హిందూ పాలకులు దేవాలయాలు కూల్చేసిన చరిత్ర

హిందూ పాలకులు దేవాలయాలను కూల్చేసిన చరిత్ర కూడా ఉంది. అది చాలా మందికి తెలీదు. ఇది చదివేవారికి కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ గజనీ, ఘోరీల కథలనే చెబుతూ ఒక్క ముస్లిం పాలకులే హిందూ దేవాలయాలు కుల్చారన్న కథల్నే పదే పదే వండి వార్చుతూ ఉన్న కారణంగా చాలా మందిలో ముస్లిం పాలకులంటే ‘హిందూ దేవాలయాలు కూల్చేసిన హిందూ వ్యతిరేక క్రూరులు’ అనే ఒక భావన ఏర్పడిపోయింది. నిజానికి దేవాలయాలను కూల్చేసిన, దోచుకున్న సంఘటనలు ముస్లిములకన్నా హిందూ పాలకుల కాలంలోనే ఎక్కువగా జరిగిందన్నది చరిత్ర పుటలు తిరగేస్తే తెలుస్తుంది!

“మధ్యయుగాల్లో ఒక్క ముస్లిం పాలకులే హిందూ దేవాలయాలు ధ్వంసం చేసేశారని” వక్రీకరించబడిన చరిత్రను చెబుతూ ముస్లిముల వల్ల “హిందూత్వం ప్రమాదంలో ఉందని” ప్రచారం చెయ్యటంలో ఉద్దేశం- సామాన్య హిందూ ప్రజానీకం దృష్టిలో ముస్లిం సమాజం పట్ల ధ్వేషాన్ని సృష్టించి, ఈ ఇరు వర్గాల ప్రజల మధ్య విష బీజాలు నాటాలన్నదే.

ముస్లిం పాలకులు 60 వేల దేవాలయాలు ధ్వంసం చేశారని చాలా మంది హిందుత్వ వాదులు చేస్తున్నది కేవలం నిరాధార విమర్శ మాత్రమే. ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ Richard M. Eaton ప్రకారం భారతదేశంలో ముస్లిం పాలకుల ద్వారా 80 దేవాలయాల కూల్చివేతకు సంబంధించిన రికార్డులు మాత్రమే ఉన్నాయి. కానీ అంతకంటే ఎక్కువ దేవాలయాలను హిందూ పాలకులు కూడా కుల్చారన్న వాస్తవాన్ని పేర్కొనటం జరిగింది.

హిందూ రాజులు హిందూ దేవాలయాలను దోచుకున్నారు!

“11 వ శతాబ్దంలో మొదటి లోహర రాజవంశానికి చెందిన కాశ్మీర్ రాజు “హర్ష” హిందూ దేవాలయాలు కూల్చి, వాటిని దోచుకోటానికి ప్రత్యేకంగా ‘దేవోత్పతాన నాయక’ పేరుతో ఒక శాఖనే ఏర్పాటు చేశాడు. అతను ఎన్నో హిందూ మరియు బౌద్ధ దేవాలయాలను ధ్వంసం చేసి, విగ్రహాలను సంపదను దోచుకెళ్లాడు” (కల్హణ, రాజతరంగిణి).

“12 వ శతాబ్దానికి చెందిన పరమార్ రాజు శుభర్ వర్మన్ తన స్వంత రాజ్యంలో దేవాలయాలు కూల్చి దోచుకోవటంతో పాటు కాంబే మరియు ధబోయ్ లోని జైన దేవాలయాలను ధ్వంసం చేశాడు” (కమ్యూనల్ పాలిటిక్స్: ఫాక్ట్ వర్సెస్ మిత్, పేజ్. 52). అలాగే.. “6 వ శతాబ్దానికి చెందిన శశాంక బుద్ధగయలో బోధివృక్షాన్ని నరికేసి మహాబోధి ఆలయాన్ని శివాలయంగా మార్చివేయటం జరిగింది” (రెలిజియన్ అండ్ గేవాల్ట్, పేజీ. 72).” ఇలాంటి ఎన్నో వాస్తవాలు మరుగున పడిపోయాయి.
****

బౌద్ధుల పట్ల బ్రాహ్మణ శత్రుత్వం:

ముస్లిం పాలకులు హిందూ దేవాలయాలు కూల్చేశారన్న చరిత్ర మాట్లాడేవారు హిందూ రాజులు, బ్రాహ్మణులు బౌద్ధ ధర్మాన్ని ఎంత వ్యతిరేకించారో, ఎన్ని దౌర్జన్యాలు చేశారో, ఎన్ని బౌద్ధ మందిరాలు పడగొట్టారో, ఎన్ని జైన మందిరాలు కుల్చారో ఈ చరిత్ర గురించి ఎవరూ నోరు మెదపరు.

1). ప్రముఖ చరిత్రకారుడు భారతదేశం యొక్క పురాతన మధ్య యుగాల చరిత్ర నిపుణుడైన DN Jha తన “Against the Grain: Notes on Identity, Intolerance and History” పుస్తకంలో ఇస్లాం పూర్వ యుగంలో అశోకుని పాలన ముగిసిన తరువాత బ్రాహ్మణ పాలకులు హిందూ మతాన్ని అభివృద్ధి చెయ్యటానికి అనేక బౌద్ధ మందిరాలు, మఠాలు, స్థూపాలను నాశం చేసి దేవాలయాలు నిర్మించారని పేర్కొనటం జరిగింది.

2). ‘పుష్యమిత్ర సుంగ’ బౌద్ధుల ప్రాబల్యాన్ని నాశనం చేసి హిందూత్వాన్ని పైకి తేవటానికి అశోకుని ద్వారా కట్టబడిన వేల కొద్దీ బౌద్ధ మఠాలను తగలబెట్టించి, బౌద్ధ స్థూపాలను పడగొట్టించాడు. బౌద్ధ సన్యాసులను ఊచకోతకోయించాడు. ఎవరైతే ఒక బౌద్ధ బిక్షవుని తలనరికి తెస్తాడో అతనికి వంద దీనార్ల బహుమానాన్ని కూడా జారీచేశాడు. ఎన్నో బౌద్ధ మఠాలను దేవాలయాలుగా మార్చటం జరిగింది” (Romila Thaper, Ashoka and Decline of Mouryas, London, 1961, p 200). “శైవుడైన జాలుక రాజు తన అధికార పరిధిలో బౌద్ధ విహారాలను ధ్వంసం చేశాడు” (కల్హణ,రాజతరంగిణి). “కాశ్మీర్ లో కిన్నెర రాజు బ్రాహ్మణులను సంతోషపెట్టటానికి వేలకొద్దీ బౌద్ధ విహారాలను పడగొట్టాడు” (కల్హణ 1:80).

3).“6 వ శతాబ్దానికి చెందిన శివభక్తుడైన మిహిరాకుల రాజు బ్రహ్మణత్వాన్ని అభివృద్ధి పరచటానికి వందల కొద్దీ బౌద్ధ మఠాలను, స్థూపాలను ధ్వంసం చేయించాడు. బౌద్ధమతపు మరొక క్రూరమైన హింసకుడని ఇతను చరిత్రకెక్కాడు” (కల్హణ,రాజతరంగిణి).

4). నాగార్జున కొండలో బౌద్ధ విగ్రహాలు, స్మారక చిహ్నాలను ధ్వంసం చేయడంలో బ్రాహ్మణ గురువైన ఆదిశంకరుడు ప్రధాన పాత్ర పోషించాడని నాగార్జున కొండలో త్రవ్వకాలు జరిపిన లాంగ్‌హర్స్ట్ తన పుస్తకం “(మెమోయిర్స్ ఆఫ్ ది ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నెం: 54, ది బౌద్ధ ఆంటిక్విటీస్ ఆఫ్ నాగార్జునకొండ ,ఢిల్లీ, 1938, పేజీ.6.)” లో నమోదు చెయ్యటం జరిగింది. అలాగే “జైనులకు చెందిన, ఇప్పుడు బయటపడుతున్న విగ్రహాలన్నీ శంకరాచార్యుల కాలంలో విరగొట్టబడినవే” అంటూ స్వామీ దయానంద సరస్వతీ తన సత్యార్థ ప్రకాశ్ 11 వ అధ్యాయంలో పేర్కొనటం జరిగింది.

శంకరాచార్య క్రూరమైన కార్యకలాపాల గురించి వ్రాస్తూ, స్వామి వివేకానంద ఏమన్నారంటే- “శంకరుని హృదయం ఏమిటంటే, అతను చాలా మంది బౌద్ధ సన్యాసులను వాదనలో ఓడించి కాల్చి చంపాడు. శంకరుని ఇలాంటి చర్యలను మతోన్మాదం తప్ప ఏమంటారు?” (Complete works of Swami Vivekananda, Vol.VII. p. 118, Calcutta, 1997)

5). బీహార్ ప్రభుత్వం ద్వారా 1951లో స్థాపించబడి KP జైస్వాల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పాట్నా నుండి డి.ఆర్.పాటిల్ రచించిన ‘ది యాంటిక్వేరియన్ రిమైన్స్ ఇన్ బీహార్’ అనే హిస్టారికల్ రీసెర్చ్ ద్వారా 1197 AD లో భక్తియార్ ఖిల్జీ దండయాత్రకు ముందే నలంద విశ్వవిద్యాలయం ధ్వంసం చెయ్యబడి, శిధిలావస్థకు చేరుకుని ఉందని నిర్ధారించింది. ఇంకా చరిత్ర లోతుగా పరిశీలిస్తే బౌద్ధంలో “హీనాయన” మరియు బ్రహ్మణిజం ద్వారా ప్రభావితం కాబడ్డ “మహాయాన” అనే రెండు వర్గాల వైరంలో నలంద ధ్వంసం చెయ్యబడినట్లు తెలుస్తుంది. చరిత్రలో బౌద్ధాన్ని నిర్మూలించటానికి బ్రాహ్మణ పాలకులు చేసిన దురాగతాలకు నేటికీ నిలిచి ఉన్న సజీవ సాక్ష్యం- బౌద్ధ గయాలో మహాబోధి ఆలయాన్ని ఆక్రమించుకుని బౌద్ధుల నియంత్రణకు దూరంగా ఉంచేందుకు హిందుత్వ శక్తులు శాయశక్తులా ప్రయత్నించటం. బౌద్ధులు ఇప్పటికీ ఈ ఆలయం కోసం పోరాడుతూనే ఉన్నారు.
****

బౌద్ధ, జైన మందిరాలు, మఠాలు మాత్రమే కాక, చరిత్రలో హిందూ పాలకులు అనేక దేవాలయాలు కూల్చిన సంఘటనలు ఉన్నాయి.

1). 642 CE లో పల్లవ రాజైన నరసింహవర్మన్ 1 చాళుక్యులను నిర్మూలించి, వారి రాజధాని వతాపిని కొల్లగొట్టి, అలయ ధ్వంసం చేసి గణేశుడి బొమ్మను తమిళనాడులోని తన రాజ్యానికి తీసుకుపోయాడు. యాభై సంవత్సరాల తరువాత అదే చాళుక్యుల సైన్యాలు ఉత్తర భారతదేశంపై దండెత్తాయి మరియు అక్కడ ఓడిపోయిన శక్తుల నుండి దోచుకున్న గంగా మరియు యమునా చిత్రాలను తిరిగి దక్కన్‌కు తీసుకువచ్చాయి.

2). 10 వ శతాబ్దం ప్రారంభంలో, రాష్ట్రకూట రాజు ఇంద్ర III కళాప్రియ ఆలయాన్ని ధ్వంసం చేశాడు.

3). కళింగరాజ్యాన్ని మగధరాజులు జయించినపుడు రిషభనాథుని విగ్రహాలను ఎత్తుకుపోగా, ఆ తరువాత ఖారవేలుడు అనే కళింగరాజు మగధసామ్రాజ్యంపై దండెత్తి ఆ విగ్రహాలను తిరిగి తెచ్చుకొన్నట్లు క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన హతిగుంఫ శాసనం ద్వారా తెలుస్తున్నది.

4). పదకొండవ శతాబ్దానికి చెందిన రాజేంద్ర చోళుడు దండయాత్రలు చేసి ఓడిపోయిన పాలకుల ఆలయాలు ధ్వంసం చేసి, చాళుక్యరాజ్యం నుంచి సూర్యపీఠం, గణేషుడు, కళింగులనుంచి భైరవ చిత్రం, తూర్పు చాళుక్యుల నుంచి నంది విగ్రహం, బెంగాలు నుంచి శివుని విగ్రహాలను తరలించుకొని వచ్చాడు.

5). 1514 లో కృష్ణదేవరాయలు ఉదయగిరిని జయించి అక్కడ బాలకృష్ణుని విగ్రహాన్ని, పండరిపురాన్ని ఆక్రమించుకొని విట్టలనాథుని విగ్రహాన్ని ఎత్తుకొనిపోయి విజయనగరంలో ప్రతిష్టించుకొన్నాడు.

6). 1579 లో గోల్కొండనవాబు వద్ద పనిచేసే మరాఠి బ్రాహ్మణుడైన మురహరిరావు రాయలసీమ ప్రాంతాలను గోల్కొండరాజ్యంలో కలిపే యత్నంలో అహోబిలం నరసింహస్వామి ఆలయంలోని విగ్రహాన్ని గోల్కొండకు తరలించుకొనిపోయాడు.

7). టిప్పూసుల్తాన్ పాలనలో శ్రీరంగ పట్నం పై మరాఠా రాజులు దాడి చేసి అక్కడ ఉన్న శృంగేరీ దేవాలయాన్ని కూలగొట్టి దేవీ శారదా విగ్రహాన్నీ అందులో సంపదనూ దొచుకెళ్లిపోయారు. తిరిగి ఆ దేవాలయాన్ని టిప్పూసుల్తాన్ పునరుద్ధరించటం జరిగింది.

😎. 8వ శతాబ్దం ADలో బెంగాలీ సేనలు కాశ్మీర్ రాజ్యం యొక్క రాష్ట్ర దేవత అయిన విష్ణు వైకుంఠ ప్రతిమను ధ్వంసం చేయడం ద్వారా కాశ్మీర్‌లోని రాజు లలితాదిత్య రాజ్యంపై ప్రతీకారం తీర్చుకున్నారు.

9). 10వ శతాబ్దం ప్రారంభంలో, ప్రతిహార రాజైన హేరంబపాల, కాంగ్రా (హిమాచల్ ప్రదేశ్) సాహి రాజులను ఓడించినప్పుడు విష్ణు వైకుంఠ యొక్క ఘన బంగారు ప్రతిమను స్వాధీనం చేసుకున్నాడు.

10). 1460వ దశకంలో, ఒరిస్సాలోని సూర్యవంశీ గజపతి వంశ స్థాపకుడు కపిలేంద్ర, తమిళ దేశంలోని ఆక్రమణ యుద్ధాల సమయంలో కావేరి డెల్టాలోని శైవ మరియు వైష్ణవ ఆలయాలను కొల్లగొట్టాడు.

11). పదకొండవ శతాబ్దం మధ్యలో, చోళ రారైన రాజాధిరాజు చాళుక్యులను ఓడించి, కల్యాణిని దోచుకున్నాడు, ఒక పెద్ద నల్ల రాతి తలుపు సంరక్షకుడిని తంజావూరులోని తన రాజధానికి తీసుకువెళ్లాడు, అక్కడ అది తన పౌరులకు యుద్ధ ట్రోఫీగా ప్రదర్శించబడింది.

12). 9 శతాబ్దంలో , పాండ్యన్ రాజు శ్రీమార శ్రీవల్లభ శ్రీలంకపై దండెత్తాడు మరియు రాజు సేన I ని ఓడించి అతనితో పాటు నగలు , బంగారం మరియు విలువైన దేవాలయాల సంపదను , ముఖ్యంగా బుద్ధుని యొక్క భారీ బంగారు విగ్రహాన్ని తీసుకువెళ్లాడు. తరువాత, తరువాత శ్రీలంక పాలకుడు సేన II, పాండ్యన్ రాజధాని మదురైపై దాడి చేసి బుద్ధుని విగ్రహాన్ని తిరిగి తీసుకువెళ్లాడు

ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో అటు ముస్లిం రాజులే కాక ఇటు హిందూ రాజులు సైతం ఎన్నో దేవాలయాలను కూల్చిన, దోచుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.
***

ఇంతకూ హిందూ పాలకులు దేవాలయాలను ఎందుకు కుల్చారు?
ఆనాటి ప్రతీ హిందూ రాజ్యానికి ఒక రాష్ట్రదైవం ఉండేది. రాజ్యాన్నేలే రాజు ఆ దైవాన్ని కొలుస్తూంటాడు. ఆ ఆలయం ఆ రాజ్యలక్ష్మికి, సౌభాగ్యానికి, ప్రతిష్టకు సంకేతం. అంతేకాక ఆలయాలలో రహస్య మాళిగలలో సంపదలను భద్రపరచుకోవటం జరిగేది. ఆ విధంగా దేవాలయాలు సంపదకు నిలయాలుగా ఉండేవి.

ఒక హిందూ రాజు మరో హిందూ రాజ్యాన్ని జయించినపుడు ఓడిపోయిన రాజ్యం యొక్క రాష్ట్ర దైవాన్ని తరలించుకొని తన రాజ్యంలో ప్రతిష్టించుకోవటం అన్నది రెండు వేల సంవత్సరాలుగా ఈ గడ్డపై నడిచిన ఒక సంప్రదాయం. అలా చేయటం ద్వారా మాత్రమే ఆ రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకోవటం పూర్తయినట్లు భావించేవారు.

మధ్య యుగాల్లో ఒక రాజ్యం మరో రాజ్యాన్ని జయించినప్పుడు ఓడిపోయిన రాజ్యం యొక్క రాజ్య దేవతను, ధ్వంశం చెయ్యటమో, తరలించుకుపోయి తమ రాజ్యంలో కలుపుకునేవారు. అలా చెయ్యటం యుద్ధాన్ని నెగ్గటానికి, వారి రాజ్యాన్ని తమ రాజ్యంలో కలుపుకోవటానికి సంకేతంగా (Symbolic) భావించేవారు. ఆ విధంగా రాజ్యాలకు రాజ్యాలకూ మధ్య జరిగిన అనేక యుద్ధల్లో ఒక్క ముస్లిం రాజులే కాదు అనేక హిందూ రాజులు సైతం ఆలయాలను ధ్వంశం చేసిన సంఘటనలు చరిత్రలో కోకొల్లలు.

అదంతా కేవలం అప్పటి రాజ్యకాంక్ష తాలూకు యుద్ధోన్మాదమే తప్ప మతోన్మాదం కాదు.

ఈ విధంగా చరిత్రను గమనిస్తే మసీదులు, దేవాలయాలు, మఠాలు కూల్చివెయ్యబడిన సంఘటనలు కోకొల్లలుగా చూడగలం.
అలాగే ఎందరో ఖుతుబుద్దీన్ ఐబక్ నుండి ఔరాంగ్ జేబ్ వరకు ఎందరో ముస్లిం పాలకులు హిందూ దేవాలయాల నిర్మాణాలకు భారీ విరాళాలు, జాగీర్లు ఇచ్చి దేవాలయాలు కట్టించిన, పునరుద్ధరించిన చరిత్ర సైతం ఉంది. కానీ, ఈ చరిత్ర నేడు మరుగుపరచబడింది.

అయితే హిందూ-ముస్లిం పాలకులిద్దరూ దేవాలయాల్ని కూల్చివేశారన్నది కాదనలేము. అదంతా కేవలం రాజ్యాల మధ్య యుద్ధ జ్వాలలు రగులుకున్న సమయంలో జరిగిందే తప్ప అందులో ఎటువంటి మత ఉన్మాదమూ లేదు. కానీ, చరిత్రలో ఒక్క ముస్లిం పాలకులనే క్రూరులుగా హిందూ వ్యతిరేకులుగా నేడు చిత్రీకరించటం జరుగుతుంది. చరిత్రలో కేవలం ఒక్క ముస్లిం పాలకులు మాత్రమే దేవాలయాలు పడగొట్టేశారని, దోచుకున్నారని చెప్పి హిందూ, ముస్లిముల మధ్య ధ్వేషాన్ని రగిలించే ప్రయత్నం నేడు యథేచ్ఛగా జరుగుతుంది.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *