మతం అన్నది మనిషి జ్ఞాన వికాసాన్ని, స్వేచ్ఛను అంతమొందించి, అతన్ని హేతుబద్ధ ఆలోచనా విధానం నుండి అహేతుకమైన విశ్వాసాలవైపుకు, గుడ్డి నమ్మకాలపై నడిపి అతన్ని భౌతికంగా ఎదగనీయదు. కాబట్టి మతం అనే వ్యవస్థ నుండి బయటకు వచ్చి హేతుబద్ధంగా వికాసం చెందనంతవరకూ ఈ ఆధునిక యుగంలో అభివృద్ది సాధించటం పీడకల్లో కూడా ఆశించలేమన్నది నేటి ఆధునిక హేతువాదుల వాదన.
ధార్మిక గ్రంథాల అవగాహన ఉన్న నాలాంటి వారెవరైనా పై వాదన నూటికి నూరుశాతం కారెక్టనే చెబుతారు. ఎందుకంటే అహేతుక గుడ్డి నమ్మకాలతో కూడిన మతవ్యవస్థకూ, ధార్మిక గ్రంథాలు ప్రబోధించే ధర్మానికీ పొంతన లేదు కాబట్టి. మనిషి హేతుబద్ధంగా వికాసం చెందనీయకుండా వారిని దోచుకోటానికి కొందరు వంచక పండితులచే తయారు చేయబడిండే మతవ్యవస్థ! కానీ గుడ్డి నమ్మకాల్ని, ధార్మిక గ్రంథాలనూ ఒకే గాడిన కట్టేసి అధ్యాత్మిక వ్యవస్థే పెద్ద చెత్త, ట్రాష్ అని నాస్తికులు తీర్మానిస్తుంటారు. అది మటుకు నూటికి నూరుశాతం తప్పే.
హేతుబద్ధమైన ఆధ్యాత్మికత ధార్మిక గ్రంథాల్లో ఉంటే.. గుడ్డి నమ్మకాలతో కూడిన ఆధ్యాత్మికత కొందరు కల్పించిన నేటి మతవ్యవస్థలో ఉంది.
నిజానికి ధార్మిక గ్రంథాలు హేతుబుద్ధి, జ్ఞాన వికాసం నుండి ప్రజలను దూరం చేసేసి, వారిని ఏమాత్రం ఎదగనీయకుండా సన్నసులుగా మారి బతకమని చెప్పటం లేదు. ఒకసారి ఈ క్రింది వాక్యాలు చదివితే ధార్మిక గ్రంథాలు జ్ఞానవికాసానికీ, హేతువాద ఆలోచనలకు ఎంతటి పెద్ద పీట వేస్తున్నాయో తెలుసుకోగలరు.
“ఈ ప్రపంచంలో జ్ఞానంతో సమానమైనది ఏదీ లేదు. అట్టి జ్ఞానయోగ సిద్ధిని బొందినవాడు కాలక్రమమున తన యందే స్వయముగా పొందుచున్నాడు” – గీతా 4:38
“జ్ఞానం సంపాదించినవాడు ధన్యుడు వివేకము కలిగిన నరుడు ధన్యుడు. వెండిని సంపాదించుటకంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుటకంటే జ్ఞానము సంపాదించుట మేలు” – బైబిల్ (సామెతలు 3:13-15)
“తమ బుద్ధిని ఉపయోగించని వారు చెవిటివారు, మూగవారు మాత్రమే అల్లాహ్ దృష్టిలో నీచాతినీచమైన కోవకు చెందిన జంతువులు” – ఖురాన్ 8:22
“బుద్ధీ, జ్ఞానాలు వ్యవహరించనివారిపై ఆయన మాలిన్యాన్ని పడవేస్తాడు” – 10:100
ఇలాంటి ఎన్నో వాక్యాల్లో… ధార్మిక గ్రంథాలు (వీటినే చాలామంది మతగ్రంథాలు అని కూడా పిలుస్తుంటారు) జ్ఞానం సంపాదించి, బుద్ధీ, జ్ఞానలతో వ్యవహరించమనే చెబుతున్నాయి తప్ప ఏపనైనా హేతువిరుద్ధంగా గుడ్డిగా చేసుకుపోండి అని చెప్పటం లేదు. .
అలాగే ధార్మిక గ్రంథాలు భౌతికాభివృద్ధి విషయంలో ఎటువంటి పరిశ్రమా చెయ్యకుండా గుడ్డిగా దేవుణ్ణి నమ్ముకుని ప్రార్థనలు చేసుకుంటూ బైరాగుల్లా మారిపోయి గడిపేయమని చెప్పటం లేదు. “తన్ను తాను ఉద్ధరించుకోవలెను (గీత 6:5)”, “నరుడు కష్టార్జితంతోనే సుఖపడాలి (బైబిల్-ప్రసంగి 3:10)” “మనిషి శ్రమించిన దానికి మించి అతనికి ఏదీ లభించదు (ఖురాన్ 90:4)” అంటూ మనిషిని భౌతిక ప్రపంచంలో తగినంత శ్రమ పడి అభివృద్ధి చెందమంటున్నాయి.
అలాగే “ధర్మం విషయంలో నిర్బంధంగానీ, బాలాత్కారం గానీ లేవు (2:256)” “దీనినంతటినీ బాగా విచారణ చేసి తరువాత నీకు ఏది బాగనిపిస్తే అలాగే ఆచరించు (గీత18:63)” అంటూ మనిషికి ధార్మికగ్రంథాలు వ్యక్తి స్వేచ్ఛకు, భావస్వేచ్ఛకు అవకాశమిస్తున్నాయి తప్ప మనిషి ఆలోచనలకు లాక్ పెట్టేసి కొన్ని మూఢ నమ్మకాలు నిర్దేశించి పశువుల్లా గుడ్డిగా అనుసరిస్తూ వెళ్లిపోండి అని చెప్పటం లేదు.
కాబట్టి అహేతుకమైన విశ్వాసాలు, గుడ్డి నమ్మకాలపై నడిపే మత వ్యవస్థ నుండి బయటకు వచ్చి హేతుబద్ధంగా వికాసం చెందటానికి, జ్ఞానపరంగా ఎదగటానికీ మార్గం చూపున్న ధార్మిక గ్రంథాల శాస్త్రీయ ధర్మం వైపునకు మరలటమే హేతుబద్ధంగా ఆలోచించేవారి లక్షణం అలాంటివారే నిజ హేతువాదులు అని చెప్పటం అతిశయోక్తి కాదు.
హేతుబుద్ధి, జ్ఞాన వికాసం అధ్యాత్మికతతో అంతమైపోతుందా?
