నాస్తికవాదం & ధార్మికవాదం

ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మకూడదు, ప్రతీదీ హేతుబద్ధంగా ఆలోచన చెయ్యాలి.. మతవ్యవస్థలో మతబోధకులు సృష్టించిన దేవుళ్లనూ, ముఢాచారాలను వ్యతిరేకించాలి, గుడ్డి నమ్మకాలు కలిగి ఉండకూడదు, హేతువిరుద్ధమైన విశ్వాసాలు కలిగి ఉండకుండా ప్రతీ విషయంలోనూ శాస్త్రీయ పరమైన ఆలోచన కలిగి ఉండాలి ఇదీ సంక్షిప్తంగా నాస్తికవాదం చెప్పేది.

ఏ కాస్త ప్రాక్టికల్ గా ఆలోచన చేసే ఎవరైనా నాస్తిక వాదం చెబుతున్న పై సూత్రాలను నూటికి నూరుశాతం ఒప్పుకుతీరాల్సిందే. సరిగ్గా ఇక్కడే మతవ్యవస్థలో మూఢత్వాన్నీ, హేతువిరుద్ధ విధానాలను చూసి మతం పట్ల వెగటు కలిగి నాస్తికవాదం పట్ల ఆకర్షితులై చాలా మంది నాస్తికులుగా మారిపోయింది.

కానీ మతవ్యవస్థలో మూఢత్వాన్ని వ్యతిరేకించేది ఒక్క నాస్తికత్వం మాత్రమే అని భావించే అభినవ నాస్తికులకు తెలీని అసలు విషయం- నేడు నాస్తికవాదం చెబుతున్న పై అంశాలన్నీ ధార్మిక గ్రంథాల “శాస్త్రీయ ధర్మం” ఏనాడో చెప్పిందన్నది.

మతవ్యవస్థలో మతపండితులు సృష్టించిన దేవుళ్లనూ, ముఢాచారాలను, గుడ్డి నమ్మకాలను ఖండించి ప్రజలను హేతుబద్దమైన మరియు శాస్త్రీయపరమైన ఆలోచనా విధానం వైపునకు నడిపించే పనిని ధార్మిక గ్రంథాలు కొన్ని వందల వేల సంవత్సరాల నుండే చెయ్యటం మొదలెట్టేశాయన్నది. కానీ నేటి అభినవ నాస్తికుల భావన ఏమిటంటే మతవ్యవస్థలో పేరుకుపోయిన మూఢత్వ విధానాలకు మూలమే ధార్మిక గ్రంథాలన్నది. అలా భావించటమే అసలు సిసలైన అజ్ఞానం.

అదెలాగంటే మత వ్యవస్థలోని మతబోధకులు ప్రకృతిలో చెట్లను, పుట్టలను, జంతువులను, మనుషులను మూఢనమ్మకాలతో పూజించటాన్ని నేర్పితే.. ధార్మిక గ్రంథాల “శాస్త్రీయ ధర్మం” సృష్టి నిర్మాణం పట్ల, ప్రకృతి పట్లా వాటిలో ఉన్న చెట్లను, జంతువులను మూఢనమ్మకాలతో పూజించటానికి బదులు వాటి ఉనికి, నిర్మాణం విషయంలో శాస్త్రీయంగా ఆలోచన చెయ్యమంటుంది.

విశ్వ వ్యవస్థలో అణువు నుండి బ్రహ్మాండం వరకు ఉన్న వస్తువుల అద్భుత నిర్మాణం విషయంలో శాస్త్రియంగా ఆలోచన చెయ్యమంటుంది.. మనుషులను వారి విగ్రహాలనూ పూజించటం కాదు మనిషి పిండ దశ నుండి అనేక దశలను దాటుకుంటూ అత్యద్భుతంగా జరిగిన అతని పుట్టుక గురించి ఆలోచన చెయ్యమంటుంది.

ఈ సృష్టిలో మత బోధకులు సృష్టించిన విగ్రహారాధనను, సృష్టి పూజను, వ్యక్తి పూజను ఖండించి వారు వెలుగులోకి తెచ్చిన మిధ్యా దైవాలను, వాటి పేరుతో కల్పించుకున్న గుడ్డి నమ్మకాలను, మూఢ విశ్వాసాలను విడిచిపెట్టి.. వాటికి బదులు సృష్టి నిర్మాణం పట్ల శాస్త్రీయ బద్ధమైన ఆలోచన చేసి ఈ విశ్వాన్ని ఉనికి లోకి తెచ్చి, దానిలో సమతూకాన్ని ఏర్పరచి, వాటిలో ప్రతీ వస్తువునూ ఎంతో క్రమబద్ధంగా నడుపుతున్న “శక్తి (Supernatural power)” ను గుర్తించమంటుంది. ఉదాహరణకు ఖురాన్ ను గమనిస్తే..

“మీరు ఒంటెలను చూడరా అవి ఎలా సృష్టించబడ్డాయో? ఆకాశాన్ని చూడరా అది పైకి ఎలా ఎత్తబడిందో? కొండలను చూడరా అవి ఎలా పాతిపెట్టబడ్డాయో? భూమిని చూడరా అది ఎలా పరచబడిందో?” – 88:17-20

“మేము మానవుడిని వీర్య బిందువుతో సృజించిన విషయాన్ని మీరు చూడటం లేదా?” – 36:77

“భూమీ ఆకాశాల నిర్మాణం గురించి చింతన చేసే వివేకవంతులకు ఎన్నో సూచనాలున్నాయి” – 3:190

అంటూ సృష్టి పరిశీలన వైపు ఆహ్వానం పలుకటాన్ని అనేక వందల వాక్యాల్లో గమనించగలం. అలాగే బైబిల్లో గమనిస్తే.. “దేవుని అదృశ్య లక్షణాలు, అనగా ఆయన నిత్య శక్తీ, దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి” – రోమా 1:20

ఈ విధంగా ధార్మిక శాస్త్రాల “శాస్త్రీయ ధర్మం” సృష్టి పట్ల పనికి మాలిన సెంటిమెంట్లతో గుడ్డి నమ్మకాలు కలిగి ఉండకుండా సృష్టిని సశాస్త్రియంగా పరిశీలన చేసి ఈ సృష్టిని ఉనికి లోకి తెచ్చి, దానిని క్రమబద్ధంగా నడుపుతున్న ఆ “శక్తి (Supernatural power)” ను గుర్తించమంటుంది. ఆశక్తిని “సృష్టికర్త”, “దేవుడు” “గాడ్” “ఖుదా” భగవాన్” “యెహోవా” “అల్లాహ్” వగైరా ఏ భాషలో ఏ పేర్లతో పిలిచినా ఈ సమస్త సృష్టినీ నడుపుతున్న ఆ “మానవాతీత శక్తి”కీ నేడు ప్రజలు అనేక రూపాల్లో పూజిస్తున్న మిద్యా దైవాలకూ లేదా కల్పిత దైవాలకూ సంబంధం లేదని దార్మిక గ్రంథాల “శాస్త్రీయ ధర్మం” చెబుతుంది.

కాకపోతే మతవ్యవస్థకూ, ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మానికీ మధ్య ఉన్న తేడా ఏమిటో తెలీని నాస్తికులు మత వ్యవస్థలో మూఢనమ్మకాలనూ, ధార్మిక గ్రంథాలనూ ఒకే గాటన కట్టేసి అసలు ఈ సృష్టికి ఒక సృష్టికర్త ఉన్నాడని నమ్మటాన్ని వ్యతిరేకించటమే మా జన్మ హక్కు అన్న చందంగా వ్యవహరిస్తుంటారు.

కాకపోతే నాస్తికవాదం చెబుతున్న విషయం ఈ సృష్టికి ఏ దేవుడూ లేదన్నది. ధార్మిక వాదం చెబుతున్నది కూడా అదే ఈ సృష్టిలో ఏ దేవుడూ లేడు అన్నదే! కానీ సర్వాన్ని ఉనికిలోనికి తెచ్చిన ఒక్క సృష్టికర్త తప్ప” అన్నది అదనంగా ధర్మం చెబుతుంది. అలా నమ్మటాన్ని నాస్తికులు అజ్ఞానంగా భావిస్తుంటారు.

అనేక రంగులతో కేన్వాస్ పై గీయబడే అందమైన చిత్రం కూడా ఓ కళాకారుడు లేనిదే దానికదే తయారవ్వదన్నది సైన్సు చెప్పే విషయమే. ఓ అందమైన చిత్రం తయావ్వటానికి ఏ కళాకారుడి అవసరమూ ఉండదు రంగులు, రేఖలూ వాటికవే ఏర్పడిపోయి కేన్వాస్ పై అందమైన చిత్రం దానికదే తయారైపోతుందని చెప్పటం అజ్ఞానమవుతుంది. కానీ నాస్తికులు అలా భావించటాన్నే మహా జ్ఞానంగా ఫీలవుతుంటారు. ఈ సృష్టి యావత్తూ ఏ సృష్టికర్తా లేకుండానే దానికదే ఉనికిలోనికి వచ్చేసి.. ఏ రూపకర్తా లేకుండానే ఈ విశ్వమంతా దానికదే ఎంతో క్రమబద్ధంగా, సమతూల్యతతో నడుపబడుతుందని చెబుతుంటారు. ఈ ఉదాహరణ అచ్చం ఓ అందమైన చిత్రం తయావ్వటానికి ఏ కళాకారుడి అవసరమూ ఉండదు రంగులు, రేఖలూ వాటికవే ఏర్పడిపోయి కేన్వాస్ పై అందమైన చిత్రం దానికదే తయారైపోతుందని చెప్పటం లాంటిదన్న మాట.

అందుకే ధార్మిక గ్రంథాలు- ఏ రూపకర్తా లేనిదే ఈ సృష్టి ఉనికిలోకి వచ్చిందని చెప్పటం అజ్ఞానమవుతుందని చెబుతున్నాయి.
ఈ విధంగా ధార్మిక గ్రంథాల ధార్మిక వాదం మనిషిని నాస్తికత్వం తాలూకు అజ్ఞానం నుండీ.. మతవ్యవస్థ తాలూకు మూఢత్వం నుండి వేరు చేసి హేతుబద్ధంగా, శాస్త్రియంగా ఆలోచనా చేసే విధానాన్ని పెంపొందిస్తుంది. కానీ ఈ విషయం నాస్తిక వాదం సమర్థించే వారికి తెలీదు. చెప్పినా చాలా మందికి ఎక్కదు.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *