ఏది నిజమైన హేతువాదం?

‘ఉత్తమసమాజ నిర్మాణం’ అన్నది ‘ఉత్తమ వ్యక్తుల నిర్మాణంతో’ ‘బాధ్యతాయుత దృక్పథాల’ అనుసరణ వలన మాత్రమే సాధ్యమవుతుంది. తప్పితే బాధ్యతారహితమైన దృక్పథాలు ‘వ్యక్తి సంస్కరణకు’ ‘అంతర్వ్యక్తిత్వ’ నిర్మాణానికి దోహదం కాలేవు సరికదా వ్యక్తులలో బాధ్యతారాహిత్యాన్ని, నిర్లక్ష్యాన్ని, విచ్చలవిడితనాన్ని పెంచేసి అనేక చెడుల్లో మునిగిపోవటానికి కారణమవుతాయి.

నేటి అభినవ నాస్తికవాదుల దృక్పథం ఏమిటంటే- మతం కేవలం ట్రాష్! మతం మూఢనమ్మకాలను తప్ప దేన్నీ నేర్పదు. అది వ్యక్తుల్లో హేతుబద్ధమైన ఆలోచన విధానానికి లాక్ పెట్టేసి మనుషులను మూఢత్వంలోకి నెట్టేస్తుంది కాబట్టి గుళ్లూ, దేవుళ్లూ, మతాల ఉచ్చులో నుండి బయటపడి, హేతుబద్ధంగా ఆలోచన చేస్తూ భౌతికంగా అభివృద్ధి సాధించటానికి ప్రయత్నించినప్పుడే ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యపడుతుంది అన్నది.

కచ్చితంగా పై వాదన సరైనదే! కాకపోతే మనిషి వ్యక్తిత్వం రెండు విధాలుగా వర్గీకరించబడుతుంది అవి: 1. బాహ్యవ్యక్తిత్వం 2. అంతర్వ్యక్తిత్వం. అయితే నాస్తికుల్లో ఎంతో మంది విద్యావేత్తలు, మేధావులు సైతం చేసే అతి పెద్ద పొరపాటు ఏమిటంటే.. తాము చేసే పై వాదన కేవలం మనుషుల్లో “బాహ్యవ్యక్తిత్వ నిర్మాణం (External personality development)” కు సంబంధించిందే తప్ప ‘అంతర్వ్యక్తిత్వ’ నిర్మాణానికి (Internal personality development) సంబంధించింది కాదు అన్నది గుర్తించకపోవటం.

హేతువాద భావజాలాన్ని పెంపొందించుకుని, భౌతికంగా అభివృద్ధి సాధిస్తే చాలు ‘అంతర్వ్యక్తిత్వ నిర్మాణం’ కూడా దానికదే జరిగిపోతుందన్నది నేటి నాస్తికుల వాదన. అదే నిజమైతే.. నేడు ప్రపంచ వ్యాప్తంగా నేరాలకు-ఘోరాలకు అనేక చెడులకు పాల్పడుతున్నవారిలో అధికశాతం మంది ఉన్నత విధ్యను అభ్యసించి, ఉన్నత పదవుల్లో ఉన్నవారు సైతం ఎందుకున్నారు? అని ప్రశ్నిస్తే వారి వద్ద సరైన సమాధానం ఉండదు.
****

దీనికి కారణం నాస్తికులు చెప్పే బాధ్యతారహితమైన దృక్పథమే!

మనిషి ఈ జీవితంలోనే సాధ్యమైనంత వరకు అభివృద్ది సాధించి, ఇక్కడే సుఖభోగాలు అనుభవించి ఇక్కడే చనిపోవాలన్నది దేవుడు లేడని చెప్పే నాస్తికుల వాదన. ఇది కేవలం మనిషి జీవితం పట్ల బాధ్యతారాహిత్యాన్ని కలిగించే దృక్పథం మాత్రమే!

ఈ బాధ్యతారాహిత్యమైన దృక్పథం కారణంగా వ్యక్తులు ఎంతగా భౌతికాభివృద్ది సాధించినప్పటికీ సమాజంలో అధికశాతం నైపుణ్యం కలిగిన నేరస్థులు, ఆర్థిక నేరగాళ్లు, అనేక చెడులకు అలవాటు పడిన దుర్మార్గులు తయారవుతారు తప్ప.. “మనోవాంఛలపై అదుపు సాధించే “ఉత్తమ నైతిక విలువల”ను నాస్తికవాదం ఎప్పటికీ నిర్దేశించలేదు.

హేతుబద్ధ ఆలోచనలు పెంచేదే “శాస్త్రీయ ధర్మం”

మూఢ నమ్మకాలు, గుడ్డి విశ్వాసాలు, కర్మకాండలు తప్ప వ్యకిత్వ నిర్మాణానికి, భౌతికాభివృద్ధి కోసం ఏ మాత్రం పనికి రాని మతవ్యవస్థ పట్ల వెగటుతో నాస్తికులుగా మారిపోయిన వారు చేసే అతిపెద్ద పొరపాటు నేడు సమాజంలో ఉన్న “మూఢ మతవ్యవస్థ”ను, ధార్మిక గ్రంథాల “శాస్త్రీయ ధర్మాన్నీ” ఒకే గాడిన కట్టేసి వ్యతిరేకించటం.

నిజానికి ధార్మిక గ్రంథాలు అవతరించబడినవే మతవ్యవస్థలో గుడ్డి నమ్మకాల నుండి ప్రజలను బయటపడవేసి.. వారిలో హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని (Logical thinking) పెంపొందించటానికి. ధార్మిక గ్రంథాలు “జ్ఞానానికి” ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయి. అలాగే భౌతికంగా లాభపడాలంటే తగినంత భౌతిక శ్రమ చెయ్యమంటున్నాయి. మీ సంపాదనలో కొంతభాగాన్ని నేరుగా బీదలకే పంచి పెట్టమని చెబుతున్నాయి.
****

దీనికి పూర్తి భిన్నంగా మతవ్యవస్థను తయారుచేసిన పండితులు- “మీరు లాభపడాలంటే మాతో ఏవో ప్రత్యేక పూజలు చెయ్యించుకుని, మాతో జాతకం చెప్పించుకుని, ఇంటి వాస్తు బాగు చెయ్యించుకుంటే సరిపోతుంది అంటారు. మీ దానాలను మా హుండీలలో వెయ్యండి లేదా మా పేరున సమర్పించుకోండని చెబుతారు.

ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మం ఇలాంటి చావకబారు పనులు చెయ్యమని ఎప్పుడూ ఆదేశించదు. అవి మీ స్వంత బుద్ధీ-జ్ఞానాలను ఉపయోగించి మాత్రమే ఏ నిర్ణయాన్నైనా తీసుకోమంటుంది. చివరకు దేవుణ్ణి నమ్మటం సైతం ఎవరో చెప్పిందాన్ని గుడ్డిగా నమ్మక సృష్టిని శాస్త్రియంగా పరిశీలన చేసి అప్పుడు మాత్రమే ఈ సమస్త విశ్వానికీ అతీతంగా ఉన్న సృష్టికర్తను నమ్మమని ఆదేశిస్తుంది. సర్వేశ్వరుడు, అక్షర పరబ్రహ్మ, యెహోవా, ఈల్, ఎలోహ్, అల్లాహ్ అని ఏ పేరుతో పిలిచినా ఒక్కడు మాత్రమే ఈ సమస్త సృష్టికీ కర్త అన్న వాస్తావాన్ని తెలుపుతుంది. అనేక మిధ్యా దేవుళ్లను విడిచిపెట్టి ఆ ఒక్క సృష్టికర్తకు లోబడి ఉండటమే ధర్మమని చెబుతుంది.

వైద్యశాస్త్రం, ఆర్థికశాస్త్రం, రసాయనశాస్త్రాం వగైరా అనేక శాస్త్రాలు మనిషి భౌతిక అభివృద్ధికి తోడ్పడితే… ధార్మిక గ్రంథాలు ప్రతిపాదించే “శాస్త్రీయ ధర్మం”- ‘వ్యక్తిత్వ ప్రక్షాళన’ చేసి మనిషి చెడులపై ఎలా అదుపు సాధించాలో, నైతికంగా ఎలా జీవనం సాగించాలో నేర్పుతుంది.

వ్యక్తిగత జీవితంలో విచ్చలవిడితనాన్ని మందగింపజేసి బాధ్యతా భావమును పెంచుతాయి. దేవుని ప్రసన్నత లభించాలంటే కర్మకాండలు నిర్వహించుకుంటూ కూర్చోవటం కాదు, తోటి మానవుల పట్ల మానవత్వంతో మెలగమని చెబుతుంది. మనిషి తన వ్యక్తిగత, సామూహిక జీవీతాన్ని ఎలా గడపాలి, భౌతిక శక్తుల వాస్తవికత ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది.

ప్రాపంచిక జీవితం ఏదో కొన్నాళ్లు సుఖాలు అనుభవించి బాధ్యతారాహిత్యంగా చనిపోవటానికి కాదు.. కానీ తోటి మానవుల పట్ల ప్రేమా-త్యాగాలతో ప్రవర్తిస్తూ, చెడుకు దూరంగా మంచికి దగ్గరగా మసలుకుంటూ గౌరవ మర్యాదలు సంపాదించటానికే ఈ జీవితం ఇవ్వబడింది. ఇక్కడ చేసే మంచీ-చెడుల ఆధారంగానే పరలోకంలో శాశ్వత శిక్షా-బహుమానాలుంటాయన్న “బాధ్యాతాయుత దృక్పథాన్ని” నేర్పుతుంది.

కాబట్టి మూఢత్వ మత వ్యవస్థకూ ఎంతో హేతుబద్ధమైన విశ్వాసాలు ప్రతిపాదించే ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మానికీ మధ్య తేడాను గుర్తించి.. వైజ్ఞానిక సామర్థ్యాన్ని పెంచే భౌతిక విధ్యను నేర్చుకుంటూనే.. వ్యక్తిత్వ నిర్మాణం చేసి నైతికంగా తీర్చిదిద్దే ధార్మిక విధ్యను కూడా అందించటమే నిజమైన హేతువాదం అవుతుంది.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *