సృష్టికర్త – “శాస్త్రీయ పరిశీలన”

“ఈ విశ్వానికి ఒక సృష్టికర్త అంటూ ఎవడూ లేడు. 13 కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వమంతా ఎనర్జీతో అంటే శక్తితో కూడిన ఒక బిందువుతో ప్రారంభమైంది. ఆ ఎనర్జీ లోని పదార్థామూ (Matter), ప్రతిపదార్థం (Antimatter) తాలూకు కణాలు ఒకదానినొకటి ఘర్షించుకోవటం మూలానా క్రమంగా పదార్థ కణాలు (Matter particles) ఏర్పడుతూ తద్వారా నక్షత్రాలూ గ్రహాలు ఏర్పడ్డాయి. ఇదంతా యాక్సిడెంటల్ గా అంటే దానంతట అదే జరిగిపోయిన ప్రక్రియ తప్పితే దానికి కారణం అంటూ ఎవరూ లేరు” ఇదీ నాస్తికులు నిత్యం చేసే వాదన.
***

విశ్వ వ్యవస్థ ఎలా ఏర్పడింది? అన్న ప్రశ్నకు సైన్స్ అనేక పరిశోధనలు చేసి అంచనావేసి చెబుతున్న పై సిద్ధాంతాన్ని ఒప్పుకోవటంలో తప్పులేదు. కానీ, ఇంతపెద్ద “క్రమబద్ధమైన వ్యవస్థ (Disciplined System)” ఏ “మేధ (Intelligence)” లేకుండానే పనిచేస్తుందని వాదిస్తున్న నాస్తికుల వాదనే విచిత్రమైనది. ఈ విశ్వ వ్యవస్థ ఏర్పడటం వెనుక ఏ సృష్టికర్తా లేడని బల్లగుద్ది తీర్మానించే నాస్తికులు మటుకు ముందుగా తెలుసుకోవలసిన అంశాలు:

1. ఆధునిక సైన్స్ ద్వారా ఇప్పటి వరకు జరిగింది విశ్వవ్యవస్థ తాలూకు 4% పరిశోధన మాత్రమే! మిగతా 96 శాతం విశ్వవ్యవస్థ పరిధి ఎంత? దాని పై పనిచేస్తున్న సూత్రాలేమిటి? వాటి రహస్యాలేమిటి? అన్నవి నేటి ఆధునిక శాస్త్రవేత్తల అవగాహనా పరిధిలోకి రాని ఓ పెద్ద మిస్టరీ. వారి ద్వారా కనుగొనబడని ఆ 96 శాతాన్నే “డార్క్ ఎనర్జీ” లేదా “డార్క్ మేటర్” అని పేర్కొనటం జరిగింది.

2. విశ్వం మొత్తం బిగ్ బ్యాంగ్ ద్వారా ఏర్పడిందని చెప్పే సైన్స్.. ప్రారంభంలో ఏమీ లేని స్థితిలో విపరీతమైన ఎనర్జీ ఎలా ఏర్పడింది, తద్వారా పదార్థం (Matter) ఏర్పడటానికి అవసరమైన వివిధ మూలకాలు, గ్యాసెస్ ఎలా ఏర్పడ్డాయి? అన్న దానికి సైన్స్ దగ్గర సమాధానం లేదు.

సైన్స్ అనేక పరిశోధనలు చేసి విశ్వవ్యవస్థ ఎలా ఏర్పడిందన్న ప్రక్రియను ఊహించి వివరించగలుగుతుంది తప్పితే ఆ బృహత్తర వ్యవస్థ అంత క్రమబద్ధంగా అదుపు (Control) చెయ్యబడటం వెనుక పనిచేస్తున్న “మేధ (Intelligence)” అసలు ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నాస్తిక మేధావులు సైన్స్ చెబుతున్న దాన్నే చెప్పి విశ్వవ్యవస్థ వెనుక ఏ సృష్టికర్తా లేడని వాదిస్తుంటారు.

96 % విశ్వ రహాస్యాలు కనుగొనబడకుండానే.. ఇప్పటివరకూ కనుగొనబడిన కేవలం 4 % విశ్వ వ్యవస్థను చూసే ఈ విశ్వం వెనుక ఏ మేధాస్సూ పని చెయ్యటం లేదని పరిమిత జ్ఞానంతో తీర్మానించటం ఎంత అజ్ఞానం? అన్న విషయాన్ని ప్రక్కన పెడితే..
వాస్తవానికి విశ్వం అనే అతి పెద్ద వ్యవస్థ (System) ను జాగ్రత్తగా గమనిస్తే అది…

క్రమబద్ధమైన ప్రక్రియ (Systematic process)
పటిష్టమైన క్రమం (Order)
గంభీరమైన క్రమశిక్షణ (Discipline)
సమతూల్యత (Balance)
అర్థవంతమైన ప్రక్రియ (Meaningful process)
ప్రయోజనక ఫలితాలు (Beneficial results)
కచ్చితమైన కొలతలు (Accurate Mathematical measures)

అనే ఏడు ప్రత్యేకతలు కలిగి, “అదుపు (Control)” చెయ్యబడుతూ ఉందనే విషయాన్ని గమనించగలం.
ఈ విధమైన ప్రత్యేకతలతో కూడిన ఒక వ్యవస్థ (System) నిరంతరాయంగా అదుపు (Control) చెయ్యబడటం వెనుక తప్పనిసరిగా ఒక “మేధ (Intelligence)” లేనిదే సాధ్యం కాదు. ఏ మేధా పని చెయ్యని వ్యవస్థలో పై ప్రత్యేకతలు ఉండవు. చివరకు ఒక చిన్న పరిశ్రమ స్థాపించి దాన్ని సక్రమంగా నడపాలన్నా పై ఏడు ప్రత్యేకతలు ఉండి, దాని వెనుక ఒక మేధ (Intelligence) తప్పనిసరిగా పని చెయ్యాలి.

అబ్బే, అవసరం లేదు! అని చెప్పటం ఎలాంటిదంటే.. ప్రకృతిలో వివిధ లోహాలూ, ఖనిజాలు, రసాయనాలు, గ్యాసెస్ వగైరా మూలకాలాలన్నీ వాటంతట అవే భూమిలో నుండి పైకొచ్చేసి, కొన్ని ఆకారాలుగా రూపాంతరం చెంది, అవన్నీ క్రమంగా ఒకదానికొకటి అమర్చబడి యాక్సిడెంటల్ గా మొబైల్ ఫోన్ గా తయారై నా చేతిలోకి వచ్చేసిందని సోది చెప్పటం లాంటిదన్న మాట!

కేవలం “పిరమిడ్స్” కట్టడాల వెనుక ఏ విధమైన మేధ (Intelligence) పనిచేసిందో ఈనాటి ఆధునిక సైంటిస్టుల అంచనాలకు సైతం చిక్కటం లేదు.. అటువంటప్పుడు ఇంతపెద్ద విశ్వవ్యవస్థ అనే కట్టడం వెనుక ఏ మేధాశక్తీ పని చెయ్యటం లేదని అంటే దాన్ని అజ్ఞానం, మూర్ఖత్వం అనటం కూడా తక్కువైపోతుంది.
***

పోనీ, నాస్తికులు ఈ విషయాన్ని ఒప్పుకుంటారా?

సృష్టి దానంతట అదే ఏర్పడిపోయింది ఎవరూ సృష్టించలేదు అని వాదించే నాస్తికులు..
“విశ్వంలో అనేక కోట్ల గ్రహాలు, నక్షత్రాలు ఎంతో తెలివిగా తమంతట తామే ఎంతెంత పరిమాణాల్లో తయారవ్వాలో ఎంతెంత దురాల్లో ఉండాలో ఆలోచించుకుని.. ఏ గోళం సూర్యునిగా మారి మండుతుండాలి.. ఏ గోళం జీవజాలానికి అనువుగా ఉండాలన్నది కూడా తామే నిర్ధారించుకుని.. పైగా ఆయా గ్రహాల్లో కొన్ని ఎంతెంత వేగంతో తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలో నిర్ణయించుకుని.. ఏ యే కక్ష్యల్లో ఉండాలో.. ఉంటూ ఎంతెంత వేగంతో తిరుగుతుండాలో కూడా వాటికవే చాలా తెలివిగా రూపకల్పన చేసుకుని.. ఆయా గ్రహాలన్నీ తమ కక్ష్యల నుండి తప్పిపోకుండా కావలసినంత గురుత్వాకర్షణ శక్తిని కూడా తమకుతాముగా సృష్టించుకుని.. గొప్ప మేధాస్సూ, ఆలోచనా, తెలివితేటలతో విశ్వంలో ఉన్న కోట్లాది గ్రహాలన్నీ ఎంతో క్రమబద్ధంగా తమను తాము అదుపు చేసుకుంటున్నాయి” అని ఒప్పుకోగలరా?

“నాకు సృష్టికర్త అనేవాడు కనపడలేదు.. కాబట్టి సృష్టికర్త లేడు” అనే తీర్మానం చేసే నాస్తికులకు అవగాహన లేని విషయం:- ఈ భూమిపై ఇతర జీవులకు లేని ఒక్క మనిషికి మాత్రమే ఉన్న ప్రత్యేక సామర్థ్యాల్లో ఒకటి- అతని కళ్లకు ప్రత్యక్షంగా కనపడని వాస్తవాలను “పరోక్ష ప్రమాణాల” ఆధారంగా శాస్త్రీయ పరిశీలన చేసి గ్రహించగలగటం పైగా వాటి వాస్తవికతను వివరించగలగటం.

ఈ ప్రత్యేక సామర్థ్యం (Ability) మనిషికి ఇవ్వబడటం కారణంగానే ఈ సృష్టిలో మనిషి తనకు ప్రత్యక్ష్యంగా కనపడని/అగోచరమైన వాటిని పరోక్ష ప్రమాణాల ఆధారంగా “శాస్త్రీయ పరిశీలన” చేసి గుర్తించగలుగుతుంటాడు.

అందుకే ఈ విశ్వ వ్యవస్థను తయారు చేసి ఎంతో క్రమబద్ధత(Discipline) తో నడుపుతున్న ఆ సృష్టికర్త “శాస్త్రీయ పరిశీలన” చేసి తనను గుర్తించటానికే గొప్ప మేధ (Intelligence) తో నడుపబతున్న ఈ విశ్వవ్యవస్థను మనుషుల ముందుంచాడు. వారికి ఆలోచన చెయ్యటానికి, శాస్త్రీయ పరిశీలన చెయ్యటానికి మెదడనేది ఇచ్చాడు.

ఈ విశ్వవ్యవస్థను శాస్త్రీయ పరిశీలన చేస్తే.. దాని వెనుక ఒక మేధ పనిచేస్తుందని అర్థమవుతుంది. ఒకవేళ ఎవరూ లేరు అని తీర్మానిస్తే నాస్తికులు ఈ తీర్మానం ఏ “శాస్త్రీయ ప్రయోగాల” ఆధారంగా చెబుతున్నారో రాతపూర్వక ఆధారాలను ప్రవేశపెట్టాలని కోరుతున్నాను.

Md Nooruddin 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *