విశ్వం సృష్టించబడింది.. ఏర్పడలేదు

ఈ భూమి, విశ్వం మరియు సకల చరాచర జగత్తు ఉనికిలోకి వచ్చేసి వాటికవే ఎంతో క్రమద్ధంగా నడుపబడుతున్నాయి వాటి వెనుక ఏ “మేధస్సు (Intelligence)” పనిచెయ్యటం లేదని చెప్పటం మూర్ఖత్వం అవుతుంది. మనిషిగా పుట్టినవాడు మూర్ఖుడుగా కాక మనిషిగానే ఆలోచించాలి. కనీసం కామన్‌సెన్స్‌ (ఇంగితజ్ఞానాన్ని) కలిగి ఉండేవాడెవడైనా.. ఓ బల్బు తయారవ్వాలన్నా దానివెనుక ఓ సైంటిస్టు “మేధస్సు” లేనిదే దానికదే ఎలా తయారవుతుందనే అంటాడు. అలాంటప్పుడు విశ్వంలో కోటానుకోట్ల సూర్యు గోళాలూ, నక్షత్రాలూ, గ్రహాలూ, ఈ భూమీ ఉనికి లోనికి రావటం వెనుక ఏ మేధాస్సూ లేదని వాదిస్తే వారు ఏ స్థాయి మూర్ఖులో వేరేగా చెప్పక్కర్లేదు.

ఏ నాస్తికుడినైనా “విశ్వం దానికదే ఏర్పడింది.. సృష్టించబడలేదని ఎలా చెప్పగలుగుతున్నారు? అని ప్రశ్నిస్తే.. “నేను సృష్టి మొత్తాన్నీ వెతికి చూశాను నాకు ఎక్కడా దేవుడు కనపడలేదు కాబట్టే దేవుడు లేడన్న నిర్ధారణకు వచ్చానని కామన్ సెన్స్ ఉన్న ఏ నాస్తికుడూ చెప్పలేడు! ఎందుకంటే ఆధునిక సైన్సుకే సౌరకుటుంబం తాలూకు రహస్యాలు పూర్తిగా అంతుచిక్కలేదు.
ఈ విశ్వానికి ఒక సృష్టికర్త అంటూ ఎవడూ లేడు అని చెప్పే నాస్తికులంతా… మతాన్ని వ్యాపారంగా మార్చుకున్న కొందరు మత పండితులు, హేతు విరుద్ధమైన గుడ్డి నమ్మకాలను కల్పించి తయారు చేసిన మతవ్యవస్థలో డొల్లతనాన్ని చూసి, ఇదే ధార్మిక గ్రంథాల అసలు ‘ధర్మం’ అన్న అపోహకు గురైనవారే!

నిజానికి నేడున్న మతవ్యవస్థకూ ధార్మిక గ్రంథాలు ప్రబోధిస్తున్న ఎంతో హేతుబద్ధమైన “శాస్త్రీయ ధర్మానికీ” అస్సలు సంబంధం లేదు. మతపండితులు కల్పించిన మిద్యా దేవుళ్లకూ ధార్మిక గ్రంథాలు పరిచయం చేస్తున్న అసలు సృష్టికర్తకూ సంబంధం లేదు. అది కనిపెట్టలేకపోవటం వల్ల నేడున్న హేతువిరుద్ధమైన “మతవ్యవస్థ”కు కారణమే ధార్మిక గ్రంథాలన్న అపార్థానికి గురై మతవ్యవస్థలో గుడ్డినమ్మకాలనూ, ధార్మిక గ్రంథాలనూ ఒకే గాడిన కట్టేసి మొత్తానికి సృష్టికర్త ఉన్నాడన్న విషయాన్ని వ్యతిరేకిస్తుంటారు.

అందుకే ఈ విశ్వానికి ఓ సృష్టికర్త లేనిదే ఏర్పడిందని చెప్పటమే హేతువిరుద్ధం కదా అని ఏ నాస్తికుణ్ణి ప్రశ్నించినా ఇప్పుడు ఆ లాజిక్ ప్రకారం సృష్టికర్త ఉన్నాడని నమ్మితే దానితో ఎక్కడ మతంలో ముఢాచారాలన్నీ నమ్మల్సివస్తుందో అని.. “మనం నమ్ముకోవాల్సింది సైన్స్ ని తప్పితే దేవుళ్లను కాదు, విశ్వాన్ని గానీ, జీవాన్ని గానీ ఎవరూ సృష్టించలేదు. కాలగమనంలో పరిణామ క్రమంలో ఇవన్నీ వాటికవే ఏర్పడ్డాయన్న చిత్రమైన వాదనలు తెరమీదకు తీసుకొస్తుంటారు.

ఇప్పుడు మనం “థియరీ ఆఫ్ డిటెర్మినిజం (Determinism)” ఏమిటో గమనిద్ధాం. దీనినే అరిస్టాటిల్ “Cause and Effect theory” అనే సిద్ధాంతాన్ని సూత్రీకరించాడు. దీని ప్రకారం ప్రతీ కార్యానికీ లేదా సంఘటన (Effect) వెనుక కారణం (Cause) ఉంటుందన్నది. దీనినే “కార్యకరణ సిద్ధాంతం” అంటారు. దీని ప్రకారం విశ్వం ఏర్పడటం ఒక “ప్రభావం (Effect)” అయితే దానికి “కారణం (Cause)” ఉండాలి కదా? దానికి సైన్స్ ఆదిలో ఒక మహా విస్పోటనం (Big bang) కారణంగా విశ్వం ఏర్పడిందని చెబుతుంది. మరి ఆ విస్పోటనం ఎలా జరిగింది? అంటే ఆదిలో అత్యంత దట్టమైన పొగ (Smoke) తో కేంద్రీకృతమైన నేబ్యులా విపరీతమైన వేడి ఉత్పన్నమై మహా విస్పోటనం జరిగిందని చెబుతుంది. సరే, ఆ శూన్యంలో అంత భయంకరమైన మహా విస్పోటనానికి కారణమైన ప్రైమరీ నెబ్యులా ఎలా కేంద్రీకృతమైంది? ఆ మహా విస్పోటనం నుండి వెలువడిన గ్రహాలు ఎలా పడితే అలా చెల్లాచెదురైపోవాలికదా? కానీ, వాటికి నిర్దిష్ట కక్ష్యల్లో ఏర్పాటు చేసింది ఎవరు? పైగా ప్రతీ గ్రహం తన చుట్టూ తాను తిరుగుతూ ఆయా కక్ష్యల్లో ఇసుమంతైనా తప్పిపోకుండా నడుపుతున్నది ఎవరు? వాటి మధ్య సమతూకాన్నీ (Balance) పెట్టింది ఎవరు? లాంటి ఎన్నో ప్రశ్నలకు సైన్స్ ముంగిట సమాధానాలు లేవు.

ఏకకణ జీవుల నుండి వెన్నెముక లేని (అకశేరుకాలు) జీవులు ఏర్పడి ఆ తర్వాత కాలంలో సకశేరుకాలు (వెన్నెముక గల జీవులు) ఏర్పడ్డాయి అలా క్రమంగా మానవుడి ఆవిర్భావం జరిగిందన్న కొందరి పరిణామ సిద్ధాంతం ప్రకారం ఆ ‘ఏకకణ జీవి’ని ఉనికి లోనికి తెచ్చింది ఎవరు? అని ప్రశ్నించినా వారి వాదనలో డొల్లతనం ఏంటో అవగతమైపోతుంది. “కారణం (Cause)” అనేది లేకుండా “ప్రభావం (Effect)” జరగదు అన్నది సైన్స్ చెప్పేదే! అయినప్పటికీ అబ్బే మా విశ్వాసంలోనే మాకు ఆనందముంది.. అని నాస్తికులు అనుకుంటే అది వారి ఇష్టం. వ్యక్తి స్వేచ్ఛని కాదనలేం.
సైన్సుకు మత గ్రంథాలకూ వైరుధ్యం ఎప్పుడూ ఏర్పడుతూ వస్తోంది. మత విశ్వాసాలు ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లవు, వైజ్ఞానిక శక్తి మాత్రమే మనిషికి తిండిపెట్టి బతికిస్తోంది… వగైరా వాదనలు చేసేవారికి ధార్మిక గ్రంథాల అసలు లక్ష్యం తెలియక నేడు సైన్సు చెప్పేదేదీ మతగ్రంథాల్లో ఉండవని సైన్సుకూ, ధార్మికగ్రంథాలకూ ముడిపెట్టి మాట్లాడుతుంటారు. ఇది ఒకరకంగా బోడి గుండుకూ మోకాలుకూ ముడిపెట్టేయటం లాంటిదన్న మాట.

ధార్మిక గ్రంథాలు సైన్స్ నేర్పే గ్రంథాలా?

మానవ ప్రశాంత మనుగడకు సైన్స్ తప్పనిసరి. అలాగని ఆధునిక సైన్స్ మొత్తం ధార్మిక గ్రంథాల్లో రాయబడిలేదు కాబట్టి అవి వేస్టు అనుకోవటానికి మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు. కారణం ధార్మిక గ్రంథాల లక్ష్యం.. మనిషిని “భౌతిక సామర్థ్యాల (External abilities)”ను అభివృద్ధి పరచటం కాదు, కానీ.. అతని “నైతిక సామర్థ్యాల ను అభివృద్ధి పరచటమే! అతనిలో నిత్యం కలిగే మంచీ-చెడు ఆలోచనల్లో మంచిని ఎలా ఆచరించాలి? చెడు ఆలోచనలపై ఎలా అదుపు సాధించాలి? ఉత్తమ నైతిక, మానవీయ విలువలను ఎలా పెంపొందించుకోవాలి? అన్న విషయాలను నేర్పేవే ధార్మిక గ్రంథాలు.
కనుక దైవభావన, ధార్మిక గ్రంథాల వల్ల భౌతిక ప్రపంచం అభివృద్ధి చెందదని చెప్పే నాస్తికులు గమనించాల్సింది- సైన్స్ ప్రకారంగా ఎంతగా భౌతికాభివృద్ధి జరిగినప్పటికీ వ్యక్తుల్లో ఈ “నైతిక సామర్థ్యాలు” పెరగనప్పుడు “నైపుణ్యం కలిగిన” దుర్మార్గులు.. మానవత్వం లేని ఆధునిక మృగాలు తయారవుతాయి. నేటి ఆధునిక సమాజంలో అలాంటి దుర్మార్గులకూ, మృగాళ్లకూ కొదవలేదు. దాని ఫలితమే నిమిషానికో నేరం ప్రపంచంలో ఏదో ఒక మూల జరుగుతుండటం.

ఇక రండి.. నాస్తికులు ధార్మిక గ్రంథాలుల్లో ఈనాటి ఆధునిక సైన్స్ లేదని కొట్టిపారేస్తున్న తరుణంలో విశ్వ సృష్టి గురించి “Modern science of Cosmology” ఆవిష్కరించిన ప్రధాన సిద్ధాంతాలను ఒకసారి గమనిద్దాం.

1). విశ్వం ఏర్పడకపూర్వం శూన్యమంతా వివిధ రకాల గ్యాసెస్ (Gases) తో, అత్యంత దట్టమైన పొగ (Smoke) తో నిండి ఉండేది. దానినే “ప్రైమరీ నెబ్యూల” అని చెప్పటం జరిగింది. ఈ థియరీ ని మొట్టమొదట 1734 లో “ఇమ్మానుయేల్ స్వీడెన్ బర్గ్” ఆవిష్కరించటం జరిగింది. కానీ, ఈ విషయాన్ని ఖురాన్ 1400 సం.ల క్రితమే- “తరువాత ఆయన కేవలం పొగ (Smoke) గా ఉన్న ఆకాశం వైపునకు తన ధ్యానాన్ని మరాల్చాడు (ఖురాన్ 41:11) అని ప్రస్తావించింది.

2. 13.7 బిలియన్ల సంవత్సరాల క్రితం శూన్యంలో అత్యంత దట్టమైన పొగ (Smoke) వేడితో కూడిన ఒక కేంద్రకం (Point) మహా విస్పోటనం చెంది గెలాక్సీలు గ్రహాలూ, నక్షత్రాలుగా ఏర్పడ్డాయి. దీనినే “బిగ్ బ్యాంగ్ థియరీ (Big bang theory) అంటారు. ఈ థియరీని 1920 లో “జార్జ్ లిమైటర్” అనే శాస్త్రవేత్త ఆవిష్కరించాడు. కానీ, ఖురాన్ 1400 సం.ల క్రితమే- “… ఒకప్పుడు ఆకాశాలూ భూమీ పరస్పరం కలిసి ఉండేవనీ, తరువాత అవి వేరయ్యాయని (ఖురాన్ 21:30)” ప్రస్తావించింది. .

3). విశ్వం ఒకచోట నిశ్చలంగా లేదు కానీ విస్తరిస్తూ (Expand అవుతూ) ఉందన్న విషయాన్ని 1929లో “ఎడ్విన్ హబుల్” అనే శాస్త్రవేత్త ఆవిష్కరించటం జరిగింది. కానీ, ఈ విషయాన్ని ఖురాన్ ఎప్పుడో “ఈ విశ్వవ్యావస్థ విస్తరిస్తూ ఉంది (ఖురాన్ 51:47)” అని ప్రస్తావించింది.

4). అంతేకాదు “యోహన్నస్ కెప్లర్” 1609 సం.లో చెప్పిందేమిటంటే సూర్యునితో సహా సౌరకుటుంబంలోని గ్రహాలన్నీ తమ తమ కక్ష్యల్లో తిరుగుతున్నాయన్నది. ఈ విషయం సైతం ఖురాన్ – “సూర్య చంద్రులు తమ తమ కక్ష్యలలో తెలియాడుతూ తిరుగుతున్నాయి (ఖురాన్ 21:33) అని చెబుతుంది.

ఈ విధంగా విశ్వావిర్భావం గురించి, మానవ నిర్మాణం (Embryology) గురించి, ఆధునిక సైన్స్ ఈనాడు చేసిన ఎన్నో ఆవిష్కరణలు ఖురాన్ లో రాయబడినట్టు చూడగలం. దానిని బట్టి ఖురాన్ సైన్స్ పుస్తకమనో సైన్స్ నేర్పుతుందనో చెప్పటం నా ఉద్దేశం కాదు. నిజానికి పైన నేను చెప్పినట్టు ధార్మిక గ్రంథాల అసలు లక్ష్యమైతే మనిషిని చెడు నుండి మంచి వైపునకు నడిపించటమే!
ఇక మనం పైన చెప్పుకున్న “కార్యాకరణ సిద్ధాంతం (Cause and Effect theory)”ని తీసుకుంటే.. ఈ సమస్త విశ్వంలో 1. అద్భుతమైన ‘క్రమబద్ధత (Order)’ 2. సమతుల్యత (Balance) చూడగలం. 3. ఈ మొత్తం విశ్వవ్యావస్థను ఒక ‘అసాధారణమైన మేధస్సు (Supernatural Intelligence)’ క్రమబద్దీకరిస్తున్నట్లు గ్రహించగలం.

ఈ పరిశీలన ఆధారంగా సమస్త విశ్వం ఉనికి లోనికి రావటం ‘ప్రభావం (Effect)’ అయితే… అది ఉనికి లోనికి రావటానికి… ఎంతో క్రమబద్ధంగా నడుపబడటం వెనుక ‘మూల కారణం (Cause)’ ఒక అసాధారణమైన మేధస్సు ఉండి తీరాలి అన్న విషయం బయటపడుతుంది. పైగా ధార్మిక గ్రంథాలు మనిషిని ఏవో గుడ్డి నమ్మకాల ఆధారంగా కాకుండా… సృష్టిని శాస్త్రీయ పరిశీలన చేసి ఈ సృష్టిని ఉనికిలోకి తెచ్చి, క్రమబద్ధంగా నడుపుతున్న ఆ అసాధారణమైన మేధస్సును తెలుసుకోమంటున్నాయి. దానిని తెలుగులో “సృష్టికర్త” అన్నా, ఇంగ్లీష్ లో “క్రియేటర్” అన్నా, హెబ్రూ లో “యెహోవా” అన్నా, అరబ్బీలో “అల్లాహ్” అన్నా, హిందీలో “భగవాన్” అన్నా మొత్తానికి ఆ “అసాధారణమైన మేధస్సు” కూ.. నేడు మతపండితులు సృష్టించిన మిద్యాదైవాలకూ అస్సలు సంబంధంలేదన్నది ఇక్కడ అసలు విషయం. ఇప్పుడు నేను చెప్పిందంతా “మతబోధ” కాదు! కానీ “శాస్త్రీయ ధర్మం” చెప్పే “హేతుబద్ధమైన బోధ”!

కాబట్టి మత బోధకులు నైతికంగా దిగజారి మతాన్ని ఒక వ్యాపారంగా మార్చేసుకున్నారు కాబట్టి మతాన్నీ ధార్మిక గ్రంథాల ‘శాస్త్రీయ ధర్మాన్నీ” ఒక్కటే అని భ్రమపడి కాలదన్నేయటం మూర్ఖత్వమవుతుంది. ఈ విశ్వావిర్భావం వెనుక ఏ మేధోశక్తీ లేదనటం అజ్ఞానమవుతుంది. కచ్చితంగా ఆత్మవిశ్వాసం లేనివారే కల్పిత దేవుళ్లను నమ్ముకుంటారు.. కానీ హేతుబద్ధంగా ఆలోచన చెయ్యగలిగే కనీస ఇంగిత జ్ఞానమున్నవారు ఏదో ఒక మేధస్సు లేనిదే ఇంతపెద్ద విశ్వ వ్యవస్థ సృష్టించబడి క్రమబద్ధంగా కోట్ల సంవత్సరాలుగా నడపబడటం ఎలా సాధ్యమన్న కోణంలో ఆలోచన చెయ్యగలుగుతారు.

 Md Nooruddin 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *