మతోన్మాదం – నాస్తికోన్మాదం

మా మతమే గొప్పని భావించుకుంటూ ఇతరమతాలను హీనంగా చూసే భావజాలాన్ని “మతోన్మాదం” అంటారు. ఈ సృష్టికి ఏ దేవుడూ లేడని భావించటం నాస్తికత్వమైతే.. పనికట్టుకుని తమ నాస్తిక భావాలను ప్రదర్శించుకోవటానికి మత విశ్వాసాలను, ధార్మిక గ్రంథ ఆదేశాలనూ హేళన చేస్తూ కించపరుస్తూ మాట్లాడటాన్నే “నాస్తికోన్మాదం” అంటారు.

మత వ్యవస్థలో సంస్కారులతో పాటు “మతోన్మాదులు” ఉన్నట్టే.. నాస్తికుల్లోనూ సంస్కారులతో పాటు “నాస్తికోన్మాదులు” ఉంటారనటం అతిశయోక్తి కాదు. అయితే అటు మతోన్మాదులకూ ఇటు నాస్తికోన్మాదులకూ ఉండే కామన్ క్వాలిఫికేషన్ హేళన, వెటకారంతో కూడిన చిల్లర విమర్శలు చెయ్యటం. అలాంటి అచ్చోసిన ఓ “నాస్తికోన్మాది” పెట్టిందే ఈ క్రింది (స్క్రీన్ షాట్స్ లో) పెట్టిన పోస్టు.

***

ఖురాన్ 4:34 వాక్యంపై చాలా మంది ఖురాన్ అవగాహన లేనివారు, మరికొందరు నాస్తికులు లేవనెత్తే ప్రశ్నలను గమనించే ముందు ఆ వాక్యాన్ని గమనించగలరు.

“పురుషులు స్త్రీలకు అధికారులు. ఎందుకంటే ఒకరికి మరొకరిపై అధిక్యతను ప్రసాదించటం వల్ల. ఇంకా పురుషులు తమ సంపదను వారిపై ఖర్చు చేస్తున్నందువల్ల. కనుక సుగుణవతులైన స్త్రీలు విధేయత కలిగి ఉంటారు. పురుషులు లేనప్పుడు అల్లాహ్ రక్షణలో ఉంటూ వారి హక్కులను కాపాడుతారు. ధిక్కరిస్తారనే భయం మీకు ఏ స్త్రీల విషయంలో కలుగుతుందో వారికి నచ్చచెప్పండి. పడకగదులలో వారిని దూరంగా ఉంచండి, మరియు కొట్టండి, తరువాత వారు మీకు విధేయులైతే అకారణంగా వారిని వేధించటానికి సాకులు వెతకకండి” – 4:34-35

పై ఖురాన్ 4:34-35 వాక్యాలు జాగ్రత్తగా చదివితే.. అందులో భార్యా, భర్తల హక్కుల గురించి తెలుపబడింది.

ఎలా అయితే భర్త తన భార్య హక్కులను కాపాడతాడో.. అలాగే భార్య తన భర్త హక్కులను సైతం కాపాడాలి. అంటే అతను లేనప్పుడు వేరే పురుషులతో ఎలాంటి రహస్య సంబంధాలు పెట్టుకోకుండా అతని హక్కులను కాపాడాలి.

కానీ ఒకవేళ ఆ హక్కులు కాపాడే విషయంలో ఏ స్త్రీ అయినా ఒకవేళ చెడు నడతకు పాల్పడితే చెయ్యల్సిందేమిటో చెప్పబడింది. 1. ముందు నచ్చచెప్పాలి 2. పడక నుండి దూరం చెయ్యాలి. ఈ స్వల్ప శిక్షల తరువాత కూడా ఆమె తన భర్త హక్కులను కాలరాస్తున్నప్పుడు 3. కొట్టాలి. ఎలా? అంటే గొడ్డును బాదేసినట్టు జుట్టుపట్టుకుని కింద ఈడ్చిపడేసి బాదెయ్యమని కాదు. ప్రవక్త ముహమ్మద్ (స) వారు స్త్రీల పట్ల అణకువ కలిగి ఉండండి అని.. మీ భార్యలను ముఖంపై ఎంతమాత్రం కొట్టకూడదు నిజంగా ఆమెను మీరు కొట్టాల్సిన సందర్భం వస్తే స్వల్పంగా వీపు పై కొట్టండని చెప్పారు.

ఈ వాక్యంలో కొట్టటం అంటే సింబాలిక్ గా తన అయిష్టతను మరింత గట్టిగా వ్యక్తపరచటం మాత్రమే.

***

భార్య చెడు ప్రవర్తన విషయంలో మందలించమని చెప్పినప్పుడు.. మరి భర్త అవిధేయత, చెడు ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మరి భార్యలకు అలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వలేదు?

ఈ ప్రశ్నకు ఖురాన్ ఇస్తున్న సమాధానం:

“పురుషులకు మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా పురుషులపై ఉన్నాయి” -2:228

1. పై వాక్యం ప్రకారం పురుషులకు మహిళలపై ఏ హక్కులైతే ఉన్నాయో అలాంటి సమాన హక్కులే మహిళలకు పురుషులపై కూడా ఉన్నాయని స్పష్టమవుతుంది.

2. భర్త గనుక చెడునడతకు పాల్పడితే భార్య కిక్కురుమనకుండా ఓ మూల పడుండాల్సిందే అని ఖురాన్ చెప్పటం లేదు. అయితే స్త్రీ సహజంగానే కోమలత్వం కలిగి ఉంటుంది, పురుషుడు ధృఢత్వం కలిగి ఉంటారు కనుక తమ భర్తలు చెడునడతకు పాల్పడితే స్త్రీలను తిరిగి కొట్టమనటం సాధ్యం కాదు కనుక స్త్రీలు తమ భర్తలు గనుక చెడు నడతకు పాల్పడితే తమదైన పద్దతిలో పెద్దల సమక్షంలో పెట్టి న్యాయపరంగా తమ హక్కులను సాధించుకోవచ్చు.

“మీ కొరకు (స్త్రీ పురుషులిరువురికీ) సమ న్యాయం నిర్ణయించటం జరిగింది” – ఖురాన్ 2:178

కాబట్టి ఖురాన్ స్త్రీ పురుషులిరువురికీ సమాన హక్కులు, సమన్యాయం నిర్ణయిస్తుంది తప్పితే ఏ ఒక్కరి విషయంలోనూ ఎలాంటి వివక్షా చూపటం లేదు.

***

మరి అటువంటప్పుడు “పురుషులు స్త్రీలకు అధికారులు” అని ఎందుకు రాయబడింది?

అంటే.. స్త్రీని అన్ని విధాలా కాపాడటం కష్టపడి ఆమెను, కుటుంబాన్నీ పోషించే బాధ్యత పురుషునిది. ఒకవేళ ఆమె చదువుకున్నప్పటికీ స్వతహాగా సంపాదనాపరురాలైనప్పటికీ కూడా .. ఆమెను అన్ని విధాలుగా సంరక్షించే, ఆమె ఆలనా పాలనా చూసుకునే బాధ్యత పురుషునిది. ఆ విధంగా బాధ్యతల పరంగా పురుషునికి కాస్త ఆధిక్యత ఇవ్వబడింది. అయినప్పటికీ ధర్మం ప్రకారం పురుషులకు మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా పురుషులపై ఉన్నాయి, స్త్రీ పురుషులిరువురికీ సమ న్యాయం నిర్ణయించటం జరిగింది”.

ఈ విషయాల తాలూకు సరైన అవగాహన లేనోల్లు మాత్రమే ఇదిగో ఈ క్రింది విధమైన విమర్శలు చేస్తూ కూర్చుంటారు. కాబట్టి విమర్శకు ముందు పరిశీలన చాలా అవసరం అది చేతకానప్పుడు విమర్శించటం అనవసరం.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *