స్వంత మతాన్ని విమర్శలు చేస్తున్నంత మాత్రానా ఇతర మతాలను, వారి విశ్వాసాలను పనికట్టుకుని విమర్శించటానికి, హేళన చెయ్యటానికి లైసెన్సు దొరికేసినట్టు కాదు.
మతోన్మాదులు మత ఉన్మాదాన్ని ప్రదర్శించినట్టే.. ఆస్తికులు కలిగి ఉండే విశ్వాసాలను దెప్పిపొడుస్తూ, హేళన వ్యంగ వెటకారాలు చేస్తూ నాస్తికులు సైతం నిత్యం నాస్తికోన్మాదాన్ని ప్రదర్శిస్తుంటారు.
పైగా అలా ఇతర మతాల్ని పనికట్టుకుని ఎందుకు హేళన చెయ్యటం అని ప్రశ్నిస్తే “మేము మా మతాన్ని కూడా విమర్శిస్తున్నాం కదా కేవలం మీ మతాన్నేకాదు” అని చెబుతూ ఇంకా వీలైతే మీరు కూడా మతాన్ని దేవుణ్ణి వదిలేసి తాడూ బొంగరం లేకుండా తయారైపోమని ఓ ఉచిత సలహా కూడా ఇస్తుంటారు.
పైగా మేము హిందువులకో, ముస్లిములకో వ్యతిరేకులము కాము కేవలం వారి మూఢాచారాలను, గుడ్డి నమ్మకాలనే మేము విమర్శించేది అని ఓ కవరింగ్ కూడా ఇస్తుంటారు.
నాస్తికులు కలిగి ఉండే అమాయకత్వం ఏమిటంటే ఇతర మతాల తాలూకు ఆచారాలను, నమ్మకాలను, విశ్వాసాలను పట్టుకుని విమర్శించేసినంత మాత్రానా ప్రజల్లో చైతన్యం వచ్చేస్తుందనో లేక వారు కూడా అన్నీ వదిలేసి సన్యాసుల్లా నాస్తిక సమాజంలో జాయిన్ అయిపోతారనో భావించి అలవోకగా ఇతర మతాల్ని విమర్శించేసి భావప్రాప్తి పొందుతుంటారు.
చెయ్యాల్సిన విమర్శలన్నీ చేసేసి.. “అయితే మేము విమర్శే చెయ్యకూడదా? విమర్శించినంత మాత్రానా మీ మనోభావాలు దెబ్బతీసుకుంటే ఎలా?” అన్న ప్రశ్న నాస్తికులు పదే పదే అడుగుతుంటారు.
విమర్శ మంచిదే. కచ్చితంగా విమర్శ చెయ్యాలి. దాని వెనుక ఇతర మతాల్నీ, మనుషుల్నీ ప్రక్షాళన చేసే ఉద్దేశముందా? లేక కేవలం దెప్పిపొడవటం అన్న ఉద్దేశం ఉందా? అన్నది గమనించాలి.
ఎందుకంటే విమర్శలన్నీ ఒకలాంటివికావు కనుక. అక్కసు, ఈర్ష్య, ధ్వేషాలతో చేసే విమర్శలు, విచ్ఛిన్నాత్మక విమర్శలు, అర్థరహిత విమర్శలు ఉంటాయి. అర్థవంతమైన, సమంజసమైన, సద్విమర్శలు కూడా ఉంటాయి. వీటిలో ఏ రకమైన విమర్శలను మేము చేస్తున్నామనేది విమర్శించే వారు గమనించుకోవాలి. తప్పితే విమర్శలన్నిటినీ ఒకే గాటన కట్టేసి గుడ్డిగా విమర్శలు చెయ్యకూడదు. అలా చెయ్యటం రాజ్యాంగ విరుద్ధం కూడా.
నిజంగా ఎదుటి వ్యక్తులను, మతవర్గాన్నీ ప్రక్షాళన చెయ్యాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు అర్థవంతమైన, సమంజసమైన, సద్విమర్శలు మాత్రమే చెయ్యాలి.
ఇక సమాజ సంస్కరణ, మత సంస్కరణలన్నవి ధర్మాన్నీ, ధార్మిక గ్రంథాలను వదిలిపెట్టేసి నాస్తికులుగా మారిపోయినంత మాత్రానా సాధ్యం కాదు. ఎందుకంటే నాస్తికత్వం కేవలం మతాల్ని విమర్శించటం మీదే తన ఉనికిని కాపాడుకోగలుగుతుంది. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది తప్పో, ఏది ఒప్పో వివరిస్తూ సమాజాన్ని సంస్కరించటానికి నాస్తికత్వం దిశానిర్దేశం ఎప్పటికీ చెయ్యలేదు.
ఎందుకంటే నాస్తికత్వం మంచీ-చెడు, సత్యం-అసత్యం వంటి వాటిని ప్రమాణంగా తీసుకోదు. “మీరు ఈ భౌతిక ప్రపంచంలో బ్రతికినన్నాళ్లు ఇష్టమొచ్చినట్టు బ్రతికి చనిపోండి. ఎవరో చూస్తున్నారనో, దేవుడు ఉన్నాడనో కోరికలు చంపుకుని బ్రతకవద్దు. ప్రాపంచిక జీవితంలోనే మజాలన్నీ జుర్రుకోండి.. కోరికలన్నీ తీర్చేసుకోండి.. నీతీ, న్యాయం, ధర్మం, అధర్మం వగైరా వంటివాటిని ప్రక్కన పెట్టేసి కేవలం సైన్స్ ను దేవుడుగా చేసుకుని బ్రతికేసి చచ్చిపోండి” అన్నది నాస్తిక్ కాన్సెప్ట్. ఈ దృక్పథం మనిషిలో విశృంఖలత్వాన్ని పెంచేసి, మనిషిని ఓ మృగంలా మార్చేస్తుంది.
ఎందుకంటే నేను బహిరంగంగా, ఒంటరిగా చేసే తప్పులకు ఎవరి ముందూ జవాబుదారీ కాదు, నా తప్పులను ఎవరూ పట్టుకోరు అన్న దృక్పథం మనిషిని మృగంగా మార్చుతుంది. ఎందుకంటే నా తప్పులకు నేను ఎవరికీ జవాబుదారీ కాదు అనుకున్నప్పుడు నీతీ- న్యాయం, మంచీ-మానవత్వం అన్న అదనపు బరువులను మోయాల్సిన అవసరం ఎందుకుంటుంది? వ్యభిచారం చేస్తూ కూడా నేను వ్యభిచారం చెయ్యటం లేదు కేవలం కోరికను తీర్చుకుంటున్నాను అంతే కదా అని జస్టిఫికేషన్లు ఇచ్చుకుని ఎలా పడితే అలా విశృంఖలంగా బ్రతికెయ్యటానికే అవకాశం ఉంటుంది.
కాబట్టి నాస్తికత్వం సమాజ సంస్కరణకు ఎప్పటికీ ఏ సొల్యూషన్నూ చూపలేదు. ఎందుకంటే నాస్తికత్వం దగ్గర విధి-విధానాలూ, సంస్కరణ సూత్రాలనేవేవీ ఉండవు దానికి తెలియవు కనుక.
దీనికి పూర్తి భిన్నంగా ధార్మిక గ్రంథాలు అవతరణ ఉద్దేశమే మత వ్యవస్థలో ముఢాచారాల్ని రూపుమాపి, ఏది తప్పో ఏది ఒప్పో దిశానిర్దేశం చెయ్యటం. తప్పితే మత వ్యవస్థలో మూఢనమ్మకాలకు, ముఢాచారాలను కారణం ధార్మిక గ్రంథాలు కావు. అలాగే మత వ్యవస్థలో మూఢనమ్మకాలకు, ముఢాచారాలకూ ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మానికీ సంబంధం ఉండదు.
వీలైతే ప్రజలకు వారు కలిగి ఉండే విశ్వాసాల విషయంలో వారి ధార్మిక గ్రంథాలు చెబుతున్న సమాచారం ఏమిటో చూపి, తప్పొప్పులను వివరించి, సంస్కరించటానికి ప్రయత్నించాలి. ఫలానా అంశం తప్పు అని చెప్పగలిగినప్పుడు ఏది కరెక్టో కూడా వివరించగలగాలి.
అంతేగానీ, ఎంతసేపు వారిలో లోపాల్ని దెప్పిపొడుస్తూ, వారి విశ్వాసాలను విమర్శిస్తూ, వాటి నమ్మకాలను వెటకారం చేస్తూ గడిపేయటం వల్ల కేవలం టైమ్ పాస్ అవుతుందేమో గానీ, సమాజం సంస్కరించబడదు. పైగా అలాంటి ధోరణిని సభ్యసమాజం హర్షించదు కూడా.
