మతోన్మాదం జ్ఞానాన్ని హరిస్తుందా?

కొందరు కట్టర్ హిందూ సోదరులు పెట్టే పోస్టుల్లో వారు ఇచ్చే విచిత్రమైన స్టేట్మెంట్లు చదివాక.. అసలు ఇంతకు మించిన అజ్ఞానపురితమైన స్టేట్మెంటు మరొకటి ఉండదేమో అనుకునేలోపే దానికి మించిన దిగజారుడు స్టేట్మెంటు ఇచ్చి ఎప్పటికప్పుడు తప్పని నిరూపిస్తూనే ఉంటారు.

1857 తోనే అసలు స్వతంత్ర పోరాటం మొదలయ్యింది అంతకు ముందే టీపూ సుల్తాన్ చనిపోతే స్వంతంత్ర సమరయోధుడు ఎలా అయ్యాడు? అన్నది కట్టర్ హిందువుల ప్రశ్న.

ఈ ప్రశ్న అడిగేవారికి తెలీని బేసిక్ పాయింట్ ఏమిటంటే.. 16 వ శతాబ్దంలోనే బ్రిటిషర్లు భారతదేశంలో ప్రవేశించారు. అప్పటి నుండే వారి విధానాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, తిరుగుబాట్లు జరిగాయి. వాటిలో ప్రముఖమైనది 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు. అది మీరట్ లో సిపాయిలతో మొదలై భారతదేశంలో అనేక ప్రాంతాల్లో జరిగింది. దీనినే “జాతీయ తిరుగుబాటు, “సైనిక, పౌర తిరుగుబాటు పారంపరల కలయిక, సిపాయిల పితూరి” అని కూడా పేర్కొనటం జరిగింది.

కానీ, 1857 కు ముందే బెంగాల్ నవాబ్ “సిరాజుద్దౌలా” 1757 ఫ్లాసీలో బ్రిటీషర్లకు ఎదురు తిరిగి వారితో యుద్ధం చేసి ప్రాణాలు అర్పించేసిన మొట్టమొదటి రెబలియన్ అన్న విషయం చాలా మందికి తెలీదు. దానినే “ఫ్లాసీ యుద్ధం” అంటారు.

అలాగే టిప్పుసుల్తాన్ నాలుగు సార్లు బ్రిటీషర్లతో యుద్ధానికి తలపడి చివరిగా యుద్ధంలోనే ప్రాణాలు అర్పించటం జరిగింది. ఆయన చేసిన యుద్ధాలు “ఆంగ్లో మైసూర్ వార్స్” అన్న పేరుతో వినుతికెక్కాయి.

ఇక 1857 సిపాయిల తిరుగుబాటు విషయానికొస్తే.. డల్హౌసీ ప్రవేశపెట్టిన ‘రాజ్య సంక్రమణ సిద్ధాంతం’ ఇంకా.. భారతీయ సిపాయీలకు బ్రిటిషు అధికారులకూ మధ్యగల జాతీయ, సాంస్కృతిక వైరుధ్యాలు, బ్రిటిషు వారి తీవ్రమైన సాంఘిక సంస్కరణలు, కఠినమైన భూమి శిస్తులు, భూస్వాములు, జమీందార్ల అకృత్యాలు వగైరా బ్రిటిషు వారి పాలన పట్ల ఉన్న వ్యతిరేకత 1857 తిరుగుబాటుకు పురికొల్పాయి.

ఇవే అంశాల మీద 1857 కు ముందే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా 1763 నుండి 1856 వరకు అనేక సివిల్, గిరిజన, సిపాయిల తిరుగుబాట్లు జరిగాయి. అలాగే 1857 లో జరిగిన సిపాయిల తిరుగుబాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో జరిగిన కారణంగా దానిని “సైనిక, పౌర తిరుగుబాటు పరంపరల కలయిక” అని, అది మొట్టమొదటి స్వాతంత్రోధ్యమం కాదని కూడా కొందరు చరిత్రకారులు పేర్కొనటం జరిగింది.

ఈ విధంగా బ్రిటిషర్ల విధానాలకు వ్యతిరేకంగా అనేక మంది హిందూ-ముస్లిం రాజులు, వేలకొద్దీ సామాన్య హిందూ-ముస్లిం ప్రజలు కలిసి అనేక ఉద్యమాలు, తిరుగుబాట్లు చేసిన ఫలితమే భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది. ఇవన్నీ చరిత్ర చదివితే తెలుస్తుంది.

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *