“నిజంగా దేవుడే ఉంటే నేరాలూ ఘోరాలు జరుగుతాయా?” /-

ఇది పైకి వినటానికి చాలా న్యాయమైన ప్రశ్నలానే వినపడుతుంది. ఎక్కడైనా ఎవరైనా స్త్రీ గానీ లేదా చిన్న పిల్ల గానీ రేప్ కు గురైనప్పుడో లేదా సమాజంలో మరేదైనా ఘోరమైన నేరం జరిగినప్పుడో సాధారణంగా చాలామంది నాస్తికులు లేవనెత్తే ప్రశ్నే “నిజంగా దేవుడే ఉంటే ఇన్నేసి నేరాలూ ఘోరాలు జరుగుతాయా?” అని.

మరి కొందరైతే ఇంకాస్త ముందుకెళ్లి “నిజంగా దేవుడే ఉంటే ఫలానా పసిపిల్లకు రేప్ జరుగుతున్నప్పుడు ఆ పసిపిల్లను కాపాడొచ్చుకదా. కాపాడలేనివాడు దేవుడేలా కాగలడు? అసలు దేవుడే ఉంటే సమాజంలో చెడు మటుకు ఎందుకుండాలని” కూడా కూడా ప్రశ్నిస్తుంటారు. ఫైనల్ గా దేవుణ్ణి నమ్ముకున్నా, నమ్ముకోకపోయినా జరిగే నేరాలు ఎలాగూ జరుగుతుంటాయి. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రానా సమాజంలో నేరాలు ఆగిపోవు అని తమదైన స్వంత డిక్లరేషన్లు ఇస్తుంటారు.

“నిజంగా దేవుడే ఉంటే ఇన్నేసి నేరాలూ ఘోరాలు జరుగుతాయా? ప్రపంచంలో ‘చెడు’ అనేది ఉండి ఉండేదా?” అని ప్రశ్నించేవారి ప్రకారం సినిమాల్లో చూపించినట్టు సమాజంలో ఎక్కడ నేరం జరుగుతున్నా అక్కడ దేవుడు హీరో మాదిరిగా ఆకాశం నుండి ప్రత్యక్షమైపోయి కాపాడేసి వెళ్లిపోతుండాలన్న మాట!

మనిషి మస్తిష్కంలో మంచీ-చెడు అనే రెండు ఆలోచనలు అసలు ఎందుకున్నాయి? వాటితో పాటు మనిషికి మనిషికి మంచీ-చెడుల మధ్య విచక్షణ చేసే జ్ఞానం, బుద్ధీ, వివేకాలు ఎందుకివ్వబడ్డాయి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలీనోల్లే పై విధమైన పనికిమాలిన ప్రశ్నలు అడుగుతుంటారు.

కాబట్టి బుద్ధీ, జ్ఞానాలు ఉన్నవారు అర్థం చేసుకోవలసింది.. సృష్టిలో అణువు నిర్మాణం నుండి ప్రతీ వస్తువునూ జంటల సూత్రం ఆధారంగా నిర్మించిన సృష్టికర్త అయిన దేవుడే మనుషుల్లో స్త్రీ-పురుషుల జంటలను, వారి ఆలోచనల్లోనూ ‘మంచీ-చెడు’ అనే రెండు రకాల జంట ఆలోచనలను పెట్టాడు. పెట్టటమే కాక, మనిషికి మంచీ-చెడుల మధ్య విచక్షణ చేసే జ్ఞానాన్నీ పెట్టాడు. అలాగే మనిషి చెడు ఆలోచనలను ఎలా నియంత్రించుకోవాలి, మంచి ఆలోచనల ప్రకారం ఎలా జీవించాలి అన్న రెండు విషయాలను తెలియజేయటానికి మరియు ఆచరణాత్మకంగా నేర్పటానికి అనేక మంది ప్రవక్తలను పంపాడు, గ్రంథాలను అవతరింపజేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ధార్మిక గ్రంథాల మౌలిక లక్ష్యం- “మనిషి జీవన రంగంలో చెయ్యవలసిన-చెయ్యకూడని (do’s and don’ts) ఆదేశాల సంపుటి అన్న మాట!

భౌతిక సూత్రాల ఆధారంగా సృష్టించబడిన ఈ లోకంలో మనిషి తన సామర్థ్యాలను పెంపొందించుకుని కష్టపడి చెమటోడ్చి శ్రమిస్తేనే అతను కడుపు నింపుకోగలుగుతాడు అలాగే దేవుని అస్తిత్వాన్నీ ఆయన్ శక్తి-సామర్థ్యాలను యదార్థంగా గుర్తించి, బుద్ధీ వివేకాలతో ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకుంటేనే మనిషి చెడు ఆలోచనలను నియంత్రించుకోగలుగుతూ.. మంచి ఆలోచనల ప్రకారం నడుచుకోగలుగుతాడు అన్న ఆదేశాలనే స్వయంగా సృష్టికర్త అయిన దేవుడు ధార్మిక గ్రంథాల్లో తెలియజేయటం జరిగింది.

కాబట్టి ప్రపంచంలో అనేక కోట్ల జీవరాసుల్లో మంచీ-చెడుల మధ్య విచక్షణ చేసే సామర్థ్యం, ఆ రెండిటిలో దేన్నైనా ఎన్నుకుని దాని ప్రకారం జీవించే స్వేచ్చ ఇవ్వబడింది ఒక్క మనిషికి మాత్రమే. ఈ మనిషికి ధార్మిక గ్రంథాలు అతనికి ఒంటరిగా ఉన్నా తనలో సహజంగా కలిగే చెడు ఆలోచనలను నియంత్రించుకుంటూ మంచి ఆలోచనల ప్రకారం ఎలా నడుచుకోవాలి? అన్న విషయాన్ని నేర్పుతాయి.. ‘మంచి’ ఆలోచనల ప్రకారం నడుచుకోవటం వల్ల కలిగే ‘శాశ్వత లాభాలు’.. ‘చెడు’ ఆలోచన వల్ల కలిగే ‘శాశ్వత నష్టాలను’ వివరిస్తాయి.

కాబట్టి సృష్టికర్తైన దేవుడు ఉన్నాడనటానికి గుర్తు ప్రజలు నేరాలకు పాల్పడినప్పుడల్లా ఆకాశం నుండి దిగొచ్చేసి కాపాడి వెళ్లిపోవటం కాదు. అలాంటి వాగ్దానం దేవుడు ధార్మిక గ్రంథాల్లో ఎక్కడా చెయ్యలేదు కూడా. కానీ, సృష్టికర్త అయిన దేవుడు సమాజంలో నేరాలూ, ఘోరాలూ జరగకుండా ముందుగానే వాటికి కారణమయ్యే ప్రతీ చెడునూ నిషేధించటం జరిగింది. అయినప్పటికీ ఒకవేళ సమాజంలో వ్యక్తులు చెడుల్లో కూరుకుపోతే తద్వారా వాటిల్లే నష్టాన్ని మీరు చేతులారా కొని తెచ్చుకున్నట్టే అవుతుందని ముందే హెచ్చరించటం జరిగింది.

ఉదాహరణకు ఖురాన్ స్త్రీ-పురుషులకు ఇచ్చిన ఆదేశాలు గమనిస్తే..

పురుషులకు:

1. పరాయి స్త్రీల విషయంలో మీ చూపులను కాపాడుకోండి.
2. అశ్లీల్ల విషయాలకు దూరంగా ఉండండి.
3. చివరకు వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్లకండి.
4. మత్తు కలిగించే పదార్థాలకు దూరంగా ఉండండి.
5. స్త్రీలతో ఉత్తమోత్తమ పద్ధతిలో వ్యవహరించండి.

స్త్రీలకు:

1. మీ శరీర భాగాలు పూర్తిగా కప్పబడేలా దుస్తులు ధరించండి.
2. అదనంగా తలపై నుండి భుజాల వరకూ వస్త్రాన్ని కప్పుకోండి.
3. పరాయి పురుషుల విషయంలో మీ చూపులను కాపాడుకోండి.
4. మీ అలంకరణ విషయంలో హద్దులు మీరకండి. మీ భర్తలకు తప్ప పరాయి పురుషుల ముందు మీ అలంకరణను ప్రదర్శించకండి.

ఒక్క క్లిక్ తో ఇంటర్నెట్ లో కుప్పలు తెప్పలుగా వచ్చిపడే పోర్న్ సైట్లు, యువత భావోద్రేకాలను రెచ్చగొట్టే వెబ్ సిరీసులు, వెకిలితనం-శృంగారాన్ని వినోదంగా మార్చి డబ్బు చేసుకునే సినిమాలూ, సీరియళ్లూ, ప్రభుత్వాలే లైసెన్సులిచ్చి నడిపే లిక్కర్ షాపులు, బార్లు, పబ్బులు వగైరా వాటితో మార్గం తప్పిపోయిన సమాజం పై ఖురాన్ ఆదేశాలకు ఎంత దూరంలో ప్రయాణిస్తుందో ఏ కాస్త బుద్ధి ఉన్నోల్లైనా అంచనా వెయ్యవచ్చు.

అలాంటి మార్గం తప్పిపోయిన సమాజంలో ఆరేళ్ల పసిపాపల నుండి అరవయ్యేళ్ల స్త్రీల వరకూ నిముషానికి ఒకొక్కరు చొప్పున సర్వసాధారణంగా అత్యాచారాలకు గురవ్వటం వింతేమీ కాదు. కాబట్టి దేవుడు నిషేధించిన వాటిని పెడచెవిన పెట్టి, నగ్నత్వంలో, అశ్లీల్లంలో, మధ్యం మత్తులో మునిగి తేలుతున్న సమాజాన్ని తీర్చిదిద్దటం ప్రక్కన పెట్టి.. పైగా దేవుడే ఉంటే ఇన్నేసి నేరాలూ, ఘోరాలూ జరుగుతాయా? అంటూ తలాతోకా లేని పనికిమాలిన స్టేట్మెంట్లు ఇవ్వటం హాస్యాస్పదం అవుతుంది.

వాస్తవానికి దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల మనిషిలో చెడు అన్నది దానంతట అదే మాయమైపోదు.. కానీ, దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల, దైవాదేశాలనూ పాటించటం వల్ల మనిషి నేరం చెయ్యకుండా తనను తాను నియంత్రించుకోవటాన్ని నేర్చుకోగలుగుతాడు.

మరి నేడు నేరాలు చేస్తున్నవారిలో చాలా మంది ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకుంటున్న వారేగా? అన్న మరొక ప్రశ్న వస్తుంది. ఇక్కడ ‘దేవుడు’ అంటే కనపడ్డ రాళ్లూ రప్పలో, చెట్లూ చేమలో, జంతువులో లేక ప్రజలు సృష్టించుకున్న మిద్యా దైవాలో కాదు సమస్త సృష్టిని ఉనికిలోకి తెచ్చి, హైందవ, బైబిల్, ఖురాన్ గ్రంథాల్లో సర్వేశ్వరుడిగా, యెహోవాగా, అల్లాహ్ గా పిలువబడిన సృష్టికర్త అయిన దేవుడు అని అర్థం. ఆయన ఆదేశాలను, విధి-నిషేధాలను పాటించిచినప్పుడే మనిషి చెడు చెయ్యటం నుండి తనను తాను నియంత్రించుకుని, మంచి ఆలోచనల ప్రకారం జీవించగలుగుతాడు. ఈ దైవాదేశాలను చిన్నతనం నుండే తలిదండ్రులు పిల్లలకు నేర్పాలి. సమాజంలో సర్వసామాన్యం చెయ్యాలి.

దీనికి బదులు నేడు కొందరు ఆడ పిల్లలకు గుడ్ టచ్- బ్యాడ్ టచ్ ల గురించి కౌన్సిలింగులు ఇవ్వాలంటూ, పర్సనాలిటీ డవలప్మెంట్ క్లాసులు ఎన్ని నిర్వహించాలంటూ ఎన్ని రకాల పరిష్కారాలు చూపినా అవన్నీ టైమ్ పాస్ వ్యవహారాలుగానే మిగిలిపోతాయి.

అసలు సమాజంలో బ్యాడ్ టచ్ చెయ్యటానికి కారణమయ్యే ప్రతీ అంశాన్నీ లేకుండా చెయ్యాలి. అంటే.. పోర్న్ వెబ్ సైట్లను, మత్తు పదార్థాలనూ, విచ్చలవిడి సెక్స్, హింసను, మత్తు పదార్థాల సేవనాన్ని నేర్పించే సినిమాల వరకూ నిషేధించి యువతను ఆధునిక విద్యతో పాటు ధార్మిక గ్రంథాల్లో చెప్పబడిన నైతిక విలువల అవగాహన కల్పించాలి.

అవేమీ చెయ్యకుండా పోర్న్, విచ్చలవిడి సెక్స్, మత్తు పదార్థాల సేవనం వ్యక్తిగతమని.. స్త్రీలు ఎంత తక్కువ దుస్తులు ధరించి రోడ్లపై తిరిగితే అంత సాధికారత సాధించినట్టని కాళీ సమయాల్లో పనికిమాలిన అభ్యుదయవాదం ప్రదర్శిస్తూ.. ఏదైనా నేరమో, ఘోరమో జరిగితే.. దేవుడే ఉండి ఉంటే ఇన్నేసి నేరాలు ఘోరాలూ జరుగుతాయా? అని ప్రశ్నించటం ఒట్టి మూర్ఖత్వమే అవుతుంది.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *