ఎలియన్స్ ను చూసే చెబుతున్నారా ఈ మాట..!?

హమ్మయ్యా మొత్తానికి ఎలియన్స్ ఉన్నారని కనిపెట్టేశారు మన శాస్త్రవేత్తలు. అవునా? ఎలా? ఉంటే ఎలా ఉంటారు వారు? మన శాస్త్రవేత్తలు ఎలియన్స్ ను చూసే చెబుతున్నారా?

లేదు…

మరి చూడకుండా ఎలా చెబుతున్నారు?

ప్రత్యక్షంగా చూస్తేనే కదా ఉన్నారని చెప్పగలిగేది?

లేదంటే ఎలియన్స్ ఉన్నారన్నది మూఢనమ్మకమవుతుంది కదా?

???????????

ఇంతకూ మన శాస్త్రవేత్తలు ఎలియన్స్ జాడ కనిపెట్టింది ప్రత్యక్షంగా చూసి కాదు కొన్ని “అనుమాన ప్రమాణాల” ఆధారంగా అన్నమాట!

“అనుమాన ప్రమాణం” అంటే…

లక్షల కోట్ల నక్షత్రాలూ గ్రహాలున్న ఈ సువిశాల విశ్వంలో మానవుడు ఒంటరివాడు కాడు.. భూమికి ఆవల ఎన్స్ లాడెస్ అనే శనిగ్రహం తాలూకు ఉపగ్రహం నుండి వేడి నీటి ఆవిర్లు అంతరిక్షంలో ఎగజిమ్ముతున్నట్టు కనిపెట్టారు. ఆ నీటి ఆవిర్లో మిథేన్ వాయువు ఉందని తేల్చారు. అంతరిక్షంలో మిథే న్అన్నది ఏ గ్రహంపైనా ఉండదు. జీవజాలం ఉన్నచోట మాత్రమే మిథేన్ ఉంటుందన్నది శాస్త్రవేత్తల వాదన!

కాబట్టి అక్కడ మెథనోజెన్స్ గా పిలువబడే సూక్ష్మ జీవులు ఉండే అవకాశం ఉండి ఉండవచ్చు కాబట్టి భవిష్యత్తులో అక్కడ ఇతర జీవులు పరిణామం చెందే అవకాశం ఉండొచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా.

ఈ విధంగా మనిషి ప్రత్యక్షంగా కళ్లతో చూడలేని వాటిని.. ఊహ, అంచనాలను అధిగమిస్తూ.. కొన్ని “అనుమాన ప్రమాణాల” ఆధారంగా పరిశీలన చేసి “యథార్థం” “వాస్తవాల” మీదుగా ప్రయాణించి, “నిర్థారణ” వద్దకు చేరుకుంటారు. సైన్స్ ఈ సూత్రం మీదే ఆధారపడి అణువు నిర్మాణం నుండి ఎన్నో విషయాల వాస్తవికత గురించి నిర్వచించగలిగింది.. ఎన్నో ఆవిష్కరణలు చేసింది.

విశ్వంలో ఎక్కడైతే “మిథేన్” వాయువు ఉంటుందో అక్కడ జీవజాలం ఉంటుందని అంచనా కడితే అది సైన్స్..

ఒకవేళ అదే విశ్వం పటిష్టమైన నియమాల ఆధారంగా ఎంతో క్రమబద్ధంగా నడుపబడుతుంది కాబట్టి.. ఆ నియమాలను ఏదో అదృశ్య శక్తి కచ్చితంగా నియంత్రిస్తుండాలని అంచనా కడితే మటుకు అది కొందరి దృష్టిలో అజ్ఞానం..

విశ్వంలో ఎక్కడైతే మిథేన్ ఉంటుందో అక్కడ జీవజాలం ఉండవచ్చు అని నమ్మాలి.. ఎక్కడైతే జీవజాలం ఉంటుందో అక్కడ ఆ జీవాన్ని కలగజేసేవాడు కూడా ఒకడు ఉండి ఉండాలి కదా అని లాజికల్ గా మటుకు ఆలోచించకూడదు..

మనుషులు క్రమశిక్షణతో మెలగాలంటే.. వారిని నియంత్రించేవాడు ఒకడు కచ్చితంగా ఉండాలని నమ్మాలి.. అదే ఈ మహత్తర విశ్వం ఎంతో క్రమశిక్షణ (Discipline) తో నడుపబడుతుందంటే దానిని నియంత్రించేవాడు కూడా ఒకడు ఉండి ఉండాలి కదా అని మటుకు లాజికల్ గా ఆలోచించకూడదు..

ఒక చక్కటి పెయింటింగ్ వెయ్యాలన్నా ఎంతో క్రమబద్ధతతో గీయగలిగే ఒక కళాకారుడు ఉన్నప్పుడే సాధ్యం అని కచ్చితంగా నమ్మాలి.. అదే ఈ సమస్త సృష్టి శక్తివంతమైన నియమాల ఆధారంగా ఎంతో క్రమబద్ధతతో అదుపు చెయ్యబడుతూ ఉందంటే దాని వెనుక ఏదో ఒక అదృశ్య శక్తి పనిచేస్తూ ఉండాలి కదా అని మటుకు లాజికల్ గా ఆలోచించకూడదు..

ఇలా మోకాలి చిప్పలక్రింద మెదడును పెట్టుకుని అర్థంపర్థం లేకుండా ఇల్లాజిగ్గా మాట్లాడటమే ఇప్పుడు కొందరు ఫాలో అవుతున్న లేటెస్టు ట్రెండ్ తెలుసా!

—————— Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *