తనను నమ్మకపోతే నరకంలో పడేసేవాడు దేవుడు ఎలా కాగలడు?

అటు ఆస్తికులైనా ఇటు నాస్తికులైనా ఏదైనా విషయాన్ని వినయంగా చర్చించాలి తప్ప వెకిలితనంగా మాట్లాడకూడదు. నాస్తికులన్న ట్యాగ్ తగిలించుకున్నంత మాత్రానా తమ ఐడెంటిటీని నిరూపించుకోవాలన్న హడావిడిలో ఆస్తికులను హేళన చెయ్యటమే పనిగా పెట్టుకోకూడదు. అలాగే ఆస్తికులు సైతం తోటి ఆస్తికులపట్ల, నాస్తికుల పట్ల సైతం హేళనా దృష్టి కలిగి ఉండకూడదు.

ఇటు నాస్తికులైతే ‘హేతుబద్ధమైన నాస్తికులుగా’ ఉండాలి తప్ప ‘మూఢత్వ నాస్తికులు’గా ఉండకూడదు అటు ఆస్తిలైతే ‘హేతుబద్ధమైన ఆస్తికులుగా’ ఉండాలి తప్ప ‘మూఢత్వ ఆస్తికులు’గా ఉండకూడదు.

తనను నమ్మకపోతే నరకంలో పడేసే దేవుడు కరుణామయుడు ఎలా కాగలడు శాడిస్ట్ అవుతాడు గానీ? అన్నది చాలా మంది నాస్తికులు లేవనెత్తే ప్రశ్న

***

తనను నమ్మని వాళ్లనే కాదు.. తనను నమ్మే కొందరు పరమ భక్తులను కూడా దేవుడు నరకంలో పడవేస్తాడు. అదేంటి!? వారెవరూ? ఆశ్చర్యంగా ఉంది కదూ.

ఇది అర్థం కావాలంటే ముందు అసలు దేవుణ్ణి నమ్మటం లేక దైవారాధన అంటే ఏమిటి? దేవుని ఆదేశాలు అనుసరించటంలో ఎవరికి ప్రయోజనం కలిగుతుంది అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి.

‘దైవారాధన’ అన్న పదనికి చాలా విస్తృత అర్థం ఉంది. నిజానికి దేవుని ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటించటమే అసలు దైవారాధారన లేక దేవుణ్ణి నమ్మటం అంటే. తప్పితే ఏదో మొక్కుబడిగా దణ్ణం పెట్టుకోవటమో, ప్రార్థనలు చెయ్యాటమో కాదు దేవుణ్ణి నమ్మటం అంటే.

సరే, ఇంతకూ దేవుని ఆదేశాలను పాటించటం వలన ఎవరికి ప్రయోజనం?

అధికారిక హోదాలో ఉంటూ ఆదేశాలు ఇచ్చే వ్యక్తులు మూడు రకాలుగా ఉంటారు అలాగే వారిచ్చే ఆదేశాలు కూడా మూడు విధాలుగా ఉంటాయి. ఉదాహరణకు:

1. ఏదైనా ఆదేశం ఇవ్వటం వల్ల.. ఆ ఆదేశం ఇచ్చేవారికీ లాభం ఉంటుంది, దానిని అనుసరించేవారికీ లాభం ఉంటుంది

2. ఆ ఆదేశం ఇచ్చేవారికి మాత్రమే లాభం ఉంటుంది.. తప్ప వాటిని అనుసరించేవారికి ఏ లాభమూ ఉండదు

3. ఆదేశం ఇచ్చేవారికి ఏ లాభమూ ఉండదు.. కానీ వాటిని అనుసరించే వారికి మాత్రమే లాభం ఉంటుంది

పై వాటిలో మూడవ రకమే దేవుడు ఇచ్చే ఆదేశాలు కూడా
ఉదాహరణకు ధార్మిక గ్రంథాల్లో దేవుడిచ్చే ఆదేశాలను గమనిస్తే..

మీరు వ్యభిచారం, అశ్లీల్లం దరిదాపులకు కూడా వెళ్లవద్దు..

జూదం, మధ్యం, మత్తు పదార్థాల జోలికి కూడా పోవద్దు..

అన్యాయంగా ఏ ప్రాణినీ హతమార్చవద్దు..

భూమి మీద వీర్రవీగుతూ అహంకారంతో నడవవద్దు..

వృద్ధాఖర్చు చేయవద్దు, అనాధాల సొమ్ము జోలికి పోవొద్దు..

తలిదండ్రులను కసురుకుంటూ మాట్లాడవద్దు..

ప్రజలతో మర్యాదగా, మృదువుగా మాట్లాడండి..

మంచి పనులు చేయటంలో మిన్నగా ఉండండి..

ప్రవర్తన రీత్యా మీలో ఉత్తముడే దేవుని దృష్టిలో ఉత్తముడు..

అసలు ఈ ఆదేశాలన్నిటినీ పాటించటమే అసలు నిజ ‘దైవారాధన’ అంటే. ఈ ఆదేశాలు ఇవ్వటంలో పోనీ దేవుని స్వార్థం ఏదైనా ఉందా? అంటే.. కించిత్తు స్వార్థం లేదు పోనీ పై ఆదేశాలను అనుసరించటం వల్ల మానవాళికి నష్టం ఏదైనా ఉందా? లేక లాభం ఉందా? సమాధానం రెండవదే
ఉదాహరణకు: బోర్డర్ లో కమాండర్ తన సైనికులకు గట్టి ఆదేశాలు ఇస్తూ ఉంటాడు. అలా ఇవ్వటంలో అతని స్వార్థం ఏదైనా ఉంటుందా? ఆ ఆదేశాలు పాటించటం వల్ల లాభం ఎవరికి? పాటించకపోతే నష్టం ఎవరికి? సైనికులకే కదా! అచ్చం దైవాదేశాలు కూడా అలాంటివే

కానీ, ధర్మాన్ని వ్యాపారాత్మకంగా మార్చుకున్న కొందరు స్వార్థపరులైన పండితులు ఈ ఆదేశాలను ప్రజలకు చెప్పి నిజ సృష్టికర్త అయిన దేవుణ్ణి పరిచయం చెయ్యటానికి బదులు.. మూఢ మతాచారాలతో ఒక మత వ్యవస్థను తయారుచేసి ప్రజలను అందులో నడిపించటంతో అదే ధార్మిక గ్రంథాల అసలు శాస్త్రీయ ధర్మం అన్న అపార్థం చేసుకుని కొందరు మొత్తానికి నాస్తికులుగా మిగిలిపోయారు.

***

ధార్మిక గ్రంథాల్లో సృష్టికర్త అయిన దేవుడు ఇలాంటి కొన్ని వందల ఆదేశాలు ఇవ్వటం వెనుక ఉద్దేశం స్వయంగా దేవుడు లాభపడటమా? లేక మానవాళికి లాభాన్ని చేకూర్చటమా? అంటే మానవాళి లాభం చేకూర్చటమే అన్నది నిర్వివాదం

వివరంగా చెప్పాలంటే ప్రజలను తనను నమ్మమని చెప్పటం వెనుక ఉద్దేశం.. వారు తన ఆదేశాల ప్రకారం మంచి పనులు మాత్రమే చేస్తూ ఉత్తమోత్తమ నైతిక విలువలతో కూడిన విజయవంతమైన (Successful) జీవితం గడపటమే
కాబట్టే.. స్వయంగా సృష్టికర్త అయిన దేవుడు.. ఖురాన్ లో-

“ఎవరైనా సరే సృష్టికర్త అయిన దేవుణ్ణి విశ్వసించి, మంచి పనులు చేసేవారికి గొప్ప ప్రతిఫలం ఉంది (2.62)” అని చెబుతున్నాడు.

దీనిని బట్టి ఏదో మొక్కుబడిగా తనను నమ్మేసినంత మాత్రానా స్వర్గాన్ని/మోక్షాన్ని ప్రసాదిస్తానని దేవుడు చెప్పినట్లు ఏ ధార్మిక గ్రంథంలోనూ లేదు. అసలు దేవుణ్ణి విశ్వసించటం అన్న దృక్పథం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమే ఒక మనిషి వ్యక్తిగత జీవితంలో నైతికంగా ఉంటూ.. సామాజిక జీవితంలో ఇతరుల పట్ల మంచి చెయ్యటం అన్నది.

ఉదాహరణకు ఒకానొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్(స) వారిని ఓ వ్యక్తి ప్రశ్నిస్తాడు: “ఒక స్త్రీ ఉంది ఆమె పరమ దైవ భక్తురాలు, నిత్యం ప్రార్థనల్లో మునిగి తేలుతూ ఉంటుంది కానీ తన దురుసైన మాటలతో ఇతరులను బాధిస్తూ ఉంటుంది.. మరొక స్త్రీ ఉంది ఆమె అప్పుడప్పుడూ ప్రార్థన చేస్తూ అణకువగా ఉంటుంది కానీ ఇతరుల పట్ల చాలా మర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇద్దరిలో ఎవరు స్వర్గవాసి? ఎవరు నరకవాసి? అని అడుగుతాడు. దానికి ప్రవక్త ముహమ్మద్(స) – నిత్యం ప్రార్థనల్లో మునిగి తేలుతూ ఉన్నప్పటికీ ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తించే పరమ దైవ భక్తురాలు నరకానికి వెళుతుంది అణకువగల రెండవ స్త్రీ స్వర్గానికి వెళుతుందని చెబుతారు.
మరో సందర్భంలో దేవుని దృష్టిలో ఒక వ్యక్తికి ప్రాధాన్యత అన్నది కేవలం సత్ప్రవర్తన, భయభక్తుల ద్వారా తప్ప ఏ విధంగానూ ఉండదు అని చెబుతారు.

దీనిని బట్టి దేవుడు, మానవుల విషయంలో కోరుకుంటుంది తన ఆదేశాల ప్రకారం తోటి మానవుల పట్ల నైతిక ప్రవర్తన, సేవా దృక్పథం కలిగి ఉండటం మాత్రమే. ఇవి లేనప్పుడు ఎంతదైవ భక్తుడైనా అతను దైవ శిక్షకు గురవుతాడని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి

ఇదంతా చవివాక ఒక ప్రశ్న రావచ్చు. దేవుణ్ణి నమ్మేవారే మంచి వారుగా మారి మంచి పనులు చేస్తున్నారా? నమ్మకపోతే మంచి పనులు చెయ్యటం సాధ్యం కాదా? అని.

దీనికి సంక్షప్త సమాధానం- ప్రతీ మనిషిలోనూ దేవుడు మంచీ-చెడుల విచక్షణా జ్ఞానాన్ని పెట్టాడు. ప్రతీ మనిషిలో మంచి ఆలోచనలతో పాటు చెడు ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. అయితే మనిషిలో నిత్యం కలిగే చెడు ఆలోచనలను నియంత్రించుకుంటూ వ్యక్తిగత నైతిక జీవనంలో మంచి ఆలోచనల ప్రకారం ఎలా జీవితం గడపాలో తెలుపటానికే దేవుడు మనిషికి ధార్మిక గ్రంథాల ద్వారా తన ఆదేశాలను ఇస్తూ వచ్చాడు. కాబట్టి ధర్మానికీ, మనిషికీ మధ్య ఉన్న సంబంధం ఒక పరికరానికీ/యంత్రానికీ దాని ‘మాన్యువల్ (Manual)’ కీ మధ్య ఉన్న సంబంధం లాంటిది.

ఎంత స్వంత డబ్బుతో కొన్నప్పటికీ ఏ వస్తువైనా అనుకూలంగా పనిచెయ్యాలంటే.. చెయవలసిన, చెయ్యకూడని (do’s and don’ts) ఆదేశాలతో కూడిన ‘మాన్యువల్ (Manual)’ ను అనుసరించాల్సిందే.

కాబట్టి దేవుణ్ణి నమ్మకుండా ఎవరో నూటికి ఒకరో ఇద్దరో కొంతమేరకు మంచి పనులు చేసినప్పటికీ… సమాజంలో మనుషులందరిలో సోదర సమానత్వం, ఐక్యత, నైతక విలువలు సంపూర్ణంగా ఏర్పడి ఒక సుందర సమాజం ఏర్పడాలంటే చెయవలసిన, చెయ్యకూడని (do’s and don’ts) ఆదేశాలతో కూడిన మాన్యువల్ లాంటి దైవిక ధర్మాన్ని అనుసరించక తప్పదు. అయితే ఈ శాస్త్రీయ ధర్మం అన్నది ధార్మిక గ్రంథాల్లో దొరుకుతుంది తప్పితే నేటి శాస్త్రులు బోధిస్తున్న మతవ్యవస్థలో దొరకదు

మరి శిక్షా-బహుమానాలు దేనికి?

Where there is a ‘Creation’ there must be a ‘Creator’.
ఎక్కడ అయితే సృష్టి ఉంటుందో అక్కడ సృష్టికర్త అనేవాడు ‘తప్పక’ ఉంటాడు

Where there is a ‘Discipline’ there must be a ‘Dictator’.
ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో అక్కడ సర్వాధికారి అనేవాడు ఉంటాడు

Where there is a ‘Dictator’ He must be an ‘Observer’.
ఎక్కడ అయితే ఒక సర్వాధికారి ఉంటాడో ఆయన తప్పక పర్యవేక్షకుడై ఉంటాడు

Where there is an ‘Observer’ He must take a ‘Report’.
ఎక్కడ అయితే ఒక పర్యవేక్షకుడు ఉంటాడో అతను తప్పక నివేదిక తీసుకుంటాడు

Where there is a ‘Report’ there must be an ‘Account’.
నివేదిక ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పక “లెక్క” అనేది ఉంటుంది

Where there is an ‘Account’ there must be a ‘Reward’ or ‘Punishment’
ఎక్కడైతే “లెక్క” అనేది ఉంటుందో అక్కడ “శిక్షా” “బహుమానాలు” తప్పక ఉంటాయి

***

ఈ విధంగా ఇహలోక జీవితంలో దైవ ఆదేశాలను పాటిస్తూ సామాజిక జీవనంలో ఒక వ్యక్తి తోటి మానవుల పట్ల ఎలా ప్రవర్తించాడు, వ్యక్తిగత జీవితంలో ఎలాంటి జీవితం గడిపాడు అన్న నివేదిక (Report) ఆధారంగా అతని మంచీ-చెడు పనులను బట్టి, అతని ప్రవర్తన (Attitude) ని బట్టి మాత్రమే శిక్షా-బహుమానాలు ఇవ్వబడనున్నాయి తప్పితే.. దేవుడు ఎక్కడా నన్ను నమ్మితే చాలు స్వర్గంలోకి .. నమ్మకపోతే నరకంలోకి పంపుతానని ఎక్కడా చెప్పలేదు

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *