మతం అంటే కేవలం అమానుషత్వం, వ్యర్థమైన ఆలోచనలు, మూఢత్వం మరీ ముఖ్యంగా మతం కేవలం తిరోగమనం మూర్ఖత్వం మాత్రమే! చరిత్రలో శైవుల-వైష్ణవుల మధ్య సాగిన మారన హోమం నుండి, క్రైస్తవులు-ముస్లిముల మధ్య జరిగిన క్రూసేడ్లు, సిరియా దాడుల నుండి ఐఎస్ఎస్, అల్ ఖైదాల ఉగ్రవాద దాడుల వరకూ చరిత్రలో ఎన్నో మారణ హోమాలకు కారణమే మతం!
అలాంటి మతం అనే ఛట్రం నుండి బయటపడి, హేతువాద ఆలోచనను పెంపొందించుకుంటే గానీ వ్యక్తిగత, సామాజిక అభివృద్ధి సాధ్యం కాదు అన్నది మత వ్యవస్థ పట్ల వెగటుతో పూర్తిగా ఆధ్యాత్మికతకు దూరమైపోయిన ఆధునీక భౌతికవాదులు చాలా సందర్భాలలో చేసే వాదన! అంతేకాదు, నేటి చాలా మంది ఆధునికుల్లో కూడా ఇది అతి సర్వసాధారణమైపోయిన ఆలోచన కూడా
దీనికి రెండు ప్రధాన కారణాలు కనుగొనవచ్చు:
1. ఆది నుండీ ధర్మం నుండి ప్రజలను వేరు చేస్తూ వచ్చిన స్వార్థపరులైన మత పండితులు మూఢ విశ్వాసాలతో కూడిన మతవ్యవస్థను తయారుచేసి తాము సృష్టించిన మూఢ నమ్మకాలకు మత రంగు పులమటం
2. ఆస్తికులమని చెప్పుకునే వారు సైతం తాము అనుసరిస్తున్న మత విశ్వాసాలు ధార్మిక గ్రంథాలు ఆదేశిస్తున్న విశ్వాసాలా? లేక పండిత వర్గం కల్పించిన విశ్వాసాలా? అన్నది పరిశీలించక గుడ్డిగా వ్యవహరించటం.
దీనికి గొప్ప ఉదాహరణ ఒకప్పటి యూరప్ లోని చర్చీ వ్యవస్థను తీసుకోవచ్చు. అప్పట్లో వారు మేము దేవుని తరఫున భువిలో ప్రతినిధులం మా మాటే వేదం అన్న చందంగా వ్యవహరిస్తూ.. తమ అభిప్రాయాలకు విభేదించే వారిని ఘోర హింసలతో శిక్షలు అమలు పరిచే నేపథ్యంలో భూమి గోళాకారంగా ఉందని చెప్పి వారి బోధల్లో డొల్లతనాన్ని ఎత్తి చూపిన పాపానికి శాస్త్రవేత్తలను హింసించి చంపారు. ఎందుకంటే వారి వాదన భూమి చతుస్రాకారంలో ఉందన్నది. నిజానికి భూమి గోళాకారంలో ఉందని బైబిల్లోనే ఉంది. కానీ, అప్పటికే వారు ధార్మిక గ్రంథ బోధలకు దూరమైపోయి ఎన్నాళ్లో గడిచిపోయి ప్రజలపై అపర దైవాలై కూర్చుని స్వంతంగా ఓ మత వ్యవస్థను తయారు చేసుకుని అధికారం చలాయిస్తున్నారు.
ఇటు ముస్లిం సమాజాన్ని తీసుకుంటే ఇస్లాం బహుదైవారాధన, విగ్రరాధన ఖండిస్తున్నప్పటికీ, ఎంతో హేతుబద్ధమైన బోధలు ఇస్లాంలో ఉన్నప్పటికీ.. కొందరు మత పండితులు ప్రజల డబ్బును తమ జేబుల్లో సులువూగా రప్పించుకోవటానికి తాయెత్తులు, దర్గా సంస్కృతులను కల్పించారు. వారి గుడ్డి ఆచారాలకు మత రంగు పులిమి ప్రజల్లో వలియల్లాలను నమ్ముకుంటే దేవుని దగ్గర వారి సిఫారసు లభిస్తుందనే గుడ్డి నమ్మకంపై నడిపించారు. చివరకు సినిమాల్లో ముస్లిం సమాజ సంస్కృతిని చూపాలన్నా దర్గాలు, పచ్చ రంగు జెండాలు, తాయెత్తులు, దర్గాల దగ్గర ఖవ్వాలీలు చూపించే పరిస్థితికి వచ్చింది. నిజానికి తాయెత్తులు, దర్గా సంస్కృతులకు ఖురాన్ ప్రతిపాదించే శాస్త్రీయ ధర్మానికీ (ఇస్లాంకూ) సంబంధం లేదు.
అలాగే ఈనాడు హిందూ సమాజాన్ని గమనిస్తే వేదమంత్రోచ్ఛారణలతో విగ్రహ ప్రతిష్ట అని చెయ్యటాన్ని చూడగలం. నిజానికి వేదాల్లో ఎక్కడా విగ్రహారాధన చెయ్యవచ్చు అనటానికి ఒక్క మంత్రం లేదు సరికదా వేదాలు విగ్రహారాధనను ఖండిస్తున్నాయి. మరి ముఖ్యంగా వేదకాలంలో అసలు విగ్రహారాధనే లేదన్నది వేదజ్ఞాన పండితులకు తెలిసిన వాస్తవమే! పైగా వేదోపనిషత్తులు, గీతా శాస్త్రాలు ఏకేశ్వరోపాసనను బోధిస్తూ బహుదైవాల ఆరాధనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. కానీ, ఈరోజు హిందూ మతానికి పునాదే విగ్రహారాధన, బహుదైవారాధనలన్నంత వరకూ వచ్చేసింది పరిస్థితి. ఎన్నో కర్మకాండలు, జాతకాలు, హస్తరేఖలూ, విగ్రహపూజలు వగైరా మూఢ నమ్మకాలకు మత రంగు పులిమి తయారు చెయ్యబడిన హిందూ మతానికీ, వైదిక ధర్మానికీ సంబంధం లేదు. హిందూ అనే పదమే నైసర్గిక పదం తప్ప అసలు మతపరమైనదే కాదు.
ఈ విధంగా మతవ్యవస్థలో కల్పించబడిన ఎన్నో మూఢ నమ్మకాలకూ, గుడ్డి విశ్వాసాలకు మతరంగు పులమటమే ఎందరో ఆధునిక విద్యావంతులను మతం అంటే వెగటుపుట్టేలా చేసింది. వారి గుడ్డి నమ్మకాలతో కూడిన బోధల్లో డొల్ల తనమే ఎందరినో నాస్తికులుగా మార్చేసింది. దానికి తోడు మతతత్వవాదులు మతం పేరుతో మారణహోమాలు సృష్టించటం దానికి తోడయ్యింది. వెరసి జరిగిన అతిపెద్ద నష్టం ఏమిటంటే- మతవ్యవస్థలో పేరుకుపోయిన అమానుషత్వానికీ, మూర్ఖత్వానికీ కారణమే “ధార్మిక గ్రంథాలు” అని అపోహపడి, ధార్మిక గ్రంథాలు ప్రబోధించే ఎంతో హేతుబద్ధమైన “శాస్త్రీయ ధర్మానికి” పాపం వారు పూర్తిగా దూరమైపోయారు. నిజానికి మతవ్యవస్థలో పేరుకు పోయిన మూఢ నమ్మకాలను తుడిచిపెట్టటానికే ధార్మిక గ్రంథాలు అవతరించాయన్న వాస్తవం వారికి కనుమరుగైపోయింది.
ఒక ప్రక్క తమ మూఢ నమ్మకాలకు మతరంగు పులిమిన పండితులూ.. మరో ప్రక్క మతం పేరు మీద మారణహోమాలు సృష్టించిన కొందరు మూర్ఖుల కారణంగా అసలు ధర్మం ఎలా అభాసుపాలైందంటే…
ఒక తండ్రి తన పిల్లలకు ఉత్తమ నైతిక బోధలు చేస్తూ అహింసను నేర్పుతూ పెంచుకుంటూ వచ్చాడు. కానీ వారిలో కొందరు అతని నీతి బోధలను పెడ చెవిన పెట్టి దుర్మార్గులుగా మారారు. పైగా తమ దుర్మార్గాన్ని సులువుగా కానించటానికి తమ తండ్రి పేరును ఉపయోగించుకునేవారు. కొంతకాలానికి ఆ దుర్మార్గులను చూస్తూ వచ్చిన జనం.. వారి దుర్మార్గాలకు కారణం వారి తండ్రి పెంపకమే అన్న అభిప్రాయానికి వచ్చారు. ఈనాడు కొందరు మతతత్వవాదుల కారణంగా అచ్చం ధర్మం పరిస్థితి కూడా అలానే తయారయ్యింది.
మూఢత్వ మతవ్యవస్థను తయారుచేసిన మత పండితులు ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మాన్ని చాకచక్యంగా తప్పించి తాము సృష్టించిన మూఢ విశ్వాసాలపట్ల ఎనలేని పవిత్రతను కల్పించారు. తాము సృష్టించిన మూఢ నమ్మకాల పట్ల ప్రజలకు ఎక్కించిన సెంటిమెంట్ మత్తు ఎంతగా పని చేసిందంటే వారు వెనక్కి తిరిగి ఇలా చెయ్యటం ఎంతవరకు కరెక్టు అని లాజికల్ గా ఆలోచించలేనంత దూరం లాక్కెళ్లిపోయి వదిలేశారు.
కాబట్టి ఆధ్యాత్మిక వ్యవస్థలో ఆస్తికులమని చెప్పుకునేవారు ఆజ్ఞానపు ఆస్తికులుగా కాక హేతుబద్ధమైన ఆస్తికులుగా మారాలంటే తాము సెంటిమెంటుగా చేసే ఆరాధనలూ, పూజలు, పునస్కారాలు, ప్రార్ధనలు, క్రతువులు వగైరా తమ వద్ద ఉన్న శాస్త్రాలు నిర్దేశించేవేనా? అన్నది గమనించినప్పుడే అది సాధ్యమవుతుంది.
అది ఎలాగంటే యేసును దేవునిగా చేసుకుని ఆరాధించమని తమకు పాస్టర్లు ఆదేశిస్తున్నప్పుడు గుడ్డిగా వారిని ఫాలో అయిపోక నిజంగా బైబిల్లో యేసు ఎక్కడైనా తాను దేవుడని చెప్పుకున్నారా? లేక ఆయన మరో దేవుణ్ణి పరిచయం చేశారా? అన్నది గమనించగలగాలి.
దర్గాలకు వెళ్లి ప్రార్ధనలు చేసి, తాయెత్తులు కట్టుకునే ముస్లిములు ఇలాంటివి తమను కాపాడతాయని ఖురాన్ లో నిజంగా రాసుందా? అన్నది ఖురాన్ చదివి తెలుసుకోవాలి.
అలాగే రాముడు నుండి సాయిబాబా వరకు అనేక మహనీయులు తామే దైవాలని చెప్పుకున్నారా? లేక వారు కూడా మరొక దైవాన్ని ఆరాధించేవారా? అన్నది కాస్త పరిశీలించి… విగ్రహారాధన, బహుదైవారాధన అసలు వైదిక ధర్మంలో ఉందా? దేన్ని పడితే దాన్ని ఎవరికి పడితే వారిని దణ్ణమెట్టేయటం కరెక్టేనా? అలా చెయ్యమని వేదోపనిషత్తులు, గీతా శాస్త్రాలు చెబుతున్నాయా? అన్నది హిందువులు పరిశీలించాలి. అప్పుడే మతం అనే మూఢత్వం నుండి శాస్త్రీయత కలిగిన ధర్మం వైపునకు తిరిగి హేతుబద్ధమైన ఆలోచనా విధానం పెరగటానికి దోహదపడుతుంది.
