మదనపల్లె జంట హత్యల కేసును గురించి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఎవరు మాట్లాడినా ఇంత చదువుకుని ఉన్న కుటుంబంలో సైతం పునర్జన్మ చెందాలన్న ముఢాచారంతో క్షుద్ర పూజలు నిర్వహించటం ఏమిటీ? వారి మూఢనమ్మకం కారణంగా రెండు నిండు ప్రాణాలు అన్యాయంగా బలైపోయాయని చెబుతున్నారు.

బహుశా ఈ సంఘటనలో ఆ ఇద్దరమ్మాయిలు చనిపోయి ఉండకపోతే.. “నేనే శివుణ్ణి, కాళికా దేవినంటూ” తలాతోకా లేకుండా మాట్లాడుతున్న ఆ ఇద్దరమ్మాయిల తల్లి ఈ పాటికే మహాశక్తి గల దేవతగా పాపులరైపోయి వి.ఐ.పీ ల నుండి సామాన్యుల వరకూ పూజాలందుకుంటూ ఉండేది కాబోలు! కానీ ఆ సంఘటనలో బయటపడిన క్రైమ్ కారణంగా ఇప్పుడు మీడియాతో సహా చాలా మందికి అదో మూఢనమ్మకం అన్న స్పృహ కలిగింది.

డేరాబాబా చాలా మందికి గుర్తుండే ఉంటాడు. ఆ విచిత్ర జీవిని పూజించే.. అతను బోధించే మూఢనమ్మకాలను నమ్మే మూఢ భక్తులు ఒకప్పుడు కోకొల్లలు. కానీ ఎప్పుడైతే భక్తి ముసుగులో డేరాబాబా చేస్తున్న డ్యాన్సులు, అత్యాచారాలు బయటపడ్డాయో.. అప్పుడు గానీ అతను అప్పటివరకూ ప్రజలకు నేర్పుతూ వస్తున్నవి మూఢనమ్మకాలన్న స్పృహ మీడియాతో సహా చాలా మందికి కలగలేదు.

ఆశారామ్ బాపూకైతే ప్రధాన మంత్రి మోడీ నుండి వి.వి.ఐ.పీ ల వరకూ భక్తులు ఉండేవారు. చన్నాళ్ల తరువాత అతను, అతని కుమారుడు సైతం భక్తి ముసుగులో చేస్తూ వస్తున్న అత్యాచారాలు బయటపడ్డాక గానీ అతను చెప్పే శ్రీరంగ నీతులన్నీ కేవలం మూఢనమ్మకాలన్న స్పృహ చాలా మందికి కలగలేదు.

ఈ లిస్టు రాసుకుంటూ పోతే ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉదహరించవచ్చు. ఆధ్యాత్మిక గురువుల వేషాలు ధరించి ప్రజలను మూఢనమ్మకాల్లో నడిపిస్తూ పూజాలందుకుంటూ ప్రజల నెత్తిపై అపరదైవాలై కూర్చొని కోట్లకు పడగలెత్తిన స్వాములూ, బాబాలున్నారు. ఈ ఫేక్ బాబాల భాగోతం బయటపడనంత వరకూ మటుకు వాళ్లు చెప్పే మూఢనమ్మాకాలు పరమ సత్యాలుగా చాలామణీ అవుతుంటాయి.

ఏది మూఢనమ్మకమో ఎలా తెలుసుకునేది?

ఇది ఒకరకంగా ఆస్తికులకు అతి పెద్ద పజిల్ లాంటిదని చెప్పటం అతిశయోక్తి కాదేమో! ఎందుకంటే ఆస్తికుల్లోనే అధికశాతం మందికి హేతుబద్ధంగా ఆలోచించగలిగే నిజ ఆస్తికులుగా మారాలంటే చెయ్యల్సిందేమిటో సరైన క్లారిటీ లేదు కనుక.


కాబట్టే ఎవరన్నా గెడ్డం పెంచుకుని కాషాయబట్టలు తొడిగి అధ్యాత్మిక గురువుగా అవతరిస్తే చాలు అతన్నో దైవాంశసంభూతుడన్న భ్రమలో అతన్ని దేవుణ్ణి చేసుకుని ఆరాధించటం మొదలెడుతున్నారు. ఈ విధంగా హిందూత్వంలో హిందువుల కంటే వారు నమ్మే మూఢనమ్మకాల సంఖ్యే ఎక్కువగా ఉన్నాయనటం అతిశయోక్తి కాదు.

కడప, ఆజ్మీర్ షరీఫ్ వగైరా దర్గాలకు పోటెత్తే ముస్లిముల నుండి ముహర్రం వస్తే రక్తమోడేలా బ్లేడులతో రక్కుకోవటాలు, కొరడాలతో కొట్టుకోవటాలు, మిలాదున్నబీ పేరుమీద ఊరేగింపులు, రొట్టెల పండుగలు వగైరా ఇస్లాంలో లేని ఆచారాలన్నీ తలకు పచ్చ రంగు పగిడీలు, పొడవాటి గెడ్డాలు కళ్లలో సుర్మా, సెంట్లు కొట్టుకుని కుర్తా పైజామాలు తొడుక్కుని పైకి ముస్లిం ఆధ్యాత్మిక గురువుల వేషాలు ధరించిన కొందరు ముల్లాలు ప్రవేశపెట్టినవే.

త్రిత్వం, యేసు దైవత్వవాదం, అవతార సిద్ధాంతాల నుండి చెట్టుకొమ్మలతో ఊరేగింపులు, గుణదల గౌరీపట్నంలో ధూప దీప నైవేధ్యాలతో యేసు, మేరీ విగ్రహాలను ఆరాధించే వరకు క్రైస్తవంలో చిత్రవిచిత్రమైన మూఢాచారాలు ప్రవేశపెట్టింది కొందరు క్రైస్తవపాస్టర్లే.

ఈ మూఢనమ్మకాల నుండి బయటపడాలంటే నాస్తికత్వమే మార్గమా?

ఒక్క నాస్తికత్వం మాత్రమే మతవ్యవస్థలో మూఢనమ్మకాలను ఖండిస్తుంది.. నేడు హిందూ, ముస్లిం, క్రైస్తవ సమాజాల్లో పేరుకుపోయిన మూఢనమ్మకాల నుండి బయటపడి హేతుబద్ధమైన ఆలోచనా విధానం కలిగి ఉండాలంటే నాస్తికత్వమే కరెక్టు అన్నది నాస్తికుల వాదన.

నాస్తికత్వానికి ముందు మూఢనమ్మకాలను ఎవరూ ఖండించలేదా?

మూఢనమ్మకాలను మొట్టమొదటిసారిగా ఖందించే పని ఒక్క నాస్తికత్వం మాత్రమే చేసిందని భావించే అమాయక నాస్తికులకు తెలీని విషయం- వేల సంవత్సరాల ముందు నుండే ధార్మిక గ్రంథాలు మతవ్యవస్థలో మూఢనమ్మకాలను ఖండిస్తూ ప్రజలను శాస్త్రీయ బద్ధమైన ఆలోచనల వైపుకు నడపటం మొదలెట్టాయి. ముఢాచారాలను ఖండించటం వరకే నాస్తికత్వం చెయ్యగలుగుతుంది ఏది కరెక్టు? అన్న ప్రశ్నకు నాస్తికత్వం దగ్గర ఎప్పటికీ సమాధానం ఉండదు. కానీ ధార్మిక గ్రంథాలు ముఢాచారాలను ఖండిచటంతో పాటు ఏది కరెక్టో కూడా చెబుతున్నాయి.

ఉదాహరణకు: వేదోపనిషత్తుల్లో ఉండే వైదిక ధర్మానికి హిందూ మతానికీ కించిత్తు పొంతన ఉండదు. నేడు హిందూత్వంలో ఉండే మూఢనమ్మకాలేవీ వైదిక ధర్మంలో ఉండవు. వైదిక ధర్మం ప్రకృతిలో ఉండే వస్తువులను పూజించేవారు అంధకారంలో ప్రవేశిస్తారని చెబుతుంది. ఈ ప్రకృతిలో కళ్లకు కనపడేదేదీ దైవం కాదని ఉపనిషత్తులు చెబుతున్నాయి. దీనికి పూర్తి విరుద్ధంగా ప్రతీ చెట్టూ పుట్టల్నీ, దొంగస్వాములు, బాబాలనూ , విగ్రహాలనూ పూజించటమే హిందూత్వానికి ఆధారంగా తరువాతి కాలాల్లో కొందరు హిందుత్వవాదులు మార్చేసి మూఢనమ్మకాలతో సరికొత్త ఆధ్యాత్మికతను తయారు చేసుకున్నారు.

దర్గాలూ, సమాధి ఆరాధనలూ, ముహర్రం వస్తే రక్తమోడేలా కత్తులూ, బ్లేడ్లతో రక్కుకోవటాలు, కొరడాలతో కొట్టుకోవటాలు, మిలాదున్నబీ పేరుమీద ఊరేగింపులు, రొట్టెల పండుగలు వగైరావేవీ ఇస్లాంలో లేని ముఢాచారాలే. ఖురాన్ సృష్టిలో వస్తువుల గురించి విశ్వ నిర్మాణం గురించి శాస్త్రియంగా ఆలోచన చేసి, సృష్టికి అతీతంగా ఉన్న సృష్టికర్తను హేతుబద్ధంగా గుర్తించమంటుంది. కానీ తరువాతి కాలాల్లో కొందరు ముస్లిం పండితుల వేషాలు ధరించి ఇస్లాంలో లేని ప్రతీ ముఢాచారాన్నీ ముస్లిం సమాజంలో ప్రవేశపెట్టారు.

త్రిత్వం, యేసు దైవత్వవాదం, అవతార సిద్ధాంతాల నుండి చెట్టుకొమ్మలతో ఊరేగింపులు, యేసు, మేరీ విగ్రహాలను ఆరాధించే వరకు క్రైస్తవంలో చిత్రవిచిత్రమైన ముఢాచారాలన్నీ యేసు తరువాత దాదాపు మూడొందల సంవత్సరాల తరువాత నైషియా సభలో కాన్స్టాంటైన్ నోపిల్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టబడిన అన్య ఆచారాలన్న విషయం చాలా మంది సామాన్య క్రైస్తవులకు తెలీని విషయం. నిజానికి ఇలాంటి ముఢాచారాలన్నీ బైబిల్లో ఖండించబడ్డాయి. ఇది కూడా బైబిల్ చంకలో పెట్టుకుని ఆదివారాలు చర్చీలకు వెళ్లే చాలా మంది క్రైస్తవులకు అవగాహన లేదు.

భవిష్యత్తులో ప్రజలు మూఢనమ్మకాల వలయంలో చిక్కుకుపోతారనే ముందుగా ధార్మిక గ్రంథాలు “శాస్త్రులను” కాక “శాస్త్రాలను” మాత్రమే చదివి అర్థం చేసుకుని నడవాల్సిందిగా హెచ్చరించాయి. “మీ ఇష్ట ప్రకారం నడుచుకోక ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అన్న సంశయం వచ్చినప్పుడు శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకోవాలి (గీత 16:24)” అని గీతా శాస్త్రం, “నువ్వు బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథము చదువుచుండవలెను (ద్వితీ 17:22)” అని బైబిల్ .. “మానవులారా మీ దేవుని దగ్గర నుండి స్పష్టంగా మార్గం చూపే గ్రంథం వచ్చేసింది (4:174)” అని ఖురాన్ ముందుగానే హెచ్చరించాయి.

అయినప్పటికీ ఆధ్యాత్మిక రంగంలో అధిక శాతం సామాన్య ప్రజలు చేసే అతిపెద్ద తప్పు తాము నమ్మే సిద్ధాంతాలు, విశ్వాసాలూ, నమ్మకాలు కరెక్టా? కావా? అన్నది తేల్చుకోవటానికి మతపండితుల బోధలనే బెంచ్ మార్క్ గా తీసుకుంటూ “ఆఁ.. అవన్నీ చదవబట్టేగా ఆయా పండితులు మాకు బోధిస్తుంది” అని అనుకుని వారు చెప్పే ప్రతీ మూఢ నమ్మకాన్నీ గుడ్డిగా నమ్ముతుంటారు.

సనాతన ధర్మంలో కొందరు వంచక పండితులు ప్రవేశపెట్టిన మూఢాచారాలను ప్రక్షాళన చేసి ప్రజల్లో శాస్త్రబద్దమైన మరియు హేతుబద్ధమైన ఆలోచనా విధానం పెంపొందించటానికే ధార్మిక గ్రంథాలు శ్రుతి (వహీ) రూపంలో ప్రవక్తల పై అవతరించాయన్న అవగాహన లేని నాస్తికులు ధార్మిక గ్రంథాలను విమర్శిస్తూ ఉంటారు.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *