నిజమైన హేతువాదులు ఎవరు?

మొత్తం ప్రపంచంలో అనేక మతాల, కులాల, నాస్తిక వర్గపు ప్రజలున్నప్పటికీ మొత్తం మానవ జాతిలో మంచివారు-చెడ్డవారు, హేతుబద్ధంగా ఆలోచన చేసేవారు-హేతువిరుద్ధంగా ఆలోచన చేసేవారన్న రెండే రెండు రకాల ప్రజలు గా వర్గీకరించబడతారు.
ఏ విషయాన్నైనా అంగీకరించటానికైనా లేదా తిరస్కరించటానికైనా సరే ఎందుకు? ఏమిటి? ఎలా? అన్న ప్రశ్నలు వేసుకుని లోతైన పరిశీలన, ఆలోచన చేసే వారే నిజమైన హేతువాదులు అనబడతారు.

దీనికి భిన్నంగా నిజనిజాలను, సత్యాసత్యాలను గురించి “పరిశీలన” “ఆలోచన” చెయ్యకుండా తమకు తోచిందే కరెక్ట్ అని డిక్లేర్ చేసేసుకుని, తమ వాదనే పైనుండాలని ఎదుటి వారు చెప్పే దానిపై కనీస ఆలోచన చేయకుండా అక్కడితో తమ మెదళ్లకు గోళ్లెం పెట్టి, తాళం వేసేసుకునే వారంతా కేవలం మూర్ఖులే అవుతారు! ఈ రెండు రకాల వ్యక్తులు ఏ వర్గంలో నైనా ఉండవచ్చు. అది ఏ మత వర్గమైనా కావొచ్చు లేదా నాస్తిక వర్గమైనా కావొచ్చు.
…………………

మత వ్యవస్థలో హేతువాదులు – మూఢులు

మతవ్యవస్థలో హేతువాదులు ఎందుకుంటారని కొందరు ఆశ్చర్య పడవచ్చు. ఉదాహరణకు మతవ్యవస్థలో ఏకైక సృష్టికర్త అయిన దేవుడిని గురించి హేతుబద్ధంగా ఆలోచన చేసి నమ్మే నిజ ఆస్తికులూ ఉంటారు. తమ లాంటి పుట్టి చనిపోయే మానవులను లేదా జంతువులను ఇష్టదైవాలుగా చేసుకుని పూజించే నామమాత్ర ఆస్తికులు కూడా ఉంటారు. కాబట్టి ఆధ్యాత్మిక వ్యవస్థలో ఉండే వారందరినీ కలిపి ఆస్తికులు అని అన్నప్పటికీ.. అందులో హేతుబద్ధంగా ఆలోచన చేసే ఆస్తికులు, సెంటిమెంటల్ గా లేక మూఢత్వంగా వ్యవహరించే నామమాత్ర ఆస్తికులు అని రెండు రకాల ఆస్తికులు ఉంటారన్నది గమనించాలి.

హేతుబద్ధంగా ఆలోచన చేసే ఆస్తికులు ఎవరు? వారి ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే.. ఎవరైనా “ఫలానా దాన్ని/అతన్ని దేవునిగా చేసుకుని పూజిస్తే మీకు లాభం కలుగుతుంది” అని చెబితే.. గుడ్డిగా నమ్మేయడు. ఆ ఫలానా దానికి/అతనికి ఈ సమస్త సృష్టిని ఉనికిలోకి తెచ్చి క్రమబద్ధంగా నడపటంలో భాగస్వామ్యం ఏదైనా ఉందా? లేక అది/అతను కూడా అనేక సృష్టితాలలో ఒక భాగామా? అన్న కోణంలో ఆలోచిస్తాడు.

సృష్టికర్త అయిన దేవుడు అనేవాడు సమస్త సృష్టిని ఉనికిలోకి తెచ్చి, దానిని ఎంతో క్రమబద్ధంగా నడుపుతున్నవాడు, ఎప్పటికీ చనిపోనివాడు, పుట్టేవాడు కానప్పుడు.. పుట్టి చనిపోయే, కొన్నాళ్లకు నాశనమైపోయే ఏదైనా/ఎవరైనా పూజించబడటానికి ఎలా అర్హులవుతారు? అన్న కోణంలో ఆలోచించటం మొదలెడతాడు. ఇదే అసలైన హేతుబద్ధమైన ఆలోచనా విధానం అంటే.

అదే హేతువిరుద్ధంగా ఆలోచించే మూఢులైతే.. “ఫలానా దాన్ని/అతన్ని దేవునిగా చేసుకుని పూజిస్తే మీకు లాభం కలుగుతుంది” అని ఎవరో చెబితే.. గుడ్డిగా నమ్మేసి అతను చెబుతుంది నిజమే కాబోలు లేదంటే అంతమంది ఎందుకు దాన్ని/అతన్ని పూజిస్తారని మెదడును లాక్ చేసేసుకుని అనాలోచితంగా అడ్డదిడ్డమైన పూజాపునస్కారాలు చెయ్యటం మొదలెడతాడు.

ఉదాహరణకు బైబిల్లో యేసు తనకు అతీతంగా ఉన్న యెహోవా దేవుడిని గురించి ప్రస్తావించినట్టు, ఆయనను ప్రార్ధించినట్లు కొన్ని వందల వాక్యాల్లో చూడగలం. అయినప్పటికీ యేసు మరొక దేవుని ప్రస్తావన చేశారంటే.. యేసు దేవుడేలా కాగలరు?అసలైన దేవుడు ఒకడున్నట్టే కదా? ఆయన ఎవరు? ఆయన గుణ లక్షణాలు ఏమిటి? అన్న కోణంలో కొందరు హేతుబద్ధంగా పరిశీలన చేసేవారే ఆలోచించగలుగుతారు. దీనికి భిన్నంగా “ఆబ్బే యేసు బాబే దేవుడండీ.. మా చర్చీలో పాస్టర్ అలానే చెప్పారని వాదించేసి గుడ్డిగా నమ్మేసేవారంతా తమ మెదళ్లకు తాళం పెట్టేసిన వారనే చెప్పాలి.

ఆలాగే రాముడు, కృష్ణుడు వగైరా మహనీయులందరి బోధలు జాగ్రత్తగా గమనిస్తే వారు తమకు అతీతంగా సర్వేశ్వరుడైన దేవుడి గురించి ప్రస్తావించినట్టు, ఆయన్ని ప్రార్ధించినట్టు చూడగలం. వారంతా అందరిలానే పుట్టి, చనిపోవటం కూడా అందరికీ తెలిసిందే. చివరకు చాలా మంది పూజించే నిన్నా మొన్నటి సాయిబాబాను గమనించినా “సబ్ కా మాలిక్ ఏక్ హై” అన్నది అతని నినాదం.
దేవుడు ఒక్కడే ఆయన్నే ఆరాధించాలని సాయిబాబా చెబుతూనే చనిపోవటం జరిగింది.

అలాగే తమలాగే పుట్టి చనిపోయిన కొందరు భక్తుల సమాధులను అందంగా అలంకరించి దానిపై దర్గాలు నిర్మించుకుని తమ ప్రార్ధనలు నెరవేరాలని/దేవుని వద్దకు చేరాలని అక్కడకు వెళ్లే ముస్లిములు కొందరుంటే.. వారి వద్ద ఉన్న ఖురాన్ గ్రంథంలోనే “అల్లాహ్ మీ కంఠ రక్తనాళం కంటే మీకు చాలా దగ్గరగా ఉన్నాడు, ఆయన మీ ప్రార్ధనలన్నిటినీ వింటున్నాడన్న” నిజాన్ని గ్రహించి హేతుబద్ధంగా ఆలోచన చేసి, ఏకైక సృష్టికర్తను మాత్రమే ప్రార్ధించే ఆలోచనాపరులైన వ్యక్తులూ ఉంటారు.

ఈ విధంగా అనేక కాలాల్లో రాముడు, కృష్ణుడు, యేసు వగైరా ప్రవక్తలు, రుషులు పరిచయం చేస్తున్న ఆ సర్వేశ్వరుడు లేక అల్లాహ్ లేక యెహోవా అంటే ఎవరు? ఆయన గుణలక్షణాలేమిటి? ఆయనను ఎలా గుర్తించాలి? అన్న కోణంలో హేతుబద్ధంగా ఆలోచన చేసే వారు కొందరుంటారు.

దీనికి విరుద్ధంగా “అబ్బే ఆయా మహనీయులంతా దేవుడు గురించి చెప్పారంటే.. దేవుణ్ణి వారంతా ప్రార్ధించారంటే వాళ్లు కూడా దేవుళ్లే అయి ఉంటారని లేక దేవుని అవతారాలని పనికిమాలిన సెంటిమెంట్లు మెదడులో పెట్టుకుని, ఆ మెదడును మోకాలి చిప్పలక్రింద దాచి పెట్టేసి వాళ్లనే గుడ్డిగా పూజించేవారు కూడా ఉంటారు.
…………………

నాస్తికుల్లో అసలైన హేతువాదులు – మూఢులు

ఈ సృష్టంతటికీ ఒక కర్త లేడు అని విశ్వసించే నాస్తికులైనప్పటికీ.. “సృష్టికర్త అనేవాడు లేడనేది మా విశ్వాసం. అయినప్పటికీ.. కనీసం ఈ సృష్టిని గురించి, సృష్టికర్త అనే దృక్పథం గురించి ఎందుకు? ఏమిటి? ఎలా? అన్న కోణంలో ఆలోచన చేస్తామని” చెప్పేవారే నాస్తికుల్లో అసలైన హేతువాదులు అవుతారని చెప్పవచ్చు.
ఎందుకంటే.. సృష్టికర్త అనేవాడు లేడు అని నమ్మటం నాస్తికత్వమే కావొచ్చు.. కానీ, సృష్టి, సృష్టికర్త పట్ల అసలు ఆలోచన చెయ్యకపోవటం నాస్తికత్వం కాదు కదా.

అసలు “మేము సృష్టి, సృష్టికర్త గురించి శాస్త్రీయ ఆలోచన ఎందుకు చెయ్యాలి? మేము అలా చెయ్యము. చెయ్యాల్సిన పనిలేదు. ఈ సృష్టికి ఏ కర్తా లేడు అదంతా బోడి గాలివాటంగా అలా ఏర్పడియిపోయింది అంతే.. కాబట్టి మేము చెప్పిందే ఫిక్స్.. అదే ఫైనల్. దానిమీద మేము డిస్కషన్లు చెయ్యము. పైగా సృష్టిని గురించి సృష్టికర్తను గురించి ఆలోచించటమే పెద్ద టైమ్ వేస్టు వ్యవహారమని చెప్పి తమ మెదళ్లకు లాక్ పెట్టేసుకునే వారంతా కేవలం నామమాత్ర హేతువాదులు, మూఢత్వపు నాస్తికులని చెప్పవచ్చు.

చివరకు ధార్మిక గ్రంథాలు సైతం ప్రత్యక్షంగా కనపడుతున్న సృష్టిని గురించి హేతుబద్ధంగా ఆలోచించి, సృష్టికర్తను గుర్తించమంటున్నాయి తప్పితే.. అనాలోచితంగా గుడ్డిగా మీరు దేవుణ్ణి నమ్మేయాల్సిందే అని చెప్పటం లేడు. ఉదాహరణకు ఖురాన్ ను గమనిస్తే..

“భూమీ, ఆకాశాల సృష్టిలో రేయింబవళ్లు ఒకదాని తరువాత మరొకటి రావటంలో, నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అన్ని వేళలా అల్లాహ్ ను స్మరించే, భూమీ ఆకాశాల నిర్మాణం గురించి ఆలోచన చేసే వివేకవంతులకు ఎన్నో సూచనాలు ఉన్నాయి” – ఖురాన్ 3:190

“భూమిపై తిరగండి, ఆయన సృష్టిని ఏ విధంగా ప్రారంభించాడో చూడండి” – ఖురాన్ 29:20

అలాగే బైబిల్లో సైతం ఈ విషయాన్ని గమనించగలం.

“ఆయన అదృశ్యాలక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, ఆయన దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది” – రోమా 1:20

కాబట్టి ఏ విషయాన్నైనా అంగీకరించటానికైనా లేక
తిరస్కరించటానికైనా శాస్త్రీయ పరిశీలన, ఆలోచన చేసేవారే అసలైన హేతువాదులు అవుతారు. శాస్త్రీయ పరిశీలన, నిరూపణ లేకుండా మేము నమ్మింది/చెప్పింది ఫైనల్ ఇక ఆలోచించాల్సిన అవసరం లేదని నిర్ధారించేసుకుని, తాము నమ్మిందే నిజమనే భ్రమలో బ్రతికేసేవారంతా కేవలం ఆలోచనలేని మూర్ఖులన్న మాట. వారు నాస్తికులైనా లేదా ఆస్తికులైనా సరే! మరి మీరేమంటారు?

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *