస్థానాల దగ్గర లేదు. ఆ అన్ని నేరాలకు తిరిగి ఉరిశిక్షనే ఖరారు చెయ్యటం జరుగుతుంది.

కాబట్టి “నేరాలకు తగిన శిక్ష” అన్నది ఇక్కడి చట్టాలు న్యాయస్థానాలలో కొంతవరకే సాధ్యం తప్పితే వేలాది, లక్షలాది మందిని చంపేసిన దుర్మార్గుడి నేరానికి తగిన శిక్ష ఏ దేశపు చట్టంలోనూ లేదు. పైగా ఆ దుర్మార్గుడు తెలివిగా సాక్ష్యాలు తారుమారు చేసి నిర్దోషిగా విడుదలైపోవచ్చు లగ్జరీగా కింగ్ సైజ్ లైఫ్ గడుపుతూ ఓ దేశానికి ప్రధాన మంత్రి కూడా అయిపోవచ్చు. ఎందుకంటే వాడు ప్రజలకు తెలియకుండా చీకట్లో రహస్యంగా పన్నిన కుట్రలను రికార్డు చేసి న్యాయస్థానంలో ప్రదర్శించి, వాడు చేసిన నేరాలకు తగ్గ శిక్షను విధించే ఏ వ్యవస్థా ఇక్కడి న్యాయస్థానాల్లో లేదు కనుక.

ఒక వ్యక్తి నేరాలూ దౌర్జన్యాలకు “తగిన శిక్ష”.. ఒక వ్యక్తి మంచి పనులకు, నిస్వార్థ ప్రజా సేవకు “తగిన బహుమానం” అన్నవి ఉండాలన్నది అంతర్గతంగా మనిషి మనస్సు కోరుకునే గట్టి డిమాండ్ అని చెప్పాలి. ఆ డిమాండ్ అన్నది కచ్చితంగా నెరవేరనుందన్న శుభవార్తను ధార్మిక గ్రంథాలు ఇస్తున్నాయి.

మనిషి తాను చీకట్లో ఎవరి కంటా పడకుండా రహస్యంగా చేసే ప్రతీ మంచీ-చెడు పనులన్నీ రికార్డు అవుతున్నాయి. అతను ఈ లోకంలో చట్టాల్నీ, న్యాయస్థానాల కళ్లుగప్పి తప్పించుకోవచ్చు, కానీ అతను చేసే అతి చిన్న నేరమైనా అతి చిన్న మంచి పనైనా పరలోక న్యాయస్థానంలో తేబడుతుంది. అక్కడ అతను “నేను ఏ నేరమూ, అన్యాయమూ చెయ్యలేదని” చెప్పి తప్పించుకోవటానికి అవకాశం ఉండదు. అక్కడ అతని ప్రతీ క్రియకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందరినో అన్యాయంగా హత్యలూ, అత్యాచారాలు చేసి చంపేసిన దుర్మార్గులకు తగ్గట్టు శాశ్వత శిక్ష విధించబడుతుంది.
అలాగే ఎన్నో మంచి పనులు చేసి విశ్వాసంతో బ్రతికి కటిక దరిద్రం అనుభవిస్తూ చనిపోయినప్పటికీ అతని మంచిని ప్రజలు గుర్తించనప్పటికీ అతని మంచికి తగ్గట్టు కష్టపడకుండా తాను కోరుకుంది ప్రతీదీ లభించే శాశ్వత శాంతియుత జీవితాన్ని “శాశ్వత బహుమానం” రూపంలో ఇవ్వబడుతుంది.

ఇలాంటి వ్యవస్థ ఒకటి కచ్చితంగా ఉండాలన్నది మనిషి లాజిక్ సైతం ఒప్పుకునే విషయం.

ప్రతీ మనిషికీ మరణంతో అతని జీవితం అంతం కాదు మరో శాశ్వత జీవితానికి ఆరంభం. అతను తన జీవితంలో చేసే మంచీ-చెడులకు ఒకరోజు జవాబు చెప్పుకోవాల్సి ఉంది దానికి తగ్గ “శాశ్వత శిక్షా-బహుమానాలు” ఇవ్వబడనున్నాయనే దృక్పథమే మనిషిని “చెడు” నుండి “ఆపగలిగే” మరియు “మంచి” వైపుకు “నడపగలిగే” గొప్ప ప్రభావాత్మక ప్రేరకాలు. ఈ దృక్పథం తప్పించేసినప్పుడు మనిషి మృగం కంటే దారుణంగా మారిపోతాడు.

చివరిగా… మరి మతాన్ని నమ్ముకునేవారిలో నేరాలు చేసేవారు ఉగ్రవాదులు, తీవ్రవాదులు సైతం ఎందుకున్నారు? అన్న ప్రశ్న వస్తుంది. దానికి సంక్షిప్త సమాధానం- మత ఉన్మాదులు వేరు, ధార్మికులు వేరు. సృష్టికర్తను యదార్థంగా నమ్మేవారు వేరు, తమకు నచ్చిన వారిని/వాటిని దైవాలుగా చేసుకుని నమ్మే వారు వేరు. దీనిని బట్టి మతోన్మాదులు, ధర్మావగాహన లేనోళ్లు చేసే నేరాలను ఆస్తికులు చేసే నేరాలుగా పరిగణించి ఆస్తికులూ నేరాలు చేస్తారు కాబట్టి దేవుణ్ణి నమ్ముకోవటం వేస్టని తీర్మానాలు చెయ్యటం మూర్ఖత్వం అవుతుంది.

కాబట్టి పరలోక శిక్షా-బహుమానాలు ఉన్నాయని నమ్మితే రెండు లాభాలు 1. మనిషి బ్రతికినన్నాళ్లూ చెడు చెయ్యటాన్ని నియంత్రించుకుంటూ మంచి పనులు చేస్తూ ప్రజల్లో మంచి మనిషిగానే చనిపోతాడు. 2. నిజంగా పరలోకం ఉంటే అదనంగా శాశ్వత బహుమానం కూడా లభిస్తుంది.

పరలోక శిక్షా-బహుమానాలు లేవని నమ్మితే రెండు నష్టాలు 1. మనిషి బ్రతికినన్నాళ్లూ చెడు చెయ్యటాన్ని నియంత్రించుకోలేక చెడు పనులు చేస్తూనే అశాంతితో చనిపోతాడు. 2. నిజంగా పరలోకం ఉంటే అదనంగా శాశ్వత శిక్షకు కూడా గురికావాల్సి ఉంటుంది.

అలాకాక పరలోక శిక్షా-బహుమానాలు నమ్మటం వల్ల మనిషికి నష్టాలే ఉన్నాయంటే అవేమిటో ఆలోచనాపరులు కాస్త వివరించాలి.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *