నాస్తికులు మూఢ నమ్మకస్తులా?

మనం చెప్పే ప్రతీ విషయానికి, నిర్ణయానికి, తీర్మానానికి “శాస్త్రీయ పరిశీలన” తప్పనిసరి అన్నది నాస్తికుల వాదన. శాస్త్రీయ పరిశీలన/ప్రయోగం చెయ్యకుండా చేసే ఏ తీర్మానమైనా గుడ్డి/మూఢ నమ్మకంగా పరిగణించబడుతుంది అని బల్ల గుద్ది చెప్పటమే కాక..

చివరకు ఈ విశ్వమంతటికీ ఒక సృష్టికర్త ఉన్నాడు అన్న తీర్మానం చెయ్యటానికైనా ‘శాస్త్రీయ ప్రయోగం’ తప్పనిసరి.. అలాకాక లేని దాన్ని ఉన్నట్టు తీర్మానం చెయ్యటం గుడ్డినమ్మకం అవుతుందన్నది నాస్తికుల వాదన.

అలా అయితే మరి ‘దేవుడు లేడు” అంటూ నాస్తికులు ఏ శాస్త్రీయ ప్రయోగం ఆధారంగా తీర్మానిస్తున్నారు? దాని తాలూకు రాతపూర్వక ఆధారాలు (Written Documents) వారి దగ్గర ఏమైనా ఉన్నాయా? ‘శాస్త్రీయ ప్రయోగం’ చెయ్యకుండా చేసే ఏ తీర్మానమైనా మూఢత్వమే అయినప్పుడు..

ఏ ‘శాస్త్రీయ ప్రయోగం’ చెయ్యకుండా ఈ విశ్వానికి “ఒక సృష్టికర్త అంటూ ఎవడూ లేడు” అన్న నిరాధారపూరితమైన తీర్మానం చెయ్యటం, దాన్నే గట్టిగా నమ్మటం సైతం మూఢనమ్మకమే అవుతుంది కదా?

కాబట్టి.. నాస్తికుల ప్రకారం ఆస్తికులు “ఒక సృష్టికర్త ఉన్నాడు” అనే “నిరాధార ఊహాజనిత విశ్వాసం (Baseless belief) ” కలిగి ఉన్నవారైతే.. నాస్తికులు సైతం.. “ఏ సృష్టికర్తా లేడు” అనే “నిరాధార ఊహాజనిత విశ్వాసం (Baseless belief)” కలిగి ఉన్నవారనే కదా!

ప్రతీ విషయానికీ శాస్త్రీయ ప్రయోగం తప్పనిసరని నిలదీసే నాస్తికులు.. ఏ శాస్త్రీయ ప్రయోగమూ చెయ్యకుండానే సృష్టికర్త అనే వాడెవడూ లేడని తీర్మానించటం గుడ్డి నమ్మకమే అవుతుందన్న చిన్న లాజిక్ ఎలా మిస్సయి ఉంటారన్నదే ఆలోచించాల్సింది.

అందుకే ఏదైనా ఒక విషయాన్ని నమ్మటానికే కాదు,
తిరస్కరించటానికి సైతం ‘శాస్త్రీయ పరిశీలన’ చెయ్యటం తప్పనిసరి అలా కాకుండా ఊహాజనితంగా తిరస్కరించటం మూర్ఖత్వం అవుతుందన్న విషయాన్ని ఖురాన్ ఈ క్రింది విధంగా చెబుతుంది.

“మీరు నా సూచనలను శాస్త్రీయ పరిశీలన చెయ్యకుండానే వాటిని ఎలా తిరస్కరించారు?” – 27:84

*****

సరే, ఈ విశ్వానికి ఒక సృష్టికర్త అంటూ ఒకడున్నాడని మీరు ఏ శాస్త్రీయ పరిశీలన ఆధారంగా చెబుతున్నారు? అన్న నాస్తికుల ప్రశ్న ఒకటి మిగిలిపోయి ఉంది. దానికి సమాధానం దీని తరువాతి వ్యాసంలో వివరించబడుతుంది.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *