సృష్టికర్తను ఎవరు సృష్టించారు?

ఓ నిర్మాణం వెనుక ఓ ఇంజినీరు, ఓ పేయింటింగ్ వెనుక ఓ కళాకారుడూ, ఓ పుస్తకం వెనుక ఓ రచయితా ఉండటం ఎంత కామన్ విషయమో.. సృష్టి అన్నది ఉనికిలో ఉన్నప్పుడు దానివెనుక ఓ సృష్టికర్త ఉండటం కూడా అంతే కామన్ అన్నది కామన్ సెన్స్ పనిచేసే ఎవరైనా ఒప్పుకుతీరాల్సిన విషయమే!

ఇంట్లో వెలిగే బల్బ్ సైతం ఓ సైంటిస్టు తాలూకు మేధా శక్తి లేకుండా తయారవటం సాధ్యం కాదని ఒప్పుకునే నాస్తికులే.. గొప్ప టెక్నాలజీ తో పనిచేసే ఈ విశ్వవ్యవస్థలో ఎంతో క్రమం, క్రమబద్ధతతో అదుపు చెయ్యబడుతున్న అనేక కోట్ల గ్రహాలూ ఏ మేధా శక్తీ లేకుండానే వాటికవే ఉనికిలోకి వచ్చేశాయని, తమను తామే ఎంతో తెలివిగా కంట్రోల్ చేసేసుకుంటున్నాయని చెబుతుంటారు. పైగా ఈ రకమైన ఆలోచనా విధానానికి వారు పెట్టుకున్న ముద్దు పేరు “హేతుబద్ధమైన ఆలోచనా విధానం” అన్నది.

అయితే సృష్టి ఉనికిలో ఉండటమే సృష్టికర్త ఉనికిలో ఉన్నాడనటానికి ప్రత్యక్ష సాక్ష్యం అన్న వాదన ఎప్పుడు లేవనెత్తినా.. చాలా మంది నాస్తికులు.. “అయితే మీ లాజిక్ ప్రకారం మరి ఆ సృష్టికర్తను ఎవరు సృష్టించారు?” చెప్పండని చాలా సందర్భాల్లో ప్రశ్నిస్తుంటారు.

నాస్తికుల కాంట్రాడిక్షన్:

ఓ ప్రక్క విశ్వం ఉంటే దానికి సృష్టికర్త ఉండాలి అన్నప్పుడు మరి ఆ సృష్టికర్త ఉనికిలో రావటానికి కూడా ఓ సృష్టికర్త ఉండాలికదా? అని చెబుతూనే నాస్తికులు తమ నాస్తికత్వాన్ని తామే కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నారని చెప్పవచ్చు.

అదెలాగంటే… సృష్టికర్త ఉనికిలో ఉండటానికి ఓ సృష్టికర్త ఉండాలి కదా? అని నాస్తికులు లాజిక్ గా మాట్లాడ్డాన్ని బట్టి  అంతకంటే ముందు విశ్వం ఉనికిలో రావటానికి ఓ సృష్టికర్త కచ్చితంగా ఉండాల్సిందే అన్న విషయాన్ని నాస్తికులే మనకు చెబుతున్నారని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే విశ్వం ఉనికిలోకి రావటానికి ఏ సృష్టికర్తా లేడు అన్నప్పుడు మరలా “అయితే సృష్టికర్త ఉనికిలో ఉంటే ఆయనకు మరో సృష్టికర్త ఉండాలి కదా?” అన్న ప్రశ్న వెయ్యకూడదు. అలాంటప్పుడు “అయితే ముందు విశ్వానికి ఓ సృష్టికర్త ఉన్నాడని ఒప్పుకుంటారా?” అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

ఇక సృష్టికర్తకు మరో సృష్టికర్త ఎందుకు ఉండడో రండి తెలుసుకుందాం.   

ప్రతీ చర్య (Effect) కు ఒక కారణం (Cause) అనేది ఒకటుంటుందని సైన్స్ చెబుతుంది.. కానీ ఆ కారణానికి మూల కారణం ఏమిటి? అన్న దానికి సైన్స్ దగ్గర కూడా సమాధానం ఉండదు.

అదెలాగంటే- ఉదాహరణకు సైన్స్ 13.8 బిలియన్ల సంవత్సరాల క్రితం Particle-Antiparticle అనే జంట కణాల సముదాయంతో పదార్థం ఏర్పడి తద్వారా గ్రహాలు ఫాం అయ్యాయని సైన్స్ చెబుతుంది.

అంతే తప్పితే కణంలో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్లు తిరిగే అతి సూక్మ (Micro) వ్యవస్థ నుండి సౌరకుటుంబంలో సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే అతిపెద్ద (Macro) వ్యవస్థ వరకూ ఎంతో క్రమబద్ధంగా నడుపబడుతున్న ఈ వ్యవస్థలను ఎవరు ఉనికిలోకి తెచ్చారు? ఆ వ్యవస్థలు అంత పటిష్ట క్రమబద్ధత (Discipline) తో అదుపు (Control) చెయ్యబడటం వెనుక పనిచేస్తున్న మేధ ఏమిటి? అన్న దానికి సైన్స్ ఎప్పటికీ సమాధానం చెప్పదు. చెప్పలేదు కూడా. ఎందుకంటే అవి సైన్స్ కు అందే విషయాలు కావు మనిషి బుద్ధికి అందే విషయాలు కాబట్టి.

13.8 బిలియన్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది అక్కడి నుండే టైమ్ అన్నది ప్రారంభమైందన్నది సైన్స్ వాదనను దృష్టిలో పెట్టుకుంటే విశ్వానికి “ప్రారంభం (Beginning)” ఉంది అన్నది తేలిపోతుంది. అలాగే అది కొన్నాళ్లకు అంతమైపోతుంది అని కూడా సైన్స్ చెబుతుంది. కాబట్టి విశ్వానికి ఆది-అంతాలు (Beginning and End) ఉన్నాయన్నది సైన్స్ వెలుగులో నిర్వివాదం.

కాస్త లాజిగ్గా ఆలోచిస్తే ఆదీ-అంతాలు ఉన్న పదార్థాన్ని ఉనికిలోకి తెగలిగే సామర్థ్యం కచ్చితంగా ఆద్యంతాలు లేని అస్తిత్వానికే సాధ్యమవుతుంది. దీనిని బట్టి ఆద్యంతాలు ఉన్న ఈ విశ్వాన్ని ఆద్యంతాలు లేని సృష్టికర్త ఉనికిలోకి తెచ్చి ఉంటాడన్నది సుస్పష్టమైపోతుంది.

ఆద్యంతాలు లేని దానిని మరొకరు సృష్టించాల్సిన అవసరం ఉండదు. “ఆది (Beginning)” ఉందంటే దానిని ఉనికిలోకి తెచ్చిన “ఆద్యంతాలు లేనిదేదో ఒక అస్తిత్వం అంతకు ముందు నుండే కచ్చితంగా ఉండి తీరాలి.

అందుకే నాస్తికులు విశ్వ పదార్థం బిగ్ బ్యాంగ్ ముందు నుండి కూడా ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంది దానిని ఎవరూ ఉనికి తేలేదు అని ఏ ఎక్స్పెరిమెంటల్ సైంటిఫిక్ ఎవిడెన్సులూ లేనప్పటికీ స్వంత థియరీలు చెప్పి ఓ గింజేసుకుంటుంటారు.

పైగా ఇప్పటివరకూ సైన్స్ ఆధునిక టెలీస్కోపుల ద్వారా, ఉపగ్రహాల ద్వారా కనుగొన్న విశ్వవ్యవస్థ తాలూకు రహస్యాలు 4% మాత్రమే! ఇంకా 96% విశ్వ రహాస్యాలు సైన్స్ పరిధిలోకి ఇంకా రాలేదు. 100% అన్నది ఎప్పటికీ రాదు కూడా.

అలాంటప్పుడు సృష్టికర్త లేడు అని తీర్మానించటం, ఒకవేళ ఉంటే ఆ సృష్టికర్తను ఎవరు సృష్టించారు అని అడగటం ఆలోచన, అవగాహనా లోపమే అవుతుంది.

ఎందుకంటే.. మనిషి జ్ఞానం, ఆలోచనా శక్తి, వయస్సు, గ్రహణపరిధి (Comprehension) కొన్ని పరిమితుల (Limits) కు లోబడి ఉంది. వాస్తవం ఇడైనప్పుడు అనంతమైన విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త అస్తిత్వం గురించి ఫలానా అని విశ్లేషించగలగటం మనిషి జ్ఞాన పరిధిలో లేని విషయం.

అత్యాధునిక సైన్స్ అభివృద్ధి చెందినప్పటికీ… అనంతమైన విశ్వరహాస్యాలే సంపూర్ణంగా విశ్లేషించలేని మనిషి జ్ఞానం పరిమితమైంది (Limited) మాత్రమే! అది దాని గ్రహణ పరిధిలో లేని అనంతమైన (Unlimited) రహాస్యాలను గ్రహించలేదు.

అలాంటప్పుడు అనంతమైన విశ్వాన్ని ఉనికిలోకి తెచ్చి, దానిలో క్రమబద్ధత (Discipline) ని ఏర్పరిచి, దానిని అదుపు (Control) చేస్తున్న సృష్టికర్త అస్తిత్వాన్ని, దాని స్థితిగతులను ఇతమిద్ధంగా ఫలానా అని అంచనా వెయ్యటం, విశ్లేషించటం అతని జ్ఞానానికి, అతని గ్రహణపరిధికి అతీతమైన విషయం.

అలాంటప్పుడు సృష్టికర్త ఉంటే ఎక్కడున్నాడు ఉంటే చూపించమని అడగటం, ఆయన ఉనికి ఎలా ఏర్పడిందని ప్రశ్నించటం, ఏ సృష్టికర్తా లేడని తీర్మానించటం అజ్ఞానమవుతుంది అవుతుంది.

అలాగని ధార్మిక గ్రంథాలు సృష్టికర్త ఫలానా విధంగా ఏర్పడ్డాడని గానీ, ఫలానా విధంగా ఉంటాడనిగానీ చెప్పవు. కానీ, సృష్టి యావత్తునూ ఉనికిలోకి తెచ్చి, క్రమబద్ధత (Discipline) తో నడుపుతుంది ఒక మహా శక్తిమంతుడైన ఒక సృష్టికర్త అన్న సమాచారం ఇస్తూ ఆయన శక్తి-సామర్థ్యాలేమిటో తెలియజేస్తున్నాయి.

కారణం మనం ముందు చెప్పుకున్నట్టే మనిషి జ్ఞానం పరిమితమైంది (Limited) మాత్రమే! అది దాని గ్రహణ పరిధిలో లేని అపరిమితమైన (Unlimited) రహాస్యాలను గ్రహించలేదు. సృష్టికర్త అస్తిత్వం ఆ కోవకు చెందినదే!

కాబట్టే ధార్మిక గ్రంథాలు ఆ సృష్టికర్త శక్తి-సామర్థ్యాలేమిటో ఆయన ఆదేశాలేమిటో గుర్తించమని మాత్రమే చెబుతున్నాయి. అజ్ఞానంతో ఆయన్ని తిరస్కరించటమూ లేదా ఆయనకు బదులు మానవుల్ని, జంతువుల్నీ, విగ్రహాల్నీ దైవాలుగా చేసుకుని అజ్ఞాన వైఖరులను అవలంబించవద్దని వారిస్తున్నాయి.

కానీ ఈ రెండుపనుల్లో మొదటిది నాస్తికులు చేస్తుంటారు. రెండవదాన్ని బహుదైవారాధకులు చేస్తుంటారు.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *