కనపడనప్పుడు దేవుణ్ణి ఎలా నమ్మేదీ?

ఎంతో కాలంగా ఒక ప్రదేశాన్ని తవ్వుకుంటూ వస్తున్న ఓ పురావస్తు శాఖ తవ్వకాలలో ఒక ప్రాచీన జాతి ఆనవాళ్లు బయటపడ్డాయి. తవ్వుకుంటూ వెళితే.. ఏవో కొన్ని కుండ పెంకులు, బల్లాలు, రాళ్లూ రప్పలతో కూర్చిన కట్టడాలవంటివేవో బయటపడ్డాయి. మొత్తానికి అక్కడ ఒక ప్రాచీన జాతి అయితే నివసించింది కానీ వారు కేవలం ఆటవికులు, ఆజ్ఞానులని తేల్చిందా పురావస్తు శాఖ.

మరి కొంతకాలం తరువాత వేరే తవ్వకాలలో మరో ప్రాచీన జాతి ఆనవాళ్లు బయటపడ్డాయి. కానీ ఈసారి అద్భుతమైన డిజైన్లతో చెక్కబడిన కళాకృతులు, డ్రైనేజీ వ్యవస్థ, గొప్ప ఆర్కిటెక్చర్ తో కట్టబడిన భవంతులూ, వివిధ రకాల పనిముట్లు వగైరా బయటపడ్డాయి. ఇప్పుడా ఆ పురావస్తు శాఖ అక్కడ నివసించిన జాతి అత్యంత గొప్ప సంస్కృతితో ఒకప్పుడు అలరారిందని, వారు ఎంతో గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తులని, గొప్ప కళాకారులూ, మేధోసంపత్తి మెండుగా ఉన్నవారు, గొప్ప బలవంతులనీ తేల్చి చెప్పింది.

ముందు జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ ఆనవాళ్లను బట్టి ఆ జాతి వారిని చూడకుండానే వారు కేవలం ఆజ్ఞానులూ, ఆటవికులని తేల్చిచెప్పటం ఎలా సాధ్యపడింది?

రెండవసారి జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ ఆనవాళ్లను బట్టి ఆ జాతి వారిని చూడకుండానే వారు గొప్ప మేధావులూ, బలవంతులూ, గొప్ప నైపుణ్యం కలిగినవారు, కళాకారులూ వగైరా అని తేల్చిచెప్పటం ఎలా సాధ్యపడింది?

ఈ ప్రక్రియనే సంక్షిప్తంగా- “పరోక్ష ప్రమాణాల” ఆధారంగా “ప్రత్యక్షంగా దేన్నైనా చూడకపోయినప్పటికీ దాని ఉనికినీ, స్థితిగతులను నిర్థారించటం” అంటారు.

అందుకే ప్రత్యక్షంగా ఆ జాతిని చూడకపోయినప్పటికీ కొన్ని పరోక్ష ప్రమాణాల ద్వారా ఆ పురావస్తు శాఖ చేసిన పనులేమిటంటే-

1. అక్కడ ఒక జాతి నివశించిందని దాని “ఉనికి”ని గుర్తించటం…
2. పైగా ఆ జాతి వారు చెక్కిన కళాకృతులనూ చూసి వారు “నైపుణ్యత కలవార”ని గ్రహించటం…
3. ఇంకా ఆ జాతి నిర్మించిన గొప్ప కట్టడాలను చూసి వారి “మహా శక్తిమంతుల”ని నిర్ధారించటం…
4. అంతేకాక ఆ జాతి వాడిన పనిముట్లూ, వారు నిర్మించుకున్న సౌకర్యాలనూ చూసి వారు గొప్ప కళాకారులని తేల్చిచెప్పటం.

ఇవన్నీ చెబుతున్న ఆ పురావస్తు శాఖ దగ్గరకు ఒకడొచ్చాడు. వచ్చిన ఆ మనిషి మీరు వారిని చూడకుండానే ఇక్కడ దొరికిన కొన్ని కళాకృతులను బట్టి ఇక్కడొక జాతి నివశించిందని, పైగా వారు గొప్ప నైపుణ్యం కలవారని ఎలా చెబుతారు? ఇక్కడా ఏ జాతీ లేదు! ఆ కళాకృతులూ, బయటపడ్డ ఆనవాళ్లన్నీ ప్రకృతి సిద్ధంగా అలా ఏర్పడ్డాయంతే అని వాదించటం మొదలు పెట్టాడు. దానితో అక్కడున్న పురావస్తు శాఖ సభ్యులు అతన్నో పిచ్చివాడిగా జమకట్టి తన్ని తరిమేశారు.
****

ఇప్పుడు పైన చెప్పిన మొత్తం స్టోరీలో పురావస్తు శాఖ వారి స్థానంలో ఒకవేళ మనం ఉంటే.. ఆ బయటపడ్డ కళాకృతుల స్థానంలో సకల విశ్వ వ్యవస్థను తీసుకుంటే… ఆ కళాకృతులను బట్టి అక్కడ గొప్ప నైపుణ్యతతో, శక్తీ బలంతో అలరారిన జాతి ఉనికిని, వారి శక్తి-సామర్థ్యాలనూ నిర్థారించినట్లుగా.. శూన్యంలో వ్రేలాడుతున్న విశ్వవ్యవస్థలో తమ తమ కక్ష్యల్లో తిరుగుతున్న గ్రహాలూ, వాటి మధ్య పటిష్టమైన క్రమం, గొప్ప అయస్కాంత శక్తితో తన కక్ష్యలో వెంట్రుక వాసి క్రమం తప్పకుండా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న భూమీ.. దానిపై ఎంతో కళా నైపుణ్యంతో తీర్చిదిద్దినట్టుగా అందమైన ప్రకృతి, వివిధ జాతుల జీవాలూ, రకరకాల రుతువులూ వగైరా వాటిని చూసి…

దీనంతటి వెనుక ఎవరో ఒక సృష్టికర్త ఉన్నాడని…
అతను ఎంతో గొప్ప నైపుణ్యం కలవాడనీ…
అతను ఓ మహా శక్తిమంతుడనీ…
ఎంతో నేర్పరి అయిన గొప్ప కళాకారుడని… నిర్ధారించటం అవివేకమా? వివేకమా?

పైన చెప్పిన స్టోరీలో ఒకడు వచ్చి వాదించటం మొదలెట్టినట్టే.. ఇక్కడ కూడా ఎవడైనా – “అబ్బే! ప్రత్యక్షంగా చూడకుండానే కేవలం విశ్వ వ్యవస్థలో ఉన్న క్రమాన్నీ, నైపుణ్యతను, భూమినీ దానిపై ఉన్న జీవాలూ వగైరా చూసి వాటి వెనుక ఎవడో ఒక సృష్టికర్త ఉన్నాడని, అతను ఎంతో శక్తిమంతుడనీ అతని శక్తి-సామర్థ్యాలు సైతం ఎలా నిర్ధారిస్తారు? అవన్నీ ప్రకృతి సిద్ధంగా సహజంగా ఏర్పడ్డాయంతే! సృష్టికర్త అంటూ ఎవడూ లేడు!! అని వాదించటం మొదలుపెడితే పైన చెప్పిన స్టోరీలో మాదిరిగా అతన్ని పిచ్చివాడిగా జమకట్టాలా? లేక అతని మెళ్లో గొప్ప హేతువాది అని బోర్డు తగిలించి తలపై కూర్చొబెట్టుకోవాలా?

విశ్వాన్ని పరిశీలించి “There is some power” అని నిర్థారిస్తున్న సైంటిస్టులను వివేకులనుకోవాలా? కనపడనప్పుడు సృష్టికర్తను ఎలా నమ్మేదని వాదిస్తున్న అభినవ నాస్తికులను వివేకులనుకోవాలా?

సో.. కాబట్టి, కనపడనప్పుడు దేవుణ్ణి ఎలా నమ్ముతామని వాదిస్తున్న అభినవ నాస్తికులూ, సృష్టికర్త అసలు ఉన్నాడా లేడా అన్న మీమాంసలో ఊగిసలాడేవారూ ఈ ఆర్టికల్ ను ఒకటికి నాలుగు సార్లు బాగా చదివితే అసలు సృష్టికర్త ఉన్నాడా? లేడా? ఉంటే ఏ స్కేల్ ఆధారంగా గుర్తించాలి? ఆయనశక్తి-సామర్థ్యాలేమిటీ ? అన్న ప్రశ్నలకు ఓ స్పష్టత రావటానికి అవకాశం ఉండవచ్చు

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *