సోషల్ మీడియాలో పనికట్టుకుని మత విధ్వేషాన్ని రగిలించటమే పనిగా పెట్టుకునే కొందరు తీవ్రవాద భావాలు కలిగిన మత ఉన్మాదులు సామాన్య ముస్లిం ప్రజానీకాన్ని రెచ్చగొట్టటానికి “ఏ మతం లో ఎక్కువ ఉగ్రవాదులున్నారు చెప్పండి? ప్రపంచవ్యాప్తంగా చూస్తే టెర్రరిజం చేస్తుంది ముస్లిములు కాదా?” అంటూ అర్థ జ్ఞానాన్ని మెదళ్లల్లో నింపుకుని తలాతోకా లేని ప్రశ్నలు అడుగుతుంటారు.
ఎందుకంటే టోపీలూ, గెడ్డాలతో ఉర్దూ/అరబిక్ పేర్లు పెట్టుకున్న కొందరు చేసే దౌర్జన్యాన్నే “టెర్రరిజం” లేక “ఉగ్రవాదం” అంటారని మీడియా ఎప్పటి నుండో ప్రజల మెదళ్లను ట్యూన్ చేసుకుంటూ వచ్చిన కారణంగా ప్రపంచంలో ఎక్కడో చోట అప్పుడప్పుడూ ముస్లిం పేర్లు తగిలించుకున్న కొందరి ద్వారా ఏదైనా తీవ్రవాద సంఘటన జరిగితే.. “చూశారా! ముస్లిములు ఏ విధంగా ఉగ్రవాదం చేస్తున్నారో“ అంటూ సోషల్ మీడియాలో దిగజారుడు కామెంట్లు పెడుతూ మొత్తం ముస్లిం సమాజాన్నంతటినీ బోనులో నిలబెట్టేసే ప్రయత్నం మొదలెడతారు కొందరు. ఇస్లాం అంటే ప్రజల్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే మతమన్న భావన కలగజెయ్యటానికి ప్రతీ పనికిమాలిన ప్రయత్నాన్నీ వదలకుండా చెయ్యటం ప్రారంభిస్తారు.
ఇలాంటి దిగజారుడు మాటలు, కామెంట్లూ పెట్టేవారికి తెలీని విషయం ఏమిటంటే- బాబ్రీ మసీదు పేరు మీద మారణహోమాన్ని సృష్టించి వేల మంది సామాన్య ముస్లిం ప్రజానీకాన్ని చంపిపరెయ్యటాన్ని కూడా టెర్రరిజమనే అంటారు! గుజరాత్, ఢిల్లీ ప్రాంతాల్లో చేసిన జనహననాల్లోనో ఎందరో అమాయక ముస్లిములను మతోన్మాదులు దారుణంగా చంపేయటాన్ని కూడా టెర్రరిజమనే అంటారు! జైశ్రీరామ్ అని పలకమంటూనో, గోసంరక్షణ పేరుతోనో వేల మంది సామాన్య ముస్లిముల్ని ఇతర మైనార్టీ వర్గాలను హింసించటాన్ని, చంపటాన్ని, ఇంకా ఆజ్మీర్ షరీఫ్, జుమా మసీద్, సంఝోతా ఎక్స్ ప్రెస్ లలో కొందరు మతోన్మాదులు బాంబులు పేల్చటాన్ని కూడా టెర్రరిజమనే అంటారు! చివరకు తమ మతతత్వ పార్టీనీ సపోర్ట్ చెయ్యటం లేదనో, వ్యతిరేకిస్తున్నారనో ముస్లిమేతరుల్ని పట్టుకుని హత్యలు చెయ్యటాన్ని కూడా టెర్రరిజమనే అంటారు! మత వివక్షతో ఎందరో స్త్రీలు, చిన్న పిల్లలను అత్యాచారాలు చేసి తగలెట్టటాన్ని సైతం టెర్రరిజమనే అంటారు!
ఇంకాస్త వెనక్కి వెళితే.. ఇరాక్ లో రసాయన ఆయుధాలున్నాయన్న అనుమానంతో అమెరికా బాంబుల వర్షం కురిపించి దాదాపు 12 లక్షల మంది సామాన్య ముస్లిములను పొట్టన పెట్టుకోవటం కూడా టెర్రరిజమే! మొదటి రెండవ ప్రపంచ యుద్ధాల్లో కోట్ల మందిని చంపేయటం సైతం టెర్రరిజమే! రెండొందల సంవత్సరాలు ఎందరో ప్రాణాలను గాల్లో కలిపేసి భారతదేశంపై బ్రిటిషర్లు చేసిన దౌర్జన్యమూ టెర్రరిజమే! ఇస్రాయీల్ నిర్మించుకోవటానికి లక్షల కొద్దీ పాలస్తినా, గాజా ముస్లిములను చంపుతూ యూదులు చేస్తూ వచ్చిందీ టెర్రరిజమే! మయన్మార్ లో బౌద్ధులు వేల మంది రోహింగ్యా లను దారుణంగా చంపటం కూడా టెర్రరిజమే! మయన్మార్ లో ముస్లిములకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ఆశిన్ విరాటును టైమ్ మేగజైన్ “ఫేస్ ఆఫ్ బుద్దిస్ట్ టెర్రర్” అని పేర్కొంది. ఇతన్ని “బుద్దిస్ట్ బిన్ లాడెన్” అని కూడా అంటారు.
సకల మారణహోమాలన్నీ మతం పేరుమీదనే జరిగాయన్న నాస్తికులకు సైతం అవగాహన లేని విషయం గత వందేళ్లలో కమూనిస్ట్ రాజ్యాలు 100 మిలియన్ల మందిని చంపాయన్నది. “ద బ్లాక్ బుక్ ఆఫ్ కమ్యూనిజం” పుస్తకం చదివిన వారికి ఈ విషయం ఎరుకే! నాస్తిక దేశాల్లో జరిగిన ఈ దౌర్జన్యాలకు కారకులు ఎవరో మత ఉన్మాదులు కారు స్టాలిన్, లెనిన్, మావో వంటి వారే. చరిత్రలో అతిపెద్ద జనహననాలు సాగించిన హిట్లర్, సోవియట్ నియంత జోసెఫ్ స్టాలిన్ల కంటే మావో అధిగమించాడు. 1958 – 62 సం.ల మధ్య మావో జెడాంగ్ ప్రవేశ పెట్టిన “గ్రేట్ లీప్ ఫార్వర్డ్ పాలసీ” కారణంగా చైనాలో 45 మిలియన్ల మంది చంపబడ్డారన్న విషయం ఎంత మందికి తెలుసు? ఇది చరిత్రలో నమోదైన మరియు మరుగుపరచబడిన అతిపెద్ద జనహననం. ఇది గత వందేళ్లలో కమ్యూనిజం సాగించిన టెర్రరిజం.
కాబట్టి ఒక్క ముస్లిం పేర్లు పెట్టుకుని కొందరు చేసే దౌర్జన్యాలు మాత్రమే టెర్రరిజంగా పరిగణించబడవు. వ్యక్తుల ప్రాణాలకు, సమాజానికి హాని తలపెట్టే ప్రతీ ఉన్మాదీ టెర్రరిస్టే.. అది ముస్లిం పేర్లు పెట్టుకున్నోల్లైనా కావొచ్చు.. హిందూ పేర్లు పెట్టుకున్నోల్లైనా కావొచ్చు.. క్రైస్తవ పేర్లు పెట్టుకున్నోల్లైనా కావొచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండొందల యాభై కోట్ల మంది ముస్లిములు ఉండగా అందులో నేడు మీడియాలో చెప్పబడే అల్-ఖైదా, ISIS, తాలిబాన్, ముజాహిదీన్ గ్రూపుల్లో ముస్లిం పేర్లు తగిలించుకుని తీవ్రవాదం చేసేవారు ఒక్క శాతం కూడా ఉండరు. అసలు ఆయా గ్రూపుల్లో ఉంటూ తీవ్రవాదం చేసేవారికి ఇస్లాంతో సంబంధం లేదని ప్రపంచ వ్యాప్త ముస్లిం పండిత వర్గం ఫత్వా జారీ చేసి తీర్మానించటం జరిగింది.
చాలా మందికి తెలీని విషయం ఏమిటంటే.. 1979 ప్రాంతాల్లో సోవియట్ యూనియన్ రష్యా ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకున్నప్పుడు అమెరికా రష్యా కు వ్యతిరేకంగా దాడి చేయటానికి ఆఫ్ఘనిస్తాన్ లో కొందరు అల్లరి మూకలను పోగుచేసి వారికి ఆయుధాలు సప్లై చేసి తయారు చేసిన వ్యక్తుల్లో ఒకరే ఒసామా బిన్ లాడెన్, అబూ ముసబ్ అల్ జర్ఖవీ అనే ఇద్దరు. వీరిద్దరి ద్వారా అమెరికా అండదండలతో స్థాపించబడ్డావే అల్ ఖైదా, ISIS అనే రెండు సంస్థలన్న విషయం ఎంతమందికి తెలుసు? కొసమెరుపు ఏమిటంటే వీరి ద్వారా చాంబడ్డ వారిలో అధికులు ముస్లిములు! ఇవి కాక తాలిబాన్, జైషే ముహమ్మద్, హర్కతుల్ ముజాహిదీన్ వగైరా తీవ్రవాద కంపెనీలు నడుపుతూ కొందరు ముస్లిం పేర్లు తగిలించుకుని చేసే దాగుల్బాజీ పనులకూ ఇస్లాం బోధలకు కించిత్తు సంబంధం ఉండదన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం.
ఏ ధార్మిక గ్రంథమూ అన్యాయంగా చంపమని ఆదేశించదు. అన్యాయంగా మతం ముసుగులో జనాల్ని చంపుతున్న వారు ఆ ధార్మిక గ్రంథాలు అర్థం చేసుకుని చదివి ఉండరు.
ఏ మతమూ ప్రత్యేకంగా ఉగ్రవాదుల్ని పెంచి పోషించదు. ఉగ్రవాదులు ప్రతీ మతంలోనూ ఉంటారు. వారిని ఏ మతమూ తయారు చెయ్యాదు.
నేడు ఖురాన్ ను కనీసం చదవకుండానే గాసిప్పుల్లో దొరికే గాలి వార్తలను పట్టుకుని ఇస్లాంను విమర్శించేవారు తెలుసుకోవలసింది నిజంగా ఇస్లాం ఉగ్రవాదం ప్రేరేపించే ధర్మమే అయితే.. ఖురాన్ అన్యాయంగా వ్యక్తుల్ని చంపమని చెప్పే పుస్తకమే అయితే ఇస్లాం కొన్ని వందల సంవత్సరాల క్రితమే భూస్థాపితమైపోయి ఉండేది. ఎందుకంటే నేడు ప్రపంచంలో ఇస్లాంను స్వీకరిస్తున్న అనుసరిస్తున్న వారు కూడా మనుషులే ఏలియన్సో అడవి మనుషులో కాదు. వారికి కూడా మెదళ్లు ఉంటాయి. వారు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉన్నారు. వారు కూడా ఎంతో ఆలోచించి అర్థం చేసుకున్నాకే ఇస్లాం స్వీకరించి అనుసరిస్తున్నారు.
“ఏ మతంలో ఎక్కువ ఉగ్రవాదులున్నారు?”
