#ది_కేరళ_ఫేక్_స్టోరీ

ఇన్నాళ్లూ సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించటానికి యువత భావోద్రేగాలను రెచ్చగొట్టేలా హీరోయిన్ల అంగాంగ ప్రదర్శన, శృంగారాన్ని ముడి సరుకుగా వాడుకునే ప్రొడ్యూసర్లకు ఇప్పుడు కొత్తగా మత పరంగా ప్రజల భావోద్రేగాలను రెచ్చగొడుతూ “హిందూ-ముస్లిం వేర్పాటువాదం”, “ఇస్లామోఫోబియా”లతో సినిమాలు తీసే కొత్త ఫార్ములా దొరికింది.

ఒకప్రక్క హిందూ-ముస్లింల మధ్య విద్వేషాలను అన్ని విధాలుగా రెచ్చగొడుతూ దాని ఆధారంగా మతతత్వ రాజకీయ పార్టీలు మనుగడ సాగిస్తున్న నేపథ్యంలో కొందరు రాజకీయ పెద్దల అండదండలతో ఇప్పుడు “ఇస్లామోఫోబియా”ను కూడా సినిమాలకు ముడి సరుకుగా మార్చుకుని కోట్లు సంపాదించే పనిలో పడ్డారు కొందరు సినిమా ప్రొడ్యూసర్లు.

ఆ క్రమంలో పచ్చి అబద్ధాలతో అల్లబడిన “కాశ్మీర్ ఫైల్స్” నిర్మించి ఒకడు కోట్ల రూపాయలు సంపాదిస్తే.. ఇప్పుడు క్రొత్తగా సూదిప్తో సేన్ అనే ఓ చిల్లరాతి చిల్లర సినిమా డైరెక్టర్ వీలైనన్ని అబద్ధాలను దట్టించి, తనకు తోచిన కల్పితాలను స్టోరీగా అల్లి నిర్మించిన సినిమాయే “ది కేరళా (ఫేక్) స్టోరీ”.
****

“శాలిని ఉన్నికృష్ణన్ అనే నేను ఫాతిమా బా గా మార్చబడి ఇప్పుడు ISIS టెర్రరిస్ట్ గా మారిపోయి ఆఫ్ఘనిస్తాన్ జైల్లో ఖైదిగా మగ్గుతున్నాను! నేనే కాదు నాలాంటి 32000 మంది అమ్మాయిలు ఇక్కడ సమాధి చెయ్యబడ్డారు. కేరళలో అమ్మాయిలను ఉగ్రవాదులుగా మార్చే గేమ్ బహిరంగంగా జరుగుతుంది” అంటూ చుట్టూ పర్వతాలూ, ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చోబెట్టి బురఖా తొడిగించి ఆ సినిమా హీరోయిన్ తో చెప్పించిన మాటలు పాపం నిజమేనేమో అనుకుని చాలా మంది ఇస్లామోఫోబులు ఆ టీజర్ ను తెగ ట్రెండింగ్ చేస్తూ స్వయంతృప్తి చెందే పనిలో పడ్డారు.

అసలు కేరళ నుండి 32000 స్త్రీలు అక్రమ రవాణా అయ్యారన్న ఫేక్ సమాచారాన్ని ఆ సూదిప్తో సేన్ ఎక్కడ నుండి సేకరించాడు?

ఒకరా ఇద్దరా ఏకంగా 32000 మంది అమ్మాయిలు ISIS కు ఒక్క కేరళలాంటి అత్యధిక విద్యావంతులున్న రాష్ట్రం నుండి బానిసలుగా అక్రమరవాణా చెయ్యబడి ఉంటే అది దేశంలో ఎంత పెద్ద వార్తయిపోయేది?

ఎక్కడో ఉన్న ఉగ్రవాద సంస్థలు ఈ దేశపు విద్యావంతులున్న రాష్ట్రంలో చొరబడి పబ్లిగ్గా మహిళలపై ఇంతటి దారుణాలకు తెగబడుతున్నాయని వారిని అక్రమంగా తమ దేశాలకు రవాణా చేస్తున్నాయని ఆ సినిమా టీజర్ లో చెప్పించటాన్ని బట్టి ఈ దేశ, రాష్ట్ర ప్రభుత్వ, రక్షణ వ్యవస్థలు ఏమి చేతకాని స్థితిలో నిద్రపోతున్నాయని తెలియజేయటం ఈ టీజర్ యొక్క ఉద్దేశమా?

32000 మంది హిందూ అమ్మాయిలు కేరళ రాష్ట్రం నుండి ISIS కు అక్రమ రవాణా అయినట్టు కేరళా పోలీస్ డిపార్ట్మెంట్ రికార్డుల్లో ఎక్కడా నమోదు కాకుండా ఒక్క సుదీప్తో సేన్ కు మాత్రమే ఎలా తెలిసింది?

నిజంగా 32000 మంది హిందూ అమ్మాయిలు ISIS కు అక్రమ రవాణా చెయ్యబడితే ఆ అమ్మాయిల తాలూకు 32000 కుటుంబాలు నిద్రపోతున్నాయా?

ఆ 32 వేల అమ్మాయిల తాలూకు కుటుంబ సభ్యులు అన్ని వేల FIR లను కూడా నమోదు చేసి ఉండాలి కదా! మరి అవి కేరళా పోలీస్ రికార్డ్స్ లో ఎక్కడైనా నమోదై ఉన్నాయా? అన్ని వేల కుటుంబాలు ఎక్కడైనా నిరసనలు తెలియజేసినట్టు ఆధారాలున్నాయా?

ఇవన్నీ ఆలోచించకుండా తలాతోకా లేకుండా “ఇస్లామోఫోబియా”ను ముడి సరుకుగా మార్చుకుని సినిమా తీసిపరేసి లక్షల్లో వ్యూస్, కోట్లలో డబ్బు కోసం కకృత్తిపడి ఏ ప్రామాణిక ఆధారాలూ లేకుండా “ది కేరళా స్టోరీ” అనే పనికిమాలిన సినిమాను ఏ రకంగా విడుదల చేస్తున్నారు?

ఇలాంటి సినిమాలు దేశ ప్రభుత్వ వ్యవస్థలను, రక్షణ శాఖల్ని దారుణంగా అవమానించటం కాదా?

ఫ్యాక్ట్ చెక్!

‘ది కేరళ స్టోరీ’ దర్శకుడు సుదీప్తో సేన్, భారతదేశం లేదా కేరళ నుండి 32,000 మంది మహిళలు ISISకు రవాణా అయినట్టు ఏ ప్రామాణిక ఆధారాలు లేకుండానే ఈ సినిమా విడుదల చేస్తున్నాడన్న వాస్తవాన్ని ‘ఆల్ట్ న్యూస్’ (Alt News) ఫ్యాక్ట్ చెక్ టీం బయటపెట్టింది.

ఈ టీజర్లో సమాచారంపై ఆల్ట్ న్యూస్ ఫ్యాక్ట్ చెక్ టీం స్వయంగా కేరళా పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడింది. 32000 హిందూ అమ్మాయిలు అక్రమంగా తరలించబడ్డారని టీజర్ లో చెప్పబడిన సమాచారం పూర్తిగా నిరాధారమని అక్కడి ఒక పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కూడా కొట్టిపారేయటం జరిగింది.

అంతేకాదు, “యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ టెర్రరిజం” 2020 నివేదికల ప్రకారం నవంబర్, 2020 నాటికి ISISతో 66 మంది భారతీయులు మాత్రమే జతకట్టినట్టు ఆధారాలున్నాయి. తప్పితే 32000 మంది కాదు!

‘ది హిందూస్తాన్ టైమ్స్’, ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’తో సహా అనేక ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు ఇదే విషయాన్ని కవర్ చేశాయి కూడా. అలాగే జూన్ 2021 లో “ద హిందూ” పత్రిక భారత సంతతికి చెందిన 4 మహిళలు ఆఫ్గానిస్తాన్ లో ఖైదు చెయ్యబడ్డారని పేర్కొంది తప్పితే ఏనాడూ ఏ పత్రికా 32000 మంది ఖైదు చెయ్యబడినట్లు పేర్కొనలేదు.
32 వేల మంది ISISతో ఖైదు చెయ్యబడ్డారన్నది సినిమా ద్వారా డబ్బులు దండుకోటానికి సుదీప్తో సేన్ సృష్టించిన కల్పితం మాత్రమే!

