“నికాహ్ హలాలా” – ఇస్లాంలో లేని దురాచారం

“నికాహ్ హలాలా” ఖురాన్ లో ఎక్కడా కనపడని గమ్మత్తైన పదబంధం. “ట్రిపుల్ తలాక్” తరువాత మీడియాలో ఎక్కువsగా చర్చించబడిన అంశం- “నికాహ్ హలాలా”.


ఖురాన్ అవగాహన ఏమాత్రంలేని కొందరుఅర్థమెదడు నామమాత్ర మౌల్వీల ద్వారా వెలుగులోకి తేబడిందే.. కాంట్రాక్ట్ బేస్ మీద నిర్వహించబడే “నికాహ్ హలాలా” లాంటి ఆటవిక దురాచారం.


సామాన్య ముస్లిమేతరుల దృష్టిలో ఇస్లాంను చులకన చేయటానికి.. ఇస్లాం అవగాహన లేని కొందరు ముస్లిములు చేసే ఇలాంటి ఆటవిక దురాచారాలను పట్టుకొచ్చి ఇస్లాంకు లింకు పెట్టి..
“చూసారా ఇస్లాం ఎంత అజ్ఞానపూరిత ఆదేశాలిస్తుందో, ముస్లిములు తమ భార్యకు విడాకులిచ్చేసిన తరువాత తిరిగి ఆమెను పెళ్లాడటానికి ఆమెను వేరే అతనికి పెళ్లి చేసి తిరిగి అతనితో విడాకులిప్పించి పెళ్లిచేసుకుంటారంట. దీనినే ‘నికాహ్ హలాలా’ అంతారంటా! ఎంత గొప్ప సంస్కారం ఇస్లాం నేర్పుతుంది? అంటూ విమర్శిస్తూ ఈ మధ్య సోషల్ మీడియాలో సైతం కొందరు మతోన్మాదులు పోస్టులు పెడుతున్నారు.
***


ఈ అపార్థానికి ఖురాన్ వెలుగులో సమాధానం:-

1. అసలు “ట్రిపుల్ తలాక్” ఇవ్వాలన్నది సైతం ఇస్లాంలో లేని దుశ్చర్య. ఏకకాలంలో నోటితో మూడుసార్లు తలాక్ చెబితే విడాకులైపోతాయన్నది కేవలం అపార్థం మాత్రమే.

2. ఒక ముస్లిం పురుషుడు గనుక తన భార్యకు విడాకులివ్వాలన్న ఉద్దేశంతో నోటితో ఒకసారి “తలాక్” చెప్పిన తరువాత వెంటనే భార్యను బయటకు గెంటెయ్యటానికి హక్కులేదు. ఆ భార్యా భర్తలిరువురూ ఆమె మూడు ఋతువుల కాలం పూర్తయ్యే వరకు వేచి ఉండాలి. ఆమె గర్భవతి అయితే ప్రసవించే వరకూ ఆగాలి (ఖురాన్ 65:4).

3. ఈ గడువు లోపు ఒకవేళ వారు పరస్పరం తప్పును సిరిదిద్దుకుంటే తిరిగి కలిసిపోవచ్చు. అదే ఒకవేళ గడువు (ఇద్దట్) దాటిపోతే ఆ భార్య తనకు ఇష్టమైన వ్యక్తితో ఎప్పుడైనా పెళ్లాడే హక్కును, స్వతంత్రాన్ని ఇస్లాం కల్పిస్తుంది. లేదా తిరిగి తన పూర్వపు భర్తను సైతం పెళ్లాడవచ్చు (ఖురాన్ 2:232). ఎటువంటి “నికాహ్ హలాలా”లు అవసరం లేదు. అయితే అతను తిరిగి కొత్తగా “మహార్” చెల్లించి ఆమెను పెళ్లాడాల్సి ఉంటుంది.

4. పెళ్లిచేసుకున్నాక తిరిగి కొన్ని సంవత్సరాల తరువాత మనస్పర్దలు వచ్చి వారు విడాకులు తీసికోవాలనుకుంటే మళ్లా అదే పద్దతిలో ఆమె మూడు ఋతువుల గడువు కాలం పూర్తయ్యే వరకు వేచి ఉండాలి. ఈ గడువు లోపల సరిదిద్దుకుని కలవక వేరైపోయి ఒకవేళ మరలా గనుక వారు కలవాలనుకుంటే… రెండవసారి కూడా అతను తిరిగి కొత్తగా ‘మహార్’ చెల్లించి ఆమెను పెళ్లాడాల్సి ఉంటుంది.

5. ఈ విధంగా “రెండు సార్లు మాత్రమే విడాకులు (తలాక్) ఇచ్చే అవకాశం ఉంది (ఖురాన్ 2:229)”. రెండుసార్లు విడిపోయి తిరిగి పెళ్లి చేసుకుని మూడవసారి గనుక వారు తిరిగి విడాకులు చేసుకుంటే… ఇక ఆమె అతనికి శాశ్వతంగా ధర్మ సమ్మతం కాదు (ఖురాన్ 2:230). ఒకవేళ ఆమె మరొకతన్ని పెళ్లి చేసుకున్నాక అతను చనిపోయో.. లేక వారు విడిపోతేనో తప్ప ఆమెను మొదటి భర్త తిరిగి పెళ్లాడటానికి అవకాశం లేదు. అది కూడా ఆమె సమ్మతి ఉంటేనే తప్ప. ఎందుకంటే పెళ్లి అన్నది చిన్నపిల్లలు ఆడుకునే ఆటకాదు కదా పదే పదే విడాకులు తీసుకుని తిరిగి కలిసిపోవటానికి.

అందుకే రెండుసార్లు గనుక ఎవరైనా విడిపోయి తిరిగి పెళ్లి చేసుకుని మూడవసారి గనుక విడిపోతే ఇక అక్కడితో వారి బంధం శాశ్వతంగా క్లోస్ అయిపోతుంది. పైన చెప్పినట్టు ఆమె మరొకతనితో పెళ్లి చేసుకున్నాక ఒకవేళ అతను చనిపోతేనో, విడాకులు తీసుకుంటేనో తప్ప తిరిగి మొదటి భర్తను పెళ్లాడటానికి వీలులేదు. ఈ పద్ధతిని “నికాహ్ హలాలా” అనరు. ఎందుకంటే ఇందులో ఎక్కడా ముందస్తు కాంట్రాక్ట్ బేస్ అనేది లేదు.

నిజానికి ఎవరైనా జంట విడాకులు తీసుకుని తిరిగి పెళ్లి చేసుకోవటానికి కాంట్రాక్ట్ బేస్ మీద “నికాహ్ హలాలా” అన్న ఆటవిక ఆచారాన్ని గనుక అవలంబిస్తే అది పక్కా “వ్యభిచారం” చెయ్యటం అవుతుంది. కాబట్టి ఖురాన్ లో రాయబడని దురాచారాలను ఇస్లాంతో లింకు పెట్టి ఇస్లాంను విమర్శించటం మూర్ఖత్వం అవుతుంది.

ఈ విధంగా ఒక జంట విడాకులు పొందాలన్నా తిరిగి పెళ్లి చేసుకోవాలన్నా ఇస్లాం ఎంతో సౌలభ్యాన్ని ఇవ్వటంతో పాటు కొన్ని పటిష్టమైన నిబంధనలు కూడా ఇస్తుంది. ఏదో మూడు సార్లు నోటితో ‘తలాక్’ చెప్పేసినంత మాత్రనా విడాకులైపోవు.
మూర్ఖులు ఏ ఒక్క మతవర్గంలోనో గుంపుగా ఒక్కచోటే చేరి ఉండరు. ప్రతీ మతవర్గంలోనూ ఉంటారు. ముస్లిం సమాజంలో సైతం దర్గాలకు వెళ్లటం, తాయెత్తులు కట్టుకోవటం, రొట్టెల పండుగలు చేసుకోవటం, పీర్లు ఊరేగించటం, బ్లేడ్లతో ఒళ్లంతా కొట్టుకోవటం, నికాహ్ హలాలా లాంటి దురాచారాలు పాటించటం లాంటి చవకబారు పనులు చేసేవారు కోకొల్లలుగా ఉన్నారు.

వారలా అయిపోవటానికి కారణం ఇస్లాం కాదు. ఇస్లాంను వారు అర్థం చేసుకోకపోవటమే

Md Nooruddin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *