సామాన్య హిందూ, ముస్లిం ప్రజానీకం మధ్య ధ్వేషాన్ని, శతృత్వాన్ని రగిలించటమే లక్ష్యంగా పనిచేసే మతోన్మాద పైత్యం తలకెక్కిన వేర్పాటువాదులు వక్రీకరించబడిన చరిత్ర పట్టుకుని మీడియాలో నిత్యం గొంతు చించుకుంటూ చెప్పే మాట… “ముస్లిం పాలకులు హిందూ దేవాలయాలు పడగొట్టేసి మసీదులు కట్టేశారు” అన్నది. కానీ చరిత్రకు రెండో వైపు గమనిస్తే… మసీదులపై కట్టబడిన దేవాలయాలు కూడా ఉన్నాయన్న విషయం అతి కొద్ది మందికే తెలిసిన వాస్తవం
***
మతోన్మాదమా? యుద్ధోన్మాదమా?
చరిత్రలో ఒక్క ముస్లిం పాలకులే కాదు హిందూ పాలకులు సైతం ఆలయాలు ధ్వంశం చేశారన్న విషయం అతి తక్కువ మందికి తెలిసిన వాస్తవం. నిజానికి అటు హిందూ రాజులైనా ముస్లిం రాజులైనా దేవాలయాలు ధ్వంసం చెయ్యటమన్నది- ‘యుద్ధోన్మాదమే’ తప్ప ‘మతోన్మాదం కాదు’
కారణం అప్పట్లో ప్రతీ రాజ్యానీకీ ఒక రాష్ట్ర దైవం ఉండేది. ఆ రాజ్యం తాలూకు ఆలయంలోనే రహస్య మాళిగలలో సంపదలను భద్రపరుచుకోవటం జరిగేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆలయాలు రాజ్యపు అస్తిత్వ రూపాలుగా ఉండేవి. ఒక్కో రాజ్యానికి ఒక్కో రాజ్య దేవత ఉండేది. ఒక రాజ్యం మరో రాజ్యాన్ని జయించినప్పుడు ఓడిపోయిన రాజ్యం యొక్క రాజ్య దేవతను, ధ్వంశం చెయ్యాటమో, తరలించుకుపోవటమో యుద్ధాన్ని విజయం సాధించామనటానికి సంకేతంగా (Symbolic) భావించేవారు. ఆ విధంగా రాజ్యాలకు రాజ్యాలకూ మధ్య జరిగిన అనేక యుద్ధల్లో ఒక్క ముస్లిం రాజులే కాదు అనేక హిందూ రాజులు సైతం ఆలయాలను ధ్వంశం చేసి, సంపదలను తమ రాజ్యాలకు తరలించుకుపోయిన సంఘటనలు చరిత్రలో అనేకం ఉన్నాయి
ఈ విధంగా భారతదేశంలో జరిగిన హిందూ ఆలయ విధ్వంసం ఎక్కువగా యుద్ధ సమయాల్లో, తిరుగుబాట్లు జరిగినపుడు శిక్షించే క్రమంలోను మాత్రమే జరిగినట్లు అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. తప్పితే నేడు కొందరు ప్రచారం చేస్తున్నట్లు ఇస్లాం రాజ్యం స్థాపించటానికే ముస్లిం పాలకులు హిందూ దేవాలయాలు ధ్వంసం చేశారన్నది వాస్తవం కాదు. అదే నిజమైతే ముస్లిం పాలకుల వెయ్యేళ్ల పాలనలో భారతదేశంలో ఒక్క ఆలయం లేకుండా తుడిచిపెట్టబడి ఎప్పుడో ముస్లిం దేశంగా మార్చబడేది. కానీ, హిందూ సంస్కృతిని ముస్లిం పాలకుల ద్వారా వెయ్యేళ్లు కాపాడబడిందన్నది కాదనలేని నిజం
***
యుద్ధాలు లేని సమయంలో ముహమ్మద్ బిన్ తుగ్లక్, అక్బర్, ఔరంగజేబు, కులీ కుతుబ్ షా వగైరా ఎందరో ముస్లిం పాలకులు ఆలయాలను పునరుద్ధరించినట్లు, ఆలయాలు నిర్మించినట్లు చూడగలం.
చిత్తారకోట్ లోని బాలాజీ మందిరాన్ని, వారణాసిలోని అధునాతన కాశీ విశ్వనాథ్ ఆలయం ఔరంగజేబ్ కట్టించిందే! అలాగే అలహాబాద్ ఆరాలి లోని సంగం ఒడ్డున సోమేశ్వర మహాదేవ ఆలయ నిర్మాణానికి, ఉజ్జయిన్ లోని మహాకాళేశ్వర ఆలయానికి ఇంకా ఎన్నో ఆలయ నిర్మాణాలకు స్థలాలను ఔరంగజేబ్ కేటాయించటం జరిగింది.
బీదరు జిల్లాలో అంతకు పూర్వం ధ్వంసం చేసిన ఈశ్వరాలయాన్ని పునరుద్దరించి, పూజాధికాలు నిర్వహించమని మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆదేశాలు ఇచ్చినట్లు 1326 నాటి ఒక శాసనం చెపుతున్నది. (Kalyana inscription of sultan Muhammad – Epigraphic Indica 32)
అక్బర్ పరిపాలనలో అనేక హిందూ సామంతులు తమ రాజ్యాలలో వివిధ హిందూదేవాలయాలను నిర్మించుకొన్నారు. ఉదాహరణ: రాజామాన్ సింగ్ బృందావనంలో నిర్మించిన గోవింద దేవ ఆలయం.
1590-1735 ల మధ్య ఒరిస్సా పూరిజగన్నాధుని రధయాత్రకు ముఘల్ చక్రవర్తి ప్రతినిధులు వచ్చి ఒక రధంపై కూర్చుని ఆ ఉత్సవాన్ని పర్యవేక్షించేవారు.
ఔరంగజేబు 1659లో – “కాశిలో కొంతమంది అక్కడి బ్రాహ్మణులను వేధిస్తున్నట్లు తెలుస్తున్నది- కాశిలోని ఆలయాలను కానీ అక్కడి పూజారులను కానీ వేధించటం కానీ తొలగించటం కానీ చేయకండి” అంటూ ఒక ఉత్తర్వును జారీ చేసాడు. ఇదే ఉత్తర్వులో “ప్రాచీన ఆలయాలను కూల్చరాదని పవిత్ర గ్రంధం చెపుతున్నది” అని అనటం గమనార్హం.
***
ముస్లిం పాలనలో హిందువులు అనేక మసీదులను కూల్చివేసి వాటిపై దేవాలయాలు కట్టారు:
1. జోధ్‌పూర్‌కు చెందిన జస్వంత్ సింగ్ క్రీ.శ 1658-59 లో అనేక మసీదులను ధ్వంసం చేశాడు మరియు వాటి ప్రదేశాలలో హిందూ విగ్రహ-దేవాలయాలను నిర్మించాడు. అయినప్పటికీ, జస్వంత్ సింగ్ 16 ఔరంగజేబుతో కలిసి 1679 లో రాజ్‌పుత్ మరణించే వరకు వచ్చే 20 సంవత్సరాలు పని చేశాడు.
2. 1618-1707 మధ్యకాలంలో ఔరంగజేబు పంజాబ్ మరియు గుజరాత్ లను సందర్శించినప్పుడు, ముస్లిం ప్రముఖుల బృందం హిందువులు మసీదులను కూల్చివేసి, తమ స్థలాలను అతిక్రమించినట్లు ఫిర్యాదు చెయ్యటం జరిగింది. తరువాత విచారణ జరిపి తిరిగి ముస్లిముల మసీదులు పునరుద్ధరించటం జరిగింది.
3. అక్బర్ కాలంలో, సూఫీ మరియు ఆధ్యాత్మిక వేత్త అయిన షేక్ అహ్మద్ సిర్హిండి క్రీ.శ. 1564-1624 మధ్య కాలంలో కొంతమంది హిందువులు మసీదులను కూల్చివేసి తమ సొంత ప్రార్థనా స్థలాలుగా లేదా హిందూ దేవాలయాలుగా మారుస్తున్నారని ఫిర్యాదు చెయ్యటం జరిగింది.
4. క్రీ.శ 1540 లో ఆఫ్ఘన్ పాలకుడు షేర్ షా కొంతమంది హిందూ భూస్వాములను శిక్షిస్తానని ప్రతిజ్ఞ చేసాడు. దానికి కారణం కొంతమంది మాగీలు గుజరాత్‌లోని హిందువులను ముస్లింలపై మరియు వారి మసీదులపై దాడి చేయమని ప్రేరేపించారు, ఆ దాడిలో మసీదులు ధ్వంసం చేయబడ్డాయి, కాల్చబడ్డాయి చాలా మంది ముస్లింలు చంపబడ్డారు.
5. అవధ్ లోని హనుమాన్ గాది ప్రాంతంలో ఒక మసీదు ఉంది, దీనిని హిందువులు పడగొట్టారు మరియు క్రీస్తు శకం 1858 లో చాలా మంది ముస్లింలు చంపబడ్డారు.
***
మసీదులు కూల్చి, కట్టబడిన దేవాలయాలయాల చరిత్ర:
1. హర్యానా, గురుగ్రామ్ జిల్లాలో ఫరూఖ్‌నగర్ ను మొఘల్ గవర్నర్ ఫౌజ్‌దార్ ఖాన్ క్రీ.శ 1732 లో స్థాపించారు. పట్టణం స్థాపించబడిన వెంటనే, పట్టణ సరిహద్దుల్లో గంభీరమైన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వాటిలో ఒకటి ‘జామా మసీదు’. తరువాత పాకిస్తాన్ నుండి హిందూ శరణార్థులు వచ్చిన తరువాత ఈ మసీదును ఆక్రమించుకుని ఆలయంగా మరియు గురుద్వారాగా మార్చి వెయ్యటం జరిగింది
2. మహారాష్ట్ర లోని దౌలతాబాద్ (ఔరంగాబాద్) కు చెందిన ఖిలిజ్ జుమ్మా మసీదు, 14 వ శతాబ్దంలో కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ ద్వారా నిర్మాణమైంది. ఈ మసీదు నిర్మాణం తరువాత శతాబ్దాలుగా వాడుకలో ఉంది. తరువాత హిందువులు దానిని ఆక్రమించుకుని మసీదులో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత స్థానికులు అక్కడ పూజలు చేయడం ప్రారంభించారు ఆ మసీదును ‘భారత్ మాతా’ మందిర్ అని పిలవడం ప్రారంభించారు.
3. హర్యానాలోని హిసార్ జిలాల్లో ‘డానా షీర్ మసీదు’ ఫిరోజ్ షా తుగ్లక్ (క్రీ.శ 1351 నుండి 1388 వరకు) నాటి పురాతన కాలం నాటిది. పాకిస్తాన్ విభజన సమయంలో హిందువులు ఆ మసీదును ఆక్రమించుకుని దానిని హిందూ ఆలయంగా మార్చారు. ‘డానా షీర్ బహ్లుల్ షా’ అనే అప్పటి ముస్లిం పెద్ద పేరు మీద కట్టబడిన ఈ మసీదు ‘భగవాన్ డానా షేర్ మందిర్’ గా మార్చబడి ఇప్పటికీ అందులో పూజలు జరుగుతున్నాయి
4. హర్యానా సోనిపట్ పట్టణంలో ఈనాడు మొఘలులకు చెందిన అనేక ఇస్లామిక్ స్మారక చిహ్నాలు, వీటిలో ఖ్వాజా ఖిజ్ర్ సమాధి, పాత కోట శిధిలాలతో పాటు ‘జామా మసీదు కూడా ఒకటి’. తరువాత దానిని హిందువులు ఆక్రమించుకుని ‘దుర్గా మందిరం’గా మార్చివేయటం జరిగింది.
దేవాలయాలు పడగొట్టి మసీదులు కట్టేశారని నిరంతరం గొంతుచించుకుని గోలపెట్టేవారు మరి మసీదులను దేవాలయాలుగా మార్చిన పై సంఘటనల గురించి ఏమని చెబుతారు? కానీ, మతతత్వవాదం తలకెక్కించుకున్న మూర్ఖులు చరిత్రలో సమాధి కాబడ్డ పై వాస్తవాలను పరిశీలించరు.
మొత్తానికి ఇక్కడ తెలుసుకోవలసింది ఏమిటంటే- మంచి చేసేవారందరూ ఒక మత వర్గంలో చెడు చేసేవారందరూ ఒక మత వర్గంలో ఉండరు. ప్రతీ మత వర్గంలో మంచోళ్లతో పాటు మూర్ఖులు కూడా ఉంటారు. కాబట్టి కొందరు మూర్ఖులు చేసే తప్పులకు మొత్తం మతవర్గాన్ని తప్పుపట్టటం ఎప్పుడో మధ్యయుగాలనాటి ముస్లిం పాలకులు కొన్ని దేవాలయాలు పడగొట్టారని ఈనాటి ముస్లిం సమాజాన్ని దానికి బాధ్యులు చెయ్యటం, ఆనాడు దేవాలయాలు పడగొట్టింది భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చేయ్యటం కోసమే అని ఏమాత్రం పొంతన లేని కల్పిత చరిత్రలను సామాన్య హిందూ ప్రజల తలకెక్కించి హిందూత్వం ప్రమాదంలో ఉందని లేనిపోని భయాలను పుట్టించి ముస్లిముల పట్ల ధ్వేషాన్ని పెంచటం, హిందూ, ముస్లిముల మధ్య అర్థంలేని ఆవేశాన్ని, కారణంలేని కోపాన్ని రగిలించటానికి ప్రయత్నాలు చెయ్యటం కేవలం అనాగరికత ఆటవికత అవుతుంది.
మసీదులపై కట్టబడిన దేవాలయాలు – చరిత్రకు రెండో వైపు