సుదీప్తో సేన్ ఊహాజనిత లెక్కలు!

32000 మంది హిందూ అమ్మాయిలు అక్రమ రవాణాకు గురైనట్టు మీరెలా లెక్కకట్టారు? అన్న ప్రశ్నకు సుదీప్తో సేన్ చెబుతున్న సోదేమిటంటే.. “అది నా లెక్కకాదు! 2012 జూన్ 25 న కేరళా మాజీ సీయం ఉమెన్ చాందీ 2006 నుండి 2012 వరకు రాష్ట్రంలో 2665 మంది హిందూ మహిళలు ఇస్లాం స్వీకరించారని పేర్కొనటాన్ని బట్టి ప్రతి సంవత్సరం మూడు వేల చొప్పున పదేళ్లకు ముప్పై రెండు వేలు ఉంటారని ఉహించి లెక్క కట్టానని చెప్పుకొచ్చాడు.

ఇదెలాంటిదంటే మోకాలికి బోడి గుండుకు ముడి పెట్టేయటం లాంటిదన్నమాట!
అప్పటి మాజీ సీయం ఉమెన్ చాందీ (2006 నుండి 2012 వరకు ఆరేళ్లలో) 2665 మంది యువత ఇస్లాం స్వీకరించారని చెప్పాడే తప్ప, వారంతా మహిళలని గానీ, వారు బలవంతంగా ఇస్లాంలో మార్చబడ్డారని గానీ, లవ్ జిహాద్ ద్వారా స్త్రీలు ఇస్లాం స్వీకరించి ISIS లో జాయినయ్యారని గానీ ఎక్కడా పేర్కొనలేదని, ఇంకా అలాంటి న్యూస్ ను ఏ మీడియా సంస్థా పేర్కొనలేదని ఆల్ట్ న్యూస్ ఫ్యాక్ట్ చెక్ చేసి తేల్చి చెప్పింది!

సుదీప్తో సేన్ నాదగ్గర మరొక ఆధారం ఉందంటూ కేరళా మాజీ సీయం వీ.ఎస్ అచ్యుతానందన్ 2010 లో జరిగిన ఓ సమావేశంలో “కేరళా ఇస్లామిక్ స్టేట్ గా మారబోతుంది” అని చెప్పారని పేర్కొనటమే కాక, ఈ విధంగా ఆయన మాట్లాడినట్టు సబ్ టైటిల్స్ తో ది కేరళ స్టోరీ టిజర్ లోనూ పెట్టేయటం జరిగింది.

ఇది పూర్తి వక్రీకరణ మాత్రమే అన్న విషయాన్ని ఆల్ట్ న్యూస్ బయటపెట్టింది.
నిజానికి వీ.ఎస్ అచ్యుతానందన్ మాట్లాడినా మాటలు వేరు. “ఆగష్టు 15 నాడు అనేక మంది జాతీయ వాదులు, దేశభక్తులు పరేడ్ లో పాల్గొంటారు, యువకులు మటుకు డబ్బుకు ఆకర్షితులవుతుంటారు” అని చెప్పినదాన్ని పూర్తిగా మార్చేసి “కేరళా ఇస్లామిక్ స్టేట్ గా మారబోతుంది” అని ఆయన చెప్పనిదాన్ని చెప్పినట్టు సబ్ టైటిల్స్ లో పెట్టటం ఎంత దారుణం?

కేరళ ముఖ్యమంత్రి ఈ సినిమాను బ్యాన్ చెయ్యాలని పిలుపునివ్వటమే కాక, ఇది రాజకీయ లబ్ది కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టటానికి సంఘ్ పరివార్ ప్రోపగాండా అని పేర్కొనటం జరిగింది.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *